భోగి తలంట్లు

సంక్రాంతి పండగ సంబరం పరాకాష్టనందుకోడం భోగి రోజుతో మొదలయ్యేది మాకు.

భోగి అంటే తెల్లారగట్ల చలిలో వెలిగించుకునే భోగిమంటలు, సాయంకాలాలు భోగిపళ్ళ పేరంటాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా కదూ! కాని నాకు మాత్రం భోగి అంటే ముందు పండగ తలంట్లు గుర్తొస్తాయి. మా ఇంట్లో భోగి నాటి తలంట్ల హడావిడి అంతా ఇంతా కాదన్నట్టుండి అంత సంబరంగా వుండేది!

మా ఇల్లు విశాలమైన ప్రాంగణంలో ఒక కొసకల్లా వుండేది. ఇంటి ముందూ, వెనకా అంతా ఎటు చూసినా పచ్చదనమే. ఇల్లంతా ఒక ఎత్తయితే వంటింటి కానుకుని ఒక పెద్ద పెరటి గది మరో ఎత్తు. దానికి పై కప్పు వుండేది కాదు. చుట్టూ నాలుగు వైపులా గోడలతో కట్టుదిట్టంగా వుండేది. పెరటి తోటలో కెళ్ళేందుకు ఓ చెక్క తలుపుండేది. దీనికానుకుని, మరో స్నానాల గదున్నా, పండగలకీ పబ్బాలకీ ఇదే మంగళ స్నానాల గది. మా ఇంటికి సూర్యుడొచ్చినా చంద్రుడొచ్చినా ఇక్కడ దిగాల్సిందే. గచ్చు చేసిన నేలకి కుడిచేతి మూలగా ఇటుకరాళ్ళేసి కట్టిన రెండు కట్టె పొయ్యిలుండేవి. రెండిటి మీదా జత కాగులు, పొట్ట పైనంతా ఎర్రగానూ మిగతాదంతా నల్లగానూ, వాటిల్లో నీళ్ళు మరుగుతుండేవి.

ఆ రోజు తలంట్లు అంటే పనిమంతురాలైన అమ్మకి సైతం ఖంగారుగా వుడేది. ఎప్పటికి తెముల్తుందిరా ఈ తలంట్ల పని అని! ఎందుకంటే, విడతల వారీగా సాగేది మరి ఆ తలంట్ల తంతు.ముందు మా నాన్న గారి తలంటు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ తర్వాత అన్నలు. ఆ తర్వాత నేను. చివరాఖర్లో అమ్మ. ఒక్కో విడతకీ ఆవిడ తీసుకునే సమయం కనీసం ఒక గంట!

అది కాదు ఆవిడ తొందర. ఆ తర్వాత నా చేత బొమ్మలు పెట్టించాలి, వాటికి నైవేద్యం చూపించాలి, నిన్న పిలవగా మిగిలిపోయిన ఇళ్ళకి పేరంటపు పిలుపుల కెళ్ళాలి. ఇన్ని పన్లు అంటే ఏ ఇల్లాలికైనా ఉరుకులు పరుగులు గానే వుంటుంది.

పొద్దునెప్పుడంటించిన పొయ్యో… అలా కాగుతూనే వుండేవి కాగుల్లో నీళ్ళు.

ముందు తలంటి ఎప్పుడూ మా నాన్నగారితో మొదలు. ఆయన ఆఫీస్ కెళ్ళిపోతే ఒక పెద్ద పని ఐపోయినట్టే అమ్మకి, మాకునూ. సంగీతం రాదు గానీ, శంకర శాస్త్రిగారంత గంభీరంగా వుండే వారాయన. మేం ముగ్గురం ఒక చోట గుంపుగా కూర్చుని గుసగుసలు పోతున్నప్పుడు హఠాత్తుగా అక్కడకొచ్చి నిలబడ్డ ఆయన్ని చూస్తే మా ప్రాణాలు వొణికి పోయేవి. ఒక్క మాటైనా అనేవారు కాదు. ఒక్క తిట్టు తిట్టిన గుర్తూ లేదు. చేతులు వెనక్కి పెట్టుకుని అలా మా వైపు ఓ చూపు విసిరారంటే దానర్థం ఒకటే! మాకది బాగా తెలుసు. వెంఠనే లేచి, వొంగి మరీ నడుచుకుంటూ పోయి, ఎవరి స్థానాల్లో వాళ్ళం పుస్తకాలు పట్టుకుని కూర్చునే వాళ్ళం. మారు మాట్లాడే పనే లేదు. ఆయన చెప్పే పద్ధతంతే. కళ్ళతో చెప్తారు. మేము పాటించి తీరాల్సిందే. అది శెలవు రోజు కానీ, పండగ రోజు కానీ, ఆయన ఆఫీస్ కెళ్ళేంత వరకూ అలా గొణగొణా చదువుతూండే వాళ్ళం – మధ్యమధ్యలో ఒకరి వంకొకరం చూసుకుంటూ అకారణంగా నవ్వు కుంటూ, సైగలు చేసుకుంటూ.

“వస్తున్నారా…” అమ్మ వినయంగా పిలిచేది తలంటుకని.

“ఊఁ”

ఆయన తలంటి కోసం అమ్మ అప్పటికే అన్నీ సిధ్ధం చేసేసేది. ఆయన కూర్చోడానికో పెద్ద కుర్చీ పీట.కాళ్ళు జాపుకోడానికి వీలుగా కాళ్ళ కిందొక పీట. సట్లు పడ్డ వెండి గిన్నెలో ఘమఘమల నువ్వుల నూనె, ఒక వెడల్పాటి గిన్నెలో సున్ని పిండి, సోప్ బాక్స్, పైన వాసం మీద వుతికిన టవల్. ఆయన చేతికి అందేలా పాళాలు చేసిన వేడి నీళ్ళ పెద్ద బకెట్ – ఇదీ అక్కడి సరంజామా. ఆయనకి కుంకుడి పిప్పి అంటే చాలా చికాకు. అందుకని, అమ్మ ఉపాయంగా చిక్కటి రసం తీసి చిన్న కూజా బిందెలో పోసి వుంచేది. ఆయన కూర్చోగానే ఆయన తల మీద నూనె అద్దేది. ఆ తర్వాత ఎకరమంత వీపు పని ఆవిడ చూసుకునేది. ఈయన తీరిగ్గా వొంటికి నూనె రాసుకుంటూ ముందుకు వొంగి పాదాలు రుద్దుకుంటూండే వారు. భర్తని అలా ఆవిడ మహారాజులా చూసుకొనేది మరి.

ఆవిడ మాటలతో బాటు మధ్యమధ్యలో ఆయన ‘ఊ’ కొట్టడాలు అన్నీ వింటూ వుండే వాళ్ళం. ఏదో, ఆయన మాట తీసేయలేక, గౌరవం కొద్దీ పుస్తకాలు పట్టుకున్నామే కానీ, అసలా సమయంలో చదువుకోడం నిషిద్ధమని మా అందరి గట్టి అభిప్రాయం. ఈ తలంట్లు కార్యక్రమం తర్వాత ఏం చేయాలా అని ఎవరాలోచన్లలో వాళ్ళం పడి కొట్టుకు పోతూండే వాళ్ళం. వెనక గదిలో పట్టు పంచె దులుపుతున్న శబ్దానికి ఉలిక్కి పడి ఈ లోకంలోకొచ్చేసే వాళ్ళం.

ఆయన తలంటి కాగానే పట్టుబట్ట కట్టుకునేవారు. ఆయన అదో తరహాలో చాతీ నుంచి లుంగీలా చుట్టుకుని, పెద్ద రాగిచెంబు నీళ్ళతో తులసి కోట వైపు అడుగులేస్తూ కనిపించేవారు. తెల్లని తడారని ఆ పెద్ద పెద్ద పాదాలు ఎంత పవిత్రంగా తోచేవో. అప్పట్లో తెలీక అలా చూస్తూ వుండి పోయే దాన్ని కాని, ఇప్పుడెదురైతే వొంగి, కళ్ళకి అద్దుకునే దాన్ని కాదూ! మరో పావు గంటలో ఆయన ఆఫీస్ కెళ్ళిపోయేవారు.

వీధి తలుపు అలా మూసుకోడమేమిటీ, మా చేతిలో పుస్తకాలు గాల్లో కెగిరిపోడమేమిటీ అన్నీ క్షణాల్లో జరిగిపోయేవి. మగ పిల్లలు మంచాల మించి దూకడం, కొట్టుకోడం మొదలవ్వగానే అమ్మ వంటింట్లోంచి కేకలేసేది. అప్పటి దాకా నిశ్శబ్దంగా వున్న ఇల్లు వాళ్ళ అల్లరితో, అమ్మ కేకలతో, రేడియో పాటలతో హోరెత్తి పోతుండేది. వాళ్ళని మందలిస్తూనే అమ్మ స్పీడై పోయేది. నన్ను తన కింద అసిస్టెంటుగా వేసుకునేది. అప్పట్లో నాకదో గొప్ప ఉద్యోగం. నే చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే వెళ్ళి అమ్మమ్మని పిల్చుకు రావడం. “త్వరగా వెళ్ళి, త్వరగా రా. పసివాళ్ళ నెత్తుకుని, అక్కడే కూర్చోకు. తలంటి పోసుకుని, బొమ్మలు పెట్టాలి, సరేనా?! ఇదిగో సైకిళ్ళు అవీ వస్తాయి. చూసుకుని నడు. సరేనా?!…” అమ్మ ఇంకా చెబుతూనే వుండేది. నేనప్పటికే చెప్పులేసుకుని వీధిలోకి తుర్రుమనే దాన్ని.

రెండు వీధుల అవతలే మా అమ్మమ్మ గారిల్లు. నడుచుకుంటూ వెళ్తే నాలుగు నిమిషాలు. నేను రెండు నిమిషాల్లో వెళ్ళిపోయేదాన్ని. నే వెళ్ళేసరికి మా తాతయ్య అప్పటికే తలంటి పోసుకుని, కొత్త పంచె కట్టుకుని, నుదుటి మీద వీభూతి రేఖలతో, ఆ రేఖల నడిమ కుంకుమ బొట్టుతో కూర్చునుండేవాడు. నన్ను చూడగానే నవ్వి “ఏమే పిల్లా… వచ్చావూ? నాన్న ఆఫిస్ కెళ్ళారా? అమ్మేం చేస్తోంది?” అని అడుగుతూనే “ఏమేవ్! మనవరాలొచ్చింది!”అంటూ కేకేసే వాడు వాళ్ళావిణ్ని.

నేనొచ్చానని తెలిసి అమ్ముమ్మ తొందర పడి పోయేది. ” ఇదిగో, మిమ్మల్నే! ఈ కాస్త కాఫీ చుక్క తాగి పడుకోండి. అన్నం టయానికి వచ్చేస్తా,” అంటూ ఓ పెద్ద ఇత్తడి గ్లాసుని ఆయన చేతికందించేది. ఆ వేడి గ్లాస్ ఆయన తన ఉత్తరీయంతో అందుకునేవారు. మా అత్తయ్యకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి ఇక నాతో బయల్దేరేది. పెద్దావిడ కదా, చేయి పుచ్చుకుని తీసుకు రమ్మనేది అమ్మ! ఈవిడేమో, ‘ముందు నడు’ అంటూ నాలుగడుగుల దూరాన్ని మెయింటైన్ చేసేది. ఎందుకంటే, ఆవిడ తలంటి పోసుకుంది. నేను పోసుకోలేదు. సైకిల్ మీద చేమంతి పూల తట్టె వాణ్ని ఆపి, వాళ్ళింటి అడ్రెస్ చెప్పి, పూలిచ్చి పొమ్మనేది. ఆగి ప్రతీవారినీ పలకరించుకుంటూ వచ్చేది.

నన్నాలస్యం చేయొద్దని అమ్మచెప్పిన సంగతి గుర్తొచ్చి నేను త్వరత్వరగా నడుచుకుంటూ ఇంటికొచ్చేసేదాన్ని. ఇంటి ముందాగి, వెనక్కి చూస్తే మెల్లగా అడుగులో అడుగేసుకుని వొస్తూ పెద్ద బొట్టు పెట్టుకుని, గోచి కట్టుతో, కనిపించే అమ్ముమ్మని చూసి నా బొమ్మల కొలువులో ఇలాంటి అమ్ముమ్మ బొమ్ముంటే బావుణ్నే అని! ఎన్నిసార్లు అనుకున్నానో. నేను రివ్వుమంటూ ఇంట్లో కొచ్చి, అమ్మమ్మని తెచ్చేశానన్న వార్తని ప్రకటించేసేదాన్ని. అమ్మ తలాడించేది, మౌనంగా. ఏమిటా అని చూస్తే మా అన్నయ్యల బట్టలు కాస్త మారిపోయి వుండేవి. అక్కడ చాలా తీవ్రమైన నిరసన జరిగిందనడానికి నిదర్శనమే మా అమ్మ మౌనం!

“వీళ్ళ తలంట్లు కాదు కాని, నా ప్రాణం కొరికి పడేస్తున్నారు. నిక్కర్ల మీద తలంట్లు పోసుకుంటారట. అదీ ఇందాకట్నుంచి గోల,” విసుక్కుంటూ అమ్మమ్మతో చెప్పేది. అమ్మ సమస్య ఏమిటంటే బట్టలకంటిన జిడ్డు వొదిలించాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అందుకని గోచీలు పెట్టుకోమనేది. కౌపీనాలు ధరించి తలంటుకోవడం తర తరాలుగా వస్తున్న ఆచారమే కదా అని ఆవిడ అభిప్రాయం. మా అమ్ముమ్మ వెంఠనే పెద్దరికం వహిస్తూ వాళ్ళని కేకలేసేది. “ఏరా! అమ్మ చెప్పిన మాట విననంత పెద్దవాళ్ళై పోయారుట్రా? మీకేమైనా గడ్డాలొచ్చాయా, మీసాలొచ్చాయా? గోచీలొద్దంటానికి పట్టుమని ఫదేళ్ళు కూడా లేవు. అప్పుడే ఎదురు చెప్పేంత మొనగాళ్ళై పోయారా? అసలు అమ్మ కాబట్టి అవైనా ఇచ్చింది, నేనైతే అవి కూడా అఖ్ఖర్లేదనే అంటా. తెలుసా,” అనేది.

అంతే. వాళ్ళు నవ్వేవాళ్ళు. ఆవిడ చెప్పిన తీరుకి నాకూ ఆపుకోలేనంత నవ్వొచ్చేది. పెదాలు బిగించి అమ్మా నవ్వేది. ఏకబిగిన, అన్నలిద్దరూ పేచీలు పడకుండా రెండు నూనెగిన్నెలక్కడ పెట్టేది. మరో రెండు గిన్నెల్లో సున్నిపిండి పోసి పెట్టేది. వాళ్ళిద్దరి మధ్య ఎలాటి పేచీలొచ్చినా, తనకొచ్చి చెప్పమంటూ నన్నక్కడ నిలబెట్టి వంటింట్లో కెళ్ళిపోయేది. రిపోర్టర్‌గా నా మొట్ట మొదటి రిపోర్టింగ్ జాబ్ అదే. చిన్నప్పట్నుంచి నాదిదే ప్రొఫెషన్ మరి!

వంటింట్లో మా అమ్మమ్మ అప్పటికే రెండు పెద్ద కుంపట్లు రాజేసి వంట మొదలు పెట్టేసేది. అమ్మ కాఫీ కలపడం కోసం కిరసనాయిల్ స్టవ్ అంటించే పనిలో వుండేది. ఇక్కడ మా అన్నలిద్దరూ వొంటికి నూనంటించుకుని, ఎంచక్కా కబుర్లలో కెళ్ళి పోయేవారు. అంతా సవ్యంగానే జరుగుతున్న దనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య వాదులాట మొదలయ్యేది. గుప్పిళ్ళు బిగించుకుని, మోచేతులు ముడిచి ‘నా కండలు గొప్పవంటే కాదు నా కండలు గొప్పవని’ ప్రగల్భాలు పోయే వాళ్ళు. నిజానికి ఇద్దరికీ కండలుండేవి కావు. అలా వారి వాగ్యుధ్ధం పెరిగి ఒకరితో ఒకరు కలియబడి విష్ణు చక్రాల్లా, కిందపడి భూచక్రాల్లా తిరుగుతూ మండుతున్న కట్టెపుల్లల దగ్గరికి పోయే వాళ్ళు. అప్పుడు, సరిగ్గా అప్పుడు ఫ్రంట్ పేజ్ బానర్ న్యూస్ దొరికినంత వేగంగా అమ్మ చెవిలో ఈ వార్తనూదేసే దాన్ని.

వినంగానే ఆవిడ తాగుతున్న కాఫీ గ్లాసుని అక్క డ పడేసి ఉన్న పళాన వచ్చేది. వెంఠనే కోపం, ఆవేశం పొంగు కొచ్చేవేమో, పళ్ళు బిగించి మూల పడున్న ఓ పొడుగాటి పుల్లని చేత పట్టుకుని, “పండగ పూట తిట్టటమెందుకూ, కొట్టడమెందుకనుకుంటే, ఉహు! మీరు ఇలా ఎందుకు వింటారు. నాలుగు తగిలించాల్సిందే,” అంటూ వాళ్ళ మీదకు దాడి చేయబోయేది. అమ్మకి కాదు కాని, దెబ్బలు పడతాయేమోనని భయంతో, దొడ్డి తలుపు గడియ తీసుకుని పారిపోయే వాళ్ళు. ఆవిడ రెచ్చిపోయి వెంట పడేది. ఆ వెనకే ( కెమెరా కన్నేసుకుని) నేనూ.

అక్కడ వాళ్ళ కథాకళి చూసి తీరాల్సిందే. పాపం అమ్మ తన ప్రయత్నలోపం లేకుండా పరుగులు తీసేదే కానీ, ఆవిడ వల్లేమవుతుందనీ! అట్నుంచి లోపలకొచ్చి, పెరటి గది తలుపు గడియేసి రొప్పుతూ నించునేది. వాళ్ళూ అంతే. పళ్ళన్నీ బయట పెట్టి, డొక్కలెగిరేలా రొప్పుకుంటూ ఎదురెదురుగా నిలబడేవాళ్ళూ. నాకూ, అమ్మమ్మకి టెన్షనేసేది. ఆ నూనె వంటి మీద వాతలు ఖాయం అని. ఇంతలో అమ్మమ్మ చెప్పేది, ‘పండగ పూట ఏం అనొద్దులే. ఆ తర్వాత నువ్వే బాధ పడతావ్. వూరుకో,” అంటూ. అమ్మ కదా, చల్లబడి పోయేది. చేతిలో ఈత బరికెని మూలకు విసిరేసేది. తనని తాను సంబాళించుకుని, తిట్లు కాని తిట్లు తిట్టి, వాళ్ళ మాడు మీద నూనె అద్ది, ఇంత ఆయుష్షు, అంత ఆయుష్షు, మార్కండేయుడంత ఆయుష్షు అంటూ దీవించి, వీపుకి నూనె రాసి, మిగిలిన నూనె వొంటికి ఇగర రాసుకోమని చెప్పి, మరో పన్లో కెళ్ళేది. ఓ గంట తర్వాతొచ్చి, నలుగులు పెట్టేది. ఆ తర్వాత, ఇద్దర్నీ పక్క పక్కనే కూర్చోబెట్టి కుంకుడుకాయ రసంతో తలంట్లు పోసేది. కాగుల్లోంచి పొగలు కక్కే నీళ్ళని బకెట్లలోకి దిమ్మరించి, పాళాలు చేసి, తలమీంచి చెంబుల కొద్దీ వేడి నీళ్ళని గుమ్మరించేది.

తరవాత నేను.

ఈ పెరటి గది వెనకానుకుని వున్న స్నానాల గదిలోకి అన్నీ చేరేసుకోవాలి. కుంకుళ్ళ డబ్బా, సున్ని పిండి డబ్బా, నూనె గిన్నె, నలుగు పిండి కలుపునే గిన్నె, పొడి పిండి కోసం మరో గిన్నె, సబ్బు పెట్టె, వొళ్ళు తుడుచుకునేందుకొక టర్కీ టవల్, తలకు చుట్టుకునేందుకొక పలచని నేత వస్త్రం – ఇవన్నీ నేను స్వయంగా చేరేసుకోవాల్సిన సరంజామా! వేడి నీళ్ళ బకెట్, చల్ల నీళ్ళ బకెట్లు చేరేస్తూ అమ్మ. మరో క్షణంలో తలంటికి సిద్ధం అనుకునే లోపు అమ్మమ్మ కేకేసేది. హారతి పట్టించి తీసికెళ్ళు అంటూ.

పండగలప్పుడు తలంటికి ముందు ఆడపిల్లకి హారతిచ్చి తలంటి పోయడం మా ఇంట్లో ఓ పద్ధతిగా వుండేది. నాకిప్పటికీ ఈ పధ్ధతి అంటే ఎంతో ముచ్చటగా వుంటుంది. తూర్పు వైపు ముఖం పెట్టుకుని కూర్చునే దాన్ని. అలా మా అమ్మ నాకు బొట్టు పెట్టి, కుడి చేతి వేళ్ళని నూనె లో ముంచి ‘అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా…’ అంటూ మూడు సార్లు తలమీద అద్దేది. ఆ పైన అమ్మమ్మ. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి ఓ మంగళ హారతి పాడి, కళ్ళకి హారతద్ది, అక్షింతలు జల్లేవారు. కాగానే అమ్మ మూడు నేతి గిన్నెల నూనె మాడు మీదకి చేర్చేది.

కళ్ళల్లోకి నూనె పడకుండా కళ్ళు మూసుకుని కూర్చున్న నాకు మా అమ్మమ్మ మాటలు వినిపించేవి. “ఇదంతా బాగానే వుంటుంది కాని, దీనికి నీ చాయ రాలేదే, కమలా?!” అంటూ. కర్ణ కఠోరంగా వున్న ఆవిడ మాటలకు ఉన్న పళాన ఒక కన్ను తీక్షణంగా తెరుచుకునేది. అమ్మ మాత్రం నవ్వి, “అదేమిటే అమ్మా! అలా అంటావ్. నా తల్లికేం తక్కువా. మంచి కళ గలది కాదూ, అంతా వాళ్ళ నాన్న పోలిక. అదృష్టవంతురాలవుతుంది,” అనేది. అంతే. ఆటోమాటిక్‌గా కన్ను మూసుకునేది. కనుబొమలు మాత్రం కాస్తంత పైకి కదిలేవి.

అలా తలకీ, వొంటికీ నూనె పట్టించి అరగంట ఆరనిచ్చి, కచ్చూరాలేసి మర పట్టించిన పెసల పిండిలో వేడి వేడి నీళ్ళు పోసి ముద్దచేసి, చర్మానికంతా పట్టించిన తర్వాత అది ఆరుతుంటే వెన్ను లోంచి చలి పుట్టేది. పచ్చి పోకుండానే పొడి పిండితో నలుగు కార్యక్రమం మొదలయ్యేది. ఆ తర్వాత, మరగ కాగిన నీళ్ళల్లో నానేసిన కుంకుళ్ళ గిన్నెలో కాసిన్ని మందార రేకులు, మరిన్ని ముద్ద మందారాకులు వేసి పిసికి, చిక్కటి రసంతో తల రుద్దేది అమ్మ.

“ఆ జుట్టు పని నీ వొక్క దాని వల్లేమవుతుంది?, వుండు. నేనొస్తున్నా..” అంటూ మా అమ్మమ్మ వచ్చి, రసం పోస్తుంటే అమ్మ తల రుద్దేది.

నాలుగు కాగుల మరగ కాగిన నీళ్ళకు మరన్ని కాగుల చల్ల నీళ్ళు కలిసి ఎన్ని కాగుల, కాదు, వాగుల నీళ్ళయ్యేవో అవి. ఈ నాటికీ నాకు లెక్క తేలదు. తలకి పిడపతో ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఎవ్వరూ తుమ్మకుండా నుదుట్న అమ్మవారి కుంకాన్ని బొట్టుగా దిద్దుకుని, పట్టు పరికిణి కట్టుకుని, కాళ్ళకు పసుపు రాయించుకుని, అది అంటకుండా కుచ్చిళ్ళు పైకి పట్టుకుని, మడమల మీద నడుచుకుంటూ నీరెండకి తల పెట్టుకుని వాకిట్లో కూర్చునే దాన్ని కుర్చీలో, సాంబ్రాణి పొగ వాసనలు పీలుస్తూ. తలంటుకున్న స్త్రీలు జుట్టు విరబోసుకుని ఆర బెట్టుకోకూడదట. అమ్మ చెప్పింది. అందుకే చెవుల పక్కనుంచి సన్నటి పాయలు తీసి జడ అల్లి ఆ ఈతచాప జడని పరుచుకున్న జుత్తులో కలిపి, కొసలకి ఎర్ర రిబ్బన్ కట్టి, కుచ్చు పెట్టేది.

ఇంతలో మా అన్నలు గుడినించి చెట్టపట్టా లేసుకొచ్చేవాళ్ళు. ఇంతకుముందు మల్ల యుద్ధాలు చేసిందీ వీరిద్దరేనా, అనిపించేది. “ఏమిటే, తలంటైపోయిందా? ఐతే ప్రసాదం తిను.” అంటూ బాదమాకులోంచి నాలుగు పులిహోర మెతుకులు తీసి నా నోట్లో వేసే వాళ్ళు. గుళ్ళో ప్రసాదం ఇంటికి తీసుకు రావాలనీ, అది అందరికీ పంచాలని అమ్మ నేర్పిన పాఠం ఈరోజు వరకూ పాటిస్తునే వున్నాం.

అమ్మ తలంటుకోడం కూడా పూర్తయినట్టుంది. పట్టు చీరల పెట్టె తెరుస్తున్న శబ్దం వచ్చేది. ముక్కుపొడుం రంగు కంచి పట్టుచీరలో ధగధగ మంటూండేది అమ్మ. ఆవిడ క్షణమైనా ఆలస్యం చేసేది కాదు. చక చకా, టేబుళ్ళు, బల్లలు, పెట్టెలు, స్టూల్స్ అన్నీ మెట్లుగా చేసేది. వాటిపైన పట్టు వస్త్రాన్ని పరిచేది. బొమ్మల కొలువుకి అందరమూ సిద్ధమై పోయే వాళ్ళం. మగపిల్లలు అట్ట పెట్టెలు తెరిచి, జాగ్రత్త గా బొమ్మల్ని తీసి అందించే వాళ్ళు. పై మెట్ల మీద బొమ్మలు తాను అమర్చేది. నాకు అందే మెట్టు నుంచి నా చేత బొమ్మల్ని పెట్టించేది. గంటలో బొమ్మలు కొలువైపోయేవి. చివరిగా కొత్త బొమ్మకు బొట్టెట్టి నా రెండు చేతులను పట్టుకుని శ్లోకం చదువుతూ అక్కడ కొలువుంచేది.

మా అమ్మమ్మ వంటింట్లోంచి మహా నైవేద్యం సిధ్ధమైందంటూ కేక వేసేది. పెరట్లో తులసి కోటకి దణ్ణం పెట్టుకుందామని వెళ్తూ ఆగి చూస్తే పెరటి గది – గంట క్రితం కురుక్షేత్రంలా వున్న ఆ ప్రదేశం ఇప్పుడెంత శుభ్రంగా వుండేదో! ఎడ తెరిపి లేకుండా మండిన ఆ రెండు పొయ్యిలు ఇప్పుడు ప్రశాంతంగా చల్లబడి పోయుండేవి. వాటి మీద రాగి కాగులు ఖాళీగా సగం వొరిగి కనిపిస్తుండేవి. మరో మూల తొట్టి నిండా కొత్త నీళ్ళు కొసలకల్లా తేలుతుండేవి. చూద్దామన్నా ఒక్క కుంకుడు గింజ కనపడేది కాదక్కడ. నూనె మరకలూ ఉండేవి కావు. గచ్చంతా అద్దంలా మెరుస్తుండేది, తెల్లటి ముగ్గులతో.

ఆ సాయంత్రం భోగి పళ్ళ పేరంటాలెన్నుండేవో! అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చుకుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది.

వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; నాన్నగారు, అమ్మ, అన్నయ్యలు, నేను, ఇలా అందరం పండగ స్పెషల్ బొమ్మలుగా కనిపించే వాళ్ళం. నాసికపు టంచులూ, చెవి కొసలు నిగనిగమంటూ నిగారిస్తూ, చెంపలు కోమలంగా మెరుస్తూ, చర్మం కొత్త కాంతులీనుతూ, మొత్తానికి కొత్త చింత పండేసి తోమిన దేవతా విగ్రహాలకు మల్లే అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

ఇదంతా జరిగి ఎన్నేళ్ళై పోయిందీ! కాని, ఎప్పుడు తలుచుకున్నా పండగ పులకింతగా వుంటుంది మనసుకి! కళ్ళకద్దిన ఆనాటి హారతి వెలుగులు – మదిలో ఇంకా వెలుగుతూనే వున్నాయి ప్రకాశవంతంగా!

గుండె గడపకి ముద్దబంతుల తోరణాలు కట్టి పోయే పండగ – సంక్రాంతి! వెచ్చని హృదయ కాంతి!!

రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...