ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ

పరిచయము

చలనచిత్ర నిర్మాణము ఒక ఉమ్మడి ప్రయత్నము. దర్శకుడు అన్ని రంగాలకు అధినేత. కాగితంపైని కథను చలనచిత్రముగా మనకు చూపడంలో అంతిమనిర్ణయాలు దర్శకుడివే. ఎందరు సహాయపడినా చివరకు మనము చూచేది అతను చూపదలచుకున్న చిత్రమునే. అట్టి దర్శకుడి మనోదృష్టిని తెరకెక్కించటమనే బాధ్యత సినీమటోగ్రాఫర్ (cinematographer) లేదా డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అని పిలవబడే ఛాయాగ్రాహకుడిదే. దర్శకుడి ఉద్దేశ్యాలను అర్థం చేసికొని, సన్నివేశాలు కథకు అనుగుణంగా తెరకెక్కించుటకు ఎంతో ఓర్పు, ప్రతిభ, సృజనాత్మక శక్తి ఉండాలి. ఆ విధముగా దర్శకుడు పూర్తిగా ఆధారపడునది కెమేరామన్ మీదనే. తన మనసును అర్థము చేసుకొని తన ఊహలకు తాను అనుకున్న విధముగా ఆకృతినిచ్చే కెమేరామన్ దొరికినప్పుడు దర్శకులు వారిని వదులుకొనరు. అలా ఎందరో దర్శకులు-ఛాయాగ్రాహకులు జంటకవులలా ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేస్తారు. అటువంటి ప్రసిద్ధమైన జంటలు ఎన్నో ఉన్నాయి చలనచిత్రరంగములో. మన దేశ చిత్రసీమను తమ ఛాయాగ్రాహణ ప్రతిభతో సుసంపన్నం చేసిన వారిలో ప్రసిద్ధులు- సుబ్రత మిత్రా, సౌమేందు రాయ్ (సత్యజిత్ రాయ్); కమల్ బోస్ (బిమల్ రాయ్); రాధూ కర్మాకర్ (రాజ్ కపూర్); బాలకృష్ణ (శాంతారాం); కమల్ ఘోష్, రామ్‌నాథ్ (జెమిని); విన్సెంట్, బాలు మహేంద్ర; మార్కస్ బార్ట్‌లీ (వాహినీ-విజయా స్టూడియోలు) మున్నగువారు.

దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ పెరిగి పెద్దదవుతున్న రోజులలో విజయా, వాహిని వంటి స్టూడియోలు ఉండేవి. ఆ స్టూడియోల అధిపతులు ఎన్నో చక్కని చిత్రములను తీశారు. తెలుగువారు ఇప్పటికీ ఎప్పటికీ గొప్పగా చెప్పుకొను మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ తదితర సినిమాలను ఈ స్టూడియోల వారే నిర్మించారు. అటువంటి ఎన్నో సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించిన మహనీయుడు మార్కస్ బార్ట్‌లీ (Marcus Bartley). భారతీయ సినీఛాయాగ్రాహకులలో ఆయన అద్వితీయుడు. పాతాళభైరవి, జగదేకవీరుని కథ, గుణసుందరి కథ, మాయాబజార్ వంటి సినీమాలలో బార్ట్‌లీ చూపిన కెమేరా కౌశలం ఇప్పటికీ చలన చిత్రాభిమానులకు ఆశ్చర్యం కలగజేస్తూనే ఉంది.

ఈ ఏప్రిల్ నెలకు మార్కస్ బార్ట్‌లీ పుట్టి నూరు సంవత్సరములు అవుతున్నది. ఆ సందర్భముగా ఆ మేటి కళాకారుని స్మరించుకుంటూ ఈ చిన్న వ్యాసమును ఆయనకు నివాళిగా రాసినాను.

తొలి రోజులు

మార్కస్ బార్ట్‌లీ 22 ఏప్రిల్ 1917లో జన్మించారు. వారిది నేటి తమిళనాడులోని ఏర్కాడులో ఆంగ్లో ఇండియన్ డాక్టర్ల పరంపర. తల్లిదండ్రులు డోరతీ, జేమ్స్. అతనికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి. చిన్నప్పటినుండి అతనికి ఛాయాచిత్రకళ (photography) అనిన చాల ఇష్టము. చదువులైన తఱువాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ప్రెస్ ఫొటోగ్రాఫర్‌గా చేరినారు. అతనికి ఫొటోగ్రఫీ గుఱించి ఎక్కువగా తెలియకపోయినా చాల శ్రద్ధతో ఆ రంగమును గుఱించి నేర్చుకొన్నారు. పత్రికలలో ఫొటోలు తీసేవారు నూటికి పదినుండి ఇరవై శాతము మంచి చిత్రములు తీయగలిగితే సంతోషపడేవారట. కాని బార్ట్‌లీ ఎప్పుడూ మంచి చిత్రములనే తీసెడివారట. అలా పత్రికలో పని చేసేటప్పుడే ఫొటోగ్రఫీ యందలి వివిధ కోణములను క్షుణ్ణముగా నేర్చుకొన్నారు. అంతేకాక చలనచిత్రాలలో వాడే కిటుకులను కూడ పరిశీలించి అవగాహన చేసికొన్నారు. పిదప న్యూస్‌రీల్ కెమేరామన్‌గా బ్రిటిష్ మూవీటోన్‌లో (British Movietone) చేరినారు.

ఫొటో అంటే కాంతి (light), గ్రాఫ్ (graphien) అంటే వ్రాయడము లేక గీయడము అని అర్థము. వెలుగునీడలను బంధించునది కాబట్టి ఫొటోగ్రాఫును తెలుగులో ఛాయాచిత్రము అని పిలుస్తాము. ఐతే అది నిశ్చలచిత్రము కాన కదిలే చిత్రములను చలనచిత్రమని, ఫొటోగ్రాఫర్ అను పేరుకు బదులుగా సినీమటోగ్రాఫర్ అని పిలుస్తాము. ఏ చిత్రమైనప్పటికినీ వెలుగు నీడల పరిమితి, తీవ్రత, ఎంతకాలము ఆ వెలుగును వాడాలి ఇవన్నీ చాల ముఖ్యము. వీటిని సరిగా వాడినప్పుడు మాత్రమే మనకు మంచి చిత్రములు లభ్యమవుతాయి. ఎటువంటి చిత్రమునకు ఎటువంటి లెన్సులు వాడవలెనో చక్కటి జ్ఞానం ఉండాలి. ఎండలో, మబ్బులో, రాత్రి పూట, పగటి పూట ఈ వెలుగును ఏ విధముగా ఉపయోగించుకోవాలి అన్నవి కెమేరామన్‌కు ప్రతి దినము ఎదురయ్యే సమస్యలు. ఒక్కొక్కప్పుడు ప్రకృతి సహజమైన దృశ్యములను స్టూడియోలో కృత్రిమముగా కల్పించాలి. ఇట్టి వాటిలోని మెళకువలను మార్కస్ న్యూస్‌రీల్ కెమేరామన్‌గా ఉన్నప్పుడు కష్టపడి నేర్చుకొన్నారు. బాంబేనుండి 1941లో మదరాసు నగరములోని ప్రగతి స్టూడియోలో చేరి మొదటిసారి తిరువళ్ళువర్ అనే తమిళ చిత్రములో ఛాయాగ్రాహకుడుగా పనిచేసినారు.

స్వర్గసీమ

1944లో వాహినీ స్టూడియోలో బార్ట్‌లీ చేరారు. విజయా-వాహినీ సంస్థలు నిర్మించిన చిత్రాలెన్నిటికో మార్కస్ ఛాయాగ్రహణ దర్శకుడు. నాగిరెడ్డి, చక్రపాణి గారలకు మార్కస్ అంటే ఎంతో అభిమానము, గౌరవము. అందువలన వారు విజయా స్టూడియోలో మార్కస్‌కు ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించారు. అతని మొట్టమొదటి వాహినీవారి చిత్రము స్వర్గసీమ. ఆ రోజులలో ఒక చలన చిత్రము సుమారు మూడు గంటల కాలము నడిచేది. అయితే ప్రపంచ యుద్ధ కాలములో ఎక్కువ నిడివిగల చిత్రములను తయారు చేయుటకు ఫిల్మ్ సరఫరా కాలేదు. సుమారు రెండు గంటల పరిమితి గల చిత్రము స్వర్గసీమ. ఈ చిత్రపు నాయకీనాయకులు జయమ్మ నాగయ్యలు. భానుమతికి పేరు తెచ్చిన చిత్రము ఇదే! ఇందులో రాత్రిపూట నాయకీనాయకులు సంభాషించునప్పుడు వాళ్ళ ముఖములపైన చెట్ల ఆకుల నీడలు పడేటట్లు ఉండే దృశ్యము ఆ కాలములో విమర్శకుల ఆదరమును పొందినది.

అదే విధముగా చిత్రము చివరలో రాత్రిపూట వీధిలో నడిచేటప్పుడు నాయకుని నీడ పొడుగవడము కూడ మన్ననలను అందుకొన్నది. స్వర్గసీమ చిత్రము వియత్నామ్ దేశములో ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవములో ప్రదర్శించబడినది. తెలుగు చిత్రసీమలో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనార్హతను పొందిన చిత్రములలో ఇదియే మొట్టమొదటిది. ఇందులోని ఛాయాగ్రహణమును అక్కడ చాలమంది ప్రశంసించినారట. పాతాళభైరవి చిత్రములో మాంత్రికుని ముఖ భావములను ప్రతిబింబింపజేసిన ఛాయాగ్రహణమును కూడ జనులు పొగడినారు. చిత్రము చివర మాయామహల్ ఆకాశములో ఎగిరిపోతున్నట్లు ఉండే దృశ్యమును స్టూడియో బల్లపైన ఏర్పరచినారట. చంద్రహారము చిత్రములోని ఎవరే ఎవరే పాటను టెలివిజన్ అప్పటికి మన దేశములో లేకున్నా, నాడు బిబిసి టెలివిజన్‌లో ప్రసారము చేసినారట.

మాయాబజార్

బార్ట్‌లీ ఛాయాగ్రహణములో తయారైన తెలుగు చిత్రాలలో మిగిలినవి ఒక ఎత్తు, మాయాబజార్ వేఱొక ఎత్తు. ఇందులో ఘటోత్కచుడి వివాహభోజనంబు పాటలోని ట్రిక్ ఫొటోగ్రఫీ, మాయాద్వారక సెట్టు, చిన్న శశిరేఖ పెద్ద శశిరేఖగా మారడము, ఘటోత్కచుని రాక్షస మాయలు, అన్నిటికన్న లాహిరి లాహిరి లాహిరిలో- పాట చిత్రీకరణ తెలుగువారి మనస్సులో అరవై ఏండ్లైనా ఇంకా మాయని ముద్రలుగా నిలిచిపోయాయి.

మూడు తరాల ప్రేక్షకులను అలరించిన గొప్ప కళాఖండము మాయాబజార్ చిత్రరాజము. ఇంతకు ముందే పాతాళభైరవి వంటి చిత్రములలో వెన్నెల పాటలు ఉన్నా, లాహిరి లాహిరి పాట చిత్రీకరణ నలుపు-తెలుపు చిత్రాలలో ఛాయాగ్రహణ కౌశల్యమునకు ఒక పరాకాష్ట. (నిర్మలమైన పూర్ణ చంద్రుడిని ‘విజయావారి చంద్రుడు’ అని పిలవడానికి కారణము బార్ట్‌లీ ఛాయాగ్రహణమే అన్న విషయమును మఱువరాదు.) ఈ పాటను మూడు సమయములలో చిత్రీకరించినారు. ఏదియును రాత్రిపూట తీసినవి కావు. నది నీటిపై వెన్నెలకిరణములు ప్రతిఫలించు సన్నివేశమును ఉదయపువేళలో, వెన్నెల కాంతిలో మెరిసిపోయే తెల్లటి రెల్లుగడ్డిని స్టూడియోలో, అట్లే స్టూడియోనందే వెనుకవైపు తెరపై దృశ్యముల ప్రదర్శన జరుగుచుండగా ముందువైపు నటీనటులను క్లోజప్‌లో చిత్రించినారు. తరువాత ఈ మూడు వేర్వేరు దృశ్యములను ఎడిటింగ్‌లో ఒకటిగా చేసినారు. అయినప్పటికి ఎక్కడ కూడ మనకు ఆ తేడాలు కనిపించకపోవుట బార్ట్‌లీ ప్రతిభకు నిదర్శనము కాక మరేమిటి?

ఈ పాటను వింటూ ఉంటే నాకు భారతములోని రెండు పద్యాలు జ్ఞాపకానికి వస్తాయి. అవి-

శారద రాత్రు లుజ్జ్వల ల-సత్తర తారక హార పంక్తులం
జారుతరంబు లయ్యె విక-సన్నవ కైరవ గంధ బంధురో-
దార సమీర సౌరభముఁ – దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండు రుచి – పూరములం బరిపూరితంబులై – భారతము, అరణ్యపర్వము, 4.142

విశద శారదాంబుద పరి-వేష్టనమునఁ
బొలుచు గగనంబు ప్రతిబింబ-మో యనంగ
వికచ కాచవనీ పరి-వేష్టనమున
నతిశయిల్లె నిర్మల కమ-లాకరములు – భారతము, అరణ్యపర్వము, 4.147

అల్లీబిల్లీ అమ్మాయికి పాట చిత్రీకరణలో శశిరేఖ బాలికనుండి యువతిగా మారు ఘటనను కూడా ఎంతో అందముగా చిత్రీకరించినారు. ముందు కొలను గట్టుపైన కూర్చున్న చిన్న శశిరేఖ ప్రతిబింబం మీదుగా కెమేరా ప్రయాణిస్తుంది. నీళ్ళు మెల్లిగా సుడులు తిరుగుతుండగా కెమేరా పెద్ద శశిరేఖ ప్రతిబింబం నుంచి మళ్ళీ ఆమె రూపం మీదికి తిరుగుతుంది. చిన్న శశిరేఖ ప్రతిబింబం పక్కన మొగ్గ రూపములో ఉండే కలువ పెద్ద శశిరేఖ ప్రతిబింబం పక్కన విరిసి ఉంటుంది. ఇదంతా ఒకే షాట్‌లోనే తీశారని గొప్పగా చెప్తారు.

బార్ట్‌లీ పనిచేసిన ఆఖరి తెలుగు చిత్రము చక్రవాకం. కోడూరి కౌసల్యాదేవి నవల ఆధారముగా రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకొనలేదు. కాని, అందులోని వీణలోన తీగలోన ఎక్కడున్నది రాగము అని పి. సుశీల పాడిన పాట ఎంతగనో ప్రాచుర్యములోకి వచ్చినది. ఆ పాట పాడు సమయములో నటి వాణిశ్రీని ఎంతో అందముగా కనిపించునట్లు బార్ట్‌లీ చిత్రీకరించిన విధము ప్రత్య్ఖేకించి ఎన్నదగినది. ఈ చిత్రములోనే ఈ నదిలా నా హృదయం అన్న పాట ఎక్కువగా కాశ్మీరులో, మరికొంత కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట వద్ద గల ముక్త్యాల అనే గ్రామంలో చిత్రించారు. కాని మనకు ఆ తేడా ఎక్కడనూ కనపడదు.

చెమ్మీన్

1960 దశకమునుండి భారతీయ చలన చిత్రములలో వర్ణ చిత్రముల సంఖ్య ఎక్కువవుతూ వచ్చినది. ఆ సంధి కాలములో బార్ట్‌లీ తకళి శివశంకర పిళ్ళై వ్రాసిన చెమ్మీన్ నవలను ఆధారము చేసికొని అదే పేరుతో రామూ కార్యాట్ దర్శకత్వములో సలీల్ చౌధురి సంగీతముతో బాబు ఇస్మాయిల్ సయిట్ నిర్మించిన చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడిగా పనిచేశారు. చెమ్మీన్ చిత్రము కేరళలోని అరేబియా సముద్ర తీరములో నివసించే బెస్తవాళ్ళను గుఱించిన కథ. ఆ బెస్తవాళ్ళు చేపలు పట్టడానికి ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి సముద్రయానము చేసేవారు. ఆ సమయములో ఇళ్ళల్లో ఉండే వారి భార్యలు పరపురుష సంపర్కము చేసికొంటే కడలితల్లి (కడలమ్మ) వారి భర్తలను పొట్టన పెట్టుకుంటుందని ఒక నమ్మకము ప్రబలముగా ఉండేది. ఒక హిందూ జాలరి భార్య కరుత్తమ్మకు, ఒక ముస్లిం మత్స్య వ్యాపారి పరికుట్టి అనే యువకునికి మధ్య వివాహేతర సంబంధము కథ ఇతివృత్తము. మత్స్యకారుల జీవితాలు, చేపలు పట్టేటప్పుడు సముద్రముపైన నౌకలు వెళ్ళడము, ప్రశాంతముగా ఉండేటప్పుడు, తుఫానులు వచ్చేటప్పుడు సముద్రపు దృశ్యాలు ఇందులో పదేపదే వస్తూ ఉంటాయి. నిజముగా ఈ కథలో ముఖ్యమైన పాత్ర మానవాతీతమైన సముద్రమే. ఆ సముద్రపు రంగులను, హంగులను, భంగిలను ఒక దృశ్య కావ్యముగా మలచినారు బార్ట్‌లీ. కడలినక్కర పోణోరే … పాటలో సముద్రతీరములోని కొబ్బరి చెట్టులు, పశ్చిమ సముద్రములో సూర్యాస్తమయము ప్రకృతి అందాలను వన్నెకు తెచ్చాయి.

ఈ చిత్రములో కూడ ఒక వెన్నెల పాట ఉన్నది. అది లాహిరి లాటి మైకము కలిగించే వెన్నెల కాదు. మానస మైనే వరూ… మసక వెన్నెలలో రెండు హృదయాల తపనను వెలికి తెచ్చే ప్రయత్నము. పెణ్ణాలె పెణ్ణాలె… పాట ప్రారంభములో సముద్ర తీరములో ఎగిరే పక్షులను చూస్తుంటే మనము ఆ బెస్త పల్లెలో ఉన్నట్లే అనుభవము కలుగుతుంది.

చిత్రము చివరి పతాక సన్నివేశములో తుఫాను మేఘాల వెనుక దాగి ఉన్న చంద్రుడు, సముద్రములో సుడిగుండము రాబోయే విషాద సన్నివేశానికి సూచనలుగా ఉండేటట్లు చిత్రీకరించబడినాయి. కాన్ (Cannes) అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో న్యాయనిర్ణేతలు చెమ్మీన్‌లో బార్ట్‌లీ ప్రదర్శించిన ఛాయాగ్రహణ కౌశల్యమును అభినందిస్తూ Best Cinematographerగా ఎన్నుకొన్నారు. శాంతినిలయం అనే తమిళ చిత్రమునకు ఉత్తమ ఛాయాగ్రహణ దర్శకుడిగా భారత ప్రభుత్వము 1970లో బార్ట్‌లీని గౌరవించినది. శాంతినిలయం చిత్రములోని ఒక పాట ఇయర్కై యెన్నుమ్ ఇళయక్కన్ని… లో ఆ సమయములోని నైసర్గిక చిత్రణను పరికించవచ్చును. ఇందులోని ప్రతి ఫ్రేమును ఒక చిత్రముగా పరిగణించి గోడలపైన ఉంచి ఆనందించుకొనవచ్చును.

మఱి కొన్ని విశేషాలు

బార్ట్‌లీ అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిశ్శబ్దముగా పనిచేయడము మనకు జ్ఞాపకానికి వస్తాయి. ఒక దృశ్యాన్ని ఎలా చిత్రీకరించాలో, ఏ విధమైన లైటింగ్ ఉండాలో అనే విషయాలపైన రాత్రంతా పనిచేసి సరి చూసికొనేవారట. ఇట్టి విషయములలో అతడు ఒక పరిపూర్ణుడు. దిలీప్ కుమార్ (రామ్ ఔర్ శ్యామ్ నాయకుడు, తెలుగులో రాముడు-భీముడు చిత్రము) వంటి నటులు కూడ వేళ తప్పకుండ షూటింగ్‌కు హాజరయ్యేవారు. గొప్ప గొప్ప నటులతో పని చేసినను, వాళ్ళతో ఎక్కువ స్నేహాలు ఉంచుకొనే వారు కారట. అతడు మిచల్ కెమేరాను (Mitchell camera) ఉపయోగించేవారు. కెమేరాను తన అనుమతి లేకుండ ఎవ్వరిని తాకనిచ్చేవారు కారట. దర్శకుడు, సహాయకులు అతడు చూడమన్నప్పుడు మాత్రమే కెమేరాలో చూడాలి. కెమేరాను ఉపయోగించడము మాత్రమే కాదు, వాటి కటకములను (lens) శుభ్రము చేసి మరమ్మతు చేసేవారట. ఆదివారము రోజు (బహుశా క్రైస్తవులైనందువలననేమో) పని చేసేవారు కారట. ఆ రోజు కెమేరాలను సరి చేసికొని మంచి స్థితిలో ఉంచుకొనేవారు. చలనచిత్రములనుండి విరమించిన తఱువాత ఈ లెన్సు రిపేరీ పనిలో పూర్తిగా నిమగ్నులయినారట. బార్ట్‌లీ భార్య పేరు పౌలీన్, వారికి నలుగురు పిల్లలు.

ముగింపు

కవి పదములతో ఆడుకొంటూ కవితలను అల్లుతాడు. గాయకుడు స్వరములతో ఆడుకొంటూ పాటలను పాడుతాడు. చిత్రకారుడు రంగులలో ముంచిన కుంచెలతో ఆడుకొంటూ చిత్రములను గీచుతాడు. ఛాయాగ్రాహకుడు వెలుగు నీడలలోని రంగులతో ఆడుకొంటూ చలన చిత్రములను నిర్మిస్తాడు. ఇవన్నీ సృజనలే. మనస్సుకు, హృదయమునకు ఒక అనుభూతిని ప్రసాదించే వరమే. వెలిగించిన దీపాలతో మాయలను కలిగించి మహోన్నత శిఖరములను సాధించిన ప్రజ్ఞాశాలి మార్కస్ బార్ట్‌లీ. వంద సంవత్సరాలకు ముందు జన్మించిన అతడు 14 మార్చి 1993 నాడు శాంతిని పొందినా, అతని ప్రతిభా చిహ్నములైన చలన చిత్రములు ఇంకా కొన్ని వందల ఏండ్లు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయన్న విషయములో సందేహము లేదు.

(వ్యాసమునకు నిండుదనాన్ని ఇవ్వడానికి ఎన్నో సూచనలను ఇచ్చిన శ్రీ పరుచూరి శ్రీనివాస్‍గారికి కృతజ్ఞతలు.)


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...