కవితాకన్యక మానసంరక్షణము – ఏకపాత్రాభినయం
స్థలము: వచనకవితా సభ
వాచకుడు: కవి సార్వభౌముడు
(కవి సార్వభౌముడు సభలోని వేదిక వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో)
ఔరా! ఈ కవితా చమత్కృతి ఏమియో గాని వ్యాకరణము నెల్ల యౌపోసన వట్టి కవి సార్వభౌముడనైన నా మానసమును సైత మాకర్షించుచున్నదే!
(దస్త్రము పక్కకు జూచి)
వీరు నా భావమును, భాషను తస్కరించి యుండరు గదా!
(ఆశ్చర్యముతో)
ఏమి, ఈ కురూప వచనాతిశయములు? ఈ మతిభ్రమణకృత కవిత లెవ్వరివై యుండును?
(దస్త్రమును సమిపించి మెల్లగా)
ఏమీ ఈ ప్రల్లదములు? ఏమి ఈ భాష? ఏమి ఈ వచనము?
(నిదానించి)
ఇది యేమి? వీనిని వ్రాతలందురా?
(మరల కొంచెము బిగ్గరగా)
ఎవరక్కడ? ఎవరు వారు ఈ వ్రాతలు వ్రాసినది?
(ఊరకుండి)
ఏమిది?
(దస్త్రము బాగుగ పరీక్షించి)
నేనెంత భ్రమపడితిని? నిమేషత్వమే లేదు. ఈ కవితలు చిత్తడి నేలలు. అడుగు పెట్టిన చాలు, జలకల్కము మనసునంత తడిపివేయును.
(ఆశ్చర్యముతో)
ఏమి యీ విచిత్ర కల్పన!
(తలయూచి)
ఈ వచన కవుల అధమోత్తర కళాకౌశలము!
(ఇంకొకవైపున జూచి)
భాష యన్న యింత చులకనయా? ఎంతటి దౌర్భాగ్యము దాపురించినది!
(చూచుచు)
వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబులు, రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్యసురభిళ పుష్పవల్లీమతల్లికా సంభాసురంబులు, భాసుర పుష్పగుచ్చ స్రవన్మధుర మధురసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకారనినాద మేదురంబులు, మేదుర మధుకర ఘనఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృతకలాప కలాప రమణీయంబులు, రమణీయ కోమల కలాపకలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబులు, సంకీర్ణ నికుంజపుంజ సుందరంబులు నగు వనంబులయందు వెలసిన కల్పతరువుల వంటి పద్యములతో, వ్రాతలతో విలసిల్లిన భాషామతల్లి యీరోజు వీరి జేతియందు విలవిలలాడుచున్నది.
(తల యూచి)
ఇందలి భావ కుసుమజాలములును రోదనానందము గల్గించుచున్నవి.
(నడువ నుంకించి, చూచి)
కుకవితాకాసారమే ఇది! హాలాహలమే ఇది. భావదౌర్భాగ్యమే ఇది. వైయాకరణ దౌర్భాగ్యమే ఇది. ఉండి లేనట్లును, లేక యుండినట్లును గనంబడుచున్నది.
(బాగుగ జూచి)
హాలాహలమే కాకున్ననీ వాక్యములు, నీ పైశాచికభాషయు నెట్లుండును?
(తల పంకించి)
సంస్పర్శమాత్ర నూత్న చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు, మందపవనచాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు, కమలకోకనదాది నానావిధ జలకుసుమ రాగారుణిత శోణితంబు, ఆలోలబాలశైవాలజాల లాలిత జంగమోద్యాన శంకావహంబు ననదగిన గ్రీవాలంకృత బిససూత్ర పాళికాసందీపిత హంస హంసీగణ విభూషితంబులతో, వర్ణనకందని యనుభూతులతో కాలము గడిపిన వాగ్దేవి నిండు మనస్సు నేడు యీ వచనపైశాచికుల కరములందున్న కలముల భూతప్రేతోజ్వలితమైన పోటుదెబ్బకు కొడిగట్టిన దీపము వలె రెపరెపలాడుచున్నది.
(తల యూచుచు)
కాల స్వభావము! నిన్న మొన్నటిదనుక నిలువనీడ లేకుండిన ఈ వచన కవులు, క్షురకుడు మార్జాలపు తల గొఱిగినటుల లపనముకొచ్చిన కూతలు గూయుచు, చేతికొచ్చిన వ్రాతలు వ్రాయుచు దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా? ఇదియంతయు గనులారగాంచుచు సుకవితా వంశ సంజాతుడగు కవిసార్వభౌముడు సహించి యుండుటయా?
(యోజించి తల పంకించి)
యోచించినకొలది మనంబున బట్టరాని క్రోధము వెల్లివిరిసి దుర్భరంబగుచున్నది. ఇంక నిచ్చట నిలువజాల…
(పరిహాసధ్వని వినంబడుచున్నది)