పెండ్లి కల

దక్షిణ భారతంలో గోదాదేవి కథ తెలియని వారు అరుదు.

శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణు భక్తుడికి ఒక తులసి మొక్కపాదులో దొరికిన పాప కోదై (గోద). కోదై అంటే పూలమాలిక. ఆమె విష్ణుచిత్తుని ఇంట పెరిగిన అపరంజి బొమ్మ. అనుంగు కూతురు. ప్రతిదినమూ దేవునికై కట్టిన పూలమాలని తాను ధరించేది. గోదా ధరించిన పూలమాలని తెలియకనే విష్ణుచిత్తుడు వటపత్రశాయికి సమర్పించే వాడు. ఒకనాడు దండలో ఒక తలవెంట్రుక చూసి, కూతురిని నిందించాడు. దేవుడికోసం కట్టిన మాల ఆనాడు దేవుడికి చేరలేదు. ఆరాత్రి స్వామి విష్ణుచిత్తుని కలలో కొచ్చి, గోదా ధరించిన దండనే తాను ప్రతిరోజూ ఆప్యాయంగా స్వీకరిస్తున్నానని, ఇకనుండి ఆమె ముడిచి విడిచిన దండనే తెమ్మని హెచ్చరించాడు. నాటినుండి గోదాదేవికి ఆముక్తమాల్యద (చూడికొడుత్త నాచ్చియార్) అన్న పేరు వచ్చింది.

గోదాదేవి శ్రీరంగనాథుని అందం, రూపురేఖలూ విష్ణుచిత్తుడు ప్రతిరోజూ వర్ణించగా వింటూ, ఆ రంగనాథుడినే పెండ్లాడ నిశ్చయించుకున్నది. ప్రతిరోజూ శ్రీకృష్ణునిపై ఒక పాశురము (పాట) కట్టి పాడింది. అట్లా పాడిన 30 పాటలే తిరుప్పావై తమిళ కావ్యం. తిరుప్పావై అంటే శ్రీ వ్రతం అని అర్థం.

గోదా రాసిన రెండవ కావ్యం ‘నాచ్చియార్ తిరుమొళి’ – అమ్మవారి (గోదా) శ్రీసూక్తి అని అంటారు. ఈ శ్రీసూక్తి నూటనలభైమూడు పద్యాలున్న పధ్నాలుగు ఖండాల కావ్యం.

శ్రీ సంపత్కుమారాచార్య రాసిన ‘ఆముక్త’ కావ్యానికి శ్రీసూక్తి ప్రాగ్రూపం.

శ్రీమతి ప్రేమానందకుమార్ తిరుప్పావై ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని సంపత్కుమార ఆంధ్రప్రభలో సమీక్షించారు. ఆ గ్రంధానికి అనుబంధంగా ‘వారణమాయిరం’ (వెయ్యి ఏనుగులు) అన్న శీర్షికతో పదకొండు తమిళపద్యాలు గోదాదేవి రచనగా చేర్చబడ్డాయి. అప్పట్లో (1997) సంపత్కుమారగారికి ఇది సరికొత్త విషయం. తరువాత వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది. ఆ అనువాదం మొదటిసారిగా జనవరి 98లో ఆంధ్రప్రభలో అచ్చయ్యింది.

శ్రీ సూక్తిని మొత్తం తెలుగులోకి తేవాలన్న కోరిక పుట్టింది. యధావిధిగా అనువాదం ‘కుదరటల్లేదని’ ఆయనే చెప్పుకున్నారు. అనువాద పథకమేమారి ‘ఆముక్త’ కావ్యంగా రూపొందింది. ‘సంపద్గోద’ ఈ ఆముక్త కావ్యనాయిక అని సంపత్కుమార రాసుకున్నారు.

గోదాదేవిని మొట్టమొదటిసారి ‘పరమయోగివిలాసం’ గా తాళ్ళపాక చిన్నన్న, ‘ఆముక్తమాల్యదగా ‘ శ్రీకృష్ణదేవరాయలు తెలుగులోకి తెచ్చారు. అంతేకాదు. తిరుప్పావై కావ్యానికి లక్ష్మణయతీంద్రులు తెలుగులో భావానువాదం చేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు’ అన్న పేరుతో అనువదించారు.

ఆముక్త 72 పేజీలలో 13 ఖండాల కావ్యం. అందులో 13 వ ఖండంలో పద్యాలే ‘పెండ్లికల’ పద్యాలు.

ఈ పద్యాల్లో కృష్ణయజుర్వేద పద్ధతిలో చేసే తెలుగు పెళ్ళి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఏ ఒక్కపద్యానికీ నిఘంటువు సంప్రదించవలసిన అవసరం ఉండదు. అతికమ్మని తెలుగు పదాల్లో తెలుగు పెళ్ళి వర్ణించబడింది. వెయ్యిఏనుగులతో పెళ్ళికొడుకు (శ్రీకృష్ణుడు) రావడంతో మొదలై, రక్షాసూత్రాలు కట్టడం, పెళ్ళికొడుకు కాళ్ళుకడగటం, జీలకర్ర బెల్లం మాడున పెట్టడం, మంగళసూత్రధారణం, మట్టెలు తొడగడం, తలంబ్రాలు, స్థాలిపాకం, లాజహోమం, సప్తపది, – ఒకటేమిటి, అన్నీ వర్ణించబడినాయి.

సంపత్కుమార శ్రీ వైష్ణవుడు. అయినా గోదా వివాహవర్ణనలో స్మార్త వివాహ పద్ధతులే వర్ణించబడటం ఆశ్చర్యం. ఊంజల్ (ఉయ్యాల) సేవ మొదలైనవి తరువాత వైష్ణవసంప్రదాయంలోకి వచ్చి వుండవచ్చునేమో!

సంపత్కుమారాచార్య ఆముక్త అచ్చుకాకముందు ఈ ‘పెండ్లి కల’ పద్యాలని చికాగోలో మాఇంట్లో వెల్చేరు నారాయణరావుగారికి, నాకూ చదివి వినిపించారు. ఆడియో చెయ్యకపోవడం పొరపాటే, మరి!

మార్గళి/ధనుర్మాసం, అంటే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకూ ఉన్న 30 రోజుల్లో తిరుప్పవై లోని ముప్పై పాశురాలు (పద్యాలు) రోజుకొకటి చొప్పున వైష్ణవులు చదువుకుంటారు. ఆఖరిరోజున, అంటే మకరసంక్రమణం రోజున (సంక్రాంతి దినాన) గోదా పెండ్లి చెయ్యడం ఒక ఆచారం. ఈమాట జనవరి సంచికలో పెండ్లి కల పద్యాలు సమయోచితం. ఇరవైరెండు పద్యాలున్న పెండ్లి కల మీరు చదివి ఆనందిస్తారని మా నమ్మకం.

– వేలూరి వేంకటేశ్వర రావు


కలగంటిన్‌ కలగంటినమ్మ, చెలియా! కళ్యాణి! వెయ్యేన్గులొ
ప్పుల కుప్పల్‌ తనవెంట గొల్చుచును రా ఫుల్లాబ్జనేత్రుండు వ
చ్చె, లసత్తోరణ పంక్తులైన నగరశ్రీ వేల బంగారు కుం
డలతో మంగళ వాద్య ఘోషములతోడన్‌ స్వాగతింపన్‌, సఖీ!

అరటుల్‌, గుత్తుల పోకమ్రాకులును, పూలైయల్లు నాపెండ్లి పం
దిరికిన్‌ వచ్చెనతండు, యౌవన సుధాదీపమ్ము; గోవిందుడున్‌
హరియున్‌ మాధవుడంచునున్‌ బిలిచి రమ్మా, వాని వేపేర్లతో
అరయన్‌ వానికి నాకు పెండ్లి సమయమ్మాసన్నమయ్యెన్‌, సఖీ!

సాంద్రప్రీతి శచీ పురందర వశిష్ఠారుంధతుల్‌, రోహిణీ
చంద్రుల్‌, వాణి హిరణ్యగర్భు, లగజేశానుల్‌ మహాత్ముల్‌, దయా
సింధుల్‌ వచ్చిరి; మందహాసములు విచ్చెన్‌ కౌముదీ వల్లరీ
సౌందర్యమ్ములు; వెల్లివారినవి అచ్చమ్మైన ఆనందముల్‌

దేవతలెల్ల బంధువులు దీప్తముఖుల్‌ పలుజంట జంట లే
వేవియొ మాటలాడుచు మరేవియొ పెండ్లి పనుల్‌ పొనర్చుచున్‌
మా వయిపే కనుంగొనుచు మమ్మును గూర్చియె ఊసులాడుచున్‌
పూవుల నీరు చల్లు చటు పోవుచు వచ్చుచు సందడింపగన్‌.

నారాయణ సహోదరి లలితాంగి ప్రణయిని దుర్గమ్మ
గారాపుటాడుబిడ్డ నను ముద్దాడి కౌగలించుకొని
పారిజాత సుమాల మాలతో శుభాభరణాలతో మ
హాలక్ష్మివోలె నలంకరించిన దారాటపడుచు

ఘలుఘల్లంచును కాలియందియలు మ్రోగన్‌, మందయానమ్ములన్‌
మొలకల్‌దేరెడు నవ్వులున్‌ పలుకరింపుల్‌ జంటలై సాగగన్‌
జిలుగుం బంగరు మంగళారతులతో చెల్వారు బంగారు బిం
దెలతో మాకెదురుంగ వచ్చిరదె కన్నెల్‌ పొంగులందమ్ములై

కలభశ్రీ తొలుకాడు క్రొత్తనడలన్‌ కళ్యాణ వైభోగ మాం
గలికాహార్యము చిత్రవర్ణ సుషమా కమ్రమ్ముగా నెంతయున్‌
తొలి చైతన్యపు లేత సవ్వడులు చిందుల్‌ ద్రొక్కు పాదూద్వయీ
లలితుండై హరి వచ్చెనే హృదయనేత్ర ద్వంద్వ పర్వమ్ముగన్‌.

నలుదిక్కుల్‌ గల నాల్గు సంద్రముల నానా పుణ్యకల్లోలినీ
జలముల్‌ చల్లిరి స్వస్తిమంత్ర విహిత స్వానుల్‌ ద్విజుల్‌ మా పయిన్‌
లలనా! నీరద నీల కాంతి లలితున్‌ లావణ్య శోభావధిన్‌
జలజాక్షున్‌ నను ప్రక్కగా నిలిపి రక్షాసూత్రముల్‌ కట్టిరే!