ఒక కప్పు కాఫీ

రాజప్ప ఉన్నట్లుండి లేచి కూర్చున్నాడు. చెమటతో అతని ఒళ్ళంతా తడిసి పోయింది. పక్కనే ఉన్న మాసిపోయిన తువ్వాలతో వీపును తుడుచుకున్నాడు. ఎంత విచిత్రమైన కల?

అడవిలాంటి ప్రదేశం. పాముల పుట్టల్లాగా మట్టితో కప్పబడి పోయిన పెద్ద పెద్ద గుహలు. అతను వాటిని దాటుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఆవరించుకుని ఉన్న నిశ్శబ్దం భారంగా మారి గుండెను నొక్కుతున్నట్లుగా అనిపించింది. గుహలనుంచి పాములేమైనా వచ్చి తన మీదికి దాడి చేస్తాయేమోనన్న భయం అతన్ని వేగంగా నడిచేటట్లు చేసింది. గుహల్లో పాములు లేవు. ఉన్నట్లుండి వాటిల్లోనుంచి గుంపులు గుంపులుగా మనుష్యులు వచ్చారు. అందరూ చేతుల్లేని వాళ్ళు. అమ్మ నాన్న, పిల్లలు అంటూ కుటుంబం కుటుంబంగా మొండి చేతులు! వాళ్ళందరూ వరసగా నిలబడి అతనినే చూస్తున్నారు. వాళ్ళ తీవ్రమైన చూపులకి అతని రెండు చేతులు క్రింద పడిపోగా, ఆ చేతులతో పిల్లలు ఆడుకుంటున్నారు. అందరూ అతన్ని చూసి నవ్వుతున్నారు. ఆ బహిరంగ ప్రదేశంలో వాళ్ళ నవ్వులు మారుమోగుతున్నాయి.

ఒంటిని తువ్వాలతో తుడుచుకున్న తర్వాత రాజప్ప తన చేతులను పరిశీలనగా చూసుకున్నాడు. వాటికి ఏ ఆపదా రాలేదు. భద్రంగానే ఉన్నాయి.

ఎందుకని? అదే అతనికీ అర్థం కాలేదు. ఈ చేతులతో అతను కష్టపడి సంపాదించినది లేదు. కడుపు మాత్రమే కష్టపడింది. పెళ్ళిళ్ళు ఎక్కడ, కర్మకాండలు ఎక్కడ అని ఇల్లిల్లూ వెతుక్కుంటూ కష్ట పడుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆ ఉద్యోగానికీ దారి లేకుండా పోయింది. ఊళ్ళో పెళ్ళిళ్ళూ జరగలేదు. మనుషులూ ఆరోగ్యంగా ఉన్నారు. పోయిన వారం మెట్ట వీధిలో పార్వతమ్మకి ప్రాయశ్చిత్తం జరగబోతుందని తెలియగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. పెదవి విరుస్తూ బైటికి వచ్చిన డాక్టరును చూడగానే అతనికి నమ్మకం కలిగింది. ముసలావిడకి తొంబై ఏళ్ళని అన్నారు. పెళ్ళి చావు! బాగా ఉన్న కుటుంబం. పదిహేను రోజుల దాకా భోజనానికి ఢోకా లేదు. దొరికే డబ్బులు కూతురు మైదిలికి చీర కొనడానికి సరిపోతుందో లేదోనని ఆతను ఆలోచిస్తుండగా, ముసలావిడ కళ్ళు తెరిచి బిత్తర చూపులు చూసింది. అంతే! వచ్చిన యముడు భయపడి పారిపోయాడు. ప్రాయశ్చిత్తానికి దొరికిన డబ్బులు తమలపాకులు, వక్క కొనడానికి మాత్రమే సరిపోయాయి.

రాజప్ప అరుగు మీద నుంచి దిగాడు. అరుగు మీద ఇంకో మూలలో పడుకున్న ఆరుముగం లేచి గుడి పనులను చూడడానికి వెళ్ళిపోయాడు. ఆరుముగాన్ని చూస్తే అసూయగా అనిపించింది. బ్రహ్మచారి. బ్రహ్మచారిగా ఉండడానికి అతని ఆకృతి కూడా ఒక కారణం. సన్నగా వెదురు బొంగు లాగా వంగిన శరీరం. కడుపు, వీపు ఒకదానికొకటి అతుకున్నట్లుగా అనిపిస్తుంది. ఏ అమ్మాయి ఇతన్ని చూసి పెళ్ళి చేసు కోవడానికి ముందుకు వస్తుంది?

రాజులాగా అందంగా ఉన్నాడని అతనికి రాజప్ప అని పేరు పెట్టారు. చిన్నప్పుడు అతను రాజులాగే ఉండే వాడు. తినాలంటే సంపాదించాలన్న వివరం కూడా అతనికి అప్పుడు తెలియదు. బడిలో బుద్దిగా చదువుకుని ఉంటే, యముడిని నమ్ముకుని జీవితాన్ని గడిపే అవసరం వచ్చి ఉండేది కాదు, కనీసం ముందు నుంచే బుద్దిగా వేదం చదువుకుని ఉండాల్సింది. ఉత్తర ప్రాంతంలో వైదీకులకి బాగా గిరాకీ ఉన్నట్లు ఆమధ్య ఢిల్లీ నుంచి వచ్చిన నాచ్చియార్ కోవిల్ అబ్బాయి చెప్పాడు. బ్రాహ్మణ పుటక పుట్టి మంత్రాలు తెలియవు, వేరే ఏ పనీ చేతకాదు అన్నప్పుడు, తనలాంటి వాడికి కడుపును మూలధనంగా చేసుకుని బ్రతకడం కంటే వేరే దారి ఏముంది?

అతని తమ్ముడు చదువుకుని ఊళ్ళోనే L.I.C.లో ఉన్నాడు. అతనికి నలుగురు ఆడపిల్లలు. రెండేళ్ళ క్రితం వరకూ, తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఒకే కుటుంబంగానే ఉండే వాళ్ళు. శుభస్వీకారం ముగిసిన మరునాడే తమ్ముడు చెప్పేశాడు. “ఇదిగో చూడు రాజప్పా! నాకూ నలుగురు ఆడపిల్లలు. మనం కలిసి ఉండడమనేది సాధ్యం కాదు. నడుమింటి గది నువ్వు ఉంచుకో. ఒక్క గది చాలా అని లెక్క చూడడం ప్రారంభించావంటే, నీకే తెలుసు. ఏదో అమ్మ ఉన్నంత వరకు, నీ బండి నడిచి పోయింది. ఎంత కాలమని నువ్వు ఏ బరువు భాద్యతలు లేకుండా ఉండగలవు? నీ ముగ్గురు కూతుళ్ళనీ, పెళ్ళాన్నీ నీవే ఇక పోషించాలి. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు.”

ఆ రోజు మొదలు ఒకే ఇంట్లో రెండు కాపురాలు. అతని కూతుళ్ళు కూడా అతనిలాగే, సరస్వతి దేవిని దగ్గరికి రానీయకుండా తరిమేశారు. చదువు లేదు. డబ్బూ లేదు. ఎలా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం? పెద్ద ప్రశ్నే!

అయితే ఇది ఇప్పటి సమస్య కాదు. ఇప్పటి సమస్య అతను వెంటనే కాఫీ తాగాలి. నిన్ననే అతని భార్య చెప్పేసింది. “కాఫీ పొడి లేదు. డబ్బులు తెచ్చి ఇస్తేనే కాఫీ. లేకపోతే మంచి నీళ్ళు తాగి గమ్మున ఉండండి. ఇల్లిల్లూ తిరిగి అప్పు అడగడానికి నేను సిద్ధంగా లేను.”

రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు. ఏమనుకున్నాడో, ఉన్నట్లుండి లేచి లోపలికి వెళ్ళాడు. ఒక వేళ భార్యతో దీని గురించి బ్రతిమిలాడడానికి వెళ్ళి ఉండవచ్చు. చాలా సేపటికి అతను బైటికి రాలేదంటే అతని సిఫారసు ఫలించ లేదని అర్థం. దైవం అనుకూలింఛి ఆమె కాఫీ ఇవ్వడానికి సమ్మతిస్తే తమ్ముడు ఏం చేస్తాడన్నది కాస్త కుతూహలం కలిగించే విషయం. అతను హాల్లోకి వచ్చి బెంచి మీద కూర్చుని కాస్త పెద్ద గొంతుతో “ఒసేవ్! రాజప్పకి కాఫీ తీసుకుని రా” అని అంటాడు. తను చెప్పినట్లు పెళ్ళాం వింటుందట.

రాజప్ప అక్కడే కాసేపు నిలబడ్డాడు. లోపలికే వెళ్ళిన తమ్ముడు అదే పోత! తనకి కాఫీ దొరకదని అతనికి ఖచ్చితంగా తెలిసి పోయింది.అతను పెరటి వైపు వెళ్ళాడు. అతని భార్య ముళ్ళ కంచె దగ్గర నిలబడి ఉంది. అతను జంధ్యాన్ని చెవికి చుట్టుకుంటూ అడిగాడు.

“ఏమయింది?”

“ఏమిటా? అదే. రుక్కు వంట చేస్తోంది. కాస్త చేదోడు వాదోడుగా ఉండండి.”

“రుక్కునా? మైదిలికి ఏమైయ్యింది?”

“అభిరామి గారింట్లో రాజరాజేశ్వరి పూజ చేస్తున్నారట. కన్నె పిల్లకి చీర పెడతారట. పంపించాను.”

“అభిరామి గారింట్లోనా? వాళ్ళు అయ్యర్ ఇంటి అమ్మాయికే కదా ఇస్తారు?”

“నేనే అభిరామిగారి కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకున్నాను. పద్దెనిమిదేళ్ళు నిండాయి. మైదిలికి కట్టుకోవడానికి ఒక్క మంచి చీర లేదు. అన్నీ చిరుగులే. పెళ్ళికి ఎదిగిన పిల్ల.”

“బ్రాహ్మణులకి భోజనం పెడతారా?”

“చీర చుట్టుకొని వెళ్తే పెడతారు.” రాజప్ప భార్యని గుచ్చినట్లు చూసాడు. పెదవి చివర్న వంకర నవ్వుతో ఆమె గడ్డివాములు పెట్టే గదిలోకి వెళ్ళింది.

అతను చెవి నుండి జంధ్యాన్ని తీస్తూ తిరిగి వచ్చినప్పుడు ఆమె గడ్డివాము గదిలో కూర్చుని ఉంది. దానికి పేరు మాత్రమే గడ్డివాము గది. మునుపటి రోజుల్లో అతని తాతగారు ‘మిరాసుదారు’గా పేరు పొందిన రోజుల్లో ఇంట్లో ఆవులు ఉండేవి. గడ్డివాములూ ఉండేవి. గడ్డి మోపులను ఆ గదిలోనే పేర్చి ఉంచే వాళ్ళు. అతని తాతగారి ఆటలన్నీ ముగిశాక నాన్నగారి హయాములో యాభై ఎకరాలు, పదిగా మారాయి. అతని తండ్రి దాన్ని కూడా తిని కరిగించేశాడు. ఇప్పుడు ఉన్నదల్లా ఇల్లూ, పెరట్లో ముళ్ళ కంచె మాత్రమే.
అతను గడ్డివాము గది దాటి లోపలి వెళుతుండగా “అలాగే బావి దగ్గర స్నానం చేసి వెళ్ళండి” అని గొంతు వినబడింది. భార్యామణి ఆజ్ఞ.

“ఎందుకూ?”

“ఎందుకేమిటీ? చెప్పానుగా, రుక్కు ఒంటరిగా…”

“వైదేహి ఏమైంది?”

“చిన్నదే కదా. నేనూ వెళతాను అమ్మా అన్నది. కాస్త కూరగాయలు కోసి ఇస్తే, అభిరామిగారు అన్నం పెట్టకుండా పోతారా?” దండెం మీద ఆరేసిన కావిరంగు తువ్వాలను తీసుకొని బావి గట్టుకు వచ్చాడు రాజప్ప. గిలక మీద చేంతాడు లేదు.

“చేంతాడు ఎక్కడే?”

“పాతది ముందే పీలికలుగా ఉండేది. నిన్న ముక్కలు ముక్కలై పోయింది. అదిగో చూడండీ. మిగిలింది మూరెడు ముక్క. అదికూడా ఏదైనా సమయానికి పనికి వస్తుందేమోనని ఉంచాను.”

“ఎవరికి పనికి వస్తుంది? నాకా?”

“మీకెందుకు వస్తుంది? నాకే! ఇలాంటి సంసారాన్ని ఈదడం కన్నా…”

“నన్నేం చేయమంటావు?”

“బ్రాహ్మణార్థం నమ్ముకొని సంసారం గడపాలంటే కుదురుతుందా? ఏదైనా కొట్లో లెక్కలు వ్రాయండి.”

“ఎవడే ఉద్యోగం ఇస్తానంటున్నాడు? నేను లెక్కలు రాయనని అన్నానా?”

“యాభై ఏళ్ళ దాకా ఏ పనీ చేయకుండా కూర్చుని, ఇప్పుడు ఉద్యోగం ఇవ్వమంటే ఎవడు ఇస్తాడు? మన అదృష్టం, ఇంకా ఒక నెల దాకా ఎవరింట్లోనూ శ్రాద్ధం లేదు.”

“అడిగి తెలుసుకున్నావా?”

“అవును. ఇంటింటికీ వెళ్ళి ‘మీ ఇంట్లో శ్రాద్ధం ఎప్పుడూ?’ అని అడిగి తెలుసుకున్నాను. పెద్దగా అడగవచ్చారు. ఆ రోజు కుప్పుస్వామి శాస్త్రులు వచ్చినప్పుడు చెప్పారు.”

“అది ఉండనీ. ఇప్పుడు స్నానం ఎలా చేయడం?”

“మీ తమ్ముడి భార్యని అడగండి. రోజూ బట్టలుతికే బండ మీద తన చేంతాడుని పెడుతుంది. ఈ రోజు మనం తీసుకుంటామేమోనని, మహారాణి! లోపలికి తీసుకెళ్ళి పోయింది.” అతని తమ్ముడి భార్య చేంతాడును తీసుకు వచ్చి బండరాయి మీద దబ్బుమని పడేసి లోపలి వెళ్ళిపోయింది.

“చూశారా, ఎలా పడేసి వెళ్ళి పోయిందో? మీరు ఇక్కడ స్నానం చేయొద్దు. చెరువుకు వెళ్ళి…”

“సిగ్గు శరం ఉంచుకుంటే మనం బ్రతకలేం. అవన్నీ ఎప్పుడో తుడిచి పెట్టేశాను” అంటూ రాజప్ప చేంతాడును గిలక మీద ఎక్కించాడు.

యాభై ఎకరాల మిరాసుదారు రాజగోపాల అయ్యంగార్, తన మనవడు ఊరి వాళ్ళ పిత్రులకి ప్రతినిధిగా ఉంటూ, వాళ్ళ ఆకలిని తీరుస్తాడని ఎదురు చూసి ఉంటారా? లేక అతని తండ్రి దీన్ని ఊహించి ఉంటారా? నిజం చెప్పాలంటే అతను ఇప్పుడు చేస్తున్న ‘ఉద్యోగం’ అతనికే ఆశ్చర్యం కలిగించే విషయం. తల్లి చనిపోయిన తరువాత సాపాటుకి ఏం చేయడం అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, కుప్పుస్వామి శాస్త్రులు అతడిని ఈ వృత్తిలో ప్రవేశపెట్టారు. దీని కోసం అతను వేషం ధరించడం అవసరమయ్యింది. క్రాపు పోయి పిలక వచ్చిది. అడ్డ పంచెకు బదులు సంప్రదాయమైన పంచెకట్టు. నుదిటిన మెరిసే శ్రీ చూర్ణం. అతని తమ్ముడికి ముందు ఈ విషయం నచ్చలేదు. కానీ అభ్యంతరం చెప్తే తన మీదికి వస్తుందేమోనని భయపడి నోరు మూసుకున్నాడు.

రాజప్ప స్నానం ముగించి లోపలి వచ్చిప్పుడు రుక్మిణి వంట చేస్తోంది.

“వంట ఏమిటీ?” అని అడిగాడు రాజప్ప.

“అన్నం అయిపొయింది. నిన్నటి పులుసు ఉంది. అప్పడాలు కాల్చాలి.”

“కాఫీకి ఏమైనా దారి ఉందా?” రుక్కు కాఫీ డబ్బాను తలక్రిందులుగా చేసి చూపించింది.

“నేను అప్పడాలు కాలుస్తాను. నీవు వెళ్ళి కుప్పు శాస్త్రిగారింటికి వెళ్ళి….”

“నేను ఎవరింటికీ వెళ్ళి కాఫీ పొడి పట్టుకు రాను.”

“కాఫీ తాగకుండా ఎలాగో ఉందే?”

“మళ్ళీ ఇంకొకరి ఇంటికి వెళ్ళి చక్కెర తేవాలి. దానికి బదులు మీరే వెళ్ళి ఎవరింట్లో అయినా కాఫీ తాగేసి రండి. మీరు అప్పడాలు కాల్చక్కర్లేదు. నేనే కాలుస్తాను.” తండ్రికి చెప్పింది. రాజప్పకి ఒళ్ళు మండుకొచ్చింది. ఎవరి మీద కోపగించుకోవడం?

ఎలాగైనా సరే కాఫీ తాగాలన్న ఆవేశం అతనిలో ముంచుకు వచ్చింది. బైటికి వెడితే ఎవరైనా దొరక్క పోతారా? అభిరామి గారింటికి వెళ్ళి ‘వైదేహి వచ్చిందేమోనని చూడడానికి వచ్చా’నని అడిగి కాస్సేపు అక్కడే తచ్చాడితే కాఫీ దొరకడానికి ఆస్కారం ఉంది. రిటైర్డ్ ఇంజనియర్ రామనాధన్ ఇంటికి వెడదామంటే, ఆయన కూతురి ఇంటికి కుంభకోణం వెళ్ళారు. కాలాన్ని అనుసరించి గుడిలో పెరుమాళ్ళుకి ప్రొద్దున్న కాఫీ నైవేద్యం పెట్ట కూడదూ! శ్రీరంగంలో రంగనాధుడికి రొట్టెలు పెడుతున్నారు. ఈ ఊరి పెరుమాళ్ళుకీ కాఫీ తాగే ఒక దేవేరి ఉంటే ఎంత బాగా ఉండేది? రోజూ కాఫీ ప్రసాదం దొరికేది.

“మీరు భోంచేస్తారా ఇప్పుడు?” రుక్కు అడిగింది.

“ఇంత త్వరగానా? నేను కాస్త బైటికి వెళ్ళి వస్తాను.” రాజప్ప ఇంటి నుంచి బైటికి వచ్చి వీధిలో రెండు పక్కలా చూశాడు. కాఫీకి ఏదైనా దారి దొరుకుతుందా అన్నదే అతని మహత్తరమైన ప్రశ్న.

బస్సు స్టాండుకు వెళ్తే ఎవరైనా దొరకవచ్చు. బస్సు స్టాండులో విపరీతమైన జనం. పెళ్ళి ముహూర్తం రోజు కూడా కాదు. ఇంత మంది ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనిపించింది రాజప్పకి. మాణిక్యం పండ్ల దుకాణంలో భార్య, భర్త ఇద్దరు నిలబడి ఉన్నారు. భర్తకి తన వయసే ఉంటుందని రాజప్పకి అనిపించిది. లావు ఫ్రేము కళ్ళద్దాలు. జరీ పంచె, ఉత్తరీయం. కాళ్ళకి ఉన్న చెప్పులను చూస్తే ఉత్తర ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడని అనిపించింది. అతని భార్యకి నలభై ఏళ్ళు ఉండొచ్చు. పట్టు చీర. సన్నగా ఉంది. చేతిలో హేండ్ బేగ్. తను కూడా కళ్ళద్దాలు పెట్టుకుంది. రాజప్ప వాళ్ళవైపు వెళ్ళాడు.

“రూపాయికి ఎనిమిది పళ్ళు ఇవ్వు అబ్బీ” అని మొగుడు మాణిక్యం దగ్గర బేరం చేస్తున్నాడు.

“కుదరదండీ. ఏడు పళ్ళు కావాలంటే చేసుకోండి.” అన్నాడు మాణిక్యం.

“ఏంట్రా మాణిక్యం! ఊరుకి కొత్త అని మోసం చేయాలని చూస్తున్నావా ? డజను ఒక్క రూపాయ అని మార్కెట్లో విచ్చల విడిగా అమ్ముడు పోతోంది” మాణిక్యంతో అంటూ భర్తవైపు చిరు నవ్వుతో చూసాడు రాజప్ప.

“రావయ్యా. నువ్వెప్పుడు డబ్బులు ఇచ్చి పళ్ళు కొని తిన్నావు? పెద్దగా న్యాయం చెప్పడానికి వచ్చేశావు” అన్నాడు మాణిక్యం.

జరీ పంచె వ్యక్తి రాజప్పని కాస్సేపు గుచ్చినట్లుగా చూసాడు. ఎందుకోసం అతను అలా తనను చూస్తున్నాడని రాజప్పకి అర్థం కాలేదు. కాస్త ఇబ్బందిగా కూడా అనిపించిది.

“మీ పేరు?” అడిగాడు జరీ పంచె వ్యక్తి .

“రాజప్ప.”

“అనుకున్నాను. మై గాడ్! ఏం వేషంరా ఇదీ? సంప్రదాయమైన పంచె కట్టు, నామం, పిలక?” రాజప్పకి ఏమీ అర్థం కాలేదు.

“గుర్తు పట్టలేదా నన్ను? బాగా చూడరా?” రాజప్ప జ్ఞాపకాల దొంతరల్లో వెతికాడు. ఏమీ స్ఫురించలేదు.

“ఆదిపురం అనంతు అంటే చాలా?” అని అంటూ అతను రాజప్ప భుజం మీద చేయి వేశాడు.

“అనంతు? మీరు ఎక్కడో ఉత్తరాదిన..”

“కరెక్ట్! ఢిల్లీలో ఉన్నాను. ఈమె నా భార్య, సరోజ. అది ఉండనీ. ఏమిట్రా ‘మీరు’ అని మర్యాద ఇచ్చి పిలుస్తున్నావు? ఏళ్ళు గడిస్తే మాత్రం స్నేహం మారి పోతుందా?”

అనంతు! ఇంత చనువుగా, పాత స్నేహాన్ని పురస్కరిస్తూ, అదే ఫీలింగుతో మాట్లాడుతున్నాడే? తను అలా మాట్లాడగలడా? అనంతు మేనమామ సరుగుడు తోట నారాయణ అయ్యంగారుది ఈ ఊరే. మెట్ట వీధిలో ఉండేవారు. ఆయన కాలం చెల్లి పోయాక, కొడుకులందరూ తలా ఒక దిక్కుకి వెళ్ళి పోయారు. అప్పట్లో అనంతు సెలవులకి ఈ ఊరుకి వచ్చేవాడు. అనంతుకి సినిమా పిచ్చి ఎక్కువ. సినిమాలో చేరాలనుకుంటునట్లు చెప్పేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో?

“చూసావా సరోజా! ఇతనే చిన్న వయస్సులో నా బెస్ట్ ప్రెండ్. కాలవ గట్టుకు వెళ్ళి కలిసి సిగరెట్లు కాల్చే వాళ్ళం. తరువాత రెండో ఆట సినిమా. వంటి నిండా పవుడర్ పూసుకుని, మల్లు జుబ్బాతో మైనరులాగా తిరిగినవాడు. ఇప్పుడు చూడు, వేద విద్వాంసుడిగా, నిప్పులాగా నిలబడి ఉన్నాడు. లోకంలో ఎలాంటి అద్బుతాలు జరుగు తున్నాయో చూడు” అంటూ అనంతు తన భార్యతో చెప్తున్నాడు.

“మీ.. రు.. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు?” అడిగాడు రాజప్ప.

“ఏం చేస్తున్నానా? కడుపు నింపుకోవడానికి ఒక కంపెనీలో ఉన్నాను. నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఎన్నెన్ని అక్రమాలు చేయాలో అన్నీ చేస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది రాజప్పా. ఎవరినీ మోసం చేయాల్సిన పని లేదు. సొంత ఊరిలో వాసం. పెద్ద వాళ్ళు నేర్పించిన మంత్రాలు భుక్తికి మార్గం అయ్యింది. నువ్వు శాస్త్రులుగానే కదా ఉన్నావు? నువ్వు చెప్పక పోయినా నీ వేషమే చెప్తోంది. నుదుట శ్రీ చూర్ణం! ముఖంలో తేజస్సు!”

“బాగానే ఉంది. మీరు ఇలా వీధిలో నిలబడే మాట్లాడడం. రూముకు వెళ్ళి మాట్లాడుకుందాం రండి” అంది సరోజ.

“రూముకా?” అన్నాడు రాజప్ప.

“అవును. అదిగో కనబడుతుందే లాడ్జి. అక్కడే దిగాము. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియక పోయింది రాజప్పా. లేకపోతే మీ ఇంటికే నేరుగా వచ్చి ఉండే వాడిని కదా.
ఇదిగో అబ్బీ! రెండు డజన్లు అరటి పళ్ళు తీసి ఇవ్వు. నీ వల్లనే చిన్ననాటి స్నేహితుడిని కలుసుకునే భాగ్యం కలిగింది” అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు అనంతు.

రూముకు వెళ్ళగానే రాజప్ప అడిగాడు. “నీవేంటి ఈ ఊరివైపు వచ్చావు?”

“చెప్తే నమ్మవు. నేను సౌత్ వైపు వచ్చి పదేళ్ళు అవుతోంది. నా భార్య ఢిల్లీలోనే పుట్టి పెరిగిన మనిషి. అత్తగారిల్లూ ఢిల్లీ అయిపోయింది. నాకూ ఇక్కడ ఎవరూ లేరు. ఈ వైపుకు రావాలిసిన అవసరమే లేక పోయింది. అలాగే వచ్చినా చెన్నైకి వచ్చి అట్లుంచి అటే వెళ్ళి పోయే వాడిని. ఇప్పుడే, ఈ ఊళ్ళో నేను చిన్న వయస్సులో ఉన్నాను కదా, సరోజకి చూపించుదామని వచ్చాను. ఈ ఊరికి వచ్చిన వెంటనే నాకు నీ జ్ఞాపకం రాకపోలేదు. కాని నీవు ఎక్కడ ఉన్నావో ఎవరికి తెలుసు? నిన్ను ఇక్కడ చూస్తానని సత్యంగా అనుకోలేదు. అందులోనూ ఇలాంటి వేషధారణలో. వేషం అని తప్పుగా అనడం లేదు. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. అది అలా ఉంచు, నీకు పెళ్ళి ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఏ ఊరు అమ్మాయి? ఎంత మంది పిల్లలు?”

“నా భార్యకి మెలట్టూరు. పిల్లలకేమీ తక్కువ లేదు. ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురూ పెళ్ళికి ఎదిగారు.”

“ముగ్గురు ఆడపిల్లలైతే మాత్రం తక్కువ ఏమైంది? ఘనంగా పెళ్ళిళ్ళు జరిపిస్తే పోలా? భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏది జరగదు? నాకు ఒక్కడే కొడుకు. అమెరికాలో డాక్టరుగా ఉన్నాడు. ఒక కూతురు ఉంటే బాగానే ఉండేది. కానీ ఈ విషయంలో భగవంతుడు నన్ను అనుగ్రహించలేదు.”

“ఏమిటండీ! మీరే మాట్లాడుతున్నారు, ఆయన్ని ఏమైనా తీసుకుంటారా అని కూడా అడగకుండా? కాఫీ తాగుతారా?” అని అడిగింది సరోజ.

‘ఉండవే. ఢిల్లీ అమ్మాయివని నిరూపిస్తున్నావా? వేద విత్తుగా నిలబడి ఉన్నాడు. అడ్డమైన హోటళ్ళలో కాఫీ తాగుతాడనుకున్నావా? ఈమె చెప్పినట్లు ఢిల్లీలో జరుగుతుంది. మా ఊరి వైదీకుల గురించి నాకు బాగా తెలుసు. పాలు తీసుకోవడానికి దోషం లేదు. తాగుతావా రాజప్పా?’

“వద్దు.” రాజప్ప గొంతు బలహీనంగా ధ్వనించింది.

“చూశావా? పాలు కూడా పుచ్చుకోనంటున్నాడు. ఆ కాలపు రాజప్పనేనా అని అనిపిస్తోంది. వేదం చదివితే ఎంత క్రమశిక్షణ వచ్చేస్తుందో చూసావా? రాజప్పా! నీ లాగా వేదం అభ్యసించిన వాళ్ళని చూస్తుంటే, కాళ్ళ మీద పడి ప్రణామం చేయాలని అనిపిస్తోంది. నిజంగా చెప్తున్నాను. సంస్కృత మంత్రాలు అభ్యసించిన వాళ్ళు వల్లిస్తే, విని తరించాలని నాకు పెద్ద కోరిక. ఢిల్లీలో బడిలో ఒక సంస్కృత మాస్టారు ఉండేవారు. మనవాళ్ళే. పేరు శ్రీనివాస వరదన్. మంత్రాలు వల్లించారంటే కంచు గంట మ్రోగుతున్నట్టే ఉంటుంది. ఆయనని అడపా దడపా ఇంటికి పిలిపించి పురుష సూక్తం చెప్పించుకుంటాను. ఒకసారికి పదిరూపాయలు దక్షిణ, భోజనం. ఆయనకి కనకాభిషేకం చేయించాలి, న్యాయంగా చూస్తే. కాని నా వల్ల చేతనయ్యింది ఇదే. వృత్తి కోసం మనం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాము. అందులోనూ నేను చేసే తప్పుడు పనులకి లెక్క లేదు. నా లాంటి వృత్తిలో ఉంటే అడగాల్సిన పనే లేదు. అందుకే నీలాగా వేదం చదువుకున్న వాళ్ళని పిలిచి గౌరవించడం. ఒక విధంగా ప్రాయశ్చిత్తం అని అనుకో.”

“నోరు నొప్పేటట్లు మీరే మాట్లాడుతూ ఉన్నారే. ఆయన్నీ కాస్త మాట్లాడనివ్వండి” అంది సరోజ.

“అవునవును. మాట్లాడడం ప్రారంభిస్తే నిలపను. నా వృత్తి అలాంటిది. నీవు కొంచం సామవేదం చెప్పవా. వినాలని కోరికగా ఉంది.”

“నన్ను ఢిల్లీ అమ్మాయివని చెప్పి మీరు ఇప్పుడు ఆయన్ని ఇలా అడగడం భావ్యంగా ఉందా? వేదం వల్లించడానికి వేళా పాళా ఉండొద్దా?” అంది సరోజ.

“నాకు ఉన్న ఆత్రుతలో ఏదేదో వాగుతూ ఉన్నాను నువ్వన్నదీ నిజమే సరోజా. రాజప్పా! బయలుదేరు. మీ ఇంటికి వెళదాం. నీ బార్యా పిల్లల్ని అందరినీ చూడాలని ఉంది. మాకు ఈ రోజు మీ ఇంట్లోనే భోజనం. ఇదిగో, ఈ పండైనాతిను.. కాఫియో పాలో వేరే ఏదీ ముట్టుకోనంటున్నావు.”

“ఉన్నట్టుండి మీ ఇంటికి భోజనానికి వస్తున్నామంటే ఎలా కుదురుతుంది? పాపం, వాళ్ళింట్లో ఆయన భార్య ఏం చేస్తుంది? ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో ? ఏమీ తెలియకుండా ఇలా మాట్లాడితే?’ అంది సరోజ.

“ఇది ఢిల్లీ కాదని తెలుసుకో. ఢిల్లీలో ఒకరికి భోజనం అంటే అర్థ కడుపుకే అన్నం. ఇక్కడంతా, ఇంకా ఇద్దరికీ సరిపడేటట్లు తయారుగా వండుతారు. మా ఊరి గురించి నాకు తెలియదా? నిన్ను ఎందుకోసం పిలుచుకొని వచ్చానో తెలుసా? మా ఊరి గొప్పలు నీకు చూపించాలనే. చిన్నప్పుడు వీళ్ళింట్లో ఎన్ని సార్లు తిన్నానో తెలుసా? ఇతని అమ్మ ఒక ఊరగాయ పెడుతుంది చూడు. అదేం ఊరగాయ రాజప్పా?యెస్… మాగాళి. మందులాగా వాసన వేస్తుంది. నోట్లో వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఇతని నాన్నగారు మంచి భోజన ప్రియులు. భక్తుడని కూడా చెప్పొచ్చు. అవును కదా.”

నాన్న నిజంగా భోజన ప్రియుడే. తాతగారు ఇచ్చిన పొలమంతా తిండికే ఖర్చు చేశారు. ఇతను భోజనానికి వస్తానని అంటున్నాడే? ఈ పరిస్థితిని ఎలా సమాళించడం? ఈ ఊరి గురించిన తన ముప్పై ఐదేళ్ళ జ్ఞాపకాలకి భంగం రాకూడదన్నట్లు ఆవేశం వచ్చిన వాడిలా మాట్లాడుతున్నాడు. తన చిన్న వయస్సు లోకాన్ని చూపించాలని భార్యని తీసుకొని వచ్చాడు. తన ఇంటి పరిస్థితులు తెలిస్తే అతనికి ఎంత నిరాశగా ఉంటుంది? తనకి ఇప్పుడు కాఫీకి కూడా దిక్కు లేదు.

ఊరికి కొత్త వాళ్ళుగా ఉన్నారే, గుడి, చెరువు తిప్పి చూపించి కాఫీకి ఏర్పాటు చేసుకుందామని తాను వేసిన పథకం, బావికోసం గొయ్యి తవ్వితే భూతం బైటికొచ్చినట్లయిందే? ఇతన్నుంచి ఎలా తప్పించు కోవడం? పురుష సూక్తమట, సామవేదమట. ఎవరికి తెలుసు అదంతా? అది అలా ఉండనీ. చదువు ఎందుకు? డబ్బున్న వాడికి అమ్ముడు పోవడానికా? ఇతను సంపాదన కోసం తప్పులు చేస్తాడట. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక బ్రాహ్మణుడు, వేదాలు కావాలట! అన్యాయానికి తోడు పోవాలట. నేను ఎంతో నయం ఇతనితో పోలిస్తే. వేషాలలో ఏది గొప్ప? ఏది తక్కువ?

“రాజప్పా వెళ్దామా మీ ఇంటికి?’ అన్నాడు అనంతు.

“చెప్పా పెట్టకుండా భోజనానికి వెళ్ళొద్దు. వెళ్ళి చూసి వద్దాం. కావాలంటే, కాఫీ తాగి..”

అనంతు మధ్యలోనే అడ్డుకున్నాడు. “నన్ను సరి దిద్ది, నీవే మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? వేదాలు వల్లించే వాళ్ళింట్లో కాఫీలు తాగుతారా?”

రాజప్ప ఇంకా ఓర్చుకోలేక పోయాడు. నిజాన్ని వాళ్ళు ఎదురుకోవలసిన తరుణం వచ్చేసింది.

“ఇదిగో చూడు అనంతూ! నేను వేద విద్వాంసుడిని కాదు, మట్టీ మశానం ఏమీ కాదు. వేద విద్వాంసుడు కావాలంటే నీవే వేదాల కాలానికి వెళ్ళాలి. మొదట నేను అడిగిన దాన్ని ఇప్పించు. తరువాత అంతా వివరంగా చెప్తాను.”

దిగ్బ్రమ చెందిన అనంతు హీనస్వరంతో అడిగాడు. “ఏం కావాలి?”

“ఒక కప్పు కాఫీ.”