సారా మానను

చాలామంది లాగే నాకు కూడ గడచిన ఇరవై సంవత్సరాల ముందు వరకు ఫిట్స్‌జెరాల్డు వ్రాసిన ఒమర్‌ఖయ్యాం రుబాయీల అనువాదము తప్ప, మిగిలిన కవుల రచనలు పరిచితముగా ఉండేవి కావు. 90వ దశకములో Today’s Beautiful Gem శీర్షిక క్రింద ప్రపంచ, భారతీయ సాహిత్యములనుండి కొన్ని కవితలను India Digest పాఠకులకు ప్రతిరోజు పరిచయము చేసేవాడిని. అప్పుడు నాకు మహమ్మదీయకవుల సాహిత్యాన్ని చదవాలనే బుద్ధి పుట్టింది. దాని ఫలితమే నాకు కలిగిన ఎందరో గొప్ప మహమ్మదీయ, సూఫీ కవుల పరిచయము. ఆ ఆణిముత్యాలలో కొన్నిటిని తెలుగులో అప్పుడప్పుడు తర్జుమా చేసేవాడిని. వాటిని ఈమాట పాఠకులతో పంచుకోవాలన్నదే యీ ప్రయత్నపు ముఖ్యోద్దేశము. నా యెంపిక నా ప్రత్యేక యిష్టాయిష్టాలపైన ఆధారపడినది కాబట్టి అన్ని అనువాదాలు అందరికీ నచ్చక పోయినా, కొన్నైనా తప్పక స్పందన కలిగిస్తుందనే నమ్మకము నాకున్నది. కొన్ని కవితలను పద్యములుగా, మరి కొన్నిటిని పాటలుగా, ఇంకా కొన్నిటిని వచన కవితలుగా అందజేస్తున్నాను.

తెలుసా అని తెలుగు సాహిత్య వేదిక ఒక పదేళ్ళకు ముందు అంతర్జాలములో ఉండేది. అందులో అప్పుడప్పుడు సమస్యాపూరణము నిచ్చేవారు. ఒకప్పుడు యివ్వబడిన సమస్య “సారా మానను, మాను టొప్పగునె, సచ్చారిత్ర భంగంబగున్”. దానికి నేను చేసిన ఈ క్రింది పూరణనే యీ వ్యాసానికి శీర్షికగా యెన్నుకొన్నాను.

ఔరా! యీ మధుశాల రమ్యవసుధాహర్మ్యమ్ము, యీ సౌధమం
ధారాధింతురు పానపాత్ర మది నత్యానందులై ప్రేమికుల్,
సారాయ మ్మత డిచ్చు ప్రేమరసమౌ, సారాయమే జీవమౌ,
సారా మానను, మాను టొప్పగునె, సచ్చారిత్ర భంగంబగున్!


ఇమాం అలీ సమాధి, నజాఫ్ నగరం

మహమ్మదీయులకందరికీ పవిత్రమైన గ్రంథము కొరాను. అది వారి దైనందిన జీవితాన్ని మాత్రమే కాదు, వారి కవిత్వాన్ని కూడ ప్రభావితము చేసింది. ఇరాక్ దండయాత్ర వలన మనకు పరిచయమైనది నజాఫ్ నగరపు పేరు. ఇది షియా శాఖకు చెందిన మహమ్మదీయులకు చాల పవిత్రమైన పుణ్య స్థలము. ఇక్కడ ఇమాం అలీ ఇబ్న్ తాలిబ్ యొక్క సమాధి ఉన్నది. ఇమాం అలీ దేవదూత మహమ్మదు యొక్క ప్రథమ శిష్యుడు. మహమ్మదు సోదరుని కొడుకు. అతని అల్లుడు కూడ. ఇతని కవితలు రెంటిని క్రింద ఇస్తున్నాను.

అల్పజీవులు కొందఱీ యవని పైన,
సత్కృతులు వారివి నిలుచు చాల యేండ్లు
చాల కాలము కొందఱు నేల పైన
బ్రదుకుచుందురు జీవచ్ఛవముల పగిది

వెలుగు నీడల చిత్ర మీ యిల నిజాన
నతిథి యొక రేయి యగుదు మీ యవని పైన
వర్ణమయ స్వప్న మగు మన బ్రదుకు లౌర
మెఱయు నాశా దిగంతాన మించు వోలె

అలీ మహమ్మదు యొక్క కూతురైన ఫాతిమాను పెండ్లాడెను. మహమ్మదీయులకు ఫాతిమా అతి పవిత్రమైన స్త్రీ. తన తండ్రి మహమ్మదు చనిపోయిన పిదప క్రింది భావమును వ్యక్తీకరించెనట.

ఆ సమాధిపై గాలులు మాసి పోని
తావి నిచ్చును సతతము పూవు వోలె
విధి యొసంగిన పెనుదెబ్బ వ్యధల నిచ్చి
దినములను రాత్రి జేసేను మనసు క్రుంగ

రాబియా

ఇరాకులో బాస్రా పురాతన కాలమునుండి నిలిచి ఉన్న పట్టణము. ఈ నగరపు సమీపమున యూఫ్రిటీస్ టైగ్రిస్ నదులు ఒకటవుతాయి. తరువాత దీనిని షతాల్ అరబ్ అని అంటారు. బాస్రా నగరము ఇరాకు దేశములో బాగ్దాద్ పిదప రెండవ ప్రసిద్ధ నగరము. జనాభా సుమారు 15 లక్షలు. బాస్రా నగరము కవులకు, కవిత్వానికి చాల ప్రసిద్ధి. ఇది ఇరాను దేశపు సరిహద్దులో నుండుటవలన జనులకు అరబీ భాషయే కాక పారసీక భాష కూడ పరిచితము. క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దములో రాబియా అను కవయిత్రికి బాస్రా వాస స్థానము. ఈమెకు సూఫీ సిద్ధాంతమును అనుసరించు వారిలో ఒక అగ్ర స్థానము ఉన్నది. ఈమెకు సంగీతము, నాట్య కళలలో ప్రావీణ్యత ఎక్కువ. జీవితములో ఉన్నట్లుండి దైవభక్తి గలిగి తన శేష జీవితమును దైవ చింతలో గడపినది. ఈమె అవివాహిత. అరబీ మఱియు పారసీక భాషలలో కవిత్వమును రచించినది. ఈమెను మీరాతో పోల్చవచ్చును. ఆంగ్లములో ఈమె కొన్ని కవితల తర్జుమాకు నా తెలుగు సేతను క్రింద మీకు ఇస్తున్నాను.

నరకమున మండు యగ్నికి వెఱచి నిన్ను
కొలుతు నని నీవు సుంతైన తలతు వేని
నరకమున మండు మంటలో త్వరగ నీవు
మాడ నను పంపు మో దేవ వేడు చుంటి

స్వర్గమునగల సౌఖ్యాల సరసులోన
నీద నే నిన్ను పూజింతు నిచ్ఛ తోడ
నంచు నీవు తలతువేని యనఘ నన్ను
స్వర్గమును జేర నీయకు సత్యముగను

ప్రేమ లుప్పొంగ హృదయాన స్వామి యెట్టి
ఫలము కోరక నే నిన్ను దలతు నెపుడు
దివ్య సుందర ప్రభలను దేవ దేవ
చూప కుండకు వేచితి నోప లేను

తార లవి వెల్గ నిదురించె ధరణి యెల్ల
మూయబడె రాజ భవనాలు రేయి వేళ
ప్రేమికులు మాటలాడిరి ప్రేమ మీఱ
నిన్ను జూడ నేకాకిగా నిలిచి యుంటి

నీవు మనుజుడై జనియించి నీవలె నొక
నిర్దయను దేవ ప్రేమించ నేర్చుకొనుము
ప్రేమజీవుల విరహాలు, వెతలు, గాథ
లర్థమగు నీకు, నా ప్రేమ లర్థ మగును

రెండు విధములుగా బ్రేమింతు నే నిన్ను
ఒకటి – ముదము నాకు నొసగుచుండును సదా
రెండు – నీకు తగిన రీతి నొప్పు నదియు
నిన్నె దప్ప నొరుల నే దల్వ నొకటిలో
ఉచిత రీతిగ బ్రేమ నొసగు నప్పుడు నేను
కప్పిన తెరలెల్ల విప్పంగ జూతు నిన్
ఈ రెంటిలో నాకు నే గొప్పయును లేదు
రెంటిలోనను నీవె యుంటివి గొప్పగా

సూఫీ

The way of the Sufi అనే పుస్తకాన్ని పరిచయము చేస్తూ, దాని రచయిత ఇద్రీస్ షా ఇలాగంటాడు:

“The Sufi sages, schools, writers, teachings, humour, mysticism, formulations are all connected with the social and psychological relevance of certain human ideas. Being a man of ‘timelessness’ and ‘placelessness’, the Sufi brings his experience into operation within the culture, the country, the climate in which he is living.”

సూఫీ కవితలలో మదిర అంటే దివ్యానందము, ప్రియుడంటే దైవము, దివ్యత్వం, మధుశాల సూఫీల ఆశ్రమము, సాకీ హితుడు, స్నేహితుడు, మార్గదర్శి అని భావించాలి. అల్ గజలీ (8వ శ.), ఒమర్ ఖయ్యాం (11-12 శ.), అత్తర్, అల్ అరబీ, సాదీ (12వ శ.), రూమీ (13వ శ.), హఫీజ్ (14వ శ.), సర్మద్, దారా షికో (17వ శ.) మున్నగువారు కొందరు ప్రసిద్ధ సూఫీ కవులు, రచయితలు.

రూమి

ఇరువదియవ శతాబ్దములో హృదయానికి హత్తుకొనే విధముగా మధురమైన భావాలతో, మధురమైన పదాలతో, ప్రత్యేకముగా lyrical and mystic poetry వ్రాసిన కవులలో ముగ్గురు నన్ను ఆకర్షించారు. వారు- రబీంద్రనాథ టాగోర్ (Tagore), రేనర్ మరియా రిల్క (Rilke) మఱియు జిబ్రాన్ ఖలీల్ జిబ్రాన్ (Gibran). రిల్క, జిబ్రాన్‌లకు నోబెల్ బహుమతి రానిది చాల శోచనీయము. మహమ్మదీయ కవులలో ఆంగ్లములో తర్జుమా చేయబడిన కవులు ఇద్దరు ప్రసిద్ధులు. వారు జిబ్రాన్ మఱియు జలాలుద్దీన్ రూమి (Rumi). రూమి సూఫీ సిద్ధాంతములకు పెద్ద గురువు. రూమి క్రీ.శ. 1207 – 1273 కాలములో జీవించెను. ఇప్పటి ఆఫ్గనీస్తానములో పుట్టి తుదకు సిరియా దేశములో డమాస్కస్‌లో చాల కాలము నివసించెను. ఆ కాలములో సిరియా రోమనుల ఆధీనములో నుండుట వలన ఇతనికి రూమి అను పేరు వచ్చినది. రూమి ముఖ్యముగా పారసీక భాషలో తన కవితలను రచించెను. ఇతడు వ్రాసిన 26000 ద్విపదలతో నున్న మథ్నావి (మస్నావి) ఇస్లామీయ సాహిత్యములో కొరానుకు తరువాత అత్యున్నత గ్రంథముగా పరిగణించబడుచున్నది. ఇతడు 40000 పైగా దివ్య ప్రేమతో నిండిన కవితలను రచించెను. ఈ సేకరణ ఒక దివాన్ రూపము ధరించినది. ఒక రెండు రూమీ కవితల అనువాదాలను క్రింద చదవండి –

శిల్పముల నేను జెక్కెద శిలల పైన
చిత్రముల బలు గీచెద జింద కళలు
హృది యసంతృప్తితో నిండి చెదరి పోవ
బ్రద్దలుగ జేతు శిలల నీ పదము లందు

వంద చిత్రాల వ్రాసెద సుందరముగ
కలిపెదను వాని నా యాత్మ వెలుగు తోడ
నీదు చిత్రమును గనిన నిముస మందు
నాదు చిత్రాల నగ్నిలో బూది సేతు

నీవు నాతోడ ద్రాగుచు నెయ్యమాడు
హితుడవో, చతురుడగు యహితుడవో, ని-
జాన నేను సృష్టించు నవీన భువన
భవనమును నేల జేతువు భ్రమలు గలుగ

ఆత్మ యిది నాది నీనుండి యవతరించె
నాత్మ యిది మెలిగొనెను నీ యాత్మ తోడ
హృదయ సౌరభా లబ్బె నా హృదికి, గాన
నా హృదయమును బ్రేమింతు మోహనముగ

ప్రతి యొకటి రక్త బిందువు ప్రతి విఘడియ
నీ కరాల మృత్తిక తోడ నెగసి చెప్పె
వెలుగుచుంటి నీ యాశల వేడి వోలె
మధురమగు నీదు ప్రేమకై మాడుచుంటి

జలమయము మృణ్మయము గృహమిలను నాకు
నీవు లేక హృదయ మిట నీల్గె నాకు
రమ్ము నా యిల్లు వేచె నీ రాక కొఱకు
నెలవు నాకేల నో ప్రభూ నీవు లేక

మురళి మేమైన యందలి స్వరము నీవు
పర్వతము మేము మఱి ప్రతిధ్వనియు నీవు
పావులం గడి నడిపించు నీవు మాకు
నొసగు టేమియొ నోటమియో జయమ్మొ
ఎగురు ధ్వజములపైన మృగేంద్రములము
వాని నూపు యదృష్ట పవనము నీవె

నేను క్రైస్తవుడను గాను
నేను యూదుడను గాను
నేను ముసల్మానుడను గాను
నేను హిందువుడను గాను
నేను బౌద్ధుడను గాను
నేను సూఫీ, జెన్ అనుసరించను
నేను ఏ మతమును, పద్ధతిని అనుసరించను
నేను పూర్వపశ్చిమ దేశములవాడిని గాను
నేను భూమినుండి జనించలేదు
నేను సముద్రగర్భములో పుట్టలేదు
నేను ప్రకృతినుండి గాని
ఆకాశమునుండి గాని ఆవిర్భవించలేదు
నా ఉనికి పంచభూతములు గావు
నేను లేను, ఇహములోగాని పరములోగాని లేను
నాకు మూలము ఆదాము ఎవాలు గాని, మరేదిగాని కాదు
నా ఉనికికి ఉనికి లేదు, నా మూలానికి మూలము లేదు
నాకు తనువు లేదు, మనసు లేదు
నేను నా ప్రియతమునికి చెందుతాను
రెండు భువనాలను ఒకటిగా చూసాను
అదొకటే మొదటిది, చివరిది, లోపలిది, బయటిది
ఆ ఊపిరి ఊపిరి పీల్చే మనిషిది

పూవు వేఱు కాదు, ముల్లు వేఱు కాదు
పూలు, ముళ్ళు ప్రేమమూర్తి కెప్పు డొకటె
యా కొరాను నమరు నమర వాక్కు లెల్ల
బ్రాహ్మణుడు వచించు ప్రణవ తుల్య మగును
పొగడి యతని పేరు ప్రోడగా నిలువకు
మతని ముందు మూర్ఖు డతి వివేకు డొకటె
చదివినాను నేను చక్కనైన గీతి
వినిన ప్రియ సఖుండు బిగ్గరగ హసించె
“పద్య మందు నన్ను బంధనమ్ము జేయ
నెంచి వ్రాసినావొ యిట్టి మధుర గీతి?”
“త్రుంచినా వదేల మంచి పద్యమాల?”
“యింత పెద్ద మూర్తి యిమడ జాల దందు,
తెగెను కాన నదియు”, మిగిలె నక్షరాలు!

ఎటుల హృదయమ్ము దెఱచెనో యీ గులాబి
ఎటుల నందమ్ము బ్రసరించె నీ జగాన
వెలుగు మేల్కొల్పె కాబోలు వెన్ను దాకి
వెలిగె నభయమ్ము నిండంగ బిఱికి మనసు

భూత కాలమునకు భువి గట్టి రొక గుడిన్
శోకమతులు వసుధ నేకముగను
ప్రతి దినమ్ము పూజ నతి భక్తి జేతురు
గుండెలోన వెతలు నిండ నందు
సంతసమ్ము నెటుల సాధించ వీలౌను
మతము నిండి యున్న మతుల గాదు

లేదు చిత్రించగా లేరెవ్వ రిలను
నాదు యీ హృదయమ్ము నతని రూపమ్ము

సర్మద్, దారా, జేబున్నీసా

పదిహేడవ శతాబ్దానికి చెందిన మొగలాయీ చక్రవర్తి ఔరంగజేబు సుమారు ఒక అర్ధ శతాబ్దమువరకు భారతదేశాన్ని పరిపాలించాడు. అశోకుని తరువాత భారతదేశపు ఎక్కువ భాగాన్ని పరిపాలించిన చక్రవర్తి ఔరంగజేబు. భువనవిజేతగా తన్ను తానే ఆలంగీరు పాదుషా అని ప్రకటించుకొన్నాడు. తండ్రిని చెరసాలలో ఉంచి, సోదరుడిని చంపి, కూతురిని కూడ చివరి రోజుల్లో బందీగా చేసినాడంటారు. షాజహాన్ చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని పెద్ద కొడుకైన దారా షికోకు అప్పగించాలనుకొన్నాడు. కాని ఔరంగజేబు దారా నిజమైన మహమ్మదీయుడు కాడని ఒక పుకారు లేవదీసి దారాను ఓడించి, బందీగా ఊరేగించి చివరకు చంపి మొగలు సామ్రాజ్యాన్ని స్వాధీనము చేసికొన్నాడు.
పరమతసహనముతో భగవద్గీతను, వేదాలను పారసీకములో అనువదించిన దారా చక్రవర్తి అయి ఉంటే భారతదేశ చరిత్ర ఎలా మారి ఉండేదో అన్నది ఒక గొప్ప ఊహ. ఇక్కడ ఒక విచిత్రమేమంటే, ఔరంగజేబు కూడ సూఫీయే. కానీ అందులోని ఔదార్యము, సహనము అతనిలో లోపించింది. సర్మద్ అనే సూఫీ గురువు నిరంబరుడై ఉన్నాడని దానికి మహమ్మదీయ మతములో అనుమతి లేదనే వాదనను లేవనెత్తి వంచించి న్యాయస్థానములో శిక్షగా మరణదండన విధించి చంపించాడు. ఈ సర్మద్ దారాకు గురువు కూడ.


జేబున్నీసా

ఇక పోతే జేబున్నీసా మక్ఫీ (Jeb-un-Nisa) ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె క్రీస్తు శకము 1639 నుండి 1689 వరకు జీవించినది. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. ఆరు ఏడు ఏళ్ళ వయసులో కొరాన్‌ను కంఠతా పట్టినదట. నాలుగేండ్లలో అరబీ భాష నేర్చినది. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు. ఆమె అవివాహిత. ఆమెను ఔరంగజేబ్ చెఱసాలలో ఉంచినట్లు కూడ కథలు ఉన్నాయి. ఆమె అజ్ఞాతముగా తెర మరుగున ఉండేదట. ఆమెయే తన్ను తాను మక్ఫీ అని పిల్చుకొనేది. మక్ఫీ అంటే ముసుగు వేసికొన్నదని, మరుగున ఉండేది అని అర్థము. ఆమెకు శివాజీలాంటి హిందూ రాజులపై సానుభూతి ఎక్కువ. ఆమె సమాధి లాహోర్ నగరములో ఉన్నది. ఆమె చనిపోయిన తరువాత ఆమె వేలాది గజలులను సేకరించి ఒక దివాన్‌గా ప్రచురించారట. ఆమె కవితలలో సూఫీ సిద్ధాంతములు కనబడుతాయి. సర్మద్, దారా, జేబున్నీసాల కొన్ని కవితలను యిక్కడ మీకు అందిస్తున్నాను. నాకు ప్రత్యేకముగా జేబున్నీసా కవితలు అంటే చాల యిష్టము.

సర్మద్

నన్ను జూడడు కడగంట నగుచు వాడు
యేడ్పు వలన ప్రయోజన మేమి లేదు
ఎడద గుడిలోన గూర్చుండు నెపుడు వాడు
యెఱుగ డేలకొ నా బాధ నేమి సేతు

మందిరమో మసీదొ యివి మాత్రము కావత డుండెడి చోటు భూమిపై
సందియ మేల నాకసము చారు వసుంధర వాని యిల్లుగా
సుందర విశ్వ మెల్ల పరిశుద్ధుని గాథను ప్రేమతో వినున్
వందల జ్ఞాను లందఱును వానినె గొల్తురు ప్రేమతో సదా

సర్మద్!
నమ్మిన వాడైతే తప్పక వస్తాడు అతడు
సాధ్యమైతే తప్పక వస్తాడు అతడు
ఎందుకిలా పిచ్చివాడిలా తిరుగుతున్నావు
నెమ్మదిగా కూర్చో,
దేవుడైతే తప్పక వస్తాడు అతడు

ఇక చాలు నీ స్వప్న మెదుట రావేలకో
యెవరు నీవంచు నే నిటుల వెదకుచునుంటి
నీ కౌగిలింతలే నిత్యమ్ము నా యాశ
కనిపింతు వొక క్షణము కనరావె యింతలో
తెర వెన్క నీ ఛాయ సరికాదు నీ మాయ

వందలుగ స్నేహితులు తొందరగ శత్రువులు
ఒకరితో స్నేహమే యొసగేనుగా శాంతి
ఒకరినే కోరినా నిక వద్దు నా కెవరు
నేనె యతడైతి, యతడయ్యె నే తుదకు

సిరుల గోరినావు ధరపైన నాశతో
అతని జగతి సిరుల నాశించ లేదాయె
రెండు జగము లిపుడు లేదాయె గద నీకు
బాధ మిగిలె నీకు బ్రదుకులో నికపైన

అప్రయోజకుడిని నేను, ఔను నిజము
ఫలము లీయని వృక్షము పఱగ నేను
చివర కెఱిగినా నేనొక చిన్న అణువు
లెక్క జేయక నుండెడు లేశ మగుదు

రంగుల మాయయె ప్రపంచ మంతయు
ఆమని శిశిరము లాశ నిరాశలు
ఏమని దలంచ కెగుడు దిగుడులను
ఆ మది వెతలకు నౌషధమే వెత

దారా

ఒక రహస్యము జెప్పెద నో సఖుండ
యుండ డెచ్చోట నా యీశ్వరుండు దప్ప
పేరు మారిన మాత్రము వేఱు కాదు
నీవు జూచున దెల్ల నా దేవు డొకడె

వెదకుచున్నావు ప్రతి చోట ప్రేమరూపు
వేఱు కాదు నీ వతడును వేఱు కాదు
నీవు జేయు యన్వేషణ నిజముగాను
సింధువందున వెదకెడు బిందు వేమొ

లేరు ముల్లాలు దివిలోన లేరు నిజము
వారి గొడవలు వినరావు స్వర్గమందు
ఉండనీ వినబడకుండ నుర్విపైన
వారి ఫత్వాలు చర్చలు వద్దు మాకు
ఉండడే జ్ఞాని ముల్లాయు నుండు యూర

జేబున్నీసా

నను జూడగ గులాబి నన జేరి పాడు యా
వనములో కోకిల స్వనము మఱచు
నను జూడ జందెమ్ములను దాల్చు బ్రాహ్మణుం
డును దాను మఱచునే తనదు దేవు
నను జూడవలె నన్న నా పద్యములయందు
తనరారు మాటలన్ గనగ వలెను
ననలోని తావియో యన యెప్డు దాగి యుం
దును నాదు పదముల వెనుక నేను

నే ముసల్మానుడను గాను నిజముగాను,
విగ్రహారాధకుడ నౌదు, విమల భక్తి
నాలయమ్మున బూజింతు నమిత దీక్ష,
బ్రేమమూర్తికి ప్రణమిల్లి ప్రీతి మీఱ

నేను బ్రాహ్మణుడ గాను నిజముగాను
జందెమును తీసివేసితి జంకు లేక,
నామె కురులను కొన్నిటి బ్రేమ తోడ
కంఠమున ధరించితిని హృత్కమల మలర

లెమ్ము హృదయమా యామని లెస్స వచ్చె
కొమ్మ కొమ్మయు కుసుమించె గ్రొత్త తావి
యీ వసంతపు మాయలో నెలమి దెచ్చు
సఖుడు మధువును గొల్చుచు జాల భక్తి

చూడకుండకు హృదయమా నేడు కనుల
నీ నిషిద్ధ పథమ్మును, నిర్ఘృణాంశ
నీకు బలియైన వారిని నిక్కి చూడు
చూపు నీదొక్కటియు చాలు సోలి రాల

కొందఱా మసీదున నిన్ను గొలుతు రెపుడు
కొందఱా మందిరమ్మున గొలుతు రెపుడు
ప్రేమమూర్తికి హృదయాన బీట వేయు
నీ ముదమ్మును నిభృతా గణించ దరమె

మోదపు మధువున బోయెను రుచియు
ఈ ధర మారిన దిప్పు డెడారి
పచ్చిక పెఱుగని బంజ రిదయ్యె
ఎచ్చట యామని యిక నీ బ్రదుకున

కనబడ దెక్కడ కమ్మని ముదము
కనబడ రెక్కడ కలువగ సఖులు
అధిపతి కరుణయు నగపడకున్న
వృథయయె బ్రార్థన తృణమున కన్న

వాసిగ చూడవె వదలక నిభృత
ఆశయు నుండు నిరాశల లోన
తత్తర ప్రేమపథమ్మున నడువ
క్రొత్తగ తోచును కోరిక శక్తి

గజల్

గజల్ ప్రక్రియను సుమారు 10వ శతాబ్దమునుండి మహమ్మదీయ కవులు విరివిగా వాడారు. రూమీ, హఫీజ్, ఫుజూలి మున్నగువారు గజల్ వ్రాసిన సుప్రసిద్ధ కవులు. ఉర్దూ భాషలో మీర్జాగాలిబ్ (1797-1869) గజలుకు మారు పేరు అని చెప్పవచ్చును. ఛందస్సు పరముగా ఈ గజళ్ళు ద్విపదల (షేర్ల) కూర్పు, అంత్యప్రాస అవసరము. మొదటి ద్విపదను మత్లా అంటారు. ఇందులో రెండుపాదాల్లోని చివరి పదాలకూ ప్రాస (రదీఫ్) ఉండాలి. అలాగే తరువాతి ప్రతి ద్విపదలోని చివరి చరణములోని చివరిపదానికి మొదటి చరణములోని చివరి పదముతో ప్రాస (రదిఫ్) చెల్లాలి. కొన్ని సమయాలలో దానికి ముందటి పదముతో కూడ ప్రాస నియతముగా ఉంటుంది. ఒక గజలులో ఐదునుండి పదిహేనువరకు ద్విపదలు ఉంటాయి. ప్రతి ద్విపద తనంతట తానే స్వతంత్రముగా మిగిలిన చరణాలతో సంబంధము లేక నిలబడాలి (దీనిని ముక్తకము అని కూడ అంటారు). చివరి ద్విపదలో రచయిత ముద్ర (తఖల్లూస్ – కలం పేరు, కవినామం) ఉండాలి, దీనినే మక్తా అంటారు. క్రింద మీర్జాగాలిబ్, మీనాకుమారి గజళ్ళను (ఇంచుమించు అదే మెట్టులో) చదివి పాడుకోడానికి ప్రయత్నించండి. తెలుగు సాహిత్యములో యక్షగానాలలో ఒక రెండు చోటులలో గజళ్ళను ఉపయోగించారని జోగారావు తెలిపారు. తెలుగులో నారాయణరెడ్డి ఈ ప్రక్రియను చక్కగా వాడారు. ఛందస్సు పరముగా తెలుగులో చతుర్మాత్రలు గజళ్ళకు బాగుంటాయి. బుల్లా షా కవితకు నా అనువాదములో దీనిని గమనించవచ్చును.

మీర్జాగాలిబ్ (యే న థీ హమారీ కిస్మత్)

యే న థీ హమారి కిస్మత్ – మీర్జా గాలిబ్

కనలేక పోతి ప్రియ నే నది నాదు విధియె గాదా
మనియున్న నింక నదియే మది గోరు కోర్కె గాదా

నిను నమ్ము జీవితము నా కది యౌను కల్ల గాదా
చనిపోదు సంతసముతో నది నిక్కమవగ రాదా

మది నీది చంచలముగా యిక మాట నమ్మనౌనా
యది మీఱ నౌనె స్థిరమై మది యుండ నిల్చు గాదా

అడిగేరు ఎందుకని యా శర మెక్కు పెట్ట వంచు
వడి నన్ను దాక నాకీ వ్యధ లేకనుండు గాదా

ఇది యేమి స్నేహ మయెనో సలహాల నిచ్చు వారే
వ్యధ దీర్చు వారు యెవరో దయ జూప రైరి గాదా

ప్రతి నరమునుండి పడెగా సతతమ్ము రక్త మతిగా
వెత యంచు దల్చ నదియే ఒక దీప మగును గాదా

వెత నింపె ప్రేమ మదిలో మది ముక్తి నీయ దౌరా
వెత నీయ కున్న వలపుల్ వెత నిచ్చె బ్రదుకు గాదా

ఇది సంధ్యవేళ వెతలన్ ఎవరైన గలరొ వినగా
అది యొక్కమారు రాగా మరణమ్ము చింత గాదే

అవమాన మరణ మున కా నది మునిగి చావు బాగౌ
శవ ఖనన మవదు స్మృతికై యొక గుర్తు లేదు కాదా

కననౌనె వాని నిజమై యసమానమూర్తి యతనిన్
ద్వయితంపు తావి నిజమై పరిచయము నిచ్చు గాదా

అతి తత్త్వ పూర్ణ మగు నీ సవి మాట లెల్ల గాలిబ్
మతి నిచ్చు జ్ఞాని దగునో, అరె త్రాగినావు గాదా

మీనాకుమారి (మెహజాబీన్ బాను) (చాంద్ తన్హా )

చాంద్ తన్హా – మీనాకుమారి

చంద్రుడో యొంటరి గగన మొంటరిగా
మానస మ్మాయెగా నిట నొంటరిగా

ఇంకెగా నాశ గ్రుంకెగా తార
మంచు వణికేనె యిట నొంటరిగా

జీవితమ్మది యిదంచు బిలిచేరో
దేహమో ఒంటరి జీవ మొంటరిగా

దారిలో నొకని నే గాంచినచో
వేరు దారుల వెళ్ళెద మొంటరిగా

వెలిగి యారేను కాంతిదీపికలే
మిగిలె నొక గృహ మ్మిక్క డొంటరిగా

పథము వెదకుచుందు యుగయుగాలు
వీడిపోయెద నీ భూమి నొంటరిగా

జిబ్రాన్

నాకు ఖలీల్ జిబ్రాన్ అంటే కూడ చాల ఇష్టము. అతని రెండు కవితలకు నా అనువాదాన్ని క్రింద జతపరుస్తున్నాను.

సృష్టి మొదటినుండి పృథివిపై నున్నాను
అంతమువఱ కుందు నవనిపైన
అంతమదియు లేదె యని దోచె నాకు నీ
వ్యధల నిండియున్న బ్రదుకునందు

యానమ్ము చేసినా నా నీల గగనాన
తూలినా తేలినా త్రుళ్ళి త్రుళ్ళి
ఆదర్శ భువనమ్ము కాదు నేడీ భూమి
బందీగ చెఱలోన బ్రదుకుచుంటి

కన్ఫ్యూషియసు వాక్కు కర్ణమ్ములను వింటి
బ్రహ్మ దెల్పిన వేద వాణి వింటి
సిద్ధార్థు జెంత నే బౌద్ధ సారము వింటి
నేడు మూఢునిగాను నిలిచియుంటి

మోసెస్ జెహోవాను పులకించి జూడగా
సైనాయిపై నుంటి నేను నిజము
అద్భుత చర్యల నా యేసు జేయగా
జోర్డను తీరాన జూచినాను
మహమదు దర్శించు మంచి సమయములో
నే మదీనాపురి నిలిచియుంటి
కాని నిజమ్ముగా నీ నాడు భువిపైన
సమ్మోహితుండనై దిమ్మపడితి

కనులార బాబిలాన్ ఘనశక్తి నే గంటి
ఈజిప్టు ఉచ్ఛత నెల్ల గంటి
రోమన్ల రణరంగ సామర్థ్యమును గంటి
కాని దెచ్చె నవియు కనుల నీరు

మంత్రవాదులతోడ మాట లాడితి చాల
ఐనుదూరు, మొరాకొ యందు నేను
అసిరియాలో నుండు యా తత్త్వవేత్తల
గూడి చర్చించితి గోరి నేను
పలు దేవదూతలు వఱలు పాలెస్తీను
లో నేను సత్యపు లోతు గంటి
నేడు నే నింకను వీడకుండక సత్య
శోధన గావించుంటి గాదె

ఆర్జించితిని జ్ఞాన మా భారతములోన
నరబు ప్రాచీనత నరయ గంటి
వినదగునది వింటి గనదగునది గంటి
నంధుడ బధిరుడ నైతి నిపుడు

అతి నిరంకుశులచే నణచబడితి నేను
బానిస నైతిని బరుల క్రింద
అలమటించితి గడు ఆకలితో నేను
సతమతమైతిని వెతలతోడ
ఇంకను నాలోన గ్రుంకక యున్నది
ఒక శక్తి గాంచ సూర్యోదయమ్ము

మతి నిండినను నాదు మనసు నిండకయుండె
తనువు ప్రాతది కాని మనసు లేత
ఈ లేత యువతలో హృదయమ్ము పెఱుగుగా
కోరుచు ముదిమికై కొలుతు నతని
మఱల నా ప్రభువును మనసార జేరగా
మనసు నిండును నాదు మనికి నిండు

సృష్టి మొదటినుండి పృథివిపై నున్నాను
అంతమువఱ కుందు నవనిపైన
అంతమదియు లేదె యని దోచె నాకు నీ
వ్యధల నిండియున్న బ్రదుకునందు

– జిబ్రాన్ (I was here from the moment of the Beginning – Song of Man)

నీకు పుట్టిన పాపలు నీవి కావు
జీవితపు వాంఛలకు నవజీవ మివ్వ
జనన మొందిన వారలా తనయు లవని
నీవు ద్వారము వారి యా జీవములకు
కాని నీనుండి జన్మించ రా నిసుగులు
ఇత్తువా ప్రేమ యోచన లివ్వ లేవు
వారి భావము లెప్పుడు వారి వగును
తనువులకు చోటిత్తు వాత్మలకు గావు
వారి యాత్మలు వసియించు భవిత గుడిని
కలలలోకూడ కనరాదు కనుల కదియు
వారివలె నీవు జీవించవలెను గాని
వారు నీప్రతిబింబమ్ము కారు గాదె
ముందు సాగును జీవిత మెందు జూడ
వెనుక వెళ్ళదు నిన్నతో జనదు కలయ
నీవు విల్లైన పాపలు జీవముగల
యమ్ము లౌదురు సాగ వేగమ్ముతోడ
గురి యనంతమ్ము విలుకాడు సరిగ నెంచి
విల్లు వంచును శక్తితో వేగముగను
బాణములు చేరును సుదూర పథపు గురిని
వంగినను నీవు బాగుగా బాణ మదియు
సాగుచుండును బహు దూర మాగకుండ
అతడు కోరును మించుల యమ్ము నొకటి
అతడు కోరును స్థిర ధనుర్లతను కూడ

– జిబ్రాన్ (Your children are not your children)

మరి కొన్ని యితర కవుల అనువాదాలను క్రింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.


నీతో బంధము నిర్ఘృణ సంతస మొసగక నుండును గాదా
ఈ నయనమ్ములు సంతత మశ్రువు రాల్చుచు నుండును గాదా

నీ విరహ మ్మది మా హృదయమ్ముల చీల్చుచు నుండును గాదా
నిర్దయ హృదయుడు వీడుచు బోవును కటికుడు వాడే గాదా

ఒక కణమైనను కరుణయు లేదే నిను నమ్మగ మాకౌనా
పక్షుల వలె మము వేటాడుచు తను చూడక పోవును గాదా

మఱిమఱి వచ్చెద నను యా బాసలు వ్యర్థ మ్మాయెను గాదా
ఎందుకు వానిని వలచితినో ఆ మూర్ఖత నాదే గాదా

ఈ వ్యాపారములో నే నెందుకు దిగితినొ బదులుగ నాకో
దొరకెను వ్యసనపు విసములు వంతల బరువున గ్రుంగితి గాదా

– బుల్లా షా

శ్రవణము, దృష్టియున్, రుచియు, స్పర్శయు నెల్ల నిజాన నాతడే,
భువి నిట నేను లేను, నలు మూలల నుండున దెల్ల నాతడే,
యవనిని నాదు యున్కి యొక యద్భుత సుందర స్వప్నమౌ గదా,
చివరకు స్వప్న భంగ మవ శేషపు జీవన మందు నాతడే!

– బాబా అఫ్జల్

నే నెఱుంగుదు
జేరంగ లేననుచును
నీ గృహమ్ము
నీ జన్మలో

నే నెఱుంగుదు
జేరంగ నా నెలవును
నీ కవదని
యీ జన్మలో

నే నెఱుంగుదు
నీ వందు

నీ నెఱుంగుదు
నే నిందు

– ఆయిన్ అల్ ఖోజాత్ హమదాని (1098 – 1131)

అవని కొక యద్ద మగు గాదె యణువు లన్ని
వేయి సూర్యు లణువులోన వెలుగుచుండు
వాన చినుకుల భేదించ గాన నగును
వంద వార్ధుల యలల ప్రవాహములను
సైకతపు చిన్న కణికలో సంభవించు
వేయి జీవాల సృష్టియు రేయి బవలు
సామజముకన్న పెద్దది చీమ పదము
రాలు జల బిందు వది పారు నైలు నదియె
వంద వరికోత లొక గింజ డెంద మగును
విశ్వ మొక రాగి గింజలో వెదుక దొఱకు
నీగ ఱెక్కలో నాశ్చర్య రాగ జలధి
కంటి పాపలో మిన్నేటి కాల్వ లూరు
నొక పిడికిలి హృదయమున సకల భువన
చక్రవర్తి వసించును సంతసాన

– మహమ్మద్ షబస్తరీ (1250 – 1320)

ఆ దినము పొంగి లేచేను నాదు మదియు
కోరె కలము కాగితమును కులికి వ్రాయ
చూడ స్వర్గ నరకముల చోద్యములను
తుదకు పలికేను ప్రభువు తా మృదువుగాను
కలము కాగితము నీలోనె గలవు నిజము
స్వర్గ నరకాలు నీలోనె గలవు నిజము

– ఒమర్ ఖయ్యాం

ఎవరు నేను? ప్రేమ హృదయు డతడె నేను
ఎవ్వ రతడు? నా ప్రియేశ్వరుండె యతడు
ఆత్మ లవియు రెండు, ఔర, దేహ మొకటె
చూడ నన్ను నీవు, చూతు వతని గూడ
చూడ నతని నీవు, చూతు వెపుడు మమ్ము!

– అల్-హల్లాజ్

ఉదయకాలము, పాడె పక్షులు ముదముతో విను మో సఖా
నిదుర లెమ్ముర పానపాత్రయు నిందవేసెను మనలపై
సుధను బోలిన మదిర మధురము ముదము పుట్టును త్రాగగా
కదలకుండనివాడు యాడును ముదపు టలలో మురియగా

– అబూ నువాస్

దివినుండి భువిజేరు దివ్యమౌ కానుక
లివి గులాబులు మోద మిచ్చు విరులు
నవముగా పాటల నందనమందు మా-
నవు లెల్ల వికసింతు రవనిపైన

ఈ గులాబుల రాశి నెంత కమ్ముచు నుంటి
వో గరీబు బెహారి యూరిలోన
ఈ గులాబుల కన్న యేమి దొఱకును మిన్న
యో గరీబు బెహారి యుర్విపైన

– కిసాయీ మెర్వ్

ప్రేమికులకు నడుమ పెక్కు రహస్యముల్
వారు జెప్ప రన్ని పరుల కెపుడు
అక్కడిక్క డున్న యా మచ్చలను దాము
గణన జేయుచుంద్రు ప్రణయవేళ
చెప్ప రా రహస్య మెప్పుడు నొరులకు
దాచియుంతు రెదల దప్పకుండ
మాది దానికంటె మంచి రహస్యమ్ము
అది యొడంబడికగ నమరు నెపుడు
నగవు చిమ్ముచుండు నావాని మచ్చల
నే గణించ నెపుడు నిజము నిజము

నేను, నా దేవుడు
మేమిద్దరం రెండు గున్న యేనుగులం
మా నావ చాల చిన్నది
తరచుగా ఒకరినొకరు రాసుకొంటూ ఉంటాం
తరువాత
పక్కలు చెక్కలయ్యేటట్లు
నవ్వుతాం, నవ్వుతూ ఉంటాం

– హఫీజ్

బానిస జగతి యబద్ధమున కయె
మనుజుల విడదీసి మనువా రహితులు
ద్వేషము లేకున్న దివియౌను భూమి
యేసు ముహమ్మదు లిర్వుర గొలువ

– అబూ అల్‌మారి

నిను నే ముఖాముఖి గనినచో నా బాధ
మెలమెల్ల తగ్గి శమించు గాదె
తగ్గు నీ పోటులు తగ్గు నీ గాటులు
తగ్గు నీ బాధలు తగ్గు వెతలు

నిను నే ముఖాముఖి గనినచో జీవిత
వస్త్రమున్ గుట్టుదు వదలకుండ
ప్రతియొక్క దారమున్ ప్రతియొక్క కుట్టు నే
నతి జాగరూకతన్ నమరజేతు

మొన్న నే వెదకినా నిన్న నే వెదకినా
మనసులో ప్రతి పుటన్ మానకుండ
ప్రతి పుటలో నీవె ప్రతి పంక్తిలో నీవె
ప్రతి పదములో నీవె ప్రాణ మీవె

– తహిరి

ఆహార మగు దుఃఖ మశ్రువులె పానమ్ము
ఆహా విచిత్రమ్ము లగు మనికి నిత్యమ్ము
అనుభవమ్ముల జెప్పు టది తెలియకున్నాము
చిన చిత్ర మీ బ్రదుకు జీవించియున్నాము

– దర్ద్

అందరూ అడుగుతూ ఉంటారు
ఓ కవీ ప్రేమంటే యేమని
ఎవరు చెప్పగలరు
కొందరు అది సురసరోవర మంటారు
మరికొందరు దేవుడే ప్రేమ అంటారు
కాని ప్రేమంటే బహు పరాక్!
అది అంతులేని వ్యధ కలిగిస్తుంది
దుఃఖము, బాధ, భయము, చిత్రహింస
ప్రేమకు యెన్ని పేరులో?

హృదయము, డెంద మంచు జను లెప్పుడు పల్కెద రెల్ల వేళలన్
హృదయ మనంగ నేమి యది యెంతయు చిత్ర విచిత్ర వస్తువో
హృదయపు క్షోభ యాకసపు టెల్లకు లేచు బృహత్తరంగమో
హృదయపు రక్తబిందు వది యెట్టుల దాచె పయోధి నొక్కటిన్

అక్కడ మసీదులో మతప్రచారపు ఘోషలు
అక్కడ మధుశాలలో మదిర తెమ్మని గోలలు
ఎక్కడ నీరవశాంతి లభిస్తుందని నా అన్వేషణ
చివరకు
ఇక్కడ ఈ గోరీలమధ్య నాకా ప్రశాంతి దొరికింది

– మీర్ తాఖీ మీర్

చివరి ఘడియలలోన దర్శించినాను
చూచుటకు నిన్ను బాగుగా నోచనైతి
భూమిపై నాయు వదియు కాబోలు కొంత
చిందలేనైతి నే నశ్రు బిందువులను

– జఫర్

నీరైతి నని దల్చ నేనెండమావి గద
నీరనిధి యని దల్చ నేనొక్క బుద్బుదము
నే జ్ఞాని యని దల్చ నే మతిభ్రంశుడను
జాగృతుం డని దల్చ జారితిని నిదురలో

– బినవి బదక్షాని

మత్తెక్కించిన ప్రేమ మదిర
మౌనాన్ని వాంఛిస్తుంది
అందరూ కోరేది ప్రేమే గదా
వాళ్ళు చెవుల్లో గుసగుసలాడుకొనేది ప్రేమే
వాళ్ళ్ళ అంతరాంతరాలలో మెదిలేది ప్రేమే
ఆత్మ ప్రేమికునిలో కలిసిపోయిన తరువాత
ప్రేమలో నువ్వు నేను అనే భేదాలు ఉండవు
నేను ప్రేమ చుట్టూ ఉన్న తెర తీస్తాను
నా అంతరాంతరాలలో ఉండే
స్నేహితుడు ఎవరనుకొన్నావు – ప్రేమే
ఇహపరాల రహస్యాని తెలిసిన వాడికి
ఆ రెండింటి రహస్యాలు కూడ తెలుసు
అది ప్రేమే

– ఫరీద్ ఉద్దీన్ అత్తార్

అది నాకు తెలుసు నీ యి-
ల్లది నాకు తెలుసు
అది నాకు తెలుసు నీ యి-
ల్లది చేరలేను
అది నాకు తెలుసు నా యి-
ల్లది చూడ రావు
అది నాకు తెలుసు
అది నాకు తెలుసు

– అల్ కోజా హందానీ

ప్రేమకు నిబంధనలు లేవు
ప్రేమకు కారణాలు లేవు
ప్రేమకు మర్యాదలు లేవు
మనసు ప్రేమ అనే
బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తుంటే
తిథులను వారాలను
ఎవరైనా లెక్కపెట్టుతారా

– కబీర్

నేను వ్రాసిన ఒక గజలుతో యీ సంకలాన్ని ముగిస్తాను –

వలపులు మృత మవ చంచల మతిలో వంతలు స్థిరము గదా
శలభము నైతిని తలపుల చితిలో చావొక వరము గదా – (1)

మాటల నాడవు కారణ మేమో మౌనము శరము గదా
ఆటలు నీ కట పాటులతో నా కలతయు వరము గదా – (2)

పలుకులు విన నే వేచితి నా కా స్వరమే చిరము గదా
కలలో గంటిని నొక నిశి ని న్నా కలయే వరము గదా – (3)

నీ వుండని యా చెలువపు టామని నేడు శిశిరము గదా
రావేలా సంతసమున రమణా రాకయు వరము గదా – (4)

పున్నమి రాత్రులు వెన్నెల వెలుగులు భువి దుర్భరము గదా
నిన్నటి స్మృతులను నెమరుచు నిలిచితి నిజ మవి వరము గదా – (5)

కలకల పాటలు కిలకిల నవ్వులు కడు సంబరము గదా
తళతళ లాడెడు తమ్మి మొగ మ్మీ తరుణము వరము గదా – (6)

ఈ విరహములో నిటుల తపించుట హృదయపు జ్వరము గదా
జీవిత మగు నొక పూవుల పాన్పుగ జేరిన వరము గదా – (7)

సాకీ పోయుమ చల్లని మధువును చవి సుందరము గదా
నాకద్వారము నాకై తెఱచెడు నవమందిరము గదా – (8)

హననము చాలుర మోహన రూప మ్మత్యవసరము గదా
ననవలె బూయును నిను గన మది నీ నాదమె వరము గదా – (9)


గ్రంథసూచి

  1. ఉమర్ ఆలీ షా – సూఫీ వేదాంతదర్శనము – ఉమర్ ఆలీ షా గ్రంథ మండలి, పిఠాపురం, 1977.
  2. దాశరథి – గాలిబ్ గీతాలు – ఎమెస్కో, మచిలీపట్నం, 1961.
  3. చిక్కాల కృష్ణారావు – మహార్ణవం – The voice of the masters పుస్తకానికి స్వేచ్ఛానువాదము – అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్, విజయవాడ, 1994.
  4. ఆదిభట్ల నారాయణదాసు – Rubaiyat of Omar Khayyam – British India Press, Bombay, 1932.
  5. సి. నారాయణ రెడ్డి – తెలుగు గజళ్ళు, చేతన, గుంటూరు, 1986.
  6. A J Arberry – Persian Poems – An anthology of verse translations – Dent, London, 1969.
  7. Bankey Behari – Sufis, mystics and yogis of India – Bharatiya Vidya Bhavan, Bombay, 1991.
  8. Anthony Ferris – A second treasury of Kahlil Gibran – Citadel, New York, 1962.
  9. K C Kanda – Masterpieces of Urdu rubaiyat – Sterling paperbacks, Newe Delhi, 2005.
  10. Daniel Ladinsky – The gift – Poems by Hafiz, the great Sufi master – Penguin, Arkana, 1999.
  11. Magan Lal and Jessie Westbrook – The Diwan of Zeb-un-Nissa – John Murray, London, 1913.
  12. David Matthews – An anthology of Urdu verse in English – Oxford University press, Delhi, 1997.
  13. Reynold Nicholson – The mystics of Islam – Routledge and Kegan Paul, London, 1970.
  14. Reynold Nicholson – Translations of Eastern poetry and prose – Curzon press, London, 1987.
  15. Idries Shah – The way of the Sufi, E P Dutton, New York, 1966.
  16. Andrew Dib Sherfan – A third treasury of Kahlil Gibran – Citadel, 1975.
  17. Najib Ullah – Islamic literaure – An introductory history with selections, Washington square press, New York, 1963.
  18. Peter Wilson and Nasrollah Pourjavady – The Drunken Universe – Phanes press, Grand Rapids, 1987.
  19. Martin Wolf – A treasury of Kahlil Gibran – Citadel, New York, 1951.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...