కోనిగ్ ఆర్ట్ షాపు ప్లాస్టిక్ సంచీ లోంచి ఐఫోన్ మోగటం వినిపించింది. నిసీ షామల్ గబుక్కున చేతిలోని కుంచె బల్లపైన పెట్టేసి, ఆ సంచీని వెదకటం మొదలెట్టింది. కేన్వాసులు, ఏక్రిలిక్ రంగుల పెట్టెలు, స్కెచ్ పేడ్లు, చిన్ని తుళ్ళు, ఇలా అన్నీ కింద పడేస్తూ చివరికి సెల్ ఫోన్ ఉన్న బేగ్ తెరిచి చూసింది. ఈ లోపల ఆర్ట్ క్లాసులో సహ విద్యార్ధులు కొంత అసహనంగా చూశారు ఆమె వంక. మళ్ళీ మోగుతున్న ఫోన్‌ని చెవి కానించుకుంటూ, క్లాసు బైటికి వెళ్ళింది.
“హలో! ఏమిటి లాజ్లో!”
“ఏం చేస్తున్నావ్?” అడిగాడు ఆమె స్నేహితుడు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లాజ్లో బేకస్.
“బొమ్మలేసుకుంటున్నా. ఎందుకు పిలిచావూ?”
“అదే, ఏన్యుయల్ న్యూరోఆంకాలజీ సింపోజియం – ఈ శనివారం సెప్టెంబర్ 26న, 7 గంటలకు మొదలు. నువ్వు సూర్యోదయం చూసి చాన్నాళ్ళయి ఉంటుంది కదా! టైం కి రమ్మని చెప్పటానికి.”
“ఇడియట్. నీకు రోజూ అదే పని. కాన్సర్ కాన్సర్ కాన్సర్! నాకు వందపనులుంటయ్. వస్తానని చెప్పాగా. అయినా ఇందుకోసమా ఇప్పుడు ఫోన్ చేసింది? ఒక మోడల్ బొమ్మ గీస్తున్నాం. లార్డ్ కృష్ణ లాగా, నల్లరాతినుంచి చెక్కిన విగ్రహంలా, చక్కటి సౌష్టవంతో ఉన్నాడు. నీలా కాదు బక్కగా! పైగా గిటార్ మన్మోహనంగా వాయిస్తున్నాడు. మధ్యలో నీ గోల. నిన్ను తెలిసి ఉంటం నా పూర్వ జన్మ పాపం. బై.” అని క్లాసులోకి వెళ్ళింది.
గిటారు తీగలని మీటుతున్న యువకుడు, ఆపి, ఆమెకు కన్ను గీటాడు. లైలలైలలైలా లైలా లైల లైలలైలాలైలా అని స్వరం ఎత్తుకుని Kiss me my Darling now, Don’t wait till tomorrow – అని తారస్థాయిలో పాడాడు. నిసి కళ్ళు నవ్వుతో వెలిగి పోయాయి. క్లాసులో సుందరీమణులు కేన్వాసుల మీద అతని సౌందర్యం ఎవరికి తోచిన రీతిగా వారు చిత్రిస్తున్నారు.
మధ్య మధ్య టీచర్ వారిని హెచ్చరిస్తోంది – “మీరు ఇతనిని చూస్తున్నందున, ఇతని సంగీతం వింటున్నందున మీలో కలిగిన భావ సంచలనాన్ని మీకు తోచినట్లు, వ్యక్తపరచండి. ఇంతకు ముందు మీరు చూసిన ఆర్టిస్టుల బొమ్మలను అనుకరించి వెయ్యటం కాదు. మనిషిని, గిటారుని కూడా వెయ్యక్కర్లేదు. ఆయిల్, ఏక్రిలిక్, వాటర్ కలర్, పేస్టెల్ – ఏది కావాలంటే అది ఎంచుకుని వెయ్యండి. మీ ఇష్టాన్నే మీరు గియ్యండి, నా ప్రమేయం ఏం లేదు ఈ క్లాస్ వరకూ” – అని చెబుతూ. క్లాస్ అయ్యాక గిటారిస్ట్ గది అంతా తిరుగుతూ అందరి ఆర్ట్ చూశాడు. నిసీ అతని గిటార్ తీసుకు వాయించి చూసి, అతని కార్డ్ తీసుకుంది.
“నేట్! ఒక్క పార్టీలకే గిటార్ వాయిస్తావా? వెన్నెల్లో లనాయ్‌లో నాకు డాన్స్ చెయ్యాలని అనిపిస్తే, పిలిస్తే అప్పటికప్పుడు నా ఇంటికి వచ్చి పాడతావా?”
“ఎందుకు రానూ. ష్యూర్.” అన్నాడతడు. నిసి ఈజెల్ మీద ఉన్న తన బొమ్మ చూసి పెద్దగా నవ్వాడు.
సెప్టెంబర్ 26 ఉదయం. న్యూయార్క్ నగరం. యూ. ఎస్. ఏ.
యూనివర్సిటీ కేంపస్‌లోనే ఉన్న హాస్పిటల్లో సింపోజియం. మొదటి రోజు నిసి పంక్చ్యువల్గా టైముకి వెళ్ళింది. ఆడిటోరియంలో అప్పటికే చాలామంది ఉన్నారు. కొంచెం సేపట్లో ఆమె పక్కన పరిచయ స్వరం. ఆమె మెడ మీద పరిచయమైన చేతులు. చెంపమీద చిన్ని ముద్దు. “థేంక్స్! వచ్చినందుకు,” అని చెవిలో గుస గుస.
“ఆల్రైట్ లాజ్! రిలాక్స్! ” అంది నిసి.
మొదటి వక్త ఒక న్యూరో సర్జన్. మాట్లాట్టం మొదలు పెట్టీ పెట్టక ముందే, ఆమె ‘ఫ్రెడెరిక్ ఫెకాయ్’ హెయిర్ కట్ ఇంకా సభ్యులు సరిగ్గా గుర్తించి ఆనందించక ముందే, అన్ని స్క్రీన్ల పైన ‘డా. బేకస్’, ‘డా. షామల్’ అని మెసేజ్ ఫ్లాష్ అవ్వటం మొదలయ్యింది. లాజ్లో లేచి నిసి భుజం మీద చిన్నగా తట్టాడు.
ఇద్దరూ బైటకు నడిచారు. బైట ఆందోళన నిండిన ముఖాలతో రేడియేషన్ ఆంకాలజీ ఛైర్మన్ -జాన్ లోగన్, చీఫ్ టెక్నాలజిస్ట్ – పీటర్ బుష్ నిలబడి ఉన్నారు. అందరూ పరుగు లాటి నడకతో రేడియేషన్ విభాగం కేసి నడిచారు. పీటర్, వారిని లినియాక్ ఏక్సిలరేటర్ గదిలొకి తీసుకు వెళ్ళాడు.
రేడియేషన్ ట్రీట్‌మెంట్ బల్ల మీద హెడ్ ఎండ్ నెక్ ఛీఫ్ సర్జన్ బిల్ నెల్సన్. శవరూపంలో! వారెవరూ ఊహించని దృశ్యం.
“నెల్సన్ ఇక్కడ! ఈ బల్ల మీద! మీకు గాని ఇప్పుడు పేషెంటా?” అని గబగబా లోగొంతులో అడిగింది నిసి. కొన్ని సార్లు స్టాఫ్ మెంబర్లకు కేన్సర్ వస్తే వారు మరీ పొద్దున్నే గాని, లేదా బాగా ఆలస్యంగా గాని ట్రీట్మెంట్ స్లాట్ తీసుకుని, వేరే పేషెంట్లకూ, డాక్టర్లకూ ఈ విషయం తెలియకుండా గుంభనగా వైద్యం చేయించుకుంటారు. లినియాక్ ఏక్సిలరేటర్ హెడ్ బిల్ నెల్సన్ ఛాతీకి గురి చేసి ఉంది. లంగ్ కేన్సరేమో అనుకుంది నిసి.
“కాదు. బిల్ మా పేషెంట్ కాదు. ఏం అర్థం కాటల్లేదు.” అన్నాడు డాక్టర్ జాన్ లోగన్. అతని ముఖంలో నెత్తురు చుక్క లేదు. పెదాలు వణుకుతున్నయ్.
“ఒక వేళ మిమ్మల్ని కలవటానికి కాని వచ్చాడా? వచ్చి వెదుకుతూ, సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి, ఈ బల్ల మీద పడుకుని చనిపోయి ఉండొచ్చా?”
“ఉహూ. పేరుకు ఫియర్లెస్ ఎగ్రెసివ్ సర్జనే కాని, బిల్ రేడియేషన్ రూమ్ లోకి అసలు అడుగు పెట్టటానికే భయపడి – (చచ్చేవాడు అనబోయి నిగ్రహించుకుని) డేవాడు” అన్నాడు జాన్ లోగన్. “అసలిప్పుడు తను కూడా సింపోజియం లోనే ఉండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నట్టూ?”
లాజ్లో – మై గాడ్! మైగాడ్! అనటం తప్ప ఏం చెయ్యటం లేదు.
“మన పీటర్ -రాత్రి బయాలజీ లేబ్ వాళ్ళు టిష్యూ రేడియేట్ చేసుకోటానికి వస్తే ఫిజిసిస్ట్ కు డోసిమెట్రీ కేలిబ్రేషన్ లలో సహాయం చేసి, ఆ తర్వాత ‘రేండో’ని బల్ల మీదే వదిలేసి వెళ్ళి పోయాట్ట. పొద్దున్నో ఏక్సెలెరేటర్ ‘వార్మ్ అప్’ కని వస్తే ‘రేండో’ మీద తెల్ల షీట్ కప్పబడి ఉంది. తొలిగిస్తే ఈయన శవం ఉందిట.” – మళ్ళీ జాన్ లోగన్.
డాక్టర్ నెల్సన్ లేత నీలం స్క్రబ్స్ వేసుకుని ఉన్నాడు. ఆయన హాస్పిటల్ ఆఫీసులో ఆ దుస్తుల్లోనే పేషెంట్లను చూసేవాడు. నిసీకి గుర్తే. నిసి రూం పరికించి చూసింది. అన్నీ -వస్తువులూ, పరికరాలూ- మామూలుగా వేటి స్థానంలో అవే ఉన్నట్లున్నయ్, రేండో తప్పించి. ‘రేండో’ గదిలో ఓ మూల నేలమీద పడి ఉంది. సర్జన్ శవాన్ని కూడా తాకకుండా, పరిశీలించి చూసింది.
“మెడిసిన్ కాబినెట్లు అన్నీ లాక్ చేసినవి అలానే ఉన్నాయి. వస్తువులు ఏవీ కదిలించినట్లుగా లేవు.” -మెల్లిగా అన్నాడు చీఫ్ టెక్నాలజిస్ట్ పీటర్ ఆమె చూపులను గమనిస్తూ. “మెషీన్ ఎవరూ వాడలేదు. రాత్రి నేను వదిలి వెళ్ళాక. ఏక్సిలరేటర్ లాగ్స్ చెక్ చేశాను.”
అందరూ ముఖాలు చూసుకున్నారు. సమయం 7.30 కావస్తున్నది. జాన్ లోగన్ గబగబా వారందరితో బైటికి నడిచి, “పీటర్! ఈ గది మూసి వేసి ఉంచు. ఈ మెషీన్ మీద ఈ ఉదయం ట్రీట్ చెయ్యవలసిన పేషెంట్లను వేరే మెషీన్ల మీదకు, మధ్యాన్నానికి వచ్చేట్లుగా మార్పించు. నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడే వరకూ ఈ విషయం ఎవరితోనూ మాట్లాడవద్దు.” అని చెప్పేసి ఇద్దరు డాక్టర్లనూ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు.
“ఇది హత్యే. నా మీద, నా డిపార్ట్‌మెంట్ మీద ఎంత ద్వేషం ఉన్నా నెల్సన్ ఇక్కడకు వచ్చి కుదురుగ్గా ముఖం మీదుకు ముసుగు లాక్కుని చనిపోతాడా! హాస్పిటల్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేశాను. లాయర్ని తీసుకుని వస్తున్నాడు.”
“లాజ్లో! నువ్వు మొత్తం ఆంకాలజీకే డైరెక్టరువి కదా. నిన్నందుకే పిలిచాను. ఎంతో కష్టపడి హాస్పిటల్కి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చాం. ఇప్పుడు ఈ గొడవతో, పేషెంట్లు వేరే చోటికి పోతారు. మనకిక ఇంత కూడా శాంతి ఉండదు. నిసి సింపోజియంకు ఈ రోజు వస్తున్నట్లు తెలిసింది. నాకు ఏమైనా సహాయం అవసరమైతే, ఆలోచన చెప్పవలిస్తే నిసి తప్పక చేస్తుందని పిలిచాను.” అంటూ నిసివైపు ఆందోళనతో చూశాడు.
లాజ్లో అర్థమైంది అన్నట్లు తలాడించాడు.
“ముందు ఈ కాన్ఫరెన్స్ కామ్‌గా నడిచేట్లు చూడాలి. ఎక్కడెక్కడి దేశాల వారూ వచ్చి ఉన్నారు. లక్కీగా ఈ మీటింగ్ అంతా డాక్టర్ చాంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. నేను అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తే చాలు. నెల్సన్ స్పీకర్ కాదు. అది ఒక మేలు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ పేషెంట్లు చాలా మందికి మన సెంటర్లో వైద్యం నడుస్తూ ఉంది. నాకు తెలుసు ఎవరెవరు ఉన్నదీనూ. వీరెవరూ ఆందోళన పడకుండానూ, ఏ గందరగోళం సృష్టించకుండానూ జాగ్రత్త పడాలి.”
“అవును, నా వర్రీ కూడా అదే. చస్తే చచ్చాడు నెల్సన్. ఉత్త తగువులమారి వెధవ. వెరీ మీన్ పర్సన్. నువ్వేమన్నా అను లాజ్లో. నెల్సన్ చచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. కాని ఇక్కడే చావాలా, ఇప్పుడే చావాలా దరిద్రుడు!” అన్నాడు జాన్ లోగన్ పట్టలేక.
“కేర్ ఫుల్. కేర్ ఫుల్. గోడలకు చెవులుంటాయ్. హత్యేమో అనుకుంటున్నాం కూడా. కేర్ ఫుల్ జాన్! శవాన్ని స్ట్రెచర్ మీద పడేసి మోర్గ్ కి పంపటానికి కూడా లేదు. పోలీసులతో గొడవవుతుంది.” అన్నాడు లాజ్లో, చిన్నగా నిట్టూరుస్తూ.