శతపుష్పసుందరి

ఇంకా మంచు కురుస్తున్నా, చలిగాలికి దేహము గడగడ వణికిపోతున్నా, ఆశాంకురాలు మనిషి మస్తిష్కములో ఎప్పుడు మొలిచి పుష్పములను విరియజేస్తుంటాయి. హేమంతకాలము ఉన్నప్పుడు మాత్రమే వసంతఋతువు అందము సార్థకము అవుతుంది. ఇంకా కనీసము రెండు నెలలవుతాయి అమెరికాలో వాసంతసమీరాలు వీచడానికి. అంతవఱకు ఊహాలోకములో విహరించవలసినదే. పూవులు, లతల పేరులతో ఉన్న ఛందస్సులను సేకరించి వాటిలో పద్యములను అల్లడమే ఈ సంకలనములోని నా ప్రయత్నము. సుమారు వందకు పైగా ఛందస్సులు దొఱికాయి. అందులో ఎన్నిటినో పుస్తకములలో లాక్షణికులు తెలిపారు. కొన్నిటిని నేను నా పరిశోధనలలో కల్పించినాను. సుమారు వందకు పైగా ఉన్న వృత్తములలో, జాత్యుపజాతులలో పద్యములు వ్రాసినాను. ఒక్కొక్క ఛందస్సులో ఒక ఉదాహరణమును మాత్రమే ఇచ్చాను. ఒకటికన్న ఎక్కువ ఉదాహరణములు వృత్తపు యతి గాని గతి గాని వేఱుగా నున్నప్పుడు తప్పనిసరి యైనది. విషమ వృత్తములను, దండకములను నేను పరిగణించలేదు. ఈ మధ్య శతజయంతి జరుపుకొన్న రజనిగారి శతపత్రసుందరి నా చిన్న వయస్సులో నన్ను సాహిత్యములో ప్రోత్సహించిన ఒక పుస్తకము. దానిని జ్ఞాపకము చేసికొని ఈ సంకలమునకు శతపుష్ప సుందరి అని పేరునుంచినాను. ఆశ వసంతలతలా ఎప్పుడూ చిగురిస్తూ ఉంటుంది. పాఠకులు ఆసక్తితో చదువుతారనే ఆశిస్తున్నాను.


శ్రీవరదా శుభంకర భ – జింతును బూవుల ప్రోవులన్ దయన్
రావలె మా గృహమ్మునకు, – రంజిలఁ జేతును, హృద్య పద్య సం–
భావన లిత్తు, సల్లలిత – భావ పరాగము లద్భుతమ్ముగా
తావులఁ జిమ్మ, రాగ సుధ – త్రాగుద ముల్లము లుల్లసిల్లఁగా

శతపుష్పసుందరీ – స/జ/త/త/గ, యతి (1, 8) 13 అతిజగతి 2348
శతపుష్ప సుందరీ – చైత్రలక్ష్మిద్యుతీ
శతరాగ రంజనీ – చారుశోభాకృతీ
మితిలేని సూనముల్ – మేదినిన్ బెంచఁగా
రతికూజితమ్ముతో – రా వసంతమ్ముగా

అంబుజ లేక (లఘు)మాలిని- భ/ర 6 గాయత్రి 23
అంబుదమందు నా
కంబుజనాభుఁడే
అంబుజరాశి పా-
దాంబుజ పూజకే

అంబురుహము – భ/భ/భ/భ/ర/స/లగ, యతి (1, 7, 13) 20 కృతి 37215
నిన్నటి మాటలు – నిన్నటి పాటలు – నీ స్వరమ్ముల కోరెనే
నిన్నటి యాసలు – నిన్నటి బాసలు – నీదు స్నేహము నెంచెనే
నిన్నటి పూవులు – నిన్నటి తావులు – నీదు జ్ఞప్తిని తెచ్చెనే
నిన్నటి కౌగిలి – నిన్నటి ముద్దులు – నీ వియోగము పెంచెనే

అంబురుహము – భ/భ/భ/భ/ర/స/లగ, ప్రాసయతి (1, 7, 13) 20 కృతి 37215
కమ్మగ నంబురు–హమ్ములు శోణ ము–ఖమ్ములన్ వికసించె, రా–
గమ్ములఁ బాడె గ–ళమ్ముల నెత్తి పి–కమ్ము లెల్లెడ, సుప్రభా–
తమ్మున వర్ణ మ–యమ్ము సుకాంతియు–తమ్ము భూమి, విభాత హా–
సమ్ములు సద్‌హృద–యమ్ముల నూత్న ర–సమ్ము నింపెను సొంపులన్

అభినవ తామరసము లేక తోదకము – న/జ/జ/య, యతి (1, 8) 12 జగతి 880
అభినవ తామర–సాయత నేత్రా
శుభగుణమందిర – సుందరగాత్రా
క్షుబితము నా మది – కుందెను దేవా
విభవము లీయఁగ – వేగము రావా
(ఈ పద్యము శుద్ధమంజరీ ద్విపదకు కూడ సరిపోతుంది)

అమరలతికా – స/స/న/స/ర/ర/గ, యతి (1, 7, 13) 19 అతిధృతి 75740
అనురాగమయీ – అమరలతికా – యామినీపూర్ణబింబా
దినరాత్రులు నే – తృషితుఁడనుగా – తృప్తి నీయంగ రావా
ప్రణయాబ్ధిమణీ – ప్రథమకిరణా – ప్రాణపీయూషపాత్రా
కన రమ్ము ననున్ – గమలవదనా – కంజపత్రాయతాక్షీ

అరవింద – స/న/భ/జ/స/ల, యతి (1, 9) 16 అష్టి 48060
అరుణోదయపు కాల – మరుదెంచె నిలపైన
చిర శాంతి నిడ నిండెఁ – జెలువంపు కిరణాలు
ధరణీజములయందు – ధ్వని సల్పె విహగమ్ము
లరవిందములు వాసి – యయి దొర్వులను బూచె

అలరు – త/భ/న/గగ, యతి (1, 6) 11 త్రిష్టుభ్ 581
అమ్మా యనంగ – నమృతము గారెన్
అమ్మా యనంగ – నలరులు బూచెన్
అమ్మా యనంగ – నట నెల వెల్గెన్
అమ్మా యనంగ – నరుసము గల్గెన్

ఆకాశసుమము – త/న/న/స/ర/ర/గ, యతి (1, 7, 13) 19 అతిధృతి 75773
ఆకాశసుమము – లయెగద కలల్ – హర్ష మింకెట్లు గల్గున్
రాకాశశి సుధ – రజని ఘడియన్ – రక్తి గట్టించ లేదే
ఆకారము గన – నతిగ నిట నే – నాత్రుతన్ జూచుచుంటిన్
నీకై జగమున – నిను దలచుచున్ – నేను రమ్మంటి రావా

ఆమనిగీతి – ఇం/సూ/సూ – ఇం/సూ
ఆమని లచ్చి క్రొత్త – యందమ్ము నింప
నీ మహి కవతరించు – నీ చలిన్ జంప
కోమలమైన కుసుమ-కోటితో నింక
శ్యామలమైన వనియు – సౌరుకే లంక

ఉత్పలమాల – జలదము

ఉత్పలమాల – భ/ర/న/భ/భ/ర/లగ, యతి (1, 10) 20 కృతి 355799
చాలవు కన్ను లెప్డుఁ గన – శ్యామలునిన్ బలు మార్లు హాయిగా
చాలవు వీను లెప్డు విన – శ్యామలునిన్ మెల పాడుచుండగా
చాలదుగా తలంచ మది – శ్యామలునిన్ జెలువార తీయఁగా
చాలదు జీవితమ్మొకటి – శ్యామునితో నిల నుండ నిండుగా

(ఇందులో మొదటి 13 అక్షరములు జలద వృత్తమునకు సరిపోవును.)

జలదము లేక లవలీలతా – భ/ర/న/భ/గురు, యతి (1, 10) 13 అతిజగతి 3543
చాలవు కన్ను లెప్డుఁ గన – శ్యామలునిన్
చాలవు వీను లెప్డు విన – శ్యామలునిన్
చాలదుగా తలంచ మది – శ్యామలునిన్
చాలదు జీవితమ్మొకటి – శ్యామునితో

ఏలా – స/జ/న/న/య, యతి (1, 6) 15 అతిశక్వరి 8172
ప్రభవంపు ప్రాభవపు – ప్రతిమయగు దేవీ,
విభవంపు వేవెలుఁగ – విమలతర మూర్తీ,
శుభమైన రోజు యిది – సుకరముగ నీ స–
త్సభలోన సంతతము – దయ నొసఁగ వేలా?

కనకకేతకీ – త/స/జ/జ/గ, యతి (1, 8) 13 అతిజగతి 2909
కందోయికగు విందు – కమ్మని పూలుగా
బృందావనములోన – వేలకు వేలుగా
క్రిందన్ గనకకేత-కీరజ గంధమే
నందాత్మజునితోడ – నాకనుబంధమే

కనకాంబరము – చ/చ/చ – త్రి/త్రి/త్రి/త్రి, యతి నాలుగవ మాత్రా గణముతో
కన నీలాంబరములతోఁ – గరగుచుండు నింగి సొబగు
కన ధవళాంబరములతోఁ – గదలుచుండు గిరుల బెడఁగు
కన నరుణాంబరములతోఁ – గందిపోవు సంజె సిగ్గు
కన శ్యామాంబరములతో – గరువ పడెడు రేయి నిగ్గు
కన స్వప్నాంబరములతోఁ – గప్పు నన్ను గలఁత నిదుర
కన కనకాంబరములతోఁ – గనెదఁ జెలిని చెదుర నిదుర

కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో
అమల సరసి యెల్ల – నరుణమయము
కమలగీతి స్వనము – కవిత రవము
ద్యుమణి కిరణ జాల – ముదయ వేళ
విమల ప్రకృతిఁ దాకు – ప్రేమకీల

కమలదళాక్షా – న/య/న/స/ర/ర/గ, యతి (1, 7, 13) 19 అతిధృతి 75728
అమలినవేశా – అచల హృదయా – అక్షయాఽనందరూపా
కమలదళాక్షా – కమలములతో – కాలి కెందమ్మి గొల్తున్
సుమముల మాలన్ – సుచరితునకున్ – సుందరమ్మై రచింతున్
నమనము లిత్తున్ – నవనవముగా – నన్ను జేరంగ రావా

కమలదళ లేక లలితపద – న/న/న/జ/స/గ, యతి (1, 11) 16 అష్టి 15360
మన మదియు మధురిపుని – మందిరమె యంటిన్
మన మనికి నిలకడయు – మాధవుఁడె యంటిన్
నిను గనఁగఁ గమలదళ–నేత్ర యిట నుంటిన్
విన లలితపదములను – వేఁగు హృది నుంటిన్

కమలదళము – 3,4,5,6,5,4,3 మాత్రలు
కమల
దళముల
కనులు గల
రమణునిన్ స –
దమలునిన్
సుమముల
గొలుతు
మమత
లహరుల
ముంచి యీ
స మయమున ర-
సమయమై
జేయఁగ
బిలుతు
(నాలుగవ పాదములోఉండే చివరి “స “అక్షరము రెండు దళములను కలుపుతుంది, చిత్రము చూడండి.)

కమలవిలసితము – కుసుమవిచిత్రా – మకరంద

మకరంద – న/య/న/య/న/న/న/న/గగ, యతి (1, 6, 12, 20) 26 ఉత్కృతి 16774096 లేక మొదటి మూడవ చతుర్మాత్రా గణములకు ప్రాసయతి, మొదటి, ఐదవ, ఏడవ చతుర్మాత్రలకు సామాన్య యతి
సరోజనేత్రా – సరసను రారా – స్వరముల సరముల – సరసత నిత్తున్
హరి నిను దల్చన్ – హరమగు బాధల్ – హరువుల మురువుల – హరుసము తెత్తున్
శిరమును జూడన్ – సిరు లికనేలా – చిఱునగవులె సిరి – శివ మకరందా
కరములతోడన్ – కరుణల నీరా – కరుగగ మది నను – గనుమ ముకుందా

(ఎనిమిది చతుర్మాత్రలతో అంత్యప్రాసతో నుండు రగడయైన హరిగతిరగడకు కూడ ఈ పద్యము సరిపోవును)

కుసుమవిచిత్రా– న/య/న/య, యతి (1, 6) 12 జగతి 976
సరోజనేత్రా – సరసను రారా
హరి నిను దల్చన్ – హరమగు బాధల్
శిరమును జూడన్ – సిరు లికనేలా
కరములతోడన్ – కరుణల నీరా

కమలవిలసితము– న/న/న/న/గగ, యతి (1, 9) 14 శక్వరి 4096
స్వరముల సరముల – సరసత నిత్తున్
హరువుల మురువుల – హరుసము తెత్తున్
చిఱునగవులె సిరి – శివమకరందా
కరుగగ మది నను – గనుమ ముకుందా

కమల – న/న/స, 9 బృహతి 256
కమలుచునుఁ గుములు యా
కమలముఖి మనములోఁ
కమలముఖుఁ గన బృహ–
త్కమలములు విరిసెఁగా

యమళకమలా – న/న/స/న/న/న/స, యతి (1,10), ప్రాసయతి (1, 12) 21 ప్రకృతి 1048320
విమలతరమగు వనిన్ – బిలిచె – భ్రమరములఁ గుసుమముల్
అమలమగు చెరువులో – నలరెఁ – గమలములు విరివిగా
యమళకమలములుగా – హరిణి – కమలనయనములయెన్
రమణు ముఖకమలమున్ – బ్రమద – ప్రముదితగఁ గనెనుగా

కమలాకరము – స/న/జ/జ/య, యతి (1, 11) 15 అతిశక్వరి 7036
కమలాప్తుడు మెలఁ దాకగఁ – గౌతుక మొప్పన్
గమలోత్కళికలు రేకులఁ – గ్రమ్మన విప్పన్
గమలాకరమున నిండెను – గన్నుల కింపై
కమలమ్ములు బలు నవ్వుచుఁ – గాంతుల సొంపై

కమలాక్షి – న/న/స/స/గ, యతి (1, 9) 13 అతిజగతి 1792
ఉమవలె వెలిఁగెడు – యో కమలాక్షీ
రమవలె దరి వడి – రా చపలాక్షీ
రమణను బదము స–రస్వతి వోలెన్
భ్రమ లిడ మధురతఁ – బాడుమ లీలన్

కలగీత – స/త/య/గ, యతి (1, 6) 10 పంక్తి 100
మలపై మంచుల్ – మహి జారంగన్
సెలయేరయ్యెన్ – శిలలే మున్గన్
పులుఁగుల్ వచ్చెన్ – బురులన్ విప్పెన్
గళముల్ విప్పన్ – గలగీతమ్మే

కల్వ పూవు – భ/ర/య/స/స/జ/గ, యతి (1, 9), ప్రాసయతి (1, 12) 19 అతిధృతి 177751
నల్లని గల్వ పూవులో – నాణెపు – తెల్లని మల్లె పూవులో
చల్లని పిల్ల గాలులో – సంజెలు – జల్లెడు మత్తు తావులో
మెల్లని యీల పాటలో – మెండుగ – గల్లను యందె మ్రోఁతలో
చల్లని మానసమ్ములో – సాగెను– మెల్లగఁ గ్రొత్త భావముల్

కలువ గీతి – సూ/ఇం – సూ/ఇం // సూ/ఇం/ఇం
కలువ పాడెను – గలువ గీతిని
గలువఁ బిలిచెను రాత్రిలో
గలువఱేడనె – గలువ లేనని
గలఁత చెందెను ధాత్రిపై

కలువదండ – మాలావృత్తములలో మార్పు – 12–4–12 మాత్రలు, 12 మాత్రల గణస్వరూపము ఒక్కటే
వేసెదఁ గల్వదండలను – వేయుచుఁ – జూసెద గల్వ కన్నులను
వ్రాసెద నవ్య ఛందముల – వ్రాయుచుఁ – జూసెద నందచందములను
కోసెదఁ గ్రొత్త పూవులను – గోయుచుఁ – జూసెదఁ దేనెమోవులను
చేసెద నవ్య సృష్టులను – జేయుచుఁ – జూసెద దివ్య దృష్టులను

కామలతా – భ/ర/న/భ/భ/ర/లగ, యతి (1, 11) 20 కృతి 355799
కోమల తారకాగణములన్ – కుసుమాకర రమ్య రాత్రిలో
కామలతా కనన్ ద్వరగ రా – కమలాలయ బోలు నెచ్చెలీ
యీ మలయానిలమ్ము లలితో – నెడదన్ స్పృశియించి యూపెనే
ప్రేమలతాంతముల్ విరియగా – ప్రియమై మనముందు మెన్నడున్

కుసుమ – న/భ/న/భ/న/న/న/ల/గ, యతి (1, 13) 23 వికృతి 4193784
దెసల నిండుగ శశి సుశోభయె – తిమిర ఘడియలు గడచెరా
రసమయమ్ముగ రజని నిండెను – రసము లొలుకఁగ వలతురా
మసృణ స్నిగ్ధము మమత నాయది – మధుర మయినది నిజమురా
యసమ మైనవి కుసుమ మాలిక – లనఘుఁ బదముల నిడెద రా

కుసుమ షట్పది – పం–పం / పం–పం / పం–పం – పం–గ
మనసులో నీవెరా
తనువు నీకేనురా
కనుల జూడంగ రా – కమలనేత్ర
వినతులన్ వినగ రా
ప్రణతులన్ గొనగ రా
నిను గనంగా నిటన్ – నిలిచియుంటి

మోహనా యనగనే
మోహమున్ బడితిరా
మోహనాలాపనన్ – మురిసిపోతి
శ్రీహరీ యన నాకు
దాహ మయ్యేను, దా–
సోహమంటిని రార – సొలసిపోతి

(పై రెండు పద్యములను చేర్చినపుడు, మనకు ఒక సీస పద్యము లభిస్తుంది)

కుసుమితలతావేల్లితా – మ/త/న/య/య/య, యతి (1, 12) 18 ధృతి 37857
రా రాజీవాక్షా రసికహృదయా – రాత్రి యిందుంటి నీకై
రా రాజిల్లంగాఁ బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రా రాజేంద్రా నా రచన యిది శ్రీ–రంగ నీకై నిజమ్మై
రారా జీవాత్మా ప్రణయినియు నేన్ – బ్రాణమిత్తున్ ముదానన్

ఇందులో మొదటి అక్షరమును తొలగించినయెడల, మనకు క్రింది మందాక్రాంతము లభించును.

రాజీవాక్షా – రసికహృదయా – రాత్రి యిందుంటి నీకై
రాజిల్లంగాఁ – బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రాజేంద్రా నా – రచన యిది శ్రీ–రంగ నీకై నిజమ్మై
రాజీవాత్మా – ప్రణయినియు నేన్ – బ్రాణమిత్తున్ ముదానన్

కుందము – బేసి పాదములు – రెండు చతుర్మాత్రలు, సరి పాదములు – నాలుగు చతుర్మాత్రలు
కుందము లపూర్వ
సుందరములు నవ – శోభాకృతమౌ
మందిరములు శ్రీ
చందనము లమృత – చషకము లవనిన్

కుందమాల లేక పొగడసరము – న/జ/భ/న/స/స/జ/గ, యతి (1, 11) 22 ఆకృతి 1425328
కనులకు రాదు నిద్ర, మృదు – కమలదళాక్ష నిశీథ మందు, నీ
కనుల వెలుంగు కాంతి ప్రతి – ఘడియ యెలుంగిడి పిల్చె నన్ను, రా
కనికర ముంచి హస్తములఁ – గవుగిలి నీయ, హరీ గళాన వే–
తును సిత కుంద మాలలను, – దుడుతును కాళ్ళను కళ్ళ నీళ్ళతో

గుణిత పొగడసరము–
పదములు
పాడెదన్,
పిలిచి వలపుల
పీటను వేతు,
పుల్కలన్ బెదరుచు
పూతు గంధమును,
పృథుకము
పెట్టెద నావుపాలితో ముదమున,
పేద
పైదలియు
పొగడ సరాలను
పోహణింతు, నీ సుదినము
పౌర్ణమిన్ బ్రదుకు శుభమవ,
పండ త–
పః ఫలమ్ము రా!

పదములఁ బాడెదన్, బిలిచి – వలపుల పీటను వేతుఁ, బుల్కలన్
బెదరుచుఁ బూతు గంధమును, – బృథుకముఁ బెట్టెద నావుపాలితో
ముదమున, బేద పైదలియు పొగడ సరాలను బోహణింతు, నీ
సుదినము పౌర్ణమిన్ బ్రదుకు శుభమవఁ, బండఁ దపః ఫలమ్ము రా!

కుసుమస్రజ – స/న/న/భ/గురు, యతి (1, 8) 13 అతిజగతి 3580
రమణిన్ గనగను – రసమానస రా
కుసుమ స్రజమును – గొనఁగా దరి రా
హసితాననమున – హరియించఁగ రా
అసితా సితవలె – నలరించెదరా

కోమలకల్పకలికా – స య స న గ, యతి (1, 7) 13 అతిజగతి 3788
మనమోహినీ కో–మల కల్ప కళికా
నను జూడ రావా – నగుచుండు మొలకా
వినువీథిలోనన్ – వికసించు వెలుఁగై
ప్రణయంపు గీతిన్ – బలికించు తెలుఁగై

కోమలలతా – మ/త/స/త/త/గ, యతి (1, 5, 10) 16 అష్టి 18657
గోదాదేవీ – కోమలలతా – గోవిందుఁ బూజించఁగా
నా దామమ్మున్ – హారి మెడలో – హర్షమ్ముతో వేయఁగా
శ్రీదేవేశున్ – జేరె గద నీ – జెల్వంపు కేశమ్ములున్
మోదమ్మొందెన్ – మోహవశుఁడై – ముద్దాడ నిన్నెంచెఁగా

గులాబి – భ/భ/భ/ర/స/స, యతి (1,10) 18 ధృతి 112055
క్రొన్నన లెల్లెడ నామని – కోరికల్ మది నిండెనుగా
నెన్ని గులాబులు పూచిన – వీ వనిన్ గడు రమ్యముగా
నెన్ని విధమ్ముల రంగుల – కీ షడంఘ్రులు పర్విడునో
యెన్ని విధముల తావుల – నీ సమీర మొసంగి చనున్

గులాబిమాల – జ/ర/న/భ/భ/ర/లగ, యతి (1, 10) 20 కృతి 355798
గులాబి మాల వేసెదను – గ్రుచ్చక గుమ్మని కంఠమందు నే
కలాపి పింఛమున్ శిశువు – కార్జడమీద రమించ నుంచెదన్
విలాసవీథులన్ దిరుగు – వెన్నుని కిచ్చెద వేణువాద్యమున్
కళాత్ము నీలదేహు కల–కాలము కావఁగఁ గోరి మ్రొక్కెదన్

చంపకమాల – చంపకేసరి

చంపకమాల – న/జ/భ/జ/జ/జ/ర, యతి (1, 11) 21 ప్రకృతి 711600
కన కన గాన రావు వెదు–కంగను దాగితి వెక్కడో వనిన్
విన విన దీయ తేనియల – వేణు రవమ్ములు లేవు గాలిలో
చన చన మార్గ మందు పద – సంజ్ఞలు తోచవు డస్సితిన్ గదా
దిన దిన మీవు వత్తు వని – దిక్కులు చూచుచు నుంటి నేన్ హరీ

చంపకకేసరిని చంపకమాలలో గర్భితము చేయ వీలగును. చంపకమాలలోని భాగముగా చంపకకేసరిని క్రింద చదువవచ్చును

చంపకేసరి– స/జ/స/స/స/లగ, యతి (1, 9) 17 అత్యష్టి 46828
కన కాన రావు వెదు–కంగను దాగితి వెక్కడో
విన తీయ తేనియల – వేణు రవమ్ములు లేవుగా
చన మార్గ మందు పద – సంజ్ఞలు తోచవు డస్సితిన్
దిన మీవు వత్తు వని – దిక్కులు చూచుచు నుంటి నేన్

చంపకమాలీ లేక రుక్మవతీ లేక తోవకము – భ/మ/స/గ, యతి (1, 6) 10 పంక్తి 199
సారస నేత్రా – చంపకమాలీ
నీరద దేహా – నిర్మలశీలీ
కారుణికాత్మా – కారణరూపా
చేరఁగ రారా – చిన్మణిదీపా

చిత్రకోత్పల – భ/ర/న/త/గ, యతి (1, 7) 13 అతిజగతి 2519
చిత్రకమున్ వనిన్ – చెమరుచున్ గానఁగా
చిత్రముగా మదిన్ – జెలువముల్ నిల్చెఁగా
నేత్రము లెందుకో – నెగడెఁగా నిప్పులై
రాత్రికి రాజుగా – రమణతో పర్విడన్

జలజాత – జ/స/స/య/ల, యతి (1, 9) 13 అతిజగతి 4830
హరీ యని దలంచఁగ – హాయియే కల్గె
తరించఁగ సుఖమ్ములఁ – దాకఁగా దోచె
స్థిరమ్మగు మనస్సున – దీపమే వెల్గె
సరస్సను హృదిన్ జల–జాతమే పూచె

ధవళకుసుమ– న/న/ర/న/న/ర, యతి (1, 10) 18 ధృతి 97984
ధవళ కుసుమ మాలలన్ – దనర నిచట నల్లితిన్
తవ గళమున వేయఁగాఁ – దగు నిది యని నమ్మితిన్
శ్రవణములకు నింపుగా – స్వరమయమగు గీతముల్
నవ రసముల నింపితిన్ – నయ మవగను జిత్తముల్

ప్రాసయతితో –
నవము నవముగా హిమం – బవని బడెను చల్లఁగా
ధవళ కుసుమ రాశు లీ – చెవుల బడక మెల్లఁగా
దివియు మణుల జల్లఁగా – భువియు ముదము నందెఁగా
శివము నటన మాడెగాఁ – గవిత లలరి చిందఁగా

నళిని లేక భ్రమరావలికా – స/స/స/స/స, యతి (1, 10) 15 అతిశక్వరి 14044
నళినీదళనేత్రయు – నాణ్యముగా నిలిచెన్
దలబోయుచు నిన్ను స–దా తలవాకిలిలోఁ
గలఁతల్ మదిలో మల–గాఁ గలిఁగించకుమా
శిలపైఁ జిలికించు సు–ధాంచిత శీకరముల్

ఇందులో ఒక తోటక వృత్తము కూడ గర్భితమైయున్నది. అది –

తోటకము – స/స/స/స, యతి (1, 9) 12 జగతి 1756
నళినీదళనేత్రయు – నాణ్యముగా నిలిచెన్
దలబోయుచు నిన్ను స–దా తలవాకిలిలోఁ
గలఁతల్ మదిలో మల–గాఁ గలిఁగించకుమా
శిలపైఁ జిలికించు సు–ధాంచిత శీకరముల్

నందన – న/జ/భ/జ/ర/ర, యతి (1, 12) 18 ధృతి 76720
లలితముగా సరాగములతో – రమించఁగాఁ బాడఁగా
వలపుల నుల్లసించి మది సం–భ్రమించఁగా నాడఁగా
కలలను యింద్రచాపముల వీ–క్షణమ్ము భాసించఁగా
నిల యిది నందనమ్మగుఁ గదా – హృదిన్ వసంతమ్ములో

నరకపుష్పిణీ లేక జలదరసితా – న/స/య/య/లగ, యతి (1, 9) 14 శక్వరి 4704
నిరతము మనస్సులో – నిన్నె దల్తున్ గదా
నిరతము మనస్సుతో – నిన్నె బిల్తున్ గదా
నిరతము నిశీథిలో – నిన్నె వాంఛింతురా
కరివరద నిన్ గనన్ – గాక దీరున్ గదా

(ఇందులో ద్విరదగతి రగడ, అంతరాక్కర కూడ గర్భితమై యున్నవి. )

నవోత్పల – మ/జ/స/స/స/జ/గ, యతి (1, 9) 19 అతిధృతి 177897
లాలీ యంటి నేను ఘన – లాలస మీఱఁగ నూయె లూపుచున్
మాలీ యంటి నేను మన – మార నవోత్పలమాలినిన్ హరిన్
మూలీ యంటి నేను మన – ముల్లస మొందఁగ మూలరూపునిన్
కాలీ యంటి నేను భయ–కారకు, వారకు కృష్ణమోహనున్

నీలోత్పలమాలా లేక అర్ధక్షామా – మ/త/య – 9 బృహతి 97
నీకై యీ నీలోత్పలమాలన్
నా కేలన్ నే గ్రుచ్చితి స్వామీ
స్వీకార్య మ్మా కంఠమునందున్
రా కన్నుల్ నిండన్ హృదయేశా

వాణి–పద్మ–అంబా

వాణి – ర/న/భ/భ/ర/లగ, యతి (1, 7, 13) 17 అత్యష్టి 44475
తెల్ల నైన దెల – తెల్లని యుల్లపు – దేవి వాణికిన్
నల్ల వాని నల – నల్లని మోహను – నారి పద్మకున్
చల్ల కంటి చల – చల్లని యంబకు – స్వర్ణ గౌరికిన్
కల్ల గాదు గలు – గల్లన నా మదిఁ – గైతఁ బాడెదన్

పద్మ లేక మంజుభాషిణీ – స/జ/స/జ/గ, యతి (1, 9) 13 అతిజగతి 2796
తెల తెల్లని యుల్లపు – దేవి వాణికిన్
నల నల్లని మోహను – నారి పద్మకున్
చల చల్లని యంబకు – స్వర్ణ గౌరికిన్
గలు గల్లన నా మదిఁ – గైతఁ బాడెదన్

అంబా – భ/భ/ర/లగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 695
తెల్లని యుల్లపు – దేవి వాణికిన్
నల్లని మోహను – నారి పద్మకున్
చల్లని యంబకు – స్వర్ణ గౌరికిన్
గల్లన నా మదిఁ – గైతఁ బాడెదన్

పంకజవక్త్రా – న/న/స/స/త/య, యతి (1, 5, 14) 18 ధృతి 50944
నిరతము – నిను మదిఁ దల్తును నీతో – నెయ్యము సేతున్
స్వరముల – సరముల, పంకజవక్త్రా, – చక్కగఁ జేతున్
సరగున – సహృదయ చూడర చాలీ – జాలము రారా
బిరబిర – ప్రియతమ సుందర వేళన్ – బ్రేమల నీరా

పంకజవాటికా – భ/న/న/భ/గ, యతి (1, 8) 13 అతిజగతి 3583
పంకజనయనలు – పలు పుష్పములన్
బంకజనయనుని – బదముల్ గొలువన్
శంకలు వదలుచుఁ – జన వాటికలో
జింకల నడుమను – జెలువున్ గనిరే

పంచకమల – భ/య/స/గగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 207
మించువలె నవ్వుల్ – మృదువౌ పువ్వుల్
పంచకమలమ్ముల్ – వరదా నీకే
ముంచ నను రావా – ముదమై దేవా
కాంచ నను రావా – కలలోనైనన్

పద్మమాల– భ/ర/య/స/స/జ/గ, యతి (1, 9) 19 అతిధృతి 177751
వేగము రమ్ము పాడఁగా –
వేగము రమ్మిదె యాడఁగా హరీ
వేగము రమ్ము తోడుగా –
వేగము రమ్మిదె నీడగా దరిన్
వేగము రమ్ము చూడఁగా –
వేగము రమ్మిట గూడఁగా లలిన్
నీ గళమందు వేసెదన్ –
నే గడు యందపు పద్మమాలలన్

పద్మముఖీ లేక ఖగతి – భ/భ/భ/భ/భ/గ, యతి (1, 8), ప్రాసయతి (1, 10) 16 అష్టి 28087
సన్నని కంఠముతో – సకి – కిన్నెరసానివిగా
చెన్నుగఁ బాడఁగ రా – చెలి – వెన్నెల వేళలలో
కన్నుల నిండిన యా – కల – పెన్నిధి పద్మముఖీ
ఎన్నడు నీ దలఁపే – హృది – నెన్నడు నీ వలపే

పద్మావతి– పాదమునకు 32 మాత్రలు, యతి (1, 11, 23) మాత్రలకు
పద్మాప్తుఁ డుదయించెఁ – బ్రాచీ దిశ యొక యరుణా–స్పద మయె నగమ్ముపై
పద్మములు వికసించెఁ – బద్మాకరముల సురుచిర – పద్మరాగమ్ములై
పద్మనాభా నీకుఁ – బ్రణతుల నొసఁగెద జగతిని – బాలించ లేవయ్య
పద్మావతీ నీకుఁ – బ్రణతుల నొసఁగెద జగతిని – బాలించ లేవమ్మ

పద్మావతికా లేక సుందరికా – స/స/భ/స/త/జ/జ/ల/గ, యతి (1, 7, 13, 18) 23 వికృతి 3590044
హృదయంగమమై – హృష్టికి నిరవై – శృంగారముతో – సృజనాత్మకమై
మధురాస్పదమై – మంజులతరమై – మానోజ్ఞకమై – మనమోహనమై
సుధవోల్ నదమై – సుందర రవముల్ – శోభాకరమై – సుమసుందరికా
పదముల్ ముదమై – పాడెద వినుమా – పద్మావతికా – వర భూతిలకా

పల్లవి (షట్పద)– 4,5 / 5,5 / 5,6 మాత్రలు
చల్లని వేళ యిది
యుల్ల మిట త్రుళ్ళినది
యల్లరులు చాలించర
మెల్లగ మీటు మిట
వల్లకిని వ్రేళ్ళతో
పల్లవిని పాడెద నేన్

పల్లవిని – బేసి పాదములు కేక (3–2–2 // 3–2–2), సరి పాదములు (3–2–2 // 2–2)
పల్లవించంగఁ తీఁగ – పలు పుష్పమ్ము లూఁగ
నుల్ల మానందమొంది – యూఁగె వేగ
చల్లఁగా గాలి వీచ – చంద్రుఁ డాకాశమందు
తెల్లఁగా వెల్గు నింపి – తేనెఁ జిందు

పల్లవిని – బేసి పాదములు – IAU – IAAA // IAU – IAAA,
సరి పాదములు – IAU – IAAA // IAU – U (A – ఏ అక్షరమైనా సరియే)
చిలుకా పిలువఁడే – చెలితోఁ బలుకఁడే
చిలుకా వలలలోఁ – జిక్కినానే
చిలుకా మనసులోఁ – జెలిమిన్ దలువఁడే
చిలుకా వ్యధలలోఁ – జీలినానే

పారిజాతము – 5,6/5,6/5,5 మాత్రలు
పారిజాతము నీవే
మారు జూతము నీవే
వారిపాతముగ రా
కోరకపు వని నీవే
కోరికల గని నీవే
కోరితిని సకియ రా

పారిజాతము – త/ర/త/ర/భ/జ/స/న/గగ, ప్రాసయతి (1, 7), సామాన్య యతి (1, 13, 21) 26 ఉత్కృతి 15656213
గోపాల నీవెగా – నాపాలి కెల్లయున్ – గుందితిని నీకొఱకుఁ – గొంచె మిట రారా
శ్రీపారిజాతమున్ – నీపాదపూజకై – చెల్వముగ బూచె వనిఁ – జేరువకు రారా
భూపాల రాగమున్ – నే పాడెదన్ సఖా – భూమిపయి వెల్లువయెఁ – బూర్ణ నవకాంతుల్
దీపాల వెల్గులో – రూపమ్ము జూడఁగా – దృప్తియగు నా మనసు – తేలు మది శాంతుల్

పాటలికా – న/య/న/య // భ/భ/భ/గగ
వనము వసంతో-త్పనము దొడంగెన్
తేనియ పుప్పొడి – దిక్కుల నిండెన్
అనిలము గంధ – మ్మలరఁగఁ దెచ్చెన్
కానఁగఁ బాటలి-కాసుమ రాశుల్

పున్నాగ – భ/ర/న/మ/య/లగ, యతి (1, 11) 17 అత్యష్టి 37335
ఆయమ తల్లి యీ జగతికౌ – నా దేవుడే తండ్రియౌ
నీ యిల పార్వతీపశుపతుల్ – హృత్పీఠమం దెప్పుడున్
బాయక నుండి యిత్తురుగ స–ద్భావమ్ములన్ బ్రేమతో
బూయఁగ జీవనమ్ము రమణన్ – బున్నాగ పుష్పమ్ముగా

పుష్పకేళిక – భ/ర/న/త/త/గ, యతి (1, 10) 16 అష్టి 18903
నందకుమార నీ కొసఁగ – నావద్ద లేదేమియున్
మందిర మౌను మానసము – మాధుర్య ముప్పొంగు నీ
సుందర పుష్పకేళికను – జూడంగ రావేలరా
వందలుగాను పాటలను – భావమ్ముతోఁ బాడెదన్

పుష్పడోలిక – న/జ/భ/య/య/లగ, యతి (1, 11) 17 అత్యష్టి 37808
తరగలవోలె గాలి మెలఁ – దాకంగ దేహమ్ము, రా
మురియుచు పుష్పడోలికల – మోదమ్ముతో నూఁగఁగన్
విరియును పుష్పమై మదియు – వేవేల పత్రమ్ములన్
హరి హరి యంచు పిల్చి నిను – హారమ్ము వేతున్ సఖా

పుష్పదామ– మ/త/న/స/ర/ర/గ, యతి (1, 6, 13) 19 అతిధృతి 75745
వాసంతమ్మందున్ – ప్రతి లత కొనలో – వర్ణ సంపత్తు నిండెన్
వాసమ్మే జూడన్ – భ్రమరములకు నా – పత్ర పుష్పాల డోలల్
నా సంకల్పమ్ముల్ – నవరస పదముల్ – నర్మ గీతాలు నీకే
మోసాలన్ నిల్తున్ – ముదము విరియఁగా – పుష్పదామమ్ము వేతున్

పుష్పశకటికా లేక లక్ష్మీ– భ/స/త/త/గగ, యతి (1, 8) 14 శక్వరి 2335
పౌష్పఋతువులోనన్ – పౌర్ణమీచంద్రుఁ గానన్
పుష్పశకటికన్ రా – ఫుల్లమౌ నవ్వుతో రా
శష్పసమము నేనున్ – సార్వభౌముండు నీవున్
బాష్పమయితి నేనున్ – భావనాచక్షువందున్

పుష్పితాగ్ర – బేసి – కామదత్త (న/న/ర/య), సరి – ప్రభాత (న/జ/జ/ర/గ)
గతము లయెను – కాలచక్రమందున్
బొతముగ నామని – పుష్పితాగ్రమాలల్
పతిత మయెను – వర్ణపత్రరాశుల్
చితులయె నాశలు – చిత్తమందు నేడున్

పూలసరము – భ/స/భ/స/భ/స/ర, యతి (1, 13) 21 ప్రకృతి 649119
మిశ్రగతిలో అక్షరసామ్య యతితో –
నింగి వెలుఁగులోఁ దార తళుకులో – నేల సొగసుతో నుండెఁగా
పొంగు లహరిలో రంగు విరులతో – మ్రోఁగు సడులతో నిండెఁగా
ఖంగు మనెనుగా గంట బురుజులో – కాల మయెనుగా రాఁడొకో
రంగఁ డతఁడు నా ముందు నిలువఁడే – రాత్రి గడియలో నేలకో

మిశ్రగతిలో ప్రాసయతితో –
నీల గగనమున్ – దేలు మొయిలులా – నీలతనువు నేఁ జూతురా
వేల విరూలతోఁ – బూల సరము నేఁ – గేల గళములో వేతురా
చాలు నిటులనిం – కేల నటనలో – లీల వలదురా మాధవా
పాల మనసులోఁ – బాలు చిలుకరా – బాల శశివలెన్ రా ధవా

చతురస్రగతిలో సామాన్య యతితో –
బాలక యిటులన్ గ్రీడలు సరియా – పాలను పెరుగున్ ద్రావఁగా
వాలము వలదీ కోఁతికి నగుచున్ – వాసముఁ జొరఁగా మేయఁగా
చాలిక నిటులీ జాలము చిఱుతా – చక్కఁగ నిడెదన్ వాఁతలన్
గోలను నిక నే తాళఁగ నగునా – గోకుల తిలకా చేఁతలన్

చతురస్రగతిలో ప్రాసయతితో –
కన్నులఁ గలగా – నిన్నిటఁ గనఁగాఁ – దెన్నుల వెలుగుల్ దండిగా
పున్నమి నిశిలోఁ – బున్నెపు వరమై – వెన్నెల మడుఁగుల్ నిండెఁగా
అన్నులు మదిలో – మిన్నగ నెరయన్ – జెన్నుగఁ బదముల్ తోచెఁగా
వన్నెల కిరవై – కిన్నెర రవమై – పెన్నిధివలె రా ప్రోచఁగా

ప్రసూన – జ/స/న/భ/గగ, యతి (1, 9) 14 శక్వరి 3550
దినమ్మున జ్వలించెను – దివాకరు డందున్
వనమ్మున జలించుచు – ప్రసూనము లెందున్
మనమ్మున నటించెను – మయూరము సొంపై
యనంతము ముదమ్మిట – ననంగుని కింపై

మంజరి లేక పథ్యా– స/జ/స/య/లగ, యతి (1, 6) 14 శక్వరి 4844
కన నెందు నెఱ్ఱగను – గందువన్ మంజరుల్
చిన లేత తీవలకు – చిత్రమౌ వర్ణముల్
మనమెల్లఁ బొంగఁగను – మాలగాఁ బుష్పముల్
విన నూత్న రాగములు – ప్రేమ సంభోగముల్

మంజరి –బేసి పాదము: రత – రత // రత – రత, సరి పాదము: రత – రత // రత – గ
సౌందర్య మంజరీ – స్వప్నాల సుందరీ
మందాకినీవారి – మాధుర్యమా
ఇందిరాసోదరీ – ఇందీవరాననా
ఛందమ్ములందుండు – చాతుర్యమా

మంజుమాలతీ – ర/జ/స/జ/గ, యతి (1, 7), 13 అతిజగతి 2795
సందెవేళ జ్యోతి – చరమాద్రిఁ జేరెఁగా
సుందరమ్ము నింగి – శుకగీతు లెల్లెడన్
నందబిందువైన – నవ మంజుమాలతీ
చిందుమిందుఁ దావి – చెలువమ్ము నిండఁగా

యతి (1, 6), ప్రాసయతి (1,9) తో
సంజవేళలో – సరస – రంజిలంగ రా
వంజుళమ్ములే – వనిని – గుంజనమ్ములే
మంజులమ్ముగా – మధుర – శింజితమ్ములే
కంజలోచనీ – గనుమ – మంజుమాలతీ

మందార – స/న/ర/భ/లగ, యతి (1, 9), 14 శక్వరి 7356
మణులుండు గని నీవు – మందార తరువా
తనువిందు నిను గోరెఁ – దాపమ్మె నెరవా
స్వన మొండు విన నీదు – వాక్యమ్ము లని నా
కనుదోయి నిను జూడఁ – గాంక్షించెఁ గుటిలా

రాజహంస – మందారదామ – స్రగ్విణీ

రాజహంస – త/త/త/త/త/త/త/త/గ, యతి (1, 13) 25 అభికృతి 9586981
అందాల యా నైషధాగ్రీయు నెంతున్ మ–హా వర్ణనీయాఖ్యునిన్ భర్తగాఁ గోరితిన్
సౌందర్య మూర్తీ లసద్రాజహంసా య–శఃపూర్ణచారిత్రునిన్ పూర్ణచంద్రాననున్
మందారదామమ్ము మై పొంగ వేతున్ సు–మా స్వర్ణ పుష్పాలతో శ్రద్ధగాఁ గొల్చెదన్
డెందమ్ములో ప్రేమలేఖన్ రచింతున్ వ–డిన్ పూర్ణ సంవిత్తితోఁ బొందునో స్రగ్విణిన్

ఇందులో మందారదామ, స్రగ్విణీ వృత్తము కూడ దాగి ఉన్నాయి.

మందారదామ లేక ప్రాకారబంధ – త/త/త/గగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 293
అందాల యా నైష–ధాగ్రీయు నెంతున్
సౌందర్య మూర్తీ – లసద్రాజహంసా
మందారదామమ్ము – మై పొంగ వేతున్
డెందమ్ములో ప్రేమ–లేఖన్ రచింతున్

స్రగ్విణీ – ర/ర/ర/ర, యతి (1, 7) 12 జగతి 1171
వర్ణనీయాఖ్యునిన్ – భర్తగాఁ గోరితిన్
పూర్ణచారిత్రునిన్ – పూర్ణచంద్రాననున్
స్వర్ణ పుష్పాలతో – శ్రద్ధగాఁ గొల్చెదన్
పూర్ణ సంవిత్తితోఁ – బొందునో స్రగ్విణిన్

మందారపుష్పము – త/త/మ/ర/ర/గ, ప్రాసయతి (1, 9) 16 అష్టి 9253
మందారపుష్పమ్ము నీకై – గంధమ్ము నీయంగ తేనా
సౌందర్యగానమ్ము నీకై – యందించి యుల్లాస మీనా
సిందూరవర్ణమ్ము నీపై – చిందించి నే పారిపోనా
కందోయితో నేను నీపై – బంధమ్ము వేయంగ రానా

మధుమతి – న/భ/గ, 7 ఉష్ణిక్కు 56
కన వసంతములో
వనములో విరులే
తనువులో విరులే
మనసులో విరులే

మధుమల్లీ – స/భ/ర 9 బృహతి 180
మధుమల్లీ మధురాకృతీ
హృదయాగ్నీ కవితాకృతీ
మదిరాక్షీ మృదుకోకిలా
సుధవోలెన్ ముదమీయ రా

మనోరంజిత – మ/న/ర/జ/త, యతి (1, 9) 15 అతిశక్వరి 19129
ఆడంగా మనసు గల్గె – నాడ నిమ్ము నృత్యమ్ము
పాడంగా మనసు గల్గెఁ – బాడ నిమ్ము గీతమ్ము
వేడంగా మనసు గల్గె – వేడ నిమ్ము నామమ్ము
చూడంగా మనసు గల్గెఁ – జూపవేల నీ మోము

మల్లికామాల లేక మత్తకోకిల – ర/స/జ/జ/భ/ర, యతి (1, 11) 18 ధృతి 93019
జాల మేలకొ జాము రేతిరి – జారిపోయె నిజమ్మురా
నేల యిచ్చట నిద్ర వోయెను – నీల తారక వెల్గెరా
పాల నిత్తును పండ్ల నిత్తును – పక్క వేతును మల్లికా
మాల వేతును ముద్దు లిత్తును – మార రా నగుమోముతో

మల్లెల మాల – భ/ర/న/న/జ/జ/ర, యతి (1, 10) 21 ప్రకృతి 712663
మల్లెల మాలలో, మినుకు – మని మిసి మీఱుచు వెల్గు తారలో,
ముల్లెల మూటలో, మృదుల – పులినములో, మెఱమెచ్చు మేరువో,
జిల్లను మైకమో, మొగులు – చిలికెడు వర్షమొ, మోహనోక్తియో,
తెల్లని మౌక్తికాక్షతలొ, – తెలుఁగు పదా లవి మంచి గందమో!

గుణిత వృత్తముగా –
మల్లెల
మాలలో,
మినుకుమని మిసి
మీఱుచు వెల్గు తారలో,
ముల్లెల
మూటలో,
మృదుల పులినములో,
మెఱమెచ్చు
మేరువో, జిల్లను
మైకమో,
మొగులు చిలికెడు వర్షమొ,
మోహనోక్తియో, తెల్లని
మౌక్తికాక్షతలొ, తెలుగు పదా లవి
మంచి గందమో!

మాల – ర/స/జ/జ/భ/ర/గ, యతి (1, 11) 19 అతిధృతి 93019
అటతాళ యుక్తముగా –
కోకిలా చెవివిందు జేయగఁ – గోమల స్వరమాల లెన్నో
వేకువన్ వడి పాడుచుంటివి – వేదనల మఱువంగ నాకై
చీకటిన్ దొలగించి వెలుఁగులు – చేరెగా ధరపైన జూడన్
నాకు నీ భవమందు నిండును – నవ్యమై శుభ కాంతు లింకన్

త్రిపుటతాళ యుక్తముగా –
నిన్న రేతిరి పూట మెల్లగ – నిద్రలో గల యొండు వచ్చెన్
సన్న జాజుల తావిఁ జల్లుచుఁ – జంద్రకాంతులు వన్నె దెచ్చెన్
కన్నుదోయియు జూడజాలని – కాంతి చాపము లెందు నిండెన్
తెన్ను లెన్నియొ క్రొత్త క్రొత్తగఁ – దేలి నా కగుపించుచుండెన్

మాల – (3,3,3) / (3,3,3) / (3,3,3,5)
మేఘమాల నీవు
రాగమాల నేను
మూగవోతి నిన్ను జూడఁగా
వేగ కురియు మిచట
మ్రోగిపోదు నేను
నా గళమ్ము విరియుఁ బాడఁగా

మాలతీ – న/జ/జ/ర, యతి (1, 6) 12 జగతి 1392
మనసును దా – మరపించు మెల్లఁగా
తనువును దాఁ – దనియించుఁ జల్లఁగా
వనమున నా – వనమాలి వచ్చెనా
అనఘుని మోహను – జూడు మాలతీ!

మాలతీ – మ/మ/య/య/య/య/ల, యతి (1, 5, 11) 19 అతిధృతి 299585
మల్లెల్ బూయన్ – మత్తున్ మునింగేను – మాధుర్యమున్ నింపె గంధమ్ము
ఉల్లంబెంతో – యుప్పొంగె సంద్రంపు – టుత్తుంగ భంగమ్ములై నేఁడు
అల్లల్లాడెన్ – హర్షమ్ముతో డెంద – మానందమై మాలతీ వేళ
పిల్లంగ్రోవిన్ – వేగమ్ముగా నూఁది – ప్రీతిన్ రమించంగ రా కృష్ణ

ముకులితకలికావలీ – ర/న/న/ర, 12 జగతి 1531
ఏడవ అక్షరము యతిగా –
మానసోత్కళిక – మఱల విచ్చునో
వేణు సద్రుతము – వినఁగ వచ్చునో
తేనియల్ ఝరిగఁ – దియగ పారునో
వానగన్ గురిసి – వలపు ముంచునో

ఆఱవ అక్షరము యతిగా –
గానలోలుని – గలయఁగఁ నెంచఁగా
మానసమ్మున – మరులను బెంచఁగా
నేను నీకను – నిజమును గాంచఁగా
మేను వేఁచెను – మృదుమధురమ్ముగా

మొగలిపూలు – న/జ/న/న/న/భ/న/న/గ, యతి (1,12) 25 అభికృతి 16744432
మొగులును గాంచ గగనమున – మొగ మది వెల్గె మదిని మెఱపులతో
మొగసల వేచి నిలిచితిని – మొగలి సువాసన సిగల విపులమై
సగమయె రేయి ఘడియ లిట – సగమయె దేహము వగల విసముతో
నగవుల ముంచ ముద మొదవ – నగరిని జేరర హరి హరిణగతిన్

రజనీగంధా – 6(1),6(2),8(3),8(4) మాత్రలు, యతి 1,2 మఱియు 3,4 భాగములకు సామన్య లేక ప్రాసయతి; 1,3 భాగములకు సామన్య యతి.
కన్నులతో – నిన్ను జూడఁ – గలకాలపు నా – కలలు పండు, యీ
కన్నులకో – కాన రావు – కాచిన వయ్యవి – వేఁచి చూచుచున్
వన్నెలతో – వచ్చె శశియు, – వ్రజమో వెలింగె, – రజనీ గంధము
నన్ను లేపె – నిన్నెంచఁగ, – నయగారముతో – నల్లనయ్య రా

రసాల – ర/స/స/ల, యతి (1, 6) 10 పంక్తి 731
నిన్న జూచితి – నీ సరసాల
నిన్ను జూచితి – నీకు రసాల
మన్న దొప్పిద–మైన పదమ్ము
చెన్నుగా నిట – జెంతకు రమ్ము

రాగవల్లరి – ర/ర/ర/స/య/య/లగ, యతి (1, 12) 20 కృతి 300691
ఆలపించంగ రా రాగవల్లరి – నాలపించంగ రా తీయఁగా
ఆలకింతున్ గదా రాగరాగిణు – లాలకింతున్ గదా హాయిగా
పూలు బూయున్ గదా మానసమ్మున – మోదగంధమ్ముతో ముగ్ధమై
శ్రీలు జిందున్ గదా డెందమందున – చిద్విలాసమ్ముతో స్నిగ్ధమై

ప్రాసయతితో –
చిక్కగా చీఁకటుల్ నిండెగా నలు – పక్కలన్ జూడఁగా గాదుగా
చుక్కలే నింగిలో నెక్కువై కనఁ – జక్కనౌ చంద్రుఁడే లేఁడుగా
ఇక్కడీ యింటిలో నొంటిగా నిక – దిక్కు నా కేదియున్ లేదుగాఁ
గ్రక్కునన్ బ్రీతితో రాఁడుగా నను – నక్కునన్ జేర్చి ముద్దీఁడుగా

రాగవల్లి– ర/ర/ర/న/ ల, యతి (1, 7) 13 అతిజగతి 7827
మోదముల్ నీవెగా – మోహనా నిజముగ
నాదముల్ నీవెగా – నందనా నిజముగ
వేదముల్ నీవెగా – ప్రేమికా నిజముగ
పేద నన్ జూడరా – ప్రీతితో నిజముగ

రాగోత్కళికా – త/జ/న/య/య/య, యతి (1, 6, 12) 18 ధృతి 37869
ఆ నాఁడలలై – యమృత ధునితో – నందమై పాడినావే
గానోత్కళికా – కవిత గుళికా – కావ్యవారాధినౌకా
ఈ నాఁడిటులన్ – హృదయమున నా – కెంతయో బాధ గల్గెన్
రా నా మదిలో – రసము జిలుకన్ – ప్రాణమే లేచివచ్చున్

లతా లేక మదనజవనికా – న/య/న/న/గ, యతి (1, 7) 13 అతిజగతి 4048
కనుగవ కింపై – కదలెడు నెలఁతా
తనువున కింపై – తనరు సుమలతా
అనుపమ రూపం – బగు నవ సరితా
మనసున కింపౌ – మదన జవనికా

లలితలత – న/న/భ/న/జ/న/న/య, ప్రాసయతి (1, 8, 15) 24 సంకృతి 4186048
అలరుల సరులన్ – లలితలతలతో – విలసితమయె వని వింతన్
చలితములయెఁగా – కులుకుల రొదతో – నళికులములు బలు చెంతన్
కలకల మనుచున్ – గిలకిల మనుచున్ – బులుఁగులు గగనమునందున్
వెలుఁగుల వలలో – మిలమిల మెరిసెన్ – జలములు నదములయందున్

లవంగలతా – స/ర/ర/గల, యతి (1, 7) 11 త్రిష్టుభ్ 1172
కనఁగా నింగిలోఁ – గాళ మేఘాల
మనసిం దేడ్చెగా – మాధవా యంచు
తనువో స్పర్శకై – దప్పితో నెండె
చినుకై వర్షమై – శీఘ్రమే రార

వనమంజరి – న/జ/జ/జ/జ/భ/ర, 21 ప్రకృతి 744304
వర నవమంజరు లూఁగెనుగా – వనమందు వన్నెల చిత్రమై
హరిణము లెల్లెడఁ బర్విడెఁగా – హరితంపు పచ్చిక కాత్రమై
కరి కరిపైఁ జనె గంతులతోఁ – గలవాపి నాట్యము సేయఁగా
తరువుల ఛాయలఁ జిత్రకముల్ – తటమందుఁ బాములు జారెఁగా

వనరుహ – మ/స/భ/భ/న/న/న/న/గ, యతి (1, 11, 19) 25 అభికృతి 33554432
నిన్నే గోరితి నే నీ యిలపై – నిలిచితిఁ దలఁచుచు – నిరతము సదయా
సన్నా యయ్యెను సంగీతముతో – సలలిత స్వరముల సముదిత హృదయా
కన్నయ్యా మది – కౌతూహలయై, – కల లిఁక నిజమగుఁ – గలఁతలు తొలగున్
నన్నీవేళ కనన్ రా వరదా – నలినము బ్రదుకగు – నగుచును విరియున్

ఇందులో కౌతూహల, మణిగణనికర వృత్తములు కూడ ఇమిడియున్నాయి –

కౌతూహల – మ/స/భ/గ, యతి (1, 6) 10 పంక్తి 409
నిన్నే గోరితి – నే నీ యిలపై
సన్నా యయ్యెను – సంగీతముతో
కన్నయ్యా మది – కౌతూహలయై
నన్నీవేళ క–నన్ రా వరదా

మణిగణనికరము లేక శశికళా – న/న/న/న/స, యతి (1, 9) 16 అతిశక్వరి 16384
నిలిచితిఁ దలచుచు – నిరతము సదయా
సలలిత స్వరముల – సముదిత హృదయా
కల లిఁక నిజమగుఁ – గలఁతలు తొలగున్
నలినము బ్రదుకగు – నగుచును విరియున్

వల్లీ – స/య/జ/త/గ, యతి (1, 8) 13 అతిజగతి 2380
సుర కల్ప వల్లీ ప్ర–సూన వర్ణమ్ములన్
నిరవద్య మందాకి–నీ తరంగమ్ములన్
చిరకాల స్వప్నాల – చిన్మయార్థమ్ములన్
పరికించగా నౌనె – బారవశ్యమ్మునన్

వసంతకోకిల – జ/భ/ర/స/జ/జ/గ, యతి (1, 12) 19 అతిధృతి 186038
అసీమమైనది పొంగి లేచెడు – హర్షసాగర మీమదిన్
హసించుచున్నవి పూల డోలలు – హాయిహాయిగ నీ వనిన్
వసంతకోకిల పాడెఁ గొమ్మలఁ – బంచమస్వర బద్ధమై
వసంతకాలము శోభ నిండగ – వచ్చె నేడిల నిద్దమై

వసంతతిలక – త/భ/జ/జ/గగ, యతి (1, 9) 14 శక్వరి 2933
ఆలోల మయ్యెఁ దరువుల్ – హరుసమ్ము గల్గెన్
బూలో వసంతతిలక–మ్ములుగాను వెల్గెన్
వేలాది తారలు నిశిన్ – వెలిగించి యాడెన్
కాలమ్ము ప్రేమికులకై – కవనమ్ముఁ బాడెన్

వసంతమల్లీ లేక జయరతనల – జ/య/ర/త/న/ల, యతి (1, 7) 16 అష్టి 63630
వసంతము మళ్ళీ – వచ్చెగా నందాల నొలుకుచు
వసంతపు మల్లీ – వత్తువా నెత్తావి నొసగుచు
రసమ్ముల ధారై – వ్రాయవా కావ్యమ్ము మురియుచు
హసన్ముఖ లీలా–హ్లాదమై హాసమ్ము కురియుచు

వారిజ – జ/త/త/త/ర/ల, యతి (1, 9) 16 అష్టి 43302
హృదిన్, హరా, నాగహారా! – హితంబైన భావముంచి,
సదాశివా! శాంభవీశా!,– సదా నీకు పూజ సేయు
విధానమే దెల్పుమయ్యా! – పినాకమ్ముఁ దాల్చు దేవ!
మదిన్ స్మరించంగ, శూలీ! – మహాభక్తి నీయుమయ్య!

వికలవకులవల్లీ – న/న/త/త – 12 జగతి 2368
తెరల మఱలఁ – దీయంగఁ దీయంగ
విరుల సరము – ప్రేమమ్ముఁ బూరించె
వఱలు వకుళ-వల్లీ మనోజ్ఞంపు
సిరుల నొసఁగి – చిందించు మోదమ్ము

విపినతిలక – న/స/న/ర/ర, యతి (1, 7) 15 అతిశక్వరి 9696
నృపతియును సీతయును – నెయ్యమున్ నింపఁగ
విపినతిలకమ్మయెను – ప్రేమరూపమ్ముతోఁ
దపసులకు నండగను – దండకారణ్యమం
దపరిమిత వీరుఁడగు – నా ఘనశ్యాముఁడే

విరితోట – స/న/భ/జ/ర, యతి (1, 9) 15 అతిశక్వరి 11196
హరుసమ్ము మదిలోన – ననుభూతి దల్చఁగా
విరితోట హృదయాన – ప్రియ నిన్ను దాకఁగా
వరుసమ్ము క్షణమౌను – వదనమ్ము జూడఁగా
సరసాల సుధ గారు – సకి యంచు బిల్వఁగా

విరివాన – ర/స/లగ, యతి లేదు 8 అనుష్టుప్ 91
తేనెలై సిరి బానలై
సోనలై విరి వానలై
కానలై వల కోనలై
మానినీ నను జేరవే

విరులసరము – (సూ/సూ) (ఇం/ఇం) // (ఇం/ఇం) (ఇం/ఇం), యతి లేక ప్రాసయతి ప్రతి అర్ధ పాదములో మూడవ గణముతో
విరుల సరముఁ – బ్రియముగాఁ గ్రుచ్చితిన్
సరస రా షణ్ముఖా – సంజెలో వల్లితో
సరస మాడ – శశిబింబ కాంతిలో
హరుసమ్ము నీయరా – యతిలోక సుందరా

శ్రితకమలా – భ/భ/స/గగ, యతి (1, 7) 11 త్రిష్టుభ్ 247
కాంచితి నిన్ శ్రిత–కమలాధీశా
వాంఛలు గల్గెను – వసుధాధీశా
కాంచనవస్త్రము – గట్టిన దేవా
కాంచఁగ నన్నిట – గరుణన్ రావా

సంపఁగి – 4,5,5 – 4,5,5 మాత్రలు
పూచెన్ విరు లెన్నొ వందలుగ – ఫుల్ల మ్మాయెఁగా డెందముల్
తోచెను తార లాకసములోఁ – దొడిగెన్ వనకన్య యందముల్
లేచెన్ మదిలోన భావములు – లేఁడే నా సఖుం డీ తఱిన్
చూచెను వానికై నయనముల్ – సుహృదా నను జేర రా దరిన్
(బేసి పాదములు మొదటి రెండు మాత్రలు తొలగించగా జనించిన విక్రీడిత వృత్తపు పాదములు, సరి పాదములు ఉత్పలమాల పాదములు)

సరసిజము – మ/త/య/న/న/న/న/స, ప్రాసయతి (1, 5), సామాన్య యతి (1, 10, 18) 24 సంకృతి 8388193
లాలించంగన్ – బూల కరాలన్ – రమణులు శిశువును – లలిత పదములన్
కాళిందిన్ దు–ష్కాళియుఁ గాలన్ – గదుమఁగ వెఱపున – గలఁగిరి కనులన్
కేలన్ కెందో–మాలలఁ గేళిన్ – గిరిధరు గళమున – గెలవున నిడిరే
స్త్రీలా చిద్గో–పాలుఁడు చేలన్ – జిలిపిగఁ గొన వడి – చిడిముడిపడిరే

ఇందులో రెందు కంద పద్యములు ఉన్నాయి –

లాలించంగన్ బూల క–
రాలన్ రమణులు శిశువును – లలిత పదములన్
కాళిందిన్ దుష్కాళియుఁ
గాలన్ గదుమఁగ వెఱపున – గలఁగిరి కనులన్
కేలన్ కెందోమాలలఁ
గేళిన్ గిరిధరు గళమున – గెలవున నిడిరే
స్త్రీలా చిద్గోపాలుఁడు
చేలన్ జిలిపిగఁ గొన వడి – చిడిముడిపడిరే

సరసీరుహముఖి – స/న/న/న/త/త/గగ, యతి (1, 8, 15) 20 కృతి 151548
విరజాజులు బలు – విరిసె వనిలో – వేయి నవ్వుల్ వెలింగెన్
చిఱు గాజులు మెల – చెలఁగె సడితోఁ – జేతులన్ గీతులౌచున్
వర రాగిణి సుధ – పరుగు నదిగా – వాణితో జేయ రావా
సరసీరుహముఖి – సరసతరమై – చక్కఁగా బాడ రావా

సరసిరుహలోచన – న/న/న/న/న/ర, యతి (1, 11) 18 ధృతి 98304
సరసమయ ఘడియ యిది – సరసిరుహ లోచనా
మరులు గొనె హృదయ మిది – మఱల నిఁక యోచనా
కురులఁ బలు విరుల నిడి – కొమరుగను దువ్వనా
మురియగను పెదవులకు – ముదపు సుధ నివ్వనా

తేటగీతి – సరోజ

తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ
నీవె హావము నాకిటన్ – నే నటింతు
నీవె భావము నాకిటన్ – నే రచింతు
నీవె జీవము నాకిలన్ – నే సుఖింతు
నీవె దైవము నాకిలన్ – నే జపింతు

సరోజ – ర/స/లగ 8 అనుష్టుప్పు 91
నీవె హావము నాకిటన్
నీవె భావము నాకిటన్
నీవె జీవము నాకిలన్
నీవె దైవము నాకిలన్

సరోజ – జ/చ/జ/చ – జ/చ/గ,
ప్రాసయతి (1.1, 3.1, 5.1), చ – చతుర్మాత్ర
సరస్వతీ కని–కరించు మమ్మా – స్మరింతు నిన్ను సదా
సరోజ పదముల – సరోజ హృదయము – బిరాన నుంచెద నేన్
వరిష్ఠ మూర్తీ – విరించిపత్నీ – విరాట్స్వరూపిణి రా
పరాకు చూపకు – పరాయివాఁడనె – వరమ్ము లీయఁగ రా

సరోజవదనా – న/స/న/భ/గురు, యతి (1, 8) 13 అతిజగతి 3552
హృదయము జ్వలించె – హిమపాతములో
ముదమున మనమ్ము – పులకించెనుగా
వదలను సరోజ–వదనా నిను నే
బదముల రచింతుఁ – బ్రణయప్రతిమా

సరోజవనికా – జ/స/జ/గగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 358
సరోజ వనికా – సమోదరూపా
సరాళ పథికా – సహస్రదీపా
విరాజితము నీ – ప్రియోక్తు లంతన్
పరాజితుడ నీ – పదాల చెంతన్

సరోరుహానన – జ/భ/త/ర/స/గ, యతి (1, 9) 16 అష్టి 13622
స్థిరమ్ముగా మది దల్తున్ – దినమ్ము నే నిను గొల్తున్
స్మరింతు జిన్మయ కీర్తీ – సరోరుహానన మూర్తీ
స్మరాంతకా వరరావా – సదా ముదాకర భావా
తరించగా నను గావా – దయాకరా గురుదేవా

సారసనయనా – భ/స/న/స/ర/ర/గ, యతి (1, 7, 13) 19 అతిధృతి 75743
సారసనయనా – సరసహృదయా – శ్యామలాంగా సుహాసా
వారణహరణా – పరమపురుషా – వైజయంతీవిలాసా
నీరజచరణా – నిగమగమనా – నిర్ణాయకా నియంతా
హారవిలసితా – హరుస మియ రా – హ్లాదమూర్తీ యనంతా

సారసము – ఎనిమిది చతుర్మాత్రలు (జ–గణము తప్ప), మొదటి, మూడవ గణములకు ప్రాసయతి, మొదటి, ఐదవ, ఏడవ గణములకు సామాన్య యతి
శ్రీరాగాప్తను, – సారసనయనను – స్థిరముగ శ్రద్ధగఁ – జిర మిలఁ గొలుతున్
నారాయణి నా – నారదజననిని – నమ్రతతోడను నయముగఁ బిలుతున్
సారసవాహన, – తోరణములుగా – ఛందము లల్లెద – సరస పదాలన్
ప్రేరణ లిమ్మా – పూరణ లిమ్మా – ప్రేమలఁ బ్రోవుమ ప్రియముగ లీలన్

సితోత్పల – భ/ర/న/భ/న/జ/ర, 21 ప్రకృతి 720343
పదవ అక్షరము యతిగా –
ఓ రసరాగరంజని, సి–తోత్పలదళనయనా, ప్రియంవదా
స్ఫార సుధాంశబింబముఖ, – సద్గుణమణి, వరదా, శుభప్రదా
చారుతరాంగ, చిద్భువన–చారిణి, నయహృదయా, సుధాలయా
తారకమంత్రదాయిని, మ–దర్చనను గొనగ రా, సురాశ్రయా

పదునొకండవ అక్షరము యతిగా –
వేణువు నూదవా మధురమై – వినవలె నని నాకు దోచెరా
వీనుల విందుగా లలితమై – ప్రియముగ మనసెల్ల దోచెరా
వీణను మీటనా సరసమై – వివిధములగు రీతి వేగమై
ప్రాణము గ్రొత్తగా నమరమై – పరవశమగు నింక రాగమై

సుగంధ షట్పద – చ–చ–చ / చ–చ–చ / చ–చ, ఏ చతుర్మత్రను ఎక్కడైనా ఉపయోగించవచ్చును
పువ్వుల సిరులేల నాకు
నవ్వుల విరులుండ నీకు
నవ్వుల రేవా
దివ్వెల వెలుగేల నాకు
దివ్వెల కనులుండ నీకు
దివ్వెల త్రోవా

సుగంధి – శ్యేని

సుగంధి లేక తూణకము – ర/జ/ర/జ/ర, యతి (1, 9) 15 అతిశక్వరి 10923
గాలి తెచ్చు యీల పాట – కైపు నీయఁ బాడవా
తేలి పోదుఁ దూలి పోదుఁ – దృప్తితోడఁ దూగుచున్
కేల తోడ మాల వేతుఁ – కిన్చ మాన్చ రా దరిన్
పూల రేకు రాలి పోక ముందు – రమ్ము చేరువన్

శ్యేని లేక సేనికా – ర/జ/ర/లగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 683
ఈల పాట కైపు – నీయఁ బాడవా
తూలి పోదుఁ దృప్తి–తోడఁ దూగుచున్
మాల వేతుఁ కిన్చ – మాన్చ రా దరిన్
రాలి పోక – ముందు రమ్ము చేరువన్

సుమ– స/స/స/స/స/మ, యతి (1, 7, 13) 18 ధృతి 14044
సుమరాశులతో – శుకరావముతో – సొగ సాయెన్ జూడన్
రమణీయముగా – రహి యామని స–ద్రసవంత మ్మయ్యెన్
సుమమాలల గ్రు–చ్చుచు నుండెద నో – సురసా నీకై నేన్
రమణన్ లలితో – రచియించఁగ రా – రసికా పద్యమ్ముల్

సుమలతా – 5/6 – 5/6 మాత్రలు, యతి మూడవ మాత్రా గణముపై.
కమలముగ వికసించిన – కందోయి సుందరమ్ము
సుమలతగ విరబూసెను – సోయగపు టవయవమ్ము
అమరేశు హరివిల్లుగ – నగపడెను వసనమ్ములు
రమణీయ మయెను మనసు – రసమయము సమయమ్ములు

సురభూజరాజ – న/భ/ర/న/న/న/ర, యతి (1, 12) 21 ప్రకృతి 786104
ఒక తలంపది చాలు నాకు – నుదయరవికిరణ జాలమై
సకలలోకపు సౌరుఁ జూపు – సలలిత సుమధుర రాగమై
వికసనమ్ము చేయు నాదు – విలులిత హృదయపు శాఖలన్
సుకముగా సురభూజరాజ – సుమములు కరములఁ జేరుఁగా

సురలతా – న/య, 6 గాయత్రి 16
ధరపయిఁ జూడన్
సురలతలేగా
విరులసరమ్ముల్
హరుసపు టెల్లల్

సువనమాలిక – త/స/జ/స, యతి (1, 6) 12 జగతి 1885
ప్రాతఃకుసుమ – రాశితో లలితమై
చేతన్ రచన – జేతు నే రమణమై
మాతా సువన–మాలికల్ బదములన్
బ్రీతిన్ గొనుమ – ప్రేమతో నొసఁగెదన్

సూర్యకాంతి – బేసి పాదములు – సూ/సూ – సూ/సూ, సరి పాదములు – సూ/సూ/సూ/గ
సుందరమగు – సూర్యకాంతి
చిందె నుదయవేళలో
నందమైన – యబ్జములు సు–
గంధ మెగసె గాలిలో

సౌగంధికా – త/మ/య/ర/త/గ, యతి (1, 9) 16 అష్టి 17477
వాగర్థమై వందింతు నిన్ – బ్రహ్మాత్మికా వేదాంబుధీ
యోగప్రదా యోగోద్భవా – యోగాంకురా యోగాంబుధీ
వాగీశ్వరీ రాగేశ్వరీ – భావప్రియా రాగాంబుధీ
సౌగంధికా శ్వేతాంబరీ – సత్యప్రియా శాస్త్రాంబుధీ

స్థూలా – త/స/గ, 7 ఉష్ణిక్కు 29
చాలించు హరి గంతుల్
స్థూలమ్ము విరి బంతుల్
లీలాంగ యిట రావా
పాలించుకను త్రావన్
(స్థూల = బంతి పువ్వు)

స్వాగతము – ర/న/భ/గగ, యతి (1, 7) 11 త్రిష్టుప్పు 443
స్వాగతమ్ము నవ – వర్షములో సు–
స్వాగతమ్ము భువి – సంతసమందన్
స్వాగతమ్ము విరి – వానలకై సు–
స్వాగతోక్తులు వ–సంతుఁడ రారా


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...