1 + 1

ఐ యామ్ ఎ మాన్!
మై స్పర్మ్ కౌంట్ ఈజ్ గుడ్!
అండ్, దట్ ఈజ్ మై సిన్!

తన్నుకొస్తున్న ఆవేశాన్ని గొంతులో నొక్కేసి, రెండు బొటనవేళ్ళలో బలాన్నంతా మొబైల్ కీబోర్డుపై చూపించి, ఆ మెసేజ్ వాట్సాప్ చేశాడు. ఒక క్షణం ఆగి చూశాడు. మెసేజ్‌ల పక్కన ఒక టిక్ మార్క్ వచ్చింది. వెంటనే రెండోది కనిపించింది. అవి నీలం రంగులోకి మాత్రం మారలేదు. నిట్టూర్చి, ఇంకా ఏదో టైపు చేయడం మొదలుపెట్టాడు. అనుకుంటున్నవన్నీ అనటానికి ఆటో కరెక్ట్ అడ్డుపడింది. గొంతులో అణిచి ఉన్న ఆవేశం ‘ఫక్’గా తప్పించుకుంది. సోఫాలో రెండు పల్టీలు కొట్టి కుషన్ల మధ్య ఖాళీలో ఫోన్ దాక్కుంది.

సోఫా ముందున్న కాఫీ టేబుల్ మీదకు కాళ్ళు చాచి, కాలితోనే ఎదురుగా వున్న మాక్‌బుక్‌ను ఒక పక్కకు నెట్టి, కళ్ళుమూసుకున్నాడు.

ఇంతలో ఫోన్ గుర్రుమంది, నొక్కేసిన గొంతుతో. కదలకుండా అలానే ఉండి చేతులతో వెతికాడు. పక్కకు వంగితేగాని దొరకలేదు. సైలెంట్‌మోడ్‌లో పెట్టబోతుంటే లాక్ అయ్యున్న స్క్రీన్ మీద సంధ్య పేరు కనిపించింది. ఒక్కసారిగా తల ఎత్తి కూర్చున్నాడు. వచ్చిన మెసేజ్ ఏంటో చూసుకోకుండా ఆమెకు తను పెట్టిన మెసేజిలు చదువుకున్నాడు. అందులో స్పర్మ్ ప్రస్తావన లేదని నిర్ధారించుకొని ఊపిరి తీసుకున్నాడు.

బావా! మీ ఇద్దరి గురించి బెంగగా ఉంది.
డోంట్ టార్చర్ యువర్ బాడీస్ ప్లీజ్.

ఫోన్‌ని బోర్లా తిప్పి గుండెలపై పెట్టుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం ఫామిలీ గెట్‌టుగెదర్‌లో కూడా సంధ్య ఇలానే ఏదో అంది, పిల్లలు లేకపోతేనేం? దత్తత తీసుకోవచ్చుగా! అని. అంతే! వాళ్ళమ్మ కొట్టినంత పనిచేసింది. అతడి అమ్మానాన్నలు కళ్ళతోనే కసిరారు. ‘ఏం? తన పిల్లల్ని అక్కకి ఇచ్చేస్తుందటనా?’ అని చుట్టాల్లో కొందరు వినిపించేట్టు గుసగుసలాడారు. ఆ రోజు ఆ మాట విని అక్కడ నుండి వెళ్ళిపోయిన అతడి భార్య మళ్ళీ చెల్లెలితో మాట్లాడలేదు.

ఫోన్ చేతిలోకి తీసుకుని మళ్ళీ వాట్సాప్ తెరిచి చూశాడు. విజయ్ నుంచి రిప్లయ్ లేదు. ఇంజనీరింగ్ హాస్టల్‌లో ఒకే గది పంచుకున్నవాళ్ళు. నాలుగేళ్ళు అయ్యాక ఆ గదిని కూడా తమతో పాటు మోసుకెళ్ళినవాళ్ళు. దూరభారాల మీద ఫోనుల్లో మాట్లాడుకోవడం, లైట్లు ఆపేసి, ముసుగులు తన్నేశాక చీకట్లో కబుర్లు చెప్పుకున్నట్టు అనిపించదు. మెసెంజర్లలో మాట్లాడుకోవడం మాత్రం ఒకళ్ళు గదిలో లేనప్పుడు ఇంకోళ్ళకి కాగితం మీద రాసి పెట్టి వెళ్ళిన మెసేజెస్‌లా ఉంటుంది. ఏదో అత్యవసర విషయం చెప్పడానికే కానీ, మనసులో మాట చెప్పుకోడానికి కుదరదు.

‘విజయ్ టైపింగ్’ వాట్సాప్ చూపించింది. మొబైల్‌లో టైపింగ్ కష్టమని పక్కకు పెట్టి మాక్ తీసుకున్నాడు. ఇంకేమన్నా మెసేజెస్ వస్తాయేమోనని ఎదురుచూశాడు. తాను పంపిన మెసేజెస్ మళ్ళీ చదువుకుని మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. ఇందాకటి ఆవేశమంతా నీరుకారిపోయింది. వాట్సాప్ స్టేటస్ ఇంకా మారలేదు. మాక్ మూసేసి బైటకు చూశాడు.

బైట చిన్నగా చీకటి పడుతోంది. లేచి బాల్కనీకి ఉన్న గ్లాస్ డోర్ తీయబోయాడు. అది జరగలేదు. బలంగా లాగాడు. ఆన్‌సైట్లో ఉండగా ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్ళు అప్పుడే నడక వస్తున్న పిల్లాడికోసం అతి జాగ్రత్తతో, బాల్కనీ తలుపు తెరిచేవాళ్ళుకాదు. వాడకం లేక తలుపు బిగుసుకుపోయింది.

ప్లేగ్రవుండ్‌లో లైట్లు వెలుగుతున్నాయి. ఆడింది చాలని పిల్లల్ని ఇళ్ళల్లోకి లాక్కుపోతున్న తల్లిదండ్రులు. ప్లేగ్రవుండ్ ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ కోసం అప్పట్లో ఎక్కువ డబ్బులు పోసి కొన్నారు. పెళ్ళయిన ఏడాదికే తీసుకున్న ఫ్లాట్. ఆఫీసు నుండి ముందుగా అతడే ఇంటికి చేరుకునేవాడు. గంటన్నర ప్రయాణంచేసి వచ్చే ఆమె కోసం తినడానికి ఏదో ఒకటి చేసిపెట్టి, బాల్కనీలో ఎదురు చూస్తుండేవాడు, ఆడుకునే పిల్లల్ని చూస్తూ. ఆమె ఇంటికి వచ్చాక, అతను చేసిన పకోడీలో, శాండ్‌విచ్‌లో తింటూ, ‘పిల్లలకు నీ పోలిక వస్తే, మాస్టర్ చెఫ్ అవ్వడం ఖాయం’ అనేది. ‘ఏమన్నా అవనీ గాని, కొడుకు పుడితే సచిన్ అని, కూతురు అయితే శచి అని పేరు పెడతా’నని అనేవాడు. వాళ్ళ అమ్మలు దాన్ని కాస్తా సాయి వెంకట సచిన్‌గా మార్చేస్తారని ఉడికించేది ఆమె. ‘పిలుచుకోమను పర్లేదు, రిజిస్టర్‌లో రాయనియ్యను. పిల్లలకి ఊహ తెలిశాక, సచిన్ ఇండియాలో ఆడే మ్యాచులన్నింటికి తీసుకెళ్తా’ అంటుంటే అతని కళ్ళు మెరిసేవి. వరల్డ్ కప్ తర్వాత సచిన్ ఆడడేమో అని గుర్తుచేసేది ఆమె. ‘రైట్! అవును కదా. పద పద, టైమ్ లేదు మన దగ్గర,’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకునేవాడు. ‘ఏంటిది బాల్కనీలో, ఎవరన్నా చూస్తే…’ అంటూ విడిపించుకునేది నవ్వుతూ, లోపలికి నడుస్తూ.

పట్టుకున్న బాట్‌లో సగం హైట్ కూడా లేని పిల్లలంతా, ఇప్పుడు అండర్ 10 టోర్నమెంట్స్‌లో ఆడుతున్నారు. పట్టుకున్న బాట్‌లో సగం హైట్ కూడా లేని పిల్లలు కొత్తగా వస్తూనే ఉన్నారు.

ఫోన్ రింగయింది. అమ్మ. కాల్‌ తీసుకోలేదు. వాట్సప్‌లో కదలిక, విజయ్ నుండి.

ఆర్ యూ ఓకే? కెన్ ఐ కాల్?
కుదరదు. పక్క గదిలోనే ఉంది.
అబే గిరీ… నువ్వు ఇష్యూని ఇంకా కంప్లికేట్ చెయ్యకురా.
డాక్టర్‌తో మాట్లాడి, కొంచెం బ్రేక్ తీసుకోండిబే.
ఒప్పుకోదురా.
పోనీ, గెట్ హర్ బాక్ టు వర్క్?
తన మైండ్ ఆక్యుపైడ్ అవుతుంది.
అవ్వదురా! జాబ్ వల్లే ఇదంతా అంటుంది. షి ఈజ్…

గాజుల చప్పుడు, సెల్ ఫోన్ రింగ్ దగ్గరవ్వటంతో హోమ్ బటన్ నొక్కాడు ఠక్కున. దాటకూడని గీతున్నట్టు ఆమె ఇవతలి నుండే ఫోన్ అందించింది. అతడే బాల్కనీ తలుపు దగ్గరకు వచ్చాడు. ‘అత్తయ్య కాలింగ్’ కనిపించింది ఆమె ఫోనులో.

“ఆఁ, అమ్మా, చెప్పు.”

“అమ్మనేరా! కనీసం, నా ఫోను కూడా తీయలేవురా?!”

“ఫోను సైలెంట్‌లో ఉందమ్మా. నేనేదో పనిలో ఉన్నా.” విసుగు వినపడకుండా సంజాయిషీ ఇవ్వడం ఎందుకింత కష్టం. ఎందుకీ అవసరం.

“అంతే! మీకెంతసేపూ పనులే! మీ జీవితాలు బాగవ్వాలని మేం కిందా మీదా పడాలి గానీ, మీకేం పట్టింది?”

అతడు బాల్కనీలోంచి ఇంట్లోకి వచ్చాడు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ, డైనింగ్ టేబుల్ చేరుకుంది. టేబుల్ మీదున్న ప్రసాదం బాగులోంచి కొబ్బరి చెక్కలు తీసి బయటపెట్టింది.

“స్పీకర్‌లో పెట్టు. ఇద్దరితో మాట్లాడాలి.”

“దేని గురించి?”

అతడూ మెల్లిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ చేరుకున్నాడు. కుర్చీ లాక్కుని కూర్చుంటూ స్పీకర్ ఆన్ చేసి, ఫోన్ టేబుల్ మీద పెట్టాడు.

“మీ నాన్నా, నేనూ మొన్న ఒక బాబాగారిని కలిశామని చెప్పాను కదా!” అతడు భుజాలు జారిపోయాయి. సగం మొహం చేతిలో దాచుకున్నాడు. ఆమె తల ఎత్తకుండా కొబ్బరి చెక్కల్లోంచి కొబ్బరి తీస్తోంది, ముక్కలుగా.

“మీ జాతకాలు చూపించాం. ఏ దోషమూ లేదు. దేవుడు పరీక్ష పెడుతున్నాడంటే గొప్ప వరమే ఇవ్వబోతున్నాడు అని అన్నార్రా ఆయన!”

ఆమె కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కోయడం మొదలుపెట్టింది.

“ఆయన రేపు హైదరాబాదులోనే ఉంటారు. మీరిద్దరూ వెళ్ళి కలవండి.”

“రేపా? రేపంటే ఎలా అమ్మా. ఇవ్వాళ చిత్రకి మళ్ళీ టెస్టులు చేశారు మధ్యాహ్నం అంతా. పొద్దున్న గుడికెళ్ళి 108 ప్రదక్షణలు చేసొచ్చాం. ఇద్దరం అలసిపోయున్నాం.”

“నూటఎనిమిది కాకపోతే, వెయ్యిన్నూట పదహార్లు చెయ్యండి! నేను పొమ్మన్లేదే! అది వీసాలొచ్చే గుడి. పిల్లల కోసమని ఎవరూ వెళ్ళగా నేను వినలేదు. మళ్ళీ పారిపోయే ఉద్దేశాలు ఉన్నాయేమో మరి మీకు!”

ఆమె చేతిలోని చాకు ఆగింది. ఆ గుడికి వెళ్ళమంది చిత్ర వాళ్ళ అమ్మ అని గుర్తొచ్చి నాలుక కర్చుకున్నాడు. స్పీకర్ ఆఫ్ చేశాడు.

“సరే! ఎక్కడ?”

“చాంద్రాయణగుట్టలో. మీ నాన్న అడ్రస్ మెసేజ్ చేస్తారు. ఐదింటికల్లా అక్కడ ఉంటే స్పెషల్ దర్శనం కుదురుతుందని ఆ సెక్రటరీ చెప్పాడు.”

“ఐదింటికా! గంటన్నర దూరం మాకు.” అన్నాడు, కాలు ఒత్తుకుంటూ. అవతలివైపునుంచి అసహనంగా మౌనం.

వెంటనే సర్దుకొని, “సరే! వెళ్తాంలే.” అంటూ కాల్ కట్ చేశాడు.

ఇంతలో తన ఫోన్‌లో విజయ్ నుండి మెసేజ్. సారీ రా! అర్జున్‌ని సాకర్‌కి తీసుకెళ్ళాలి. మళ్ళీ మాట్లాడతా.

రెండు ఫోన్లు టేబుల్ మీదే పడేసి, స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే చట్నీకి కావాల్సిన పోపు చిటపటలాడుతోంది. గరిటెకి, గిన్నెకి మధ్య పోట్లాట జరుగుతున్నట్టు శబ్దాలు. కారుతున్న టాప్‌లోంచి నీళ్ళ చుక్కలు క్లాగ్ అయిన సింక్‌లో టప్ టప్ అంటూ పడుతున్నాయి.

నీళ్ళు వెళ్ళడానికి ఆమె ఒక పుల్లతో పొడుస్తోంది డ్రెయిన్ కన్నాలలోకి. అతడు స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె పుల్లతో కసిగా విసురుగా పొడుస్తోంది. నీరు పోలేదు. చేతిలో పుల్ల సింక్‌లోకి విసిరేసి చటుక్కున కింద పైపు లాగడానికి వంగబోయింది. అతడు ఒక్క అడుగులో ఆమెను చేరుకొని, పట్టుకొని కూర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె కళ్ళు మూసుకొని అలానే ఒక నిమిషంపాటు ఉండిపోయింది. లేచి, చేతులు కడుక్కొని, అతడి చేతిలోంచి గరిటె తీసుకుని, కొబ్బరి ముక్కలతో పాటు పోపు మిక్సీలో వేసింది.

అతడు వచ్చి సోఫాలో వాలాడు. కళ్ళు మూసుకొని నుదుటి మీద చేయి అడ్డంగా పెట్టుకొన్నాడు.

మిక్సీ మోత ఆగుతూ మొదలవుతూ ఆగుతూ. అతడికి తల బరువుగా అనిపించింది. కళ్ళు మండుతున్నాయి. ఆమె మిక్సీ ఆపింది, మళ్ళీ ఆన్ చేసింది. బహుశా, కొన్ని నీళ్ళు పోసుండాలి, మిక్సీ చప్పుడు సాఫయింది.

తన ఆలోచనల్లో కూడా ఎవరన్నా కాసిన్ని నీళ్ళు పోస్తే తల ఇంత గోలగా ఉండదు కదా అని అనుకున్నాడు.

“గిరీ, గిరీ!” అని పిలుపు. మెత్తని చేయి అతని తల నిమిరిన భావన. కుక్కర్ విజిల్ లీలగా వినిపించింది.

అతడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు, లేచి కూర్చుంటూ. తల మీద చెయ్యి వేసేంత దగ్గరగా లేదు ఆమె.

కాఫీ టేబుల్‌కి అటే నిలబడి వేళ్ళని ముద్దలా నోటి దగ్గర పెట్టుకొని సైగ చేసింది. అతడు వాల్చిన తల ఎత్తకుండా ఆమెనే చూశాడు. ఆమె క్షణంపాటు చూసి, కళ్ళు పక్కకు తిప్పేసుకుంది.

మొహం మీద చిలకరించుకున్న నీళ్ళు సరిపోలేదు. వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. పట్టేసిన నరాల మీద వేన్నీళ్ళు పడుతుంటే కొద్దిపాటి ఊరట కలిగింది.

అతడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి కుక్కర్ మళ్ళీ స్టవ్ ఎక్కింది.

“రేపు ఎప్పుడు బయలుదేరాలి?” ఆమె అడిగింది అనునయంగా.

“ఐదింటికి అక్కడ ఉండాలంటే నాలుగింటికల్లా బైటపడాలి.”

“నీరసంగా ఉందా?” అంటూ అతడి చేతిని నిమిరింది. చేతినిండా ఎర్రని గాజులు. అవి వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. ఎవరో అతడికి ఠక్కున గుర్తురాలేదు. ఆ ఎరుపును తప్పించుకోడానికి ఆమెను చూశాడు.

ఉబ్బిన మొహం. కళ్ళ కొసల్లో ఎరుపు. చెదిరిన జుట్టు.

“నీకు బాలేకపోతే మానేద్దాం. అమ్మను మానేజ్ చేయొచ్చు.”

“ముందు ఆవిడ కాల్స్ మిస్ అవ్వకు. అదేదో నేను ఎత్తనివ్వటం లేదన్నట్టు మాట్లాడుతుంది.”

“…”

ఆమె లేచి, సింక్‌లో కంచం పడేసి, టేబుల్ మీద ఉన్నవన్నీ ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి, అక్కడ నుండి వెళ్ళిపోయింది.

చేయి ఎండిపోయేవరకూ అక్కడే కూర్చుండిపోయాడు.

ఫోన్ ఆగకుండా వైబ్రేట్ అవుతుండడంతో, చేయి కడుక్కొని, ఫోన్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టీమ్ గ్రూప్ అంతా కంగ్రాట్స్‌తో నిండిపోతోంది. మూడేళ్ళ క్రితం తను కాంపస్‌లో సెలెక్ట్ చేసిన అబ్బాయికి బాబు పుట్టాడు, ఆ సాయంత్రమే. ఆ విషయం తను పాపాయి ఫోటోతో పాటు, ‘ఇట్స్ ఎ బాయ్ ఫర్ వినీత్. బోత్ మదర్ అండ్ బేబీ ఆర్ డూయింగ్ ఫైన్!’ అంటూ టీమ్ లూప్ చేస్తూ అఫీషియల్ మెయిల్ పెట్టాడు, మానేజర్ కాబట్టి. కంపెనీ తరఫున ఇచ్చే గిఫ్ట్ వోచర్లు అతడికి పంపించాడు. ‘కంగ్రాట్స్! రేపు మాట్లాడుకుందాం’ అని మెసేజ్ పెట్టబోయి, కాల్ చేశాడు. “నాకు ముట్టుకోవాలన్నా వణుకు వచ్చేస్తుంది సర్! ఎంత డెలికేట్‌గా ఉన్నాడో!” ఆ అబ్బాయి గొంతులో సంతోషం, ఆత్రం. “వర్క్ గురించి ఆలోచించకు. టేక్ యువర్ టైమ్. కంగ్రాట్స్ అగైన్!” అని పెట్టేశాడు.

చాలామందికి పిల్లల్ని కనటం ఒకటికి ఒకటి కూడినంత తేలిక. వాళ్ళకి మాత్రం ఎందుకో మరి అంత కాంప్లెక్స్ ఈక్వేషన్ అయిపోయింది. వారం క్రితం కఫెటేరియాలో కనపడ్డ వైస్ ప్రెసిడెంట్ గుర్తొచ్చాడు. వాడూ వాడి ఈగోటిస్టికల్ ఆటిట్యూడూ. ‘హేయ్ గిరీ! ప్లానింగ్ ఎనీ కిడ్స్ యెట్?’ ‘యా! వియ్ ఆర్ ట్రయింగ్…’ ‘అవునా! మాకు మొదటిసారే అయిపోయింది. వియ్ డిడ్ ఇట్ ఇన్ వన్ షాట్ యూ నో,’ అన్నాడు అదేదో వాడు ప్లాన్ చేసి చేసినట్టు, వాడేదో ఎక్కువ మగాడు అయినట్టూ. ఒళ్ళు మండిపోయింది. ‘యూ బ్లడీ మోరాన్, ఇట్స్ జస్ట్ టైమింగ్. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ యూ యూ ప్రిక్!’ అని అరుద్దామనుకున్నాడు. కోపం ఆపుకొని భుజాలెగరేసి ట్రే తీసుకొని వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చిత్ర చెప్పేది కాదు గాని ఇలాంటి సూటిపోటి మాటలు ఆమెకూ రోజూ అలవాటే! ఉద్యోగం చేసినప్పుడు ఒకరకంగా, అది మానేసినాక ఇంకో రకంగా.

మ్యూట్‌లో ఉన్న టి.వి.లో 9పి.ఎమ్. న్యూస్ వస్తోంది. బెడ్రూమ్‌లో నుండి ఏ చప్పుడూ లేదు. ఏ చిన్న కదలిక అయినా, ఆమె గాజుల గలగలల వల్ల తెలిసిపోతుంది. గాజుల గురించి కొన్ని వివరాలు గుర్తొచ్చాయి. అవి వేసుకొని ఏడు మంగళవారాలు గుళ్ళో దానాలు చేయాలన్నారు. ఎవరు? ఎవరో.

సింక్ టాప్ లీక్ అవుతూ కారుతున్న నీటి చుక్కల శబ్దం అతని తల మీద సుత్తిపోటులా ఉంది. లేచి వెళ్ళి, సింక్‌ కింది పైప్ ఊడదీసి శుభ్రం చేశాడు. సింక్‌లో నిలిచిపోయిన నీళ్ళన్నీ బుడబుడమంటూ వెళ్ళిపోయాయి. టాప్‌ని బలమంతా ఉపయోగించి మూయడానికి ప్రయత్నించాడు. అయినా చుక్కలు పడుతూనే ఉన్నాయి.

మళ్ళీ టి.వి. ముందుకొచ్చి కూర్చున్నాడు. క్రికెట్ హైలైట్స్ వస్తున్నాయి. ఫోన్ తీసి టు-డూ ఆప్‌లో ప్లంబర్‌కి కాల్ చేయాలని నోట్ చేసుకున్నాడు. మరుసటి ఉదయం బాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాలని గుర్తుచేసింది. ఇగ్నోర్ కొట్టాడు. ఆప్ నుండి బయటకు రాబోతుంటే పొరపాటున అనలటిక్స్ లింక్ మీదకి వేలు వెళ్ళింది. హాస్పిటల్ రిలేటెడ్ ఐటమ్స్ – 73%. ప్రొఫెషనల్ ఐటమ్స్ కంప్లీటెడ్ – 89%. ఫిట్‌నెస్ టు-డూ ఐటమ్స్ – 13%. మూవీ లిస్ట్ కంప్లీటెడ్ – 4%. స్క్రీన్ ఏకరువు పెట్టింది.

గుళ్ళూ గోపురాలు, బాబాలు, ఫకీర్ల లిస్ట్ పెట్టుకోలేదింకా. లేకపోతే, వాటికి కేటాయించిన సమయమేం తక్కువ కాదు. జాతకాల్లో దోషం కనిపించదు. మెడికల్ రిపోర్ట్స్‌లో నో ఛాన్స్ అని చెప్పగలిగేంత ఇష్యూ కనిపించదు. ‘అయ్యా, ప్రతి షష్ఠినాడు, మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించి గుళ్ళోని రావిచెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేసినట్టయితే, మీకు తప్పకుండా వంశోద్ధారకుడు పుడతాడు!’ అంటాడు పూజారి. ‘మిస్టర్ అండ్ మిసెస్ గిరీ, లెట్స్ ట్రై దిస్ ప్రొసీజర్ అవుట్. బీ హోప్‌ఫుల్. లెట్స్ కీప్ ట్రయింగ్!’ అంటుంది డాక్టరు. కొంత రహస్యంగా ప్రయత్నించిన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సక్సెస్ కాలేదు. ఇన్‌విట్రో ఖర్చు సంగతి ఎలావున్నా, ముందు ఇంట్లోవాళ్ళ అడ్డంకులు ఎక్కువ, అదేదో చేయగూడని పని అన్నట్టు.

ఇరవై ఓవర్లో, ఐదు రోజులో, కనీసం ఆడాల్సిన ఓవర్లు మిగలకపోతే ఓటమని నిర్ధారణ అయిపోతుంది. అది క్రుంగదీస్తుందో, రాటుతేలుస్తుందో తెలుస్తుంది. ఆశ నిరాశల ఈ ఊగిసలాట ఎన్నాళ్ళో అతనికి అర్థంకాటల్లేదు.

మ్యూట్ చేసిన టివిలో కూడా అందరూ డిబేట్‌లో గొంతు చించుకొని అరుచుకుంటున్నారని తెలుస్తోంది. కాసేపు ట్విట్టర్‌లో తచ్చాడాడు. టెక్, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా, ట్రోల్స్, మీమ్స్ అన్నీ కలగలుపుగా చదివాడు. ‘యు హావ్ ఎ మెమరీ’ అంటూ ఫేస్‌బుక్, అటెన్షన్ కోసం తపిస్తూ. తెరిచి చూస్తే నాలుగేళ్ళ క్రితం యూరప్‌లో స్కైడైవింగ్‌కి వెళ్ళినప్పటి ఫోటో. ఆమె యూరప్‌లో ఉన్నప్పుడు అతను యూఎస్ నుండి సెలవు పెట్టుకొని వెళ్ళాడు. అతను ఎక్కడ జారిపడతానో అన్నట్టు భయభయంగా చూస్తూ ఇబ్బందిగా నవ్వుతూ, ఆమె భరోసాగా, మొహమంతా నవ్వుతో బొటనవేళ్ళు ఎత్తి చూపిస్తూ. ఆమె ప్రొఫైల్‌కి వెళ్ళాడు. మూడేళ్ళ నుండి ఏ ఆక్టివిటీ లేదు. ‘ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావ్?’ అన్న పోస్టులకి సమాధానం లేదు.

ఇంకాసేపు ఫేస్‌బుక్‌లోనే పొలిటికల్ మీమ్స్, కొత్తగా రిలీజైన తెలుగు సినిమా గురించి ఎడతెగని చర్చలు, రైట్‌వింగ్-లెఫ్ట్‌వింగ్ గలాటాలు, పిల్లల్ని ట్రోఫీల్లా ఎత్తుకొని ముద్దుపెట్టుకునే ఫోటోలు, పిల్లల్ని పెంచడమెంత కష్టమో అంటూ మురిసిపోతున్న తల్లిదండ్రుల పోస్టులూ చూశాడు.

తొమ్మిదింటి వార్తలే పదకొండింటి బులెటిన్లో చదువుతున్నారు. అతడికి కళ్ళు గుచ్చుకుపోతున్నాయి. టి.వి. ఆఫ్ చేసి కళ్ళు నలుపుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అతడి పక్కవైపు బెడ్ లైట్ తప్పించి, గదంతా చీకటిగా ఉంది. అతడు చప్పుడు చెయ్యకుండా వీలైనంత నెమ్మదిగా మంచం ఎక్కాడు. ఆమె గాజులు కదిలాయి.

దుప్పటి కింద ఆమె గాజులు చేస్తున్న శబ్దం బట్టి ఆమె నాడా విప్పుతోందని అతనికి అర్థమయ్యింది. చీకట్లో ఆమె కాళ్ళు దగ్గరకు తీసుకుని పెట్టి పైజామా కిందకి లాగుతోందని తెలిసింది. అతడు లైటు ఆర్పి, అటు తిరిగి పడుకున్నాడు.

గదిలో గడియారం మాత్రమే ఉన్నట్టనిపించింది. భుజం మీద మెల్లగా ఆమె చేయి పడింది.

“ప్లీజ్ గిరీ! ఈ సైకిల్‌లో ఇంకా రెండు రోజులే ఉన్నాయి!”

ఆమె కన్నీళ్ళలో తడిసిన మాటలు అతడిని నిలువనివ్వలేదు. ఆమె వైపుకు తిరిగాడు.

“సారీ. నేను కోపం తెచ్చుకోకుండా ఉండాల్సింది.”

తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది.

కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.

“ఇంకా రెండే రోజులు, గిరీ! ప్లీజ్!”

“నా వల్ల కాదు!” అతడి గొంతుకి ఆమె ఉలిక్కిపడింది. అతడు ఆమె మీదుగా మంచం దిగేశాడు.

“ఈ 1-2-3 సీక్వెన్స్ నా వల్ల కాదు. ఐ కెన్ మేక్ లవ్, కానీ ఇలా డ్రిల్‌లా కాదు…” బయటకు అనకూడదు అనుకుంటూనే అనేశాడు.

అతడు లైట్ వేశాడు. ఆమె దుప్పటి పైకి లాక్కుంది.

“నీకేం? నీ టెస్టులు ఫెయిల్ అయ్యుంటే తెలిసేది.”

అతడు ఒక్క అంగలో ఆమె దగ్గరకు వచ్చి, బుగ్గ గట్టిగా వత్తుతూ, “సో! ఇది నీ టెస్టులు నా టెస్టులు గురించా? చెప్పూ?!” అంటూ గద్దించాడు. ఆమె గొంతులో వినిపించిన నొప్పి మళ్ళీ అతన్ని దూరంగా నెట్టింది.

ఆమె దుప్పటిలో డ్రస్ సర్దుకుంది. జుట్టు ముడివేసుకుంది. దుప్పటిని పక్కకు తోసేసింది.

“చూడూ, ప్రతీ రాత్రి… ఐ కాంట్ గో త్రూ దిస్ షిట్. ఇలా డెడ్‌లైన్ల టార్చర్ నా వల్ల కాదు. ఐ నీడ్ ఎ బ్రేక్!”

“ఆ సంగతి మీ అమ్మను అడుగు.” ఆమె మంచం మీద నుండి లేచింది.

“మా అమ్మను తీసుకురాకు మధ్యలో!”

అతడిని దాటుకుంటూ ఆమె వార్డ్‌రోబ్ వైపుకి విసవిసా వెళ్ళింది. మూలన తాళం వేసున్న ఒక తలుపును తీసి, “ఏంటి? మీ అమ్మను తీసుకురావద్దా?” అంటూ అందులో ఉన్న బొమ్మలన్నీ తీసి ఒక్కొక్కటీ బయటకు పారేసింది.

“మా అమ్మది మనవల కోసం ఆరాటం అంతే! ఏం, మీవాళ్ళు మాత్రం గొలుసు, మురుగులు చేయించలేదా?”

“మీ వాళ్ళు. మా వాళ్ళు. అంతా వచ్చి నా నెత్తి మీద కూర్చోండి. నా కడుపులో నలుసు నిలవడం లేదు, నన్ను పొడిచి పొడిచి చంపండి అందరూ…” అంటూ తలను గోడకు కొట్టుకుంది.

అతడు ఒక్క అంగలో బొమ్మలను దాటుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.

“చిత్రా, ఏం చేస్తున్నావు. ఏంటిది?” ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.

“నేను చావను కూడా చావడం లేదు.” అతడిని విడిపించుకుంది చేత్తో నుదురు గట్టిగా కొట్టుకుంటూ, పెద్దగా ఏడుస్తూ.

“షటప్! జస్ట్ షటప్!” అంటూ ఆమె భుజాల్ని గట్టిగా కుదుపుతూ ఆమెను సగం తెరిచిన తలుపు మీదకు తోశాడు. “నిజంగానే చంపేస్తాను! ఆ మాట ఇంకో సారి వినిపిస్తే!” తలుపు మెల్లగా మూసుకుంది.

“నాకు పిల్లలు వద్దు గిల్లలు వద్దు. నువ్వు కావాలి.”

ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

“నాకు కావాలి, గిరీ! నాకెందుకు పిల్లలు పుట్టరు? నేనే పాపం చేశాను గిరీ?”

అతడు ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె భుజాలపై చేతులుంచాడు.

“గాడ్ ప్రామిస్! ఇలా… అవుతుందని తెలిస్తే… నువ్వు ఎక్కడికి… వెళ్తే అక్కడికి… వచ్చేదాన్ని… నా ఉద్యోగం… నా కెరీర్ అని… నేను…” ఆమె వెక్కిళ్ళ మధ్యలో ఆగాగి అంటున్న మాటలు ఏరుకొని పేర్చుకున్నాడు. అవి అర్ధమయ్యి తల అడ్డంగా ఆడించాడు.

ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “వియ్ డోంట్ డిజర్వ్ దిస్! నాట్ ఎట్ ఆల్!” అన్నాడు.

“నావల్లే నీకీ కష్టం!” ఆమె నోటిని చేత్తో మూశాడు. మొహం మీద పడుతున్న జుట్టును పక్కకు తోశాడు.

“ఎవరి వల్లయితేనేం. ఇది మన కష్టం. నీదీ నాదీ కాదు! ఏం? ప్రాబ్లమ్ నాలో ఉండుంటే?” ఆమె జుట్టును సవరిస్తూనే ఉన్నాడు.

“నేను అమ్మను కాలేనా, గిరి? ఎప్పటికీ కాలేనా?” అతడి షర్ట్ ఆమె గుప్పిట్లో నలిగిపోయింది.

“ఉయ్ కీప్ ట్రయింగ్, సరేనా. కానీ దానికోసం లెట్ అజ్ నాట్ బికమ్ లైక్ దిస్. మీవాళ్ళు మావాళ్ళ కోసం కాదు, ఇంక ఎవరికోసమూ కాదు. ఉయ్ డూ ఇట్ ఆన్ అవర్ టర్మ్స్. ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం. మనం ముఖ్యం.” అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ వార్డ్‌రోబ్ తలుపుకు ఆనుకుని కూలబడ్డాడు.

పాత బొమ్మ ఒకటి, కాలి కింద పడి కొన ఊపిరితో ఉన్న బాటరీ వల్ల కుయ్యిమంది. అతడు దాన్ని కాలితో పక్కకు తోసేశాడు.


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...