ఒకే సృజనతో రకరకాల మనుషులు ఎలా సమాధానపడతారో అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ చాటువులో కనిపిస్తుంది:
కవితా కన్యకు నలుగురు
కవి జనకుడు, భట్టు దాది గణుతింపంగా
నవరస రసికుడె పెనిమిటి
అవివేకియె తోడబుట్టువనవేమ నృపా!
ఇది చెప్పిన కవెవరో తెలియదట. అనవేమా రెడ్డి శ్రీనాధుని కాలం కంటె పాతకాలపు రాజు. సృజన ఒక కన్యక అని, స్వీకరించేది కృతిభర్త అనీ ఇది పాత కాలపు ఆలోచన; ఇప్పటి దృష్టికి ఎబ్బెట్టుగా తోస్తుంది. కాని ఈ చాటువులోని అంతరార్ధం ఇక్కడ ఉపయోగపడుతుంది. సృజనశీలి సృజనకు తండ్రి. ఇలా ఉండాలి అలా ఉండాలి అని ముందస్తు ప్రణాళికతో కాకుండా, అనివార్యంగా అసంకల్పితంగా సృజిస్తున్నాడు. సృజనకు అతని సంకల్పంతో, ఇష్టాఇష్టాలతో అవసరం, ఖాతరు లేవు. అతనికి సృజనతో ఉన్న అనుబంధం వాత్సల్యపూరితమైనది; మూల్యాంకనం, బేరీజు అతని స్వభావం కావు. ఒకసారి రాసినదాన్ని మళ్ళీ వివరించటం, చర్చించటం, దాని అందాల్నీ లోపాల్నీ లెక్కించటం వెగటు అనీ, అయిష్టం అనీ చెప్పిన రచయితలు చాలామందే ఉన్నారు. జాయిస్ (James Joyce) గురించి, హెమింగ్వే (Ernest Hemingway) గురించి చెప్పింది ఉంది. త్రిపుర ఇంతే. తను రాసినవాటిని గురించి అంతకు మించి వివరించబోనని బెకెట్ (Samuel Beckett) భీష్మించుకుని కూర్చున్నారు. They simply ‘mean what they say.’ అని. ఆన్ బీటి (Ann Beattie) అని రచయిత్రి. ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నతను ‘మీ పాత కధలు, ఈ కధ గుర్తుందా, ఆ కధ ఎలా రాసేరు?’ అని పదే పదే అడుగుతుంటే ఆవిడ ‘నువ్వు చెప్తున్న కధలేవీ నాకు జ్ఞాపకం లేవయ్యా?’ అని ఇబ్బంది పడ్డారు. ఆవిడ అలా అనడం విని విని అతను “Have you ever read Ann Beattie’s work? It’s very good.” అని చలోక్తి విసిరేడు.
భట్టు అంటే సృజనను పెంచి పెద్దచేసేవాడు – సంపాదకుడు, ప్రచురణకర్త, ప్రచారకుని వంటి బాధ్యతల్ని తలకెత్తుకొని, సాంస్కృతిక నాయకత్వం వహించే స్వభావం ఉన్నవాడు. ఇతను సృజనకు దాది. ఆ సృజనంటే ఆసక్తి, స్వీకరించగలిగిన శక్తి ఉన్నవాడు సృజనకు పాఠకుడు. అలాంటి వివేకం లేనివాడు ఆ సృజనకు మాత్రం తోబుట్టువు. సృజనకు తగిన పాఠకుడు లభించటం అమ్మాయికి తగిన వరుడు దొరకటమంత అరుదని కవి చమత్కారం. సృజననుండి పాఠకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త ఆశించేదీ, అందుకొనగలిగేదీ, వీటికి ఎడంగా రచయిత ఆశించేదీ, అనుభవించేదీ వీటి మధ్య ఎన్నో తేడాలుండే అవకాశం ఉంది. ఏమీ లోవెల్ (Amy Lowell) అని కవయిత్రి; చిత్రవాద కవిత్వంతో రక రకాల ప్రయోగాలు చేసింది. ఆవిడ వీలునామా అనుసారం అరవయ్యేళ్ళకు పైగా Amy Lowell Poetry Travelling Scholarship అని కవులకోసం ఒక స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. సృజన అనుభవంలోని అనివార్యమైన నొప్పిని, వేదనను గురించి ఆవిడ చెప్తున్నారు. Poetaster అంటే అకవి:
“I do not suppose that anyone not a poet can realize the agony of creating a poem. Every nerve, every muscle, seems strained to the breaking point. The poem will not be denied, to refuse to write it would be a greater torture. It tears its way out of the brain, splintering and breaking its passage, and leaves that organ in a state of jelly-fish when the task is done. And yet to have no poem to write is the worst state of all. Truly a poet’s life is not a happy one. Broken and shattered when creating, miserable and void when not creating, urged always to a strain which cannot heal except through immense pain, peaceful only in the occasional consciousness of a tolerable achievement – certainly the poor creature must be born to his calling, for no man would take on such an existence willingly. This is just the difference between the poet and the poetaster, I think. Does a man create with his blood and sinews, and suffers in doing so ? If he does not, give no heed to his works, they are still-born.”
స్వయంగా సృజనకారులు కాని వాళ్ళకు సృజన అనుభవంలోని వ్యధ అర్ధం కాదని ఆవిడ అంటున్నారు. రాయటం ఒక వేదన. అలా అని రాయకుండా వదిలేస్తే అది నిలువనివ్వదు కాబట్టి అంతకంటే ఎక్కువ దుఃఖం. సృజనశీలి బతుకు ఏమంత సుఖం కాదు. ఇలాంటి వేదనను ఏరి కోరి కావాలని ఎవరూ తలకెత్తుకోరు కాబట్టి, సృజన తనంత తానుగా, తనకు ఒప్పిన సమయంలో సందర్భంలోన పుట్టేదనీ, అది కవి ప్రయత్నపుర్వకంగా ప్రణాళికలు వేసుకొని సృజించేది కాదని. ఇలాంటి వేదనామయమైన అనుభవం వలన అనివార్యమై రాని రచనలు మృత శిశువుల్లాగ నిర్జీవంగా ఉంటాయని, అకవి రచనల్ని ఇలాగ పోల్చుకోవచ్చునని ఆవిడ మాట.
సృజన ఇంకా రూపు దిద్దుకొంటున్న సమయంలో సృజనకారుల అనుభవాన్ని గురించి ఇంకొందరి పరిశీలనలున్నాయి. వీటిలో ఎలియట్ (T. S. Eliot), యుంగ్ (Karl Jung) వంటివాళ్ళవి విస్తారంగా ఉంటాయి. ఇలాంటి సంగతులు కవులు, రచయితల్ని గురించే కాకుండా, చిత్రకారులు, శాస్త్రజ్ఞులు వంటివాళ్ళ స్వభావాల్ని గురించినవీ ఉన్నాయి. వీటిని పరామర్శించే ముందు కొన్ని జాగర్తల్లాగ చెప్పాలనుంది. ఒకటి – ఇలాంటి సంగతులు చెప్పేవాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా, పేరున్నవాళ్ళయినా సరే వాళ్ళు చెప్పేవి వెంటనే ఒప్పుకోకుండా, అలాగని తిరస్కరించకుండా ఆసక్తికరంగా ఉన్నాయని అనిపిస్తే వాటిని పరిశీలించటం, లేదంటే పక్కన పెట్టెయ్యటం మంచిదని తోస్తుంది. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లు. చదవటం – అంటే Reading అనేదే చాల ఆసక్తికరమైన ప్రక్రియ. కేవలం శబ్ద తరంగాలైన మాటల్నే వినియోగించి ఒక మనిషి ప్రవర్తనను ఇంకొక మనిషి చేత్తో అంటీ ముట్టుకోకుండా నియంత్రించడానికి భాష ఒక ‘రిమోట్ కంట్రోల్’ లాగ పనిచేస్తున్నాది కదా. భాషకున్న ఈ శక్తే నాగరికతకు ప్రాతిపదిక అంటున్నారు. అంటే జంతువుల్నుండి మనని ఎడం చేసే సంస్కృతికి ప్రాతిపదిక భాష. చదవటం, రాయటం భాషకున్న అనేక రకాల ప్రయోజనాలకు ఒక పార్శ్వం. ఈ రెండింటిని గురించీ అవి cognitive processesగా కవుల్లో, పాఠకుల్లో ఎందుకు, ఎలా పని చేస్తాయో కొత్తగా చాలా ఆసక్తికరమైన చర్చ ఉంది. ఉదాహరణకు ఇలాంటివాళ్ళు కొందరికి కాయితాల పిచ్చి, పెన్నుల పిచ్చి, అందునా ఫౌంటెన్ పెన్నుల పిచ్చి ఇలాగ ఉంటాయట. దానికి కారణాలున్నాయి. Writing as Thinking అని నిశితమైన పరిశోధన ఉంది. రాయటం ఒక ప్రత్యేకమైన వివేచన; రచనలో వెలుపలికొచ్చిన విషయాన్ని కేవలం రాతపూర్వకంగా మాత్రమే స్ఫురణ, అనుభవం చేసుకోగలం. రాయకపోతే తెలీదు. నారాయణరావు గారు రాసేటప్పుడు నెమ్మదిగా కూడబలుక్కుని రాస్తానని అనేవారు.
ఇప్పటికి ప్రస్తుతం ఏమిటంటే ఎవరైనా ప్రచురించే ఊహల్ని, అభిప్రాయాల్నీ స్వీకరించటంలో, తిరస్కరించటంలో జాగర్తని గురించి. చదవటంలో రెండు రకాలున్నాయట – విమర్శనాత్మక దృష్టితో చదివేది, సానుభూతితో చదివేదీ – అంటే Critical Reading, Sympathetic Reading అని. చెప్పే విషయం మీద, అది నిర్మిస్తున్న ఆవరణం – అంటే ఇదివరకు చెప్పుకున్న cognitive model మీద, ఇంకా ఆ చెప్తున్న వాళ్ళ మీద, లేదూ వీటన్నింటి మీదా ఇదివరకే సౌజన్యం, ఇష్టం లేకుంటే కనీసం పరిచయం ఉంటే అది Sympathetic Readingకి దోహదం చేస్తుంది. వీటికి ఎడంగా పాఠకునికి స్థిరమైన, బలమైన అభిరుచి అప్పటికే ఏర్పడి ఉంటే అది Critical Readingకు దోహదం చేస్తుంది – సానుభూతి, సౌజన్యం ఉన్నా లేకపొయినా. బలమైన కవులున్నట్టే, బలమైన పాఠకులుంటారు; పాఠకుడు, సంపాదకుడు – వీళ్ళందరూ ‘కవులే’ నని ఇదివరకు అనుకున్నది. బిపిన్‌ని, త్రిపురని చూడగా చూడగా అభిరుచిలో పరిణతి, స్థైర్యం ఉన్న పాఠకునికి ఒక సృజన యెడల విమర్శా దృష్టీ, సానుభూతీ ఏక కాలంలోనే అనుభవం కావచ్చునని అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏ పద్ధతిని ఎంచుకున్నా సరే, తొందర పడి ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా సంశయంతో పరికించి చూడటం సహాయం అవుతుందని తోస్తుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు సూచనగా చెప్పింది ఏమంటే ఏ రచననైనా చదవటానికి ఉపక్రమించే ముందు కొంత సానుకూల దృష్టితో మొదలుపెట్టాలి అని. అయితే, చేతికి అందివచ్చిన ప్రతి రచన పట్ల ఇలాంటి సానుకూల వైఖరి అనేది సాధ్యం కాదు. కొంతసేపు పరికించి చూసేక ఒక సృజనకు తను పాఠకుడు అవునో కాదో సుమారుగా అవగాహనకు వస్తుంది. అప్పుడు కూడా ఆసక్తిగా ఉన్నట్టయితే ఇంకా ముందుకు పోయి, లోతుగా చదవటానికి ఉపక్రమించవచ్చు. ఇది పేటర్ (Walter Pater) సూచించిన పద్ధతి.
ఆయన ఏమన్నారంటే ముందు కొంచెం మచ్చు చూస్తామని. “The first step towards seeing one’s object as it really is to know one’s own impression, to discriminate it, to realize it distinctly. What is this song or picture, this engaging personality in life or in a book, to me?” అంటే, పట్టి చూడగానే ఆ సృజనతో ‘నాకేంటి?’ అన్నది మొదటి ప్రశ్న. అప్పటికీ తన ధ్యాసను ఆ సృజన ఆకట్టుకోగలిగితేనే అంతకంటే ముందుకు పోయేది. “When we have formed our impressions we proceed to find ‘the power or forces’ which produced them, the work’s ‘virtue’.” ఈ చెప్పిన ప్రక్రియలోన అభిరుచి ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇలా చదివే ప్రక్రియతో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఎప్పుడో ఏ ఒక్కటో అరుదుగా తప్ప నా ఆసక్తిని, ధ్యాసను ఆకట్టుకోలేవు. దానికి కారణాలు ఏమిటనేది ముందుగా చాలా వెతుక్కొని ఆనక విడిగా, విస్తారంగా చెప్పవలసింది.
త్రిపుర, బిపిన్ ఇద్దరూ కూడా ఎన్నెన్నో సంగతుల్ని పరామర్శించేటప్పుడు, చదివేటప్పుడు ఒకలాంటి జాగ్రత్త వహిస్తారు అనుకుంటాను – సానుకూల దృష్టి, సంశయం – అంటే suspension of disbelief, skepticism రెండూ కలిసి ఏర్పరుచుకున్నలాంటి వైఖరి; healthy, sympathetic skepticismలాగా. వాళ్ళు చెప్పింది ఏమిటంటే అభిప్రాయాలు, అనుభవాలు, దృక్పధాల్లోన, శక్తియుక్తుల్లోన, సంకల్పం అంటే motivation అనే దాన్లోనూ మనుషుల్లో మన ఊహకు అందనంత వైవిధ్యం ఉంది. ప్రకృతిలో కూడా అనంతమైన వైవిధ్యం ఉంది. అన్ని రకాల అభిరుచులకూ ప్రతినిధిగా ‘సగటు పాఠకుడు ‘ అని ఉండే అవకాశం లేదు గాని, విమర్శకులకు కొన్ని తరగతుల పాఠకులని స్థూలంగా నిర్వచించుకొనే అవకాశం ఉంది. ఈ అన్ని రకాల possibilities లోన ప్రతి సృజనకారునికి, పాఠకునికీ తమవైన తోవల్ని వెదుక్కొని, స్థిరపరుచుకొనే అవకాశం, అవసరం కూడా ఉన్నాయి. అభిరుచి, అంటే tasteని గురించి చర్చించి, నిర్మించుకోవలసిన అవసరాన్ని గురించి నారాయణరావు గారు పదే పదే నొక్కి చెప్పేవారు.
తమ తోవ ఏదో స్థిరంగా తెలుసుకున్నవాళ్ళలోన ఈ స్థైర్యం వాళ్ళు కవులైతే ఇదివరకు ధీరత అనుకున్నది – తమ సృజన స్వరూపం గురించి, అనుభవం మీదను ఆరోగ్యకరమైన ఆత్మ విశ్వాసం గాను, పాఠకులైతే పరిణతమైన అభిరుచిగాను వ్యక్తమౌతున్నాది. వాళ్ళకి ఇతరుల అభిరుచితో పేచీలు లేవు, దాన్ని మార్చాలన్న దుగ్ధ లేదు, తమ సృజన అనుభవపు నాణ్యతని, ‘గొప్ప’తనాన్ని నలుగురికీ నిరూపించుకోవాలన్న తహతహ లేదు. ఇంకొకరికి, తమకంటే తక్కువ తెలిసినవాళ్ళు అనుకున్నవాళ్ళు పదిమందికీ తమ అభిరుచిని, అనుభవాన్నీ ఉవాచలుగా, ఉపదేశంగా పంచివ్వాలన్న కాంక్ష లేదు. వాళ్ళ ఔదార్యానికి ఈ మూర్తిమత్వమే ప్రాతిపదిక. దీన్ని సాధించుకోవటం ఎందుకో అంత కష్టం…! ఎవరైనా ఇలాగ తారసపడితే అద్భుతం అనిపిస్తుంది. కార్ల్ యుంగ్ తను చెప్పవలిసిందంతా విస్తారంగా చెప్పి కూడా చివరికి కాంట్ (Immanuel Kant) వంటి రససిద్ధాంతులే సృజన స్వభావం ఇదీ, స్వరూపం ఇదీ అని ఏమీ చెప్పలేకపోయేరు, నేను కూడా ఖండితంగా ‘ఇలాగ!’ అని ఏమీ చెప్పలేను, ఈ మాట తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించేరు.
త్రిపుర కొన్ని వేల గంటల సంభాషణల్లోన ఏ ఒక్క నాడూ కూడా ‘ఇలా చదువు, అలా రాయి, ఇలాగ చూడకూడదు!’ అని కనీసం సూచనగానైనా నిర్దేశించటం నేను చూడలేదు. బిపిన్ కూడా ఇంతే. ఎంతో చెప్తాడు గాని should అని, should not అనీ చెప్పడు. నాకు అబ్బురంలా ఉంటుంది. చాన్నాళ్ళ కిందట నాకు మురళి అని నా స్నేహితుడు, ఆయన అభిమానం వలన పత్రికలో ప్రచురించటానికి అవకాశం వచ్చింది. నేను ‘చాన్సు దొరికితే కానా మా… మ్మాఁ… మహదేవన్!’ అన్నట్టు రకరకాలుగా రాసి పంపిస్తున్నాను, కార్టూన్లతో సహా. త్రిపుర ఒక ఉత్తరం లోన ‘Must you draw those stupid cartoons too?’ అని మందలించేరు. నేను ఏమీ జవాబు రాయకుండానే ఆ తరువాతి ఉత్తరంలో మళ్ళీ ‘కార్టూన్లు ఎంత బాగున్నాయో చూడు ఆ బొమ్మలూ అవీ…’ అని అనునయిస్తున్నారు. Iowa ఉపాధ్యాయులు విద్యార్ధుల చెవి మెలిపెట్టి, శృంగభంగం చేసే సన్నివేశాలు చాల హృద్యంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మచ్చుకి కొన్ని:
డెల్బాన్కో (Nicholas Delbanco) అని అమెరికన్ నవలా రచయిత, ఉపాధ్యాయుడు. ఇదివరకు అనుకున్నాయన ఎల్కిన్ (Stanley Elkin) అని, ఇంకా నెమెరోవ్ (Howard Nemerov) అని – వాళ్ళిద్దరి సిద్ధాంతం ఏంటంటేనట: The real writer could not be discouraged. You are doing a favor by discouraging everybody, under the assumption that a very small proportion of them would endure. అంటే సహజంగా సృజనశీలురైన వాళ్ళని నిరుత్సాహ పరచటం అసాధ్యం. అంచేత రచయితలమని ఒచ్చిన విద్యార్ధులందర్నీ నిరుత్సాహ పరుస్తుంటేనే మంచిది. నిజంగా బలమైన కవులే అయితే వాళ్ళంతట వాళ్ళే ఎటూ నిలదొక్కుకుంటారు. పొగిడే కొద్దీ అకవులే తయారవుతారు. ఇది కఠినం అనిపిస్తుంది గాని అర్ధం చేసుకోగలిగినవాళ్ళకి అర్ధమవుతుందని డెల్బాన్కో అంటున్నారు.
ఆయన ఏం చేస్తాడంటేనట – సాధారణమైన విద్యార్ధుల్ని “Oh, that’s much better, wonderful…” అని ఎంతగానో పొగిడి పంపిస్తాడు. కాని ప్రతిభ ఉందనిపించే చాల కొద్దిమంది విద్యార్ధుల్ని మాత్రం సీరియస్‌గా తీసుకుని వాళ్ళతో మాత్రం ‘ఎందుకు టైం వేస్ట్? నువ్వింక తట్టా బుట్టా సర్దుకుని ఇంటికెళిపోకూడదా?’ అని నిరుత్సాహపరుస్తాడట. (“You’re wasting my time, you should pull up your socks, go home and do it again!”) అవార్డుల గురించి, గుర్తింపు గురించి త్రిపుర చెప్పిన ఛలోక్తులున్నాయి. రిపబ్లిక్ డే రోజు దేశం నలుమూలల్నుండీ సాహసవంతులైన బాల బాలికల్ని గుర్తించి, ఢిల్లీ రప్పించి ‘బాల వీర చక్ర’ అని ఇలాంటి అవార్డు ఏదో ఇస్తారు. ఒకసారి అగర్తలాలో ఎవరో ఒకబ్బాయి చాల ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎవరినో ప్రమాదం నుండి కాపాడేడు. అతనికి ఆ ఏడాది ఈ బాలచక్ర వచ్చింది. అది అందుకుని వెనక్కొచ్చి వాడు ఇదివరకు బుద్ధిమంతుడైన బాలుడు కాస్తా నలుగురి మీదా దాష్టీకం చేస్తూ పేటకంతా రౌడీలాగ తయారయ్యేడు. ‘అయ్యో! బంగారంలాంటి కుర్రాడు వీడికి బాలచక్ర ఇచ్చి అనవసరంగా చెడగొట్టేరు!’ అనుకుని ఊళ్ళో నవ్వుకునేవాళ్ళట.
సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని తమదైన స్థైర్యాన్ని కనుక్కోలేనంత కాలం ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా, కాకుంటే లోన ఎటుకీ ఏమీ తోచని అయోమయమైన సంశయమూ, పైకి మౌనంగా తప్పించుకు తిరిగే మర్యాదగాను వ్యక్తమౌతాయి. ఇలాంటి సృజనశీలురు తెలివైనవాళ్ళు – అంటే గడుసువాళ్ళు, మాటకారులు అయితే అభిరుచిలో, సృజనానుభవంలోని అపరిపక్వత డాంబికం – అంటే intellectual posturing అనేదానిగా స్థిరపడుతున్నాది. దురదృష్టవశాత్తు సృజనశీలికి తన తోవ ఏమిటో అభిరుచి ఏమిటో ఇతరుల అభిప్రాయలపై, సిద్ధాంతాలపై, మెప్పు లేదా తెగడ్తలపై ఆధారపడకుండా కనుక్కోని, స్థిరపరచుకోక తప్పని అవసరం, అగత్యం ఉన్నాయి. తెలివైనవాళ్ళ ఉవాచలు, అభిప్రాయాల్ని, తాము చెప్తున్న వాటితో సహా, మరీ సీరియస్‌గా నమ్ముకుంటే సృజనకారులు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా అవి అడ్డు తగిలే ప్రమాదం ఉందని ఈ చెప్పిన ఉపాధ్యాయులందరూ సూచిస్తున్నారు.
ఇదివరకు అనుకున్నట్టు కోట్లాది మనుషుల్లో కొన్ని వేలమందైనా చాల తెలివైనవాళ్ళుంటారు. వీళ్ళల్లో మాటకారులుంటారు. తెలివైనవాళ్ళలో చాలా మందికి తమకు తోచిన ఆలోచనల మీద తమకే ఏదో ప్రేమ, నమ్మకం, గౌరవం లాగ ఉంటాయి. కవులు, రచయితలకు తాము రాసినవి సృజనలూ, ఉవాచలూ మంచి నాణ్యమైన రచనలేనని భ్రమలాగ ఉంటుందట. Iowa Writers Workshop వంటి చోట్లలో ఉపాధ్యాయులు పరిశీలించి చెప్పిన సంగతి. ఎవరిది వాళ్ళకి బాగానే ఉంటుందట. ఇదివరకు బింబ ప్రతిబింబ క్రియలని చెప్పుకున్న ప్రక్రియల్లోన పాల్గొంటున్న ఇద్దరూ – రచయిత, పాఠకుడు ఇద్దరూ ఒక్క మనిషే కావడం వలన, సృజన పాఠంతో అంతగా ప్రమేయం లేకుండానే ఎవరు రాసింది వాళ్ళకి సాంతం ‘అర్ధం’, ‘అనుభవం’ అయినట్టే ఉంటాయి. అలాగే వినేవాళ్ళు, పాఠకులు వీళ్ళు కూడా తమదంటూ స్థిరమైన, బలమైన అభిరుచి లేనివాళ్ళయితే తెలివితేటలుగా చెప్పిన మాటలు ఏవైనా ఏదో ఒక మేరకు బాగానే ఉంటాయి. స్థిరంగా, ఉవాచల్లాగ చెప్పేవాటికి విశ్వసనీయత వస్తుంది. ఎల్కిన్ అని ఇది వరకు పరిచయం చేసిన రచయిత ఈ విషయాన్ని గురించి అన్నది: “There is nothing as convincing as an opinion.” అని. అంటే – ఎవరైనా తెలివైనవాళ్ళు స్థిరంగా ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తే నమ్మాలనిపిస్తుంది.
ఆయన ఈ మాటలు ఏ సందర్భంలో అన్నారంటే గార్డ్‌నర్ (John Gardner) అని చాల ప్రసిద్ధుడైన రచయిత, విమర్శకుడు; సృజనను గురించి ఆయన పుస్తకాలు The Forms of Fiction, The Art of Fiction వంటివి చాల ప్రాచుర్యంలోకి వచ్చేయి. ఆయన “Art instructs.” అని అన్న మాటల్ని ఎల్కిన్ ఖండిస్తున్నాడు – సృజనకు ప్రబోధించే శక్తి లేదని. “It ultimately teaches you taste. Taste in fiction, taste in poetry, taste in music, taste in life.” అని ఎల్కిన్. ఆ సందర్భంలో ఆయన ఎవరైనా గంభీరంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని మరీ అమాయకంగా నమ్ముకోకూడదని జాగ్రత్త చెప్తున్నాడు. If somebody says, “Cripples should not be permitted on the street after dark,” somebody will think, ‘well, may be that’s a good idea.” అని. ‘గోధుమ రంగు మేజోళ్ళు వేసుకున్నాడు, వీడేం మనిషయ్యా?’ అని గట్టిగా ఎవరి గురించైనా అంటే ‘అవున్నిజమే! గోధుం రంగు మేజోళ్ళా? తలతిక్క కాకపోతే!’ అని పదిమందికీ రూపించవచ్చని, అభిప్రాయాలు, ఉవాచల గురించి తస్మాత్ జాగ్రత్త! అని.
చాలా ఏళ్ళ కిందట నాకు పుపుల్ జయకర్గారి పుస్తకాలంటే ఇష్టంలాగుండేది. ఆవిడతో మాట్లాడి వచ్చి ఆ సంగతులు త్రిపురకి చెప్తున్నాను. మళ్ళీ నాలో నాకే సందేహం లాగుండి త్రిపురనే అడిగేను. పుస్తకాలూ అవీ రాసేవాళ్ళంటే వాళ్ళేదో ప్రత్యేకమైన మనుషులని ఆరాధనలాగ అవుతుంది కదా త్రిపుర? అని. ఆయన ‘కొంతమందికి అలాగ బాగా రాయడం వస్తుందివై. అంతే. అంతకంటే ఏంలేదు!’ అని హెచ్చరికలాగ చెప్పేరు. జిడ్డు క్రిష్ణమూర్తి గారి రచనలంటే ఆరాధనలాగ ఉండేది. అదొక ప్రత్యేకత లాగాను. త్రిపుర అది కూడా గమనించి, గమనించి తను స్వయంగా జిడ్డు క్రిష్ణముర్తి గారి శిష్యుణ్ణనీ బెనారస్‌లో ఆయనకి పాల గ్లాసు అందించటం ఇలాగ కధలు చెప్పేరు. చెప్పి చివరికి ‘ఆ మాటలు సమ్మోహకరంగా ఉంటాయనుకో! ‘ (“It casts a spell over you!”) అని అలా క్రమంగా కొంత కాలానికి బయటికొస్తామని చేత్తో సైగ చేసేరు. అలాగే అయ్యింది. త్రిపుర మీది వీరాభిమానాన్ని కూడా త్రిపురే సాంతం ఒదలగొట్టేరు – దానికి ఎలాంటి పోషాకూ దొరికే ఆస్కారం లేకుండా చేసి. మంట ముట్టించిన కర్రని మంటలోకే విసిరి తగలబెట్టినట్లు. కర్పూర హారతి ఉద్దేశం ఇదేనట. ఏ ఆనవాలూ మిగలకుండా అంతా కాల్చమని. బిపిన్ కూడా ఇలాగే చేస్తాడు. వాళ్ళతో చర్చ చాల హాయిగ ఉంటుంది.
సృజన పూర్తయి, ఆవిష్కృతమయ్యాక దాని యెడల సృజనకారుని దృష్టి రసాస్వాదన కాదు; మూల్యాంకనం, బేరీజూ కావు; స్థైర్యం. జాఁ కాక్తో (Jean Cocteau) అని ఫ్రెంచ్ కవి, రచయిత. విమర్శకుల విమర్శని గురించి ఆయన అన్నది – “One should pay close attention to which they most dislike, which is probably the only original quality you have going for yourself, and you’d best make a note of it and keep doing and doing it.” మేఘదూతం లోని ఈ శ్లోకం కాళిదాసుకు తన సృజన పట్ల ఉన్న స్థైర్యానికి తార్కాణమని ఒక కధ ఉంది:
అద్రేః శృంగం హరతి పవనః కింస్విదిత్యున్ముంఖీభిః
దృష్టోత్సాహః చకిత చకితమ్ ముగ్ధ సిద్ధాంగనాభిః
స్థానాదస్మాత్ సరస నిచులాత్ ఉత్పదోదున్ముఖఃఖమ్
దిజ్ఞానాగానామ్ పధి పరిహరమ్ స్థూల హస్తావలేపామ్
ఆషాడమాసపు తొలి దినాల్లోన మేఘుడు ఆకాశానికెగసి తన దౌత్యానికి ప్రయాణం మొదలుపెడుతున్నాడు. గాలి కాని నల్లని కొండ శిఖరాన్ని ఎత్తుకొని పోతోందా అని ఆకాశంలో ఉండే సిద్ధాంగనలు చకితులై చోద్యం చూస్తున్నారు. దిగ్గజాలు తమ బలిసిన తొండాల్ని ఆడిస్తూ ముందుకి పోదామన్న అతని ప్రయాణానికి పదే పదే అడ్డం పడుతున్నాయి. కాని నిచులములనే రసార్ద్రమైన ఆకాశ లతలు తోడుగా నిలుచున్నాయి. మేఘుడా! ఇంక నీ తోవకు ఆటంకం లేదు అని దీని తాత్పర్యమట. కాని ఈ కధలోని గూఢార్ధమేమంటే – కాళిదాసుకు నిచలుడని ఒక స్నేహితుడుండేవాడు. ఆయన రాసింది గ్రహించేవాడు. దిజ్ఞానాగాచార్యుడని ఒక తర్క పండితుడుండేవాడు. ఆయన కాళిదాసు సృజనను అధిక్షేపిస్తూ అన్నివిధాలా అడ్డుపడేవాడు. ‘దిజ్ఞానాగాచార్యుడు ఎంతగా అడ్డం పడితేనేమిలే రసజ్ఞునుడైన నిచలుడున్నాడు, నీ ప్రయాణానికింక ఆటంకం లేదు, వెళ్ళు! ‘ అని కాళిదాసు అన్యాపదేశంగా తనకు తానే చెప్పుకుంటున్నారని శ్రుతి.
11.
లౌక్యుడు, నాయకుడు, శాస్త్రజ్ఞుడు, సృజనశీలి, యోగి, వెర్రివాడు – ఈ అన్ని రకాల మనుష్యులకు సమానంగా ఉన్నది జాంతవ ప్రకృతి. సంస్కృతి కంటె చాల పురాతనమైనది. సారస్వత సృజనతో వీళ్ళందరి అనుబంధాన్ని, అనుభవాన్ని అర్ధం చేసుకోడానికి ముందుగా మానవ జంతువు ప్రకృతిని గురించి, అవసరాల్ని గురించీ కొంతైనా తెలియాలి. ఉదాహరణకు Boredom ఉంది – ఇది సంస్కృతి పరిణామక్రమం లోన ఇటీవల, అంటే పద్ధెనిమిదవ శతాబ్దం నుండి మనుషుల ప్రవర్తనను శాసించే ప్రబలమైన శక్తిగా మారిందని మనస్తత్వవేత్తలు అనేకులనుండి ప్రతిపాదన. ఈ మాటకు సరైన తెలుగు మాట దొరకదు. పాలుమాలిమి, ఊసుపోక ఇలాగ ఉన్నాయి గాని అవేవీ ఆధునిక సమాజపు బోర్‌డమ్‌కు సమానార్ధకాలు కావు. ఆధునికులు సృజన వెనుకనున్న ప్రబలమైన చోదకశక్తుల్లో ఇది ఒకటని నిర్ధారిస్తున్నారు. “Artists pursue meaninglessness until they can force it to mean something. They immerse themselves in chaos to give it form.” అని మే (Rollo May) అన్నారు.
జీవితపు మౌలికమైన అనుభవం అయోమయం, అర్ధరహితమని, బోర్‌డమ్ దీనికి ఒక చిహ్నమనీ, ఫలితమనీ అస్థిత్వవాదులు – కీర్క్‌గార్డ్ (Kierkegaard), నీచ (Nietzsche), పాస్కల్ (Pascal) వంటివాళ్ళు ప్రతిపాదించేరు. వీళ్ళల్లో పాస్కల్ అవగాహన చాల కఠోరంగాను, నిరాశాజనకంగాను ఉంటుంది. జీవితం అనంతమైన అఖాతానికీ కడపటి మహా శూన్యానికీ నడుమ అర్ధం లేని ఒంటరితనమనీ, మనిషి ఈ నిరర్ధకత్వాన్నుండి తప్పించుకునేందుకు రకరకాల మరిపింతల్ని వెదుక్కొని వినోదింపచూస్తూ కూడా చివరికి సఫలం కాలేడనీ. ఈ బాధనుండి తప్పించుకోడానికి ఆయన సూచించినవాటిలో సృజనకు స్థానం లేదు, ఆలోచనకూ స్థానం లేదు; ఒక్క ఈశ్వరునికే స్థానం ఉంది. “The heart has its reasons of which reason knows nothing. It is the heart which perceives God and not the reason. That is what faith is: God perceived by the heart, not by the reason.” అన్న ఆయన ప్రతిపాదన పదహారవ శతాబ్దం నాటిది. మానవ సమాజపు సమస్యలకి ముఖ్యమైన కారణం బోర్‌డమ్, దాని వలని చాపల్యం అని పాస్కల్ : “All of man’s troubles stem from his inability to sit quietly in a room alone.” మనుషులు చేసే పాపాల్లో సగానికి సగం బోర్‌డమ్ నుండి తప్పించుకోడం కోసమేనని బెర్ట్రండ్ రసెల్ (“At least half the mankind’s sins are caused by the fear of it.”).
ఇందుకు భిన్నంగా నీచ అస్థిత్వపు శూన్యతను, అర్ధరాహిత్యాన్ని సృజన ద్వారా అర్ధవంతంగా, నిరామయంగా మార్చుకోవచ్చునని నొక్కి చెప్పేరు. ఆయన దృష్టిలోన ప్రపంచం – అంటే మనిషికి గోచరమయ్యే ప్రపంచం – ఒక సృజనాత్మక స్థితి. “Only as an aesthetic product can the world be justified to all eternity.” ప్రపంచాన్ని, జీవితాన్ని ఇలా సృజనాత్మకంగా అనుభవించటానికి తప్పనిసరైనది Frenzy అంటే ‘ఉన్మాదం’ వంటి సృజనానుభవం. “If there is to be art, if there is to be any aesthetic doing and seeing, one physiological condition is indispensable: frenzy. Frenzy must first have enhanced the excitability of the whole machine; else there is no art.” కళాకారుడు సృజన ద్వారానే జీవితానుభవాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నాడు. “A man in this state transforms things until they mirror his power – until they are reflections of his perfection. This having to transform into perfection is – Art.” పాస్కల్‌కు భిన్నంగా కళ మతం వంటి ధార్మిక విశ్వాసాలకంటె ఉత్కృష్టమైనదనీ, సృజనానుభవమే మానవ జీవితపు సాఫల్యమనీ ఆయన ప్రతిపాదన – “In art man enjoys himself as perfection.” మనిషి అన్వేషించి, అందుకోవలసింది దైవం కాదు, సృజనానుభవం అనీ, అస్తిత్వపు అర్ధరాహిత్యానికీ శూన్యతకూ అదే ఒకే ఒక్క ఉపశమనమనీ నీచ చేసిన ప్రతిపాదన. మతపరమైన విశ్వాశాలు దైవమనే పరమ సత్యాన్నేదో ప్రతిపాదించి, అన్యాపదేశంగా సృజనను ఒక అసత్యమని చిన్న చూపు చూస్తాయని ఆయన ఆస్తికుల మతాన్ని, దైవ చింతననూ నిరసించేరు. “Art as the single superior counter-force against all will to negation of life, art as the anti-Christian, anti-Buddhist, anti-Nihilist par excellence.” బోర్‌డమ్ నుండి, అస్తిత్వపు అర్ధరాహిత్యం నుండి విముక్తిని, లేకుంటే కనీసం ఉపశమనాన్ని ఇవ్వగలిగిన సృజన, అదే బోర్‌డమ్ బారినపడి పతనం కావటం సినిమా వంటి మాధ్యమాల్లోన, సారస్వతంలోనూ సర్వ సాధారణంగా కనిపిస్తుంది. మరంచేత, సృజననూ బోర్‌డమ్‌నూ కలిపి పరికించవచ్చును.
సృజనకు, బోర్‌డమ్‌కు, అస్తిత్వానికి, అర్ధవంతమైన మనుగడ కోసం ఆరాటానికీ ఉన్న జటిలమైన సంబంధాల్ని గురించి చాల చర్చ, ఇటీవలి కాలంలో మరీ విస్తారంగా వస్తుంది. బోర్‌డమ్‌కు సారస్వతంతో ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి ఉదాహరణకు స్పాక్స్ (Patricia Meyer Spacks) అని మనస్తత్వవేత్త పరిశోధన ఉంది Boredom: The Literary History of a State of Mind అని. ఆవిడ నిర్ధారణలు ఏమంటే రాయటం, చదవటం ఈ రెండు వ్యాసంగాలూ ప్రధానంగా బోర్‌డమ్ బారినుండి తప్పించుకొనే ప్రయత్నాలే. (“As action and as product, writing resists boredom, constituting itself by that resistance. In this sense, all writing is about boredom. The act of writing implicitly claims interest (boredom’s antithesis)… any autonomous process of writing protects the writer for a time against the vacuity of what we call boredom.”) అలాగే సృజననుండి పాఠకులు ఆశించేదీ బోర్‌డమ్ నుండి విముక్తి: “Voluntarily picking up a book, we expect – indeed demand – to have our interest engaged.”
(ఇంకా ఉంది)
(పైన పద్యాన్ని, శ్లోకాన్ని పరిచయం చేసిన ఉపాధ్యాయులు, సృజనకారులు శ్రీ పి. వి. ఆర్. కె. మూర్తి గారికి కృతజ్ఞతలు.)