జమ్మిబంగారం చెట్టు

గడియారం ముల్లుపట్టి తిప్పినట్టు
కాలాన్ని ముందుకో వెనక్కో తిప్పలేం
నడుస్తూ నడుస్తూ
అనుభవాలను ఆయుధాలుగా
జమ్మిచెట్టుపై దాచి తిరగాలి
అరణ్యవాసమైనా
అజ్ఞాతవాసమైనా
జనవాసమైనా

రావణుడి ప్రాణం
నాభిలో దాగున్నట్టు
సంసోను బలమంతా
తలవెంట్రుకల్లో దాగున్నట్టు
దాచుకునే రహస్యంగా పదిలపర్చుకోవాలి
జమ్మిచెట్టయిపోయి బ్రతకగలగాలి

నిర్వీర్యం చేయడానికి
విభీషణుడో, దెలీలాయో
పథకాన్ని రచిస్తుంటారు
భూమిలో దిగబడుతున్న
కర్ణుడి రథచక్రంలా
నడుస్తున్న కాళ్ళు దిగబడిపోతుంటాయి

అంబులపొదిలో అస్త్రాలేవీ
అక్కరకురానట్టే
సమస్యలు బాణాలై సంధిస్తాయి

జయించామా! ఓడిపోయామా!
బతికున్నపుడు అదే
అసలు ప్రశ్న ఔతుంది
ఒంటరిగా ఎవరి జమ్మిచెట్టుకోసం వాళ్ళు
ఆత్రపడుతుంటారు

నడిచే కాళ్ళకు అడుగులు భారం కాదు
వేగం మార్పు అంతే! నల్గురితో కల్సి నడవటం
అంతిమ యాత్రగా
మోసుకెళ్ళే నల్గురివెనుక
రాల్తున్న జమ్మిని
బంగారంగా ఏరుకుంటున్నవాళ్ళంతా
ఒక్కో జమ్మిచెట్టౌతారు.