అల్లరి పిచుకలు

జనసమ్మర్దంలో
నా కళ్ళ చెరువుల్లోకి
మెరుపుల్లా దూకిన
నీ చూపుల చేప పిల్లల

దండెం మీద ఎగిరిన
తడి నూలు చీరల వెనక
రెపరెప నీ పుస్తకాల అక్షరాల

ఆ పెళ్ళిలో
నా పట్టు చీర మీద
రాలి పడ్డ నీ కొంటె నవ్వుల
మత్తు మల్లె పువ్వుల

తర్లి పోతున్న మబ్బుల్లో
కలిసి వెచ్చని నురగల
కాఫీలు తాగిన వేళల

నీ మీసాల గరుకు
గిలిగింతల
తడి ముద్దుల
కలల సొగసుల

లాంటివి

అలాంటివి
ఏవో

కరిగిన నా కంటి
కాటుక వెనుక
తారట్లాడుతుంటే

రోజూ బియ్యానికి
అలవాటు పడ్డ
పిచుకలు
ఆలోచనలను
చెల్లా చెదురు చేసి

నేలేచి వెళ్ళిందాక
కిచ కిచలాడుతూ
కిటికీ అద్దాన్ని
ముక్కులతో
పొడవడం ఆపవు.