కాలనీ భోగి

“ఏంట్రా! భోగి ఇంకా పది రోజులే వుంది. తెలుస్తోందా” అన్నాడు రామకృష్ణ ఎండు గడ్డి పుల్ల నించి పొగ పీలుస్తూ.

“థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీగా చాలా పోగేశారు” ఉప్పందించాడు హరిగాడు.

“ఏదో ఒకటి చెయ్యాలిరా! లేకపోతె ఇంక వేస్ట్ మనం” కొంచం విరక్తి గా అన్నాడు సాయి.

“మరేందిరా సతీష్‌గా, అలా ఏమ్మాట్లాడక పోతే ఏంటమ్మా”, రామకృష్ణ రెట్టించాడు ఈ సారి. వాడు మా అందరికంటే పెద్ద.

“చూద్దాం లేరా, ఇంకా టైం ఉంది కదా” అంటూ తొందరగా ఈ టాపిక్ అయిపోతే బావుండు అని లేవబోయాను నేను. నా ఇబ్బంది నాది మరి.

“నీ యబ్బ! నీకు పరిస్థితి అర్ధం కావడం లేదురా. లాస్ట్ భోగి మంటల్లో వాళ్ళే గెలిచారు. మన మంట కన్నా కనీసం ఒక గంట ఎక్కువ సేపు మండింది వాళ్ళది. మన సెకండ్ లైన్ పరువు పోతోందని తెలుస్తుందారా?” అని గట్టిగానే అన్నాడు సాయిగాడు.

“వాళ్ళ దగ్గర కాలనీ ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ ఆయన కొడుకు జయగాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మరి వాళ్ళ ఆఫీసు నించి చాలా వరకు విరిగి పోయిన గేట్లు, కాలనీలో పోగయిన చెక్క అంతా వాళ్ళకే ఇస్తాడు. పెద్ద మంట అయ్యింది అంటే అవ్వదా!” వివరించాడు హరి.

“పోయిన సంవత్సరం ట్రాక్ పక్కన తుమ్మలతో చాలానే పోగేసాం కదరా. లాస్ట్‌లో సతీష్ గాడు ఇప్పిస్తా అన్న స్లీపర్ కట్టె వచ్చుంటే మనదే సూపర్ అయ్యేది. సుడి లేదురా మనకి” అన్నాడు సాయిగాడు.

ఏదయితే ఎవ్వడూ మాట్లాడకూడదని అనుకొన్నానో అదే టాపిక్ మళ్ళీ మధ్యలోకి వచ్చి పడింది. నేను ఇబ్బందిగా “నేనేం చేసేదిరా. అప్పటికి ట్రై చేశాను కదరా,” అన్నాను.

“సర్లే రా, సాయంత్రం ఆలోచిద్దాం. అస్సలేమీ చెయ్యకుండా అయితే ఉండం కదా. ఏదో ఒక ప్లానేద్దాం లే!” సూరిగాడి మాటతో అక్కడ నించి అందరం కదిలాం.


విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కాలనీలో భోగి మంటలు అంటే అది ఒక వరల్డ్ కప్ పోటీ అంత మరి. కాలనీలో ప్రతి లైన్ లో కనీసం ముప్ఫై పైదాకా క్వార్టర్లుంటాయి. లైనుకీ లైనుకీ మధ్య క్రికెట్ మ్యాచ్ పోటీలు, కొట్లాటలు, రాయబారాలు అన్నీ వీర లెవెల్ లో ఉండేవి. ఇంక భోగి పండగప్పుడు మా కాలనీలో ఒక లైన్ వాళ్ళు వేసిన భోగి మంట పక్క లైన్ వాళ్ళ మంట కంటే పెద్దగా ఎక్కువసేపు మండితే ఇక అంతే, ఆ లైనువాళ్ళు ఇక కాలర్ ఎగరేసి తిరగడానికి లైసెన్స్ వచ్చిందంతే! దీని కోసం జనం దగ్గర ఉన్న పాత చెక్క సామానులు, కాలనీలో పెరిగిన పిచ్చి చెట్లు, రైల్వే ట్రాక్ వెంబడే ఉన్న తుమ్మ పొదల కోసం చాలా డిమాండ్ ఉండేది. మా లైన్లో ఆడపిల్లలు భోగి మంట బాగా పెద్దగా వస్తే మమ్మల్ని చూసే అదోరకం చూపులతో మా జన్మ తరించేది.

మిగతా రోజుల్లో ఎలా వున్నా నాకు ఈ సీజన్లో మాత్రం ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. మా నాన్నగారు రైల్వేలో ట్రాక్ ఇన్స్పెక్టరు. ఆ మధ్య కాలంలో విజయవాడ డివిజన్లో బ్రిటిష్ వాళ్ళు వేయించిన రైల్వే ట్రాకులో చెక్క స్లీపర్లు తీసేసి సిమెంట్ స్లాబ్ స్లీపర్లు వేసే ప్రాజెక్ట్ వర్క్స్ జరిగేవి. దాంతో ఈ చెక్క స్లీపర్లు చాల వరకు అవతల పారేయడం లేదా వేలంపాటలో అమ్మేయడం చేసే వాళ్ళు. మా నాన్నగారు అడపా తడప కాలనీలో వాళ్ళు వాళ్ళ క్వార్టరుకి ఫెన్సింగో, ఇంటికి గేటో వేయించుకొంటామంటే లోపాయికారీగా వాళ్ళకి సహాయం చేసేవారు. ఒక రెండు భోగి పండగల క్రితం కాలనీలోకి మేము కొత్తగా రావడం, మా నాన్నగారు ఏదో మూడ్‌లో కుర్రాళ్ళు ముచ్చట పడటం చూసి ఒక స్లీపర్ కట్టె ఇవ్వడం, మా భోగి మంట కాలనీ మొత్తానికే పెద్దది అవ్వడంతో నా లెవెల్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. కానీ తర్వాత ఇది ఏదో ఆయన ఉద్యోగానికే ఎసరు పెట్టేదని అనిపించిందో ఏమో, మా నాన్నగారు ససేమిరా అన్నారు.

ఆ పాత స్లీపర్ కట్టెలు చాలా సేపు మంచి మంటని ఇస్తూ కాలేవి. ప్రపంచంలో అందరకి స్లీపర్లు మా నాన్నగారు శాంక్షన్ చేసే వాళ్ళు కానీ మా లైన్ పరువు గురించి ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఇప్పుడు మా టీం అంతా ట్రాక్ వెంబడి పడుతూ లేస్తూ తుమ్మ మొక్కలు, చెక్క సరుకు పోగు చేసినా కూడా థర్డ్ లైన్ వాళ్ళ కాలి గోటికి కూడా సరి పోలేదు. మా ఓటమికి మిగతా కారణాలు చాలానే ఉన్నాయి. కొంచం కండ పుష్టి ఉన్న సీనియర్లు ఇప్పుడు లేరు. కొంతమంది ఇంజనీరింగులో సీట్ వచ్చీ, కొందరేమో ట్రాన్స్‌ఫరయీ వేరే ఊరు వెళ్ళి పోవడం జరిగాయి. చివరి నిమిషంలో మా భోగి మంట సామాన్లు కొన్ని మా సెక్యూరిటీ లోపంతో మాయమైపోతుండేవి. సీనియర్లు లేరు కదా, భోగి మంటలో ఎప్పుడు ఏ చెక్క వేసి మంటను పెంచాలనే స్ట్రాటజీ కూడా మాకు సరిగ్గా లేకుండా పోయింది. వేరేవాళ్ళ సంగతే ఎందుకు మా టీములోనే ఇలా అంటే ఒప్పుకోరు. ఆ కారణాలన్నీ కాలువలోకి పోయి, సంవత్సరం పొడుగూతా సతీష్ గాడు తెస్తా అన్న స్లీపర్ తేకపోవడం వల్లే మా లైన్ పరువు గంగలో కలిసింది అన్న మాట మాత్రం నిలిచి పోయింది. ఈ సంవత్సరం ఎలా అయినా స్లీపర్ సంపాదించాలి, తప్పదు.


“నాన్న గారూ, భోగికి ఒక స్లీపర్ ఇప్పించరా, ప్లీజండీ. ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడూ అడగను. నిజంగానండీ. ప్రామిస్సండీ!”

“వచ్చే సంవత్సరం పదో తరగతి. గుర్తుందిగా? ఈ వేషాలు మానేసి పుస్తకాలమీద శ్రద్ధ పెట్టు.”

తల గుండ్రంగా ఊపాను. “అలాగేనండీ. కానీ ఈ ఒక్క సారికీ…”

“సరే సరే. చూద్దాంలే. సతాయించకు.”