త్రిపదలు

త్రిపద ఛందస్సులో హైకూలు

తెలుగులో ఎందరో కవులు హైకూలను వ్రాస్తున్నారు. కాని ఈ హైకూలను వ్రాసినప్పుడు 5-7-5 అక్షరములతో అందఱు వ్రాయడము లేదు. హైకూల భావాలను నేను పైన వివరించిన ఛందోబద్ధమయిన త్రిపదలలో వెలిబుచ్చవచ్చును. అప్పుడు హైకూలలో చిత్రములను మాత్రమేగాక భాషా సౌందర్యమును కూడ అనుభవించవచ్చును.

కొన్ని హైకూలకు త్రిపదలలో నా అనువాదములను క్రింద పఠించవచ్చును –

Wake, butterfly –
It’s late, we’ve miles
To go together. – Basho

తుమ్మెదా వేళాయె – లెమ్ము సత్వరముగా
రమ్మిద్దరమ్ము దూరమ్ము
రమ్ము వెళ్ళాలి వేగమ్ము

Come out to view
the truth of flowers blooming
in poverty – Basho

చూడ రా వేగమే – చూడవా వేగమే
చూడు మీ పుష్పాల సొంపు
చూడు మీ ముఱికిలో కంపు

Polished and polished
clean, in the holy mirror
snow flowers bloom – Basho

తుడువగా తుడువగా – గడు నిద్ద మద్దమ్ము
విడిగినవి యందు పుష్పాలు
బెడగిడుచు హిమమౌక్తికాలు

I’m a wanderer
so let that be my name –
the first winter rain – Basho

నేను ప్రవాసిని – నా నామమ్మది
వానలు తొలిగా కురిసె
నీ నవ శిశిరము విరిసె

The old pond;
A frog jumps in —
The sound of the water – Basho

ఏనాటి సరసియో – ఈ నాడు పాతబడె
ఆ నీట కప్ప మునిగింది
ధ్వానముల సుడియు రేగింది

Fallen sick on a journey,
In dreams I run wildly
Over a withered moor – Basho

బలహీనమయె తనువు – చలి జ్వరము పాలైతి
పలవరింపులలోన నేను
అల కొండనే యెక్కినాను

A cooling breeze—
and the whole sky is filled
with pine-tree voices. – Onitsura

సరసపు తెమ్మెర – పరువగ చల్లగ
విరివిగ నిండెను నింగి
తరువుల సడుల జెలంగి

Watching, I wonder
which poet could put down his quill …
a perfect moon! – Onitsura

చిమ్మగ శశి ద్యో-తమ్ముల నీ నిసి
కమ్మగ పున్నమి లాఁగు
యిమ్ముగ నే కవి యాగు

Don’t weep, insects –
Lovers, stars themselves,
Must part – Kobayashi Issa

జడియకుడు క్రిములార – అడలు టది యెందులకు
కడకు తారకలు ప్రేమికులు
మడియకను నుందురే పుడమి

meteor shower
a gentle wave
wets our sandals – Michael Dylan Welch

అక్కడ నాకాశములో – చుక్కలు బలు రాలుచుండె
ఇక్కడ నొక సంద్రపు టల తడిపినది
మక్కువతో మా పదముల తుడిచినది

ముగింపు

పది యక్షరములకు తక్కువగా ఉండే వృత్తములకు, ప్రాసయతి మాత్రము కలిగి ఉండే లయగ్రాహివంటి ఉద్ధురమాలావృత్తములకు తప్ప మిగిలిన వృత్తములకు, జాతి పద్యములకు అక్షరసామ్యయతి లేక వడి తెలుగులో తప్పక ఉంటుంది. దీనికి మినహాయింపు త్రిపద, షట్పదలు మాత్రమే. త్రిపదలను కన్నడ కావ్యములలో అక్కడక్కడ ఉపయోగించారు, షట్పదులతో కావ్యములనే వ్రాసారు కన్నడ కవులు. కాని ఈ రెండు ప్రక్రియలకు తెలుగు కవులు ససేమిరా అన్నారు. పద్యములను వ్రాయుటకు పూనుకొనే విద్యార్థులు ప్రారంభదశలో యత్యక్షారలకోసం ప్రాకులాడడము సహజమే. కాని ప్రారంభదశలో వారు త్రిపదలాటి పద్యములను అల్లినచో పద్యరచనా విధానమును చక్కగా అవగాహనము చేసికొనుటకు వీలవుతుంది. మాయామాళవగౌళరాగమును సంగీతము నేర్చే విద్యార్థులు ఎలా అభ్యసిస్తారో అదే విధముగా త్రిపదను పద్యరచనా విద్యార్థులు అభ్యాసము చేసికొనవచ్చును, తఱువాత తెలుగు షట్పది, దాని పిదప ఆటవెలది తేటగీతులు, తఱువాత కందము, ఆ తఱువాత చంపకోత్పలమాలలు, అలా అభ్యాసము చేసికొని పద్యరచనా ప్రావీణ్యమును గడించవచ్చును. అదే విధముగా హైకూవంటి పదచిత్రాలకు కూడ త్రిపద సహాయకారియే అని నా ఉద్దేశము.

(తమిళఛందస్సులోని త్రిపదలను గుఱించి విసుగుపడక నాతో చర్చించిన శ్రీ సుబ్రమణ్యంగారికి కృతజ్ఞతలు.)


గ్రంథసూచి

  1. ఛందఃశాస్త్రం – శ్రీపింగలనాగ, (సం) పండిత కేదారనాథ, Parimal Publications, Delhi, 1994.
  2. Introduction to Tamil Prosody – Ulrike Niklas, Bulletin de l’Ecole française d’Extrême-Orient, Année 1988, Volume 77, 165 – 227.
  3. నాగవర్మన కన్నడ ఛందస్సు – Rev. F Kittel, Basel Mission Book & Tract Depository, Mangalore, 1875.
  4. కన్నడ ఛందోవికాస – డి. ఎస్. కర్కి, భారత ప్రకాశన, 2004.
  5. కన్నడ ఛందస్సు – టి. వి. వెంకటాచల శాస్త్రీ, డి.వి.కె. మూర్తి, మైసూరు, 1995.
  6. జయదామన్ – A Collection of Ancient Texts on Sanskrit Prosody and a Classified List of Sanskrit Metres with an Alphabetical Index, Ed. H.D. Velankar, హరితోషమాల, బాంబే, 1949.
  7. కవిజనాశ్రయము – మల్లియ రేచన, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1950.
  8. ఛందఃపదకోశము – సంగ్రాహకుడు కోవెల సంపత్కుమారాచార్య, పరిష్కర్త – దువ్వూరి వేంకటరమణశాస్త్రి – తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1977.
  9. కావ్యాలంకారచూడామణి – విన్నకోట పెద్దయ, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1936.
  10. అనంతుని ఛందము (ఛందోదర్పణము) – అనంతామాత్యుడు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1921.
  11. అప్పకవీయము – కాకునూరి అప్పకవి, (సం) గిడుగు రామమూర్తి, ఉత్పల వేంకటానరసింహాచార్యులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1934.
  12. లక్షణశిరోమణి – పొత్తపి వేంకటరమణ కవి, (సం) రావూరి దొరసామి శర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1979.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...