వర్గ సంబంధం

(“శారద” ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ లో ఉంటారు. మానవసంబంధాలను విశ్లేషిస్తూ కథలు రాస్తున్నారు. ఇదివరకు వీరి కథ మరొకటి అమ్మ, “ఈమాట” లో ప్రచురించాం.)

అడిలైడ్‌ వచ్చి రెండు నెలలైనా మనం గుడికి వెళ్ళలేదే?” స్వఛ్ఛమైన తమిళులందరిలాగే మా ఆయనకీ ఏ ఊరెళ్ళినా, ముందు గుడికెళ్ళి రావాలి. సరే, ఇక తప్పదనుకుని, స్ట్రీట్‌ డైరెక్టరి పట్టుకుని బయల్దేరాము.

పేరుకది వినాయకుని గుడే అయినా, అందరు దేవుళ్ళకీ పూజలు జరుగుతాయి. మనం మనతో పాటే మన గ్రూపులు కూడా పట్టుకెళ్తాం, కాబట్టి గుళ్ళొకూడా ఉత్తర భారతీయులొక ఆదివారం, దక్షిణ భారతీయులొక ఆదివారం పూజలు చేసుకుంటారు. గుళ్ళో భజన, ప్రసాదం వగైరా కార్యక్రమాలయ్యాక మళ్ళీ బుల్లి బుల్లి గ్రూపులు (భాషల వారీగా, ప్రాంతాల వారీగా) కట్టి కబుర్లు చెబుతూ నించున్నారు. నేను ఉభయ తారకంగా, కాసేపు తెలుగు వాళ్ళతోనూ, కాసేపు తమిళులతోనూ కాలక్షేపం చేస్తూ, అటూ ఇటూ తిరుగుతున్నాను.

ఇంతలో “ఇదిగో, శారదా! ఇతను … శ్రీలంక నించి వచ్చిన తమిళులు” అని ఆయన పరిచయం చేయటంతో తిరిగి చూసాను. ఇదీ ఇక్కడ పరిపాటే. నిజానికి, ఏ రజనికాంత్‌ సీన్మాలోనో, తమిళ పాటల కార్యక్రమంలోనైనా, భారతీయులైన తమిళులకంటే, శ్రీలంక తమిళులు ఎక్కువగా కనిపిస్తారు. అతను మాట్లాడుతూ వున్నట్టుండి శ్రీలంకలోని తమిళుల సమస్య గురించి గురించి చెప్పటం ప్రారంభించాడు. పరాయి దేశంలో రాజకీయ చర్చ అంత క్షేమం కాదేమోనన్న భయంతో నేను మా ఆయన వైపు “ఈ సంభాషణ చాలు, ఇక వెళ్దాం” అనే అర్థవంతమైన చూపులు విసరసాగాను. ఆయన అదేం పట్టించుకోక పోవటంతో ఇక నేనే మాటల్ని దారి మళ్ళించాను. నా భయం అర్థమైనట్టు ఆ కొత్తాయన నవ్వి మమ్మల్నొదిలి వెళ్ళిపోయాడు.

దారిలోనే నా మీద మొదలైంది. “అవతలి మనిషి సగం వాక్యంలో వుండగానే, అంత మర్యాద లేకుండా, మాట మార్చాలా? అతను మననేమైన సహాయం అడిగాడా? ఏదో కొంచెం సానుభూతి! అంతలోకే మనని రాజకీయ మూఠాలోకి తోసెయ్యరు ఎవరు! సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమైన చేయవేం?” ఎట్సెట్రా.

నిజమే నా ప్రవర్తన నాకే నచ్చలేదు. అతని మాటలు కాసేపు విన్నంత మాత్రాన మాకొచ్చే నష్టమేముంది? ఏదో, తన కడుపులో భాధ వెళ్ళగక్కుకున్నాడు. విని ఊరుకుంటే సరిపోయే దానికి నా పిరికి తనాన్ని ఎందుకింత బేలగా బయటపెట్టుకున్నాను? రాజకీయాలంటే భయమా? ఎక్కడో తలపడ్డ రెండు వర్గాల శతృత్వంలో తలదూర్చటం ఇష్టం లేకా? ఇంతలో ఎప్పట్లాగే, నా ఆలోచనలు పక్క దారి పట్టాయి.

“సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోవేం?” ఎక్కడో విన్నాను.ఇదే మాట, వేరే పరిసరాల్లో, వేరే పరిస్థితుల్లో ఎక్కడ, ఎప్పుడూ? నా మనసు గతం లోకి జారిపోయింది.


ఐదారేళ్ళ క్రితం, మద్రాసులో …

ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ ఇరవై నాలుగు గంటలూ ఊపిరి సలపకుండావుండే వాళ్ళం. అపుడే, మా ఎదురింట్లో ఉండే ఆస్పత్రి గుమాస్తా పెళ్ళాన్నిరోజూ చావబాదుతుండటం నా దృష్టిలో కొచ్చింది.

మన ఎదురింటి అతను, పెళ్ళాన్ని తరచూ కొడుతూవుంటాడు, తెలుసా?” అడిగాను ఒకరోజు ఆయన్ని.

అతికష్టం మీద పేపర్‌ నుండి దృష్టి మరల్చి, “కొడితే కొట్టాడులే, మొగుడూ పెళ్ళాలన్న తరువాత సవాలక్ష గొడవలవుతూ వుంటాయి.”

“అయితే పెళ్ళాన్ని కొట్టాలా? పెళ్ళాం మొగుణ్ణి కొడితే వూరుకుంటాడా?”

“అమ్మా! తల్లీ! దయచేసి నీ స్త్రీ వాదాలు మొదలు పెట్టి నాకు తలనొప్పి కలిగించకు. అసలే అఫీసు పనితో చస్తున్నాను” విసుగ్గా అని, మళ్ళీ సచిన్‌ టెండుల్కర్‌ గురించి చదువుకోవటంలో మునిగిపోయాడు.

అందరు మొగవాళ్ళలాగే మా ఆయనక్కూడా స్త్రీ వాదమన్నా, స్త్రీల సమస్యలన్న అసహనం చులకన. ఆడవాళ్ళు తిని కూర్చోలేక, “ఫెమినిజం” అంటూ వీథి కెక్కుతారని ఆయన అభిప్రాయం. నేను అలా పట్టనట్టు ఉండలేక పోయాను. అప్పుడే మా కాలనీలో “మానవ హక్కుల సంఘం” అనే చిన్న సొసైటీ నడుపుతున్నారని తెలిసింది. “వాళ్ళ కొక సారి ఫిర్యాదు చేద్దామా?” అని మా ఆయన్ని అడిగాను.

“ఆ సంఘం మొగడూ పెళ్ళాల కీచులాటలు తీర్చడనికి కాదు, మానవ హక్కుల పరిరక్షణ కోసం.”

“ఏం? భార్యలు మానవులు కారా? వాళ్ళకేం హక్కులుండవా?” వెటకారంగా అడిగాను.

“చూడు, ఆవిడ చదువుకున్నావిడ లాగే వుంది. ఆవిడ సమస్య ఆవిడే తీర్చుకుంటుంది. మనం తల దూరిస్తే ఏం బావుంటుంది చెప్పు?”

నేనేం మాట్లాడలేదు. జవాబివ్వలేక కాదు. ఆయన్ని ఒప్పించడం అనవసరం అనిపించటం వల్ల. చదువుతో అన్ని సమస్యలు పరిష్కరించుకునే తెలివి తేటలు, ధైర్యం, ఆలోచన వచ్చేస్తున్నాయా? అసలు ఆవిడకి భర్త కొడుతూ ఉంటే పడి వుండాల్సిన అవసరం లేదు, అన్న సంగతైనా తెలుసో లేదో? ఆవిడని గురించిన భాద కంటే పక్క మనిషి అన్యాయంగా దెబ్బలు తింటున్నా చలించని మా ఆయన నిర్లిప్తత నన్నెక్కువ భాదించింది.

ఎలాగైతేనేం, అతను పని చేస్తున్న ఆస్పత్రి అధికారుల్ని కలుసుకొని అతన్ని వాళ్ళు మందలించేలా ఏర్పాటు చేసాను. ఆవిడతో ఒకసారి మాట్లాడి ధైర్యం చెప్పాను. ఇదంతా చేస్తున్నప్పుడు మా ఆయనేం అడ్డు చెప్పలేదు. కానీ ఎక్కువగా ప్రొత్సహించనూ లేదు. “నీ ఇష్టం” అని మౌనంగా ఉండిపోయాడు.

అదిగో, అపుడే నేనూ సరిగ్గా ఇదే డైలాగు వదిలాను. “సాటి మనిషి కష్టాల్లో ఉంది. సహాయం ఏటూ చేయలేదు. కనీసం కొంచెం సానుభూతి చూపించగూడదా?” వగైరా, వగైరా.

ఈ రోజు, అదే నేను! ఎక్కడుందీ మెలిక?

చాలాసేపు ఆలోచించిన మీదట నాకు చిన్న ఆధారం దొరికింది. అవును, సెన్స్‌ ఆఫ్‌ బిలాంగింగ్‌. ఏ మనిషైనా తనని ఏదో ఒక వర్గానికి చెందిన మనిషినని అనుకుంటాడు భాషా పరంగా నైన, ప్రాంతీయ పరంగా నైనా, సాంఘిక, ఆర్థిక స్థాయి పరంగా నైనా. తన వర్గానికి చెందిన మనిషి కష్టనష్టాలకు స్పందిస్తాడు. ఆ వర్గానికి చెందని మిగితా మనుష్యుల గొడవ పెద్దగా పట్టదు. వాళ్ళవి చెప్పుకోదగ్గ కష్టాలనిపించవు.

అందుకే సాటి ఆడదాని కష్టానికి కదిలిపోయిన నేను, కేవలం భాష, ప్రాంతం వేరైనందువల్ల ఇంకొక వ్యక్తి బాధల్ని తోసివేసాను. “ఆడవాళ్ళ సమస్యలా?” అంటూ వెటకారం చేసే ఆయన, తన భాష మాట్లాడే జాతి ప్రజల కష్టానికి చలించిపోయాడు.

“నేను,” “నా కుటుంబం” అనే పరిధినించి బయటపడి, “నా వాళ్ళు” అనే అభిమానం పెంచుకోవటం, ఒక్క మెట్టు ఎక్కటం లాంటిదైతే, “మానవులు” అనే ఇంకా విశాల ధృక్పథం రావటం ఇంకా పైకెదగటం లాంటిది. కనీసం పది శాతం జనాభాకి ఆ ధృక్పథం అలవడ్డా, “వర్గ సంబంధాలు” కంటే “మానవ సంబంధాలు” మెరుగు పడతాయి.



శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...