నిర్దిష్టవాక్య నిర్మాణనైపుణ్య నిధి కోసం నిరంతర ప్రయాసను గునపం చేసి తవ్వుతూ పో రచనాకారుడా. చక్కని పదాల కాంతులు అల్లుకున్న చుక్కల పందిరికి లెక్కలేనన్ని భావవిద్యుద్దీపాల వెలుతురు గుత్తులు వేలాడనీ. ఆషామాషీ కాని భాషాజ్ఞాన సముపార్జన కోసం అన్ని వేళలా శ్రమించు. అపశబ్దాల, అపప్రయోగాల, అపవాదు నుండి కాపాడుకో నిన్ను నువ్వు. ఇటుకల నాణ్యత బాగుండకుంటే ఎటువంటి సౌధం వెలుస్తుందో తెలుసుకో. భాషాసవ్యతను పునాది చేసి, బలిష్ఠమైన భావవ్యక్తీకరణ భవనాన్ని నిలబెట్టు దానిమీద. పదసోపానాల పంక్తి మీంచే కదా భావబంధురతకూ, పారవశ్య సదనపు పై అంతస్తుకూ చేరుతాం మనం. చాదస్తమని దీన్ని కొట్టిపారేస్తివా చాలా నష్టపోతావు సుమా.
ఇక భావగాంభీర్య, భావసౌకుమార్య, భావశబలతల ప్రాధాన్యం అంతాయింతా కాదు. కేవల పదసౌందర్య పిపాసకావల ఏ జలస్పర్శా లేని ఎడారి దాగి ఉండవచ్చు. ఆడంబరత్వపు అతకని పదాల రైలుపట్టాల మీదుగా చేసే ప్రయాణంతో ధ్యేయం అగోచరమయ్యేది ఖాయం. ఎన్నిక బాగున్న చిన్న పదాలతో సైతం మిన్న ఐన అభివ్యక్తినందించవచ్చు. సరైన స్థానంలో సరైన పదం అనేదే సరైంది కదా. సౌందర్యదృష్టి కరువైన కలాల కవిత్వంలో కమనీయత పాలు ఎంత? పొందిక లేని వాక్యపు బొందిలో పొందుపరచగలమా అందాన్ని? అందుకే మరి, నిర్దిష్ట వాక్యనిర్మాణ నైపుణ్యనిధి కోసం నిరంతర ప్రయాస అవసరమని అనటం.