ప్రతిభా సముద్ర సాంయాత్రికులైన పూర్వులందించిన స్ఫూర్తితో, గురుచరణ సేవా సంలబ్ధమైన సంస్కార బలంతో, నిరంతర కావ్యానుశీలనంతో, సంప్రదాయ ప్రవణమైన ఆధునిక చైతన్యధారతో కావ్యవిద్యా స్నాతకులు కాగోరిన వారికి ఉపదేష్టలుగా వ్యవహరించి తెలుగులో సాహిత్య విమర్శను కొనసాగించిన ప్రముఖులలో కోవెల సంపత్కుమార ఒకరు. భారతీయ కావ్యశాస్త్ర పరంపరకు వారసులై నిలిచి తెలుగుసాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ ప్రవర్తకులైన సద్విమర్శకులలో గణించదగినవారు సంపత్కుమార. ఇంటిపేరు కోవెల, ఒంటిపేరు సంపత్కుమార. ఆ తీరు, సౌరు పేరులోనే కాక ఆయన జీవనశైలిలోనూ సృజనశైలిలోనూ మనకు దర్శనమిస్తుంది.
కోవెల సంపత్కుమారాచార్య
(26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010)
తెలుగులో ప్రాచీన కవులు తమ కావ్యావతారికలలోను, సందర్భోచితమైన కావ్యమార్గంలోను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కొంత సాహిత్య విమర్శ చేసి ఉన్నారు. అది ఎక్కువ భాగం సంస్కృతాలంకార శాస్త్ర మార్గాన్ని అనుసరించి ఉంటుంది. దేశీయమైన పరిభాష, విమర్శమార్గం కొంత లేకపోలేదు. ఆయా కవులు వెలువరించిన సాహిత్యవిమర్శ సంబంధమైన అభిప్రాయాలను క్షోదక్షమంగా అధ్యయనం చేసి క్రోడీకరించి ఆధునికులు కొందరు గ్రంథ రూపంలో వెలువరించారు. దేశీయమైన సాహిత్య విమర్శకు సంబంధించి పూర్వులు కొనసాగించిన కృషిని సర్వసమర్థంగా విశదం చేయవలసిన బాధ్యత ఇప్పటికీ మన విమర్శకుల మీద నిలిచే ఉంది. ఇదిలా ఉండగా సపాదశతజయంతిని దాటిన మన తెలుగు విమర్శరంగంలో తొలి, మలి తరాలు రెండింటిలోను కూడా సంపూర్ణమయిన ఆరోగ్యకర వాతావరణం ఏర్పడలేదు. క్రోధ ద్వేషాలతో మొలకెత్తి, కూటసృష్టితో చిగురించి, కుల శాఖ వైమనస్యాలతో మొగ్గ తొడిగి, వర్గ కలహాలతో పుష్పించి, చెప్పుదెబ్బలతో కాయకాచి, మారణాయుధాలతో ఫలించిన ఘనత మన సాహిత్య విమర్శ చరిత్రకుంది. అది అంతో ఇంతో మన భావకవితా యుగానికి, అభ్యుదయ కవిత్వ విమర్శకు విస్తరించినట్లు కొన్ని కుట్రలు, కూహకాలు, కుసుంభరాగాలు సాక్ష్యం పలుకుతున్నాయి.
ఇటువంటి అవాంఛనీయ వాతావరణాన్ని తొలగించి సాహిత్య విమర్శరంగంలో పరస్పర అవగాహనతో కూడిన హేతుబద్ధమైన చర్చలకు స్థానం కల్పించి, విభిన్న లక్ష్యాలకోసం పోరాడే విమర్శకుల మధ్య సామరస్యపూర్వకమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం కల్పించే నూత్నశకానికి నాందీవాచకం పలికిన ఘనత సంపత్కుమారకు దక్కుతుంది. ఇది ఆయన చే.రా.తో కలిసి సంయుక్తంగా సాధించిన సరికొత్త సంస్కారం. తన లక్ష్యాలతో విభేదించే ఇతర విమర్శకులతో కూడా సంపత్కుమార వ్యవహారశైలి ఇదే విధంగా ఉంటుంది. ఆయనది విశ్వనాథ మార్గం, నాది గురజాడ మార్గం. ఇద్దరమూ ఆధునికులమే అయినా ఆధునికతకు ఆయన చెప్పుకొనే నిర్వచనం వేరు, నేను స్వీకరించే నిర్వచనం వేరు. అయినా విమర్శ విధానంలో అపరిహార్యమైన సమానాంశాలెన్నో మా ఇద్దరినీ ఏకం చేశాయి. ఆయనకు, నాకు విశ్వనాథ ఆరాధ్యుడు. ప్రాక్పశ్చిమ విమర్శ సిద్ధాంతాల సమన్వయం కోసం నేను కొనసాగిస్తోన్న అధ్యయనం వారికి ప్రీతిపాత్రమయింది. అందుకే ఏడేళ్ళ స్వల్ప కాలంలో మా యిద్దరి మధ్యా ఎంతో ఆత్మీయత పెరిగింది. ఆయన నాకు గురుస్థానీయుడు, నేను ఆయనకు ఆత్మీయమిత్రుణ్ణి. ఆయన విమర్శ గ్రంథాలన్నీ చదవడం వలన నా అధ్యయనం విస్తరించింది. అబోధపూర్వమైన అనుభవం ఇప్పటికీ నన్ను ఆవరించుకుంటునే ఉంది.
సంపత్కుమార ప్రతిభామందిరం సువిశాలము, సమున్నతము అయిన కవిత్వ, పాండిత్య, పరిశోధన, విమర్శ చతుశ్శాలా సౌందర్యబంధురమై ఉంటుంది. నిసర్గ మనోహరమైన లాక్షణిక గోపురమొకటి ఆ ప్రతిభామందిరానికి అదనపు అలంకారం. సంవాద-విసంవాదాల పట్ల సుభావంతో ప్రవర్తించి సత్యశోధనకు పూనుకోవడం ఆయన విమర్శ లక్షణం. భాషాచ్ఛందో వ్యాకరణ అలంకార సృజనాత్మక రీతులను గూర్చిన ఋజువైన శాస్త్రీయమైన ఆలోచనా విధానాన్ని ప్రకటించడానికీ, నిజాయితీని పాటించడానికి తెలుగు విమర్శ రంగంలో కృషి చేసిన విశిష్టుడు సంపత్కుమార. అంతస్తపన వారి విమర్శకు ప్రేరణ. సాహిత్య విమర్శకు పాఠకుని పక్షాన నిలిచి అతని కావ్యానుభవానికి ఉపయోగపడడమే చరమ లక్ష్యమనే అవగాహనతో తన విమర్శ ప్రస్థానాన్ని కొనసాగించారు సంపత్కుమార. భారతీయ సమాజ నిర్మాణం ధర్మ మూలమయిందనే విశ్వాసం ఆయన సాహిత్య సృష్టికి, విమర్శ మార్గానికి పునాది. రాతినుండి నార తీసే విమర్శ పద్ధతి ఒకటి. విచ్చుకున్న పువ్వునుండి వాసన పీల్చే విమర్శ పద్ధతి ఇంకొకటి. వికసిత కుసుమం నుండి అజ్ఞాత మధువును సేకరించి సహృదయాస్వాదం కోసం మధుకోశాన్ని నిర్మించే భ్రమరగాన సదృశమైన విమర్శమార్గం ఇంకొకటి. ఇది సంపత్కుమార విమర్శమార్గం. తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో ఇప్పటికి అయిదు తరాలు గడిచాయని సంపత్కుమార గణన చేశారు. ఆ గణనను నాలుగు తరాలుగా సరిపెట్టవచ్చునని నేను భావిస్తున్నాను. ఎలా లెక్కించినా మూడవ తరానికి చెందిన తెలుగు విమర్శకులలో ఆయన ప్రథమ శ్రేణిలో నిలుస్తారు.
‘తెలుగు సాహిత్య విమర్శ – తొలితరం ప్రవృత్తి’ అనే తమ వ్యాసంలో సంపత్కుమార కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారిని గూర్చి వ్రాస్తూ, “గ్రంథమందలి గుణదోషములు దానిపై ఖండనమును వ్రాయించిన గ్రంథ కర్త యందే విధమైన రాగద్వేషాలు లేవు – అని శాస్త్రిగారు ప్రకటించడం సాహిత్య విమర్శ విధానానికి ఒక దేశీయ సూత్రంగా గమనించవలసిన మౌలికాంశం” అంటారు. ఇది సంపత్కుమార విమర్శకు ప్రధాన సూత్రమయింది. భావోద్వేగానికి, వాక్పారుష్యానికి ఎడమీయని సమచిత్తంతో కూడిన ఈ విమర్శ సంస్కారం సంపత్కుమారకు ఎక్కడనుంచి వచ్చింది? నిబద్ధము, నిర్వ్యాజము, నిర్దుష్టము, నిష్పక్షపాతము అయిన విమర్శ సౌష్ఠవ సాధన కోసం ఒక జీవితకాలం అహరహం పరిశ్రమించిన పటుత్వం ఆయనకు ఎలా సంక్రమించింది? జన్మసిద్ధమా! వంశపరంపరాగతమా! పరిసర సంసర్గమా! అధ్యయన వైశాల్యమా! అంతస్తపనా! అనుభవ పరీపాతమా! దర్శన వైభవమా! – ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పోతే ఈ అన్నింటి సమాహారమే సంపత్కుమారను సద్విమర్శకుణ్ణిగా చేసిందని భావించవలసి ఉంటుంది.
సంపత్కుమార తండ్రిగారైన శ్రీమాన్ కోవెల రంగాచార్యులవారు వైష్ణవాగమాలలోనే కాక సంస్కృతాంధ్రాలలో పండితులు. ‘వారిపట్ల వారి శిష్యవర్గం పరమ పూజ్యభావంతో ప్రవర్తించటం మాకు సహజంగానే ఒక వినీతిని నేర్పింద’ని సంపత్కుమార సోదరుని కుమారులు, ఇంచుమించుగా సమవయస్కులు, జంటకవి అయిన సుప్రసన్న చెప్పేవారు. బాల్యంలోనే సంపత్కుమార తండ్రిగారి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించారు. పాఠశాల దశలోనే కవితారంగంలో ప్రవేశించి జాతీయ విద్యార్థి సంఘం పెట్టే పోటీలలో బహుమతులు పొందారు. కాంగ్రెస్ ఉద్యమం సంపత్కుమారలో అసంకల్పితంగా గాంధేయ ప్రభావాన్ని, ఆధునిక జీవన మూల్యాలను గూర్చిన ఆలోచనలను కలిగించింది. రజాకార్ల అల్లర్లలో కుటుంబం కకావికలైనప్పుడు స్వస్థలం నుంచి చెదిరిపోయిన సంపత్కుమార రేపల్లె ప్రాంతంలో కొన్నినాళ్ళు ఉన్నారు. 1949-53 సంవత్సరాల మధ్య చిట్టిగూడూరులోని ప్రాచ్యకళాశాలలో అధ్యయనం కొనసాగించారు. ఆ తొలిరోజుల్లోనే విశ్వనాథ కవిత్వంతో పరిచయమయింది. ఆ కాలంలోనే మల్లంపల్లి వీరేశ్వర శర్మ, మల్లంపల్లి శరభయ్య సోదరుల మార్గదర్శకత్వంలో సంపత్కుమార కవిత్వ సాధన రాటుదేలింది. ఆ కాలంలోనే సంస్కృతాలంకార శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశారు. తరువాతి కాలంలో హిందీలో ఎం. ఎ. పట్టాన్ని పొందారు. హిందీ చదవడం వల్ల సంపత్కుమారకు అఖిలభారతదృష్టి, దేశీయతాదృష్టి కలిగాయి. తులనాత్మక సాహిత్య అధ్యయనానికి, విమర్శకు కూడా ఈ అధ్యయనం ఉపయోగించింది. హిందూమహాసభ, సామ్యవాద శిబిరం, ఆర్యసమాజం, సనాతన ధర్మ ప్రచారిణీ సభల కార్యకలాపాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అన్ని మార్గాలకు చెందిన రచనలను, అన్ని కవిత్వ ధోరణులను సమబుద్ధితో అధ్యయనం చేసేవారు.
వరంగల్లు, హైదరాబాదు నగరాలలోని అనుభవజ్ఞులైన కవి, పండిత, పరిశోధక, విమర్శక ప్రముఖులందరితోనూ సంపత్కుమార పెద్ద-చిన్న అనే భేదం లేకుండా సఖ్యతతో ఆత్మీయంగా మెలిగేవారు. సాహిత్య సంబంధమైన వనరులేమీ లేని జగిత్యాల వంటి ప్రాంతాలలో తలమునకలుగా పనిచేస్తున్నప్పుడు కూడా సాహిత్య అధ్యయనాన్ని, పరిశోధన ప్రమాణతను, విమర్శ వ్యాపారాన్ని పట్టుదలతో కొనసాగించేవారు. రాను రాను, విశ్వనాథ సాహిత్యంతో పెనవేసుకున్న ప్రగాఢ బంధము, నూతనైతిహాసిక లక్షణాలకు నిబద్ధులైన నవ్యసాంప్రదాయవాదుల తోడి సంసర్గమూ బలపడుతూ వచ్చాయి. సంపత్కుమార సాహిత్యవిమర్శ సంస్కారాన్ని సమ్యగ్రీతితో అర్థం చేసుకోదలిచినవారు బహుముఖీనమైన ఈ నేపథ్యాన్నంతటినీ ఆకళించుకోవలసి ఉంటుంది.
సంపత్కుమారకు చిరకాలం నిత్యానుపాయిగా, శరీరాంతర్భాగంగా నడచుకొన్న ఆచార్య సుప్రసన్న ‘మాకు తొలిరోజులనుండి తొందరగా విజృంభించే గుణం లేదని, సంకుచితభావాలకు ఎప్పుడూ దూరంగానే ఉండేవార’మనీ పేర్కొన్నారు. సంపత్కుమార విమర్శ గ్రంథాలలో ఎక్కువపాలు ఈ అంశాన్ని నిరూపిస్తాయి. ఆయన బహుగ్రంథకర్త. సాహిత్యవిమర్శకు, ఛందోలక్షణ నిరూపణకు పరిమితమైన వారి ప్రచురిత గ్రంథాలివి: తెలుగు ఛందోవికాసము (1962); మన పండితులు, కవులు, రచయితలు (1970); వచనపద్యం – లక్షణచర్చ (1978); ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ – సాంప్రదాయిక రీతి (1981); తెలుగు సాహిత్య చరిత్ర (1990); పూర్వకవుల కావ్యదృక్పథాలు (1990); తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు (1993); కావ్యం – కవిస్వామ్యం (1993); కిన్నెరసాని పాటలు: వస్తువిన్యాసం (1999); కన్యాశుల్కం: మరోవైపు (2000); ఛందోభూమికలు (2003). ఇవికాక, తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించిన అప్రకటిత రచనలు ఇంకా తగుమాత్రంగా ఉన్నాయని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఈ రచనలన్నిటినీ ఆమూలచూడంగా చదివిన వారికి సంపత్కుమార విమర్శమార్గం స్పష్టంగా తెలియగలదు.