కిరానా సంప్రదాయపు భీమబలుడు


యువకుడుగా భీమ్‌సేన్‌జోషీ

24 జనవరి 2011 తేదీన కాలంచేసిన భీమ్‌సేన్‌జోషీ మనదేశంలో చెప్పుకోదగ్గ హిందూస్తానీ గాయకులలో ఒకడు. 2009లో భారతరత్న బిరుదు లభించడమూ, మిలే సుర్ మేరా తుమ్హారా, వంటి టీ.వీ. ప్రదర్శనలూ, దక్షిణాదివారికి సంబంధించినంతవరకూ బాలమురళితో చేసిన జుగల్బందీ కచేరీలూ ఇటీవలి కాలంలో ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయనేది నిజమే అయినప్పటికీ సంగీతకారుడుగా ఆయన దశాబ్దాల కిందటే పేరు పొందినవాడు.

ఎంతోకాలంనుంచీ పుణే నగరంలో నివసిస్తూ మహారాష్ట్రలో ఎక్కువగా సంగీతకచేరీలు చేస్తూ ఉండడంతో భీమ్‌సేన్‌జోషీ దక్షిణాదికి చెందినవాడనేది ఎక్కువగా గుర్తుకురాదు. ఆయన పుట్టిపెరిగిన ఉత్తర కర్నాటక ప్రాంతంనుంచి అనేకమంది గాయనీగాయకులు పేరుపొందారు. 1922లో గడగ్‌లో జన్మించిన జోషీని చిన్నవయసులోనే తల్లి చనిపోవడంతో సవతితల్లి పెంచిందట. 16 మంది పిల్లల్లో పెద్దవాడైన భీమ్‌సేన్‌జోషీకి చిన్నప్పటినుంచీ సంగీతమంటే ఇష్టమట. గుడిలోని భజనలూ, మసీదు ప్రార్థనలూ అన్నీ అతనికి బాగానే ఉండేవట. అతని తాతగారు కీర్తనలు పాడేవాడట. అతని తండ్రి సంస్కృత పండితుడు. ఇంగ్లీష్ టీచర్‌గా, స్కూలు హెడ్మాస్టర్‌గా పనిచేసేవాడు.
చిన్నప్పుడు భీమ్‌సేన్‌జోషీకి కొంత మొండివైఖరి ఉండేదట. ఎక్కువగా పాటల రికార్డులమ్మే దుకాణం బైట నిలబడి సంగీతం వింటూ కాలం గడిపేవాడట. అతన్ని 11వ ఏట ఎక్కువగా సమ్మోహితుణ్ణి చేసినది కరీమ్‌ఖాన్ పాడిన బసంత్ రాగం.


తండ్రి గురురాజ్‌జోషీ ఆశీస్సులు

సంగీతాభిమానం కారణంగా భీమ్‌సేన్‌జోషీ చదువు హైస్కూలు దశలోనే ఆగిపోయింది. తన 11వ ఏటనే ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా అతను సంగీతం కోసమని ఊరూరూ తిరిగాడు. ఒకరకమైన అశాంతీ, మొండితనం, తెగింపూ, పట్టుదలా అతన్ని ముందుకు నెట్టాయి. స్వస్థలమైన గడగ్‌నుంచి అతను బిజాపూర్, పుణే, బొంబాయి, గ్వాలియర్, బెంగాల్, జలంధర్ మొదలైన చోట్లన్నిటికీ వెళ్ళాడు. ఎన్నోసార్లు అతను టికెట్టు లేకుండానే రైళ్ళెక్కాడు. డబ్బు కోసం రైళ్ళలో భజనలు పాడి పొట్ట నింపుకున్నాడు. ఇళ్ళలో చాకిరీ కూడా చేశాడు. గ్వాలియర్‌లో ప్రసిద్ధ సరోద్ విద్వాంసుడు హాఫిజ్అలీని (నేటి కళాకారుడు అమ్జద్ అలీ తండ్రి) కలుసుకున్నాడు. ఆయన భీమ్‌సేన్‌జోషీకి మార్‌వా, పూరియా, లలిత్‌ వంటి రాగాల విశిష్టతను తెలియజెప్పాడు. జలంధర్‌లో మహారాష్ట్ర గాయకుడు వినాయక్‌రావు పట్వర్ధన్ అతని గోడు విని సవాయీ గంధర్వ గురించి చెప్పి, ‘మీ ప్రాంతంలోనే ఉంటూ ఆయనవద్ద సంగీతం నేర్చుకో’మని సలహా ఇచ్చాడట.

సవాయీగంధర్వగా పేరుపొందిన రాంభావూ కుందగోళ్కర్ (1886-1952) ఉస్తాద్ కరీమ్‌ఖాన్ శిష్యుడు. (సవాయీ గంధర్వ అంటే ‘ఒకటింబావు గంధర్వ’ అని అర్థం. ఆ రోజుల్లో ఎంతో పేరు పొందిన బాలగంధర్వకు ఇతనేమీ తీసిపోడనే అభిప్రాయంతో ఎవరో ఒకాయన ఇతన్ని సవాయీగంధర్వ అన్నాడట. అప్పటినుంచీ ఈ పేరు స్థిరపడిపోయిందట). మొత్తంమీద తన యాత్రలన్నిటినీ ముగించుకుని భీమ్‌సేన్‌జోషీ సవాయీగంధర్వ వద్ద శిష్యుడుగా చేరి 1940-1945 మధ్యలో సంగీతం నేర్చుకున్నాడు. గాత్రం నేర్పడానికి సవాయీగంధర్వ ఆ రోజుల్లోనే నెలకు పాతికరూపాయలు తీసుకున్నాడట. అప్పటికి భీమ్‌సేన్‌జోషీ తండ్రి గురురాజ్‌జోషీ నెలజీతం వందరూపాయలే అయినప్పటికీ ఆయన వెనకాడలేదు. గురుశుశ్రూషగా ఇంటిచాకిరీ అంతా చేసిన అయిదేళ్ళలో భీమ్‌సేన్‌జోషీ గురువువద్ద మూడే రాగాలు (తోడీ, ముల్తానీ, పూరియా) నేర్చుకున్నాడట. తక్కినవి గురువు కచేరీల్లో పాడుతున్నప్పుడూ, గంగూబాయి హానగల్‌ (1913-2009) వంటి సీనియర్ శిష్యులు పాడగా వినీ ఆకళించుకున్నాడు. సవాయీగంధర్వ ఇతర శిష్యుల్లో బసవరాజ్‌ రాజ్‌గురు (1917-1991), ఫిరోజ్‌ దస్తూర్ (1918-2008) మొదలైనవారుండేవారు.

గొప్ప సంగీతవిద్వాంసులందరూ కఠోరసాధన చేసి పైకొచ్చినవారే. భీమ్‌సేన్‌జోషీకి బాల్యస్నేహితుడైన కులకర్ణీ అనే ఒకాయన ఆ వివరాలు చెప్పాడు. భీమ్‌సేన్‌జోషీ తన ఇరవయ్యో ఏటనే సాయంత్రం 7గంటలకు మొదలుపెట్టిన సంగీతసాధనను మర్నాడు పొద్దున్న 6 దాకా కొనసాగించేవాడనీ, వేసిన గమకం వెయ్యకుండా పాడేవాడనీ అన్నాడు. అతను జీవితమంతా సీదాసాదా వ్యక్తిగానే ఉన్నాడనీ, కీర్తిప్రతిష్ఠల కోసం ఎన్నడూ పాకులాడలేదనీ చెపుతూ, భీమ్‌సేన్‌జోషీకి సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తీ, రాఘవేంద్రస్వామి మీద భక్తీ మటుకు పుష్కలంగా ఉండేవని కులకర్ణీ అన్నాడు.


భీమ్‌సేన్‌జోషీ, గంగూబాయి

కులకర్ణీకూడా బొంబాయిలో కష్టపడ్డ మనిషే. బొంబాయి రేడియో ప్రోగ్రాములు సవ్యంగా వచ్చేదాకా భీమ్‌సేన్‌జోషీ బీదరికంతో కష్టపడ్డాడనీ, తాను మాటుంగాలో మరొక 20మంది కన్నడం కుర్రవాళ్ళతో కలిసి ఉంటున్న కొంపనుంచి చర్నీరోడ్డు దగ్గరున్న రేడియోస్టేషనుకు వెళ్ళడానికి ట్రాము టికెట్టు ఖర్చుకు అణా ఖర్చుపెట్టలేక 10 కి.మీ. కాలినడకనే వెళ్ళివచ్చేవాడనీ కులకర్ణీ అన్నాడు. ఆ తరవాత ప్రోగ్రాముకు 5 రూపాయల చొప్పున సంపాదించి, దానితో రెండేసి వారాలు గడిపేవాడనీ, నెమ్మదిగా అతని ప్రతిభ గురించి నలుగురికీ తెలిసిందనీ ఆయన చెప్పాడు.

భీమ్‌సేన్‌జోషీకి గాయకుడుగా లక్నో రేడియోస్టేషన్‌లో మొదటి ఉద్యోగం ఇప్పించినది ప్రముఖ గజల్ గాయని బేగం అఖ్తర్. అతను 1943లో బొంబాయి రేడియోకు బదిలీ చేయించుకున్నాడు. అక్కడ అతని ఎచ్.ఎం.వీ. రికార్డ్‌లూ, 1946లో తన గురువు షష్ఠిపూర్తికి చేసిన పాటకచేరీ మంచి పేరును తెచ్చిపెట్టాయి. అతను 1960లలో కచేరీలకని ఎన్ని ప్రయాణాలు చేసేవాడంటే అతనికి రైల్వే టైమ్‌టేబ్‌ల్ కంఠతా వచ్చుననీ, ఎయిర్‌హోస్టెస్‌ల పేర్లన్నీ క్షుణ్ణంగా తెలుసుననీ సాటి గాయకులు అనుకునేవారట!

భీమ్‌సేన్‌జోషీ పాడుతున్నప్పుడు ఆయన గొంతు ఖంగుమని మోగుతుంది. అంత తియ్యగా, మృదువుగా అనిపించదు. సవాయీగంధర్వ తన గురువుగారి మధురమైన గాత్రపద్ధతిని అనుకరించాడు గాని భీమ్‌సేన్‌జోషీ శైలిలో ఆ ధోరణి కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది. భీమ్‌సేన్‌జోషీ పాటలో మార్దవం తక్కువే అనడానికి ఉదాహరణగా ఆయన పాడిన మియాఁ మల్‌హార్ మూడు భాగాల్లో చివరిది మేఘాల ఉరుములనూ, పిడుగులూ, మెరుపులనూ స్ఫురింప జేస్తుంది. అది వర్షఋతువుకు సంబంధించిన రాగం (ని2 స రి2 ప మ1 ప ని1 ద2 ని2 స, స ని2 ధ2 ని1 మ1 ప ని1 గ1 మ1 రి2 స) కనకనే ఆయన ఆ ధోరణిని ప్రదర్శించాడని వేరే చెప్పనవసరంలేదు. అందులోని రెండు నిషాదాల బిగువైన విన్యాసాలను గుర్తించినవారికి అద్భుతంగా అనిపించితీరుతుంది. ఆయన పాడిన దుర్గా (శుద్ధసావేరి) విన్నప్పుడు ఆయన నిర్దుష్టమైన శైలి మనను ఆకట్టుకుంటుంది. తాను అన్ని రకాల రాగాలనూ పాడననీ, తన పద్ధతికి నప్పేవాటినే ఎంచుకుంటాననీ ఆయన ఒక సందర్భంలో చెప్పాడు.

శాస్త్రీయసంగీతానికి ఆకర్షణీయమనిపించే కంఠధ్వని అంత ముఖ్యంకాదనేది తెలిసినదే. అటువంటి పట్టింపులుంటే వోలేటి వెంకటేశ్వర్లు వంటి గాయకులకు పేరు వచ్చేదే కాదు. డి.వి.పలూస్కర్‌ వంటి గాయకుల గొంతు ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే భీమ్‌సేన్‌జోషీ గాత్రంలో ఉన్న పుష్టిదనం యొక్క ఆకర్షణీయత తక్కువేమీ కాదు. ఆయనది శాస్త్రీయతతో ఏ మాత్రమూ రాజీపడని ధోరణి. రాగం మీద ఆయనకు ఎంతటి అభిమానమూ, అధికారమూ ఉండేదంటే కేవలం భక్తిగీతాలు పాడుతున్నప్పుడు కూడా ఆయన శైలిలో శాస్త్రీయధోరణి మోతాదు ఎక్కువగా ఉంటుందని కొందరు విమర్శ చేసేవారు. శాస్త్రీయరచనల్లో ఆయన పదాలు ఉచ్చరించే తీరు ఇతర హిందూస్తానీ గాయకులలాగే అస్పష్టంగా ఉన్నప్పటికీ, భక్తిసంగీతం పాడుతున్నప్పుడు మాత్రం మాటలను స్పష్టంగా పలుకుతూ, అర్థమయేట్టుగా పాడేవాడు. సంగీతంలో ఏ సందర్భంలో సాహిత్యం ప్రధానాంశమవుతుందో ఆయన వంటి అనుభవజ్ఞులకు బాగా తెలుసు. అహీర్‌భైరవ్ (చక్రవాకం) రాగంలో ఆయన పాడిన తీర్థ విఠ్ఠల భజన్ ఎంతో ప్రజాదరణ పొందింది.