అనేక దశాబ్దాలుగా కనుమరుగయిన బిడ్డ అనుకోకుండా దర్శనమిస్తే ఆ తల్లిదండ్రులు, బంధువులు ఎంతగా ఆనందపడతారో కదా. అదే విధంగా ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.
ఆ విశేష పక్షిని శాస్త్రజ్ఞులు కర్సోరియస్ బిటర్ క్వాటస్(Cursorius bitorquatus) అంటారు. సామాన్య పరిభాషలో డబుల్ బ్యాండెడ్ కోర్సర్ (Double-banded Courser) అంటారు. దీని కంఠసీమలో రెండు హారాలు వేలాడుతున్నట్టు వర్ణ విశేషం ఉంటుంది.
కలివి కోడి కడప జిల్లాకి పరిమితమైనది. ప్రపంచంలో మరెక్కడా కనబడదు. 1848లో మొదటిసారిగా డా. టి.సి. జెర్డాన్ (T.C.Jerdon) దృష్టికి వచ్చింది. నెల్లూరు, కడప ప్రాంతాల్లో దొరుకుతుందని ఈ సైనిక వైద్యుడు నమోదు చేశాడు. పెన్నా తీరవాసిగా వర్ణించాడు. అతని పేరనే దీనికి మరొక పేరు జెర్డాన్స్ కోర్సర్ (Jerdon’s Courser). ఇండియన్ కోర్సర్ అనే సామాన్య పక్షికి ఇది దగ్గిర బంధువు. మనిషి అలికిడి అయితే త్వరగా కొంత దూరం దుముకుతూ పోయి ఎగిరిపోతుంది. ఇది దీని అలవాటు.
తరవాత 50 సంవత్సరాలు అడపా తడపా కనబడుతూవచ్చింది. 1900లో హోవర్డ్ క్యాంబెల్ కంటపడింది. కాని మరి 85 సంవత్సరాలు తెరమరుగయిపోయింది. విలుప్తమయిందనే భావించారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి, అమెరికా స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వారు వచ్చి ఈ ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది.
శాస్త్రజ్ఞులలో ఆశలు సన్నగిలలేదు. పట్టుదలగానే పరిశీలన గావించారు. 1985లో ఈ పరిశోధన తీవ్రతరం చేశారు. ఆ పరిసరాలలోని ప్రజలకు దీని గురించి తెలియపరచి దాని ఫొటోలు అందజేశారు. అన్ని విధాల స్థానికుల సహాయం స్వీకరించడం ఆరంభించారు.
1986 జనవరి 12న వీరి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఈ పక్షి ఒక స్థానికుని కంటపడింది. కొన్ని ఇతర పక్షులతో పాటు సంచరిస్తోంది. ఇంకా విశేషం దానిని పట్టగలిగాడు. శక్తివంతమయిన కాంతికి అది నిశ్చేష్టమయింది. అదే రాత్రికి మరో రెండు పక్షులు కనిపించాయి.
నిజం చెప్పాలంటే అది మనకి భోగి పండగ కానుక. 85 సంవత్సరాల తరవాత దానిని చూడగల్గాము. ఆ వేటగాడి పేరు అయితన్న. ఊరు రెడ్డిపల్లి. ఈ సంఘటనను రూఢిపరచిన శాస్త్రజ్ఞుడు భరత్ భూషణ్. ఈ వార్త వెంటనే డా. సలీం అలీకి పోయింది. వెంటనే డా. సలీం “అల వైకుంఠపురంబులో…” అన్నట్లు వెంటనే దొరికిన విమానం అందుకొని కడపలో వాలాడు.
ఆయన వచ్చేసరికి అది చనిపోయింది. తగిన ప్రక్రియలకి గురి అయి, స్టఫ్ కాబడి, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి మ్యూజియంను అలరించడానికి తరలిపోయింది. ఇటీవల గత 20 సంవత్సరాలలో ఆ పక్షులు మరిన్ని చెంగు చెంగున దూకుతూ కనబడుతూ ఉంటే శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేవు. కడప జిల్లా సిద్ధవటం మండలం లంకమల్లె అడవుల్లో 465 చ.కి.మీ. ప్రాంతం దీని రక్షణకని ఒక అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అంటారు. ఈ పిట్టతో పాటు లెపార్డ్, సాంభర్ లేడి, చుక్కల హరిణం, బ్లాక్ బక్ (కృష్ణ హరిణం) వంటివి ఇక్కడ రక్షణ పొందుతున్నాయి.
మొదట్లో ఈ అడవుల్లో నుంచి తెలుగు గంగ ప్రయాణమార్గం నిర్దేశించబడింది. ఇదే కాని వాస్తవంగా ప్రవహిస్తే ఈ పక్షి సంతతికి తప్పక ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఆ కాలువ దారి మళ్ళించింది. ఆనందమోహన్ అనే ఉన్నత అటవీశాఖాధికారి దీని ఫోటో తీసినందుకు కేంద్రప్రభుత్వపరంగా అభినందనలు అందాయి. ఇక చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడవిలో 4, 5 సార్లు దానిని చూశారు. దాని సంతతి క్రమంగా అధికమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుత అంచనాలు 100(±). ఇది చాలదు. ఇంకా అధికం కావాలి.
1988లో దీనిని గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం ఒక తపాలాబిళ్ళ విడుదల చేసింది.
ఏమయినా జోడుపట్టీల కోర్సర్ వల్ల ఆంధ్రదేశం మరొకసారి ప్రపంచపటంలో గుర్తింపు పొందింది. ఎర్రచందనం రాయలసీమలో తప్ప వేరెక్కడా లభ్యం కాదు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆంధ్రదేశంలో కర్నూలు జిల్లాలోనే కనబడుతుంది. దీని సంఖ్య కూడా చాలా బాగా పెరిగింది. అయితే ఇది రాజస్థాన్‌లో కూడా ఉంది.
పెద్దపులుల సంఖ్య మన రాష్ట్రంలోని శ్రీశైలం నాగార్జున అభయారణ్యంలోని టైగర్ ప్రాజెక్ట్‌లో అధికమై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక నల్ల హరిణం, మొసళ్ళు, నీటిబర్రె, ఇండియన్ బైసన్ (గౌర్), ఇంకా చాలా జాతుల విషయంలో ఆంధ్రదేశం శ్రద్ధ వహిస్తోంది.
అయితే విచారకరమైన విషయం చిరుతపులి (చీటా) చివరిసారిగా మదనపల్లి ప్రాంతంలోనే 100 సంవత్సరాల వెనక కనబడింది. మరి దాని దృశ్యాన్ని చూసే అవకాశం ఎవరికీ రాలేదు. అలాటి చరిత్ర పునరావృతం కాకుండా చూడాలి. జెర్డాన్స్ కోర్సర్ సందర్భంగా పోచర్స్ (దొంగ వేటగాళ్ళ) విషయంలో జాగ్రత్తగా ఉండాలి.