చివరాహరిగా 24.7.2000 (కవిసంధ్య – మో కవితావీక్షణం నుంచి)
అక్షరాద్యవస్థ / ఉంగా ఉంగా / వధ్యస్థలం / ఈలోగా / ఏలాగానో / వీడ్ని పట్టుకో / బడా చోర్ / పటుకో పటుకో / బాల నేరస్తుడు / వీడ్ని ముట్టుకో / దొంగ ఆంగ్ల పద బంధాల్ని / కడుపున పడ్డపుడే / వడ్ల గింజలో నువ్వుల గింజ / ఇంకానా వీడి / గించుకోటాలూ / తెగించుకోటాలూ / వేడి విద్యుత్తీగ మీద / దరిద్రపు తడిపొడి పాదాలు / పులి నోట్లో వీడి / సొర బీడీ / నీటిమీద తైలపు నవ్వు / దొంగ ఏడుపు దిండు / లోకళ్ళల్లో నవ్వు చివ్వు / నటిస్తూ నటిస్తూ / నాట్య లీనలోలుడు / సీయూ అంటూనే / సో నెవర్ గాడు / సోల్జరుడూ కాదు / ఊంజెరుడూ కాదు / వీడికి సమాజం / సహోదరం కాదు / అసహజం అసహ్యం కాదు / అసహాయత్వం అన్యాయం కాదు / వీడికి సరోజం శిరోజం / వీడో పంకపు పద్మ / యౌవనంలో పెరోల్లో / పారిపోయి దొరికిపోయిన / వృద్ధ ఖైదీ / గోళ్ళని రాళ్ళతో కొట్టుకుంటూ / 14 సం|| / పొయిట్రీ / తండ్రి హస్తంతో / అమ్మ ఆత్మతో / వధువు పెదవితో రాస్తూన్న / రామకోటిగాడు / వీడు కూతురులో / కన్న కొమరుడు / తిరిగి పెరిగిన నాన్న / మరలి వచ్చిన అమ్మ / అల్లుని మంచితనం / గొబ్బెమ్మల చెల్లెళ్ళు / మేనల్లుళ్ళూ / మనుమలూ మరమరాళ్ళూ / బావలూ ఏరా బావగార్లూ / యావండీ బామ్మరుదులూ / బళ్ళారి మామయ్యలూ అత్తయ్యలూ / గళ్ళల్లో వైకుంఠపాళీ యగళ్ళలూ / వేళ్ళూ వేణువులూ / దుఃఖాల్లో ధూమకేతువులూ / యుద్ధాల్లో సంధి ప్రేమలేఖలూ / మితృలూ శతృలూ / సాయుధులూ సాధువులూ / జనవరి 5, 1942లో / జులై 31 రెండు వేళ్ళులూ / అవి లాగి తీగ సాగదీసి / తాగటాలూ / సీసాలూ సీ – సాలూ / కవి సంధ్యకి / కడుపేదవాడి / కడుపారా తాగిత్రేన్చిన / కృతజ్ఞతాంజలులూ / ఉభయ సంధ్య వార్చటాలూ / సంధ్య వందనాలలో / బిజీ బిజీ అయినా / వీజీగా గృహోన్ముఖ పార్కు పూలల్లోకి –
మీ