రాసక్రీడాష్టకము

లీలాశుకుడు వ్రాసిన శ్రీకృష్ణ కర్ణామృతములోని రెండవ శతకములో రాసక్రీడాష్టకము ప్రసిద్ధమైనది. అందులోని మొదటి పద్యమును అనుసరించిన ఒక చిత్రగీతము కూడ ఉన్నది (విప్రనారాయణలో నారి నారి నడుమ మురారి …) కాని ఆ గీతము చతుర్మాత్రలపైన ఆధారపడినది. రాసక్రీడాష్టకము స్రగ్విణీ వృత్తములో వ్రాయబడినది.


(చిత్రం హరిహర్జీ.బ్లాగ్‌స్పాట్ నుంచి)

మూడు శతకములలో స్రగ్విణీ వృత్తము ఈ ఎనిమిది పద్యములు మాత్రమే. స్రగ్విణికి ప్రతి పాదములో నాలుగు పంచమాత్రలైన ర-గణములు (UIU). సంస్కృతములో స్రగ్విణికి పాదాంతయతిని (విరామము) మాత్రమే సామాన్యముగా పాటిస్తారు. తెలుగులో మూడవ ర-గణములోని మొదటి అక్షరముతో అక్షరసామ్య యతిమైత్రి ఉన్నది. ఈ రాసక్రీడాష్టకమును ఎందుకో ప్రసిద్ధ గాయకు లెవ్వరు సంపూర్ణముగా పాడలేదు. దీనికి వెలగపూడి వెంగనామాత్యుని తెలుగు అనువాదాలు కూడ చంపకోత్పలమాలలలో, మత్తేభవిక్రీడితములో ఉన్నాయి (అనుబంధము) కాని స్రగ్విణీ వృత్తములో లేవు. స్రగ్విణి లయతో అనువాదము ఏ విధముగా ఉంటుందనే ఆలోచన పర్యవసానమే ఈ అనువాదము. ఇందులో స్రగ్విణీ వృత్తపు లయ గలదు. కాని అన్ని గణములు ర-గణములు కావు. కావలసినప్పుడు ర-గణములోని గురువు(ల)ను రెండు లఘువులుగా చేసాను. అనగా ఇందులోని గణములు ర-గణము (UIU), భ-లము (UIII), న-గము (IIIU), న-లలము (IIIII). త-గణము (UUI), స-లము (IIUI) వాడబడలేదు. అన్ని తెలుగు పద్యములలో వలె యతిప్రాసలు ఉన్నాయి, పాడుటకు అనుకూలముగా పాదాంత విరామమును కూడ పాటించినాను.

అంగనా మంగనా మంతరే మాధవః
మాధవం మాధవంఽచాంతరేఽణాంగనా
ఇత్థ మాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.35

మాధవుఁడు మానినికి – మానినికి మధ్యలో
మాధవుని మాధవుని – మధ్యలో మానినియు
మోదవలయము నడుమ – మోహనమ్ముగ మురళి
నాదముల దేవకీ – నందనుం డూఁదెఁగా

కేకి కేకాదృతానేక పంకేరుహా
లీన హంసావళీ హృద్యతా హృద్యతా
కంస వంశాటవీ దాహ దావానలః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.36

పుంస్వనమ్ములు సెలఁగె – మొయిలుమెయిఁ గేకి గన
హంసలాడెను సరసి – నంబుజమ్ముల వరుసఁ
గంసవంశాటవిని – గాలిచిన మోహనుఁడు
వంశమును నూఁదె నా – వలయముల మధ్యలో

క్వాఽపి వీణాభిరారావిణా కంపితః
క్వాఽపి వీణాభిరాకింకిణీ నర్తితః
క్వాఽపి వీణాభిరామాంతరం గాపితః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.37

వీణతో జతగఁ దాఁ – బ్రియముగాఁ బాడుఁగా
వీణతో మువ్వలకు – వేగముగ నాడుఁగా
వీణతో నొక్కచోఁ – విందుగాఁ బాడుఁగా
వేణువును దేవకీ – ప్రియసుతుం డూఁదెఁగా

చారు చంద్రావళీ లోచనై శ్చుంబితో
గోప గోబృంద గోపాలికా వల్లభః
వల్లవీవృంద వృందారకః కాముకః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.38

శశిముఖుల నేత్రములు – చక్కఁగా ముద్దులిడ
పసులఁ గాపాడు గో-పాలగోపీశ్వరుం
డొసఁగు దైవమ్మువలె – నొప్పెఁగా వల్లవీ
వశుఁడు కేంద్రమ్ములో – వంశనాదమ్ములన్

మౌళిమాలా మిలన్మత్త భృంగీలతా
భీతభీత ప్రియా విభ్రమాలింగితః
స్రస్తగోపీకుచా భోగ సమ్మేళితః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.39

శిరముపై మాలికలఁ – చేరి భృంగావళుల్
చెరలి ఘోషించఁగా – చెల్వలున్ భయముతో
హరిని బాలిండ్లతో – హత్తుకొనుచుండఁగా
మురళితో స్వరములను – మోహనుం డూఁదెఁగా

చారు చామీకరా భాస భామావిభు-
ర్వైజయంతీలతా వాసితోరఃస్థలః
నందవృందావనే వాసితా మధ్యగః
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.40

పసిఁడి కాంతిని వెలుఁగు – భామకును బ్రియుఁడు పలు
మిసలతో నురముపై – మెఱయు హారమ్ముతో
రసములను జిలుకుచున్ – రమ్య బృందావనిన్
హసితుఁడై వేణువును – హారి మ్రోఁగించెఁగా

బాలికా తాళికా తాళ లీలాలయా-
సంగ సందర్శిత భౄలతా విభ్రమః
గోపికా గీత దత్తావధాన స్స్వయం
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.41

బాలికల తాళముల – భావముల లయలకై
లీలగాఁ గనుబొమల – లేపుచును దించుచును
ఆలకించుచు గతుల – నందమౌ గీతికలఁ
గేల నూఁదెను మురళిఁ – గృష్ణుఁ డావేళలో

పారిజాతం సముద్ధృత్య రాధావరో
రోపయామాస భామాగృహఽస్యాంగణే
శీతశీతే వటే యామునీయే తటే
సంజగౌ వేణునా దేవకీ నందనః
– 2.42

పారిజాతమ్ము నా – భామ ముంగిలి నునుచ
వేరుతో తెచ్చు నా – వీర రాధేశ్వరుఁడు
చేరి కాళింది తటి – చెట్టు నీడల చలువ
నారవమ్ముల సలిపె – నందముగ మురళితో

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...