ఒంటరి ప్రపంచం

మీరనుకునే ఒంటరితనంలో నేనున్నప్పుడు
ఎదురుగా ఉన్న ఆకాశహర్మ్యాలు
మనసులు పట్టని మనుషులు
మురికిపట్టిన గుండెలు
అన్నీ మాయం.

పుట్టబోయే బిడ్డని
అమ్మ మోసినంత భధ్రంగా మోస్తున్న
జ్ఞాపకాల సంచీలోంచి
కొన్ని క్షణాల వెలికితీత

అప్పుడక్కడ క్షణాల్లో
మనసంత మైదానాలు
పూలచెట్లూ, సెలయేళ్ళూ

సెలయేట్లో కాగితం పడవలు
ఒడ్డుమీద గుజ్జనగూళ్ళూ
మైదానంలో ఒంగుడుదూకుళ్ళు

మీరు
ఈ ప్రపంచం
ఒంటరివాళ్ళు

మీ ఒంటరితనం పొగోట్టుకోడానికి
నన్నొంటరిని చేసి
ఈ ప్రపంచంలోకి లాక్కొస్తారు.