ఎండగానే ఉంటుంది గాని
ఎక్కడా వేడి పుట్టదు
సూర్యుడు కూడా చలితో
గజగజ వణుకుతాడు.
రాత్రి గడిచిందన్న ఆనందం
ఎంతో సేపు నిలవదు
పగలు – చీర మార్చుకువచ్చిన
చలి మంత్రగత్తెలా ఉంటుంది.
ఆకాశం ఒక పక్షి నీడకోసం
ఆశగా ఎదురుచూస్తుంది
ఆకులు రాలని చెట్టు
తన నీడను తానే
భారంగా మోస్తుంది.
దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది.
ముడుచుకుపోవాలనుంటుంది
లోపలికి
వెనక్కి
ఏకాకి శరీరంలోనుంచి
ఏకకణంలోకి.