6. వచన పద్యం: వాద సమాపనం

వచన పద్యం ‘పద్యం’ కాదని ‘ఇంకోసారి’ నిరూపించటంలో రామారావుగారు మరోసారి చెబుతున్న అంశాలివి –

1. పద్యపాదానికి అంతర్నిర్మాణ బాహ్యపరిమితులుంటాయి.
2. వచనపద్యానికి (-పద్యపాదానికి) అంతర్నిర్మాణం లేదు. బాహ్య పరిమితి ఆర్బిట్రరీ.
3. భావగణాల స్వరూపమేమిటో స్పష్టంగా తెలియనందున భావగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవు.
4. భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగినా, వచన పద్యాన్ని వచనం నుంచి భావగణాలు వేరు చెయ్యలేవు.

– అందువల్ల వచనపద్యం ‘పద్యం’ కాదు.

చర్చను పెంచటం కాదు గాని, ఈ చర్చితాంశాల గూర్చి నా తాత్పర్యం సువ్యక్తపరుస్తూ, వచన పద్యం ‘పద్య’మే అన్న నా వాదాన్ని ఉపసంహృతీకరిస్తాను.

ముందుకు సాగేముందు వచన పద్య పద్యత్వాన్ని గూర్చి ఆలోచించే ఎవరైనా లక్షింపవలసిన ఒకటి రెండు అంశాలు –

నా చెప్పిన వచన పద్య లక్షణ సామంజస్యమేమయినా, వచన పద్యం ‘పద్యం’ కావటం అనివార్యం. పద్య మౌలిక లక్షణమయిన పాదబద్ధతే దానికా శక్తి కలిగించింది. (పాద స్వరూప విచారణ ఆ తరువాత.) వృత్త, జాత్యుపజాతి, మాత్రాఛందస్సుల్ని అధిగమించి వస్తూ, ప్రాచీనుల ‘వచనా’లనూ, ఆధునికులైన భావకవుల ‘భావగద్యా’లనూ పరిశీలించి సమన్వయించుకుంటూ; కొందరు భావకవులు వచనంగా మార్చిన ‘పద్యా’లను గమనిస్తూ వచన పద్యాన్ని నిష్పన్నం చేసింది పద్య రచయితలే తప్ప వచన రచయితలు కాదు. అందుకే నిష్పన్నమయింది ‘వచన పద్యం’. అత్యాధునికంగా పద్యకుటుంబానికి మాత్రమే కలిసివచ్చి విస్తరించిన ఆస్తి ‘వచన పద్యం’.

సాంప్రదాయికంగా ప్రసిద్ధమయిన ‘పద్యాల’ గూర్చిన లక్షణాలు ఏనాడో నిర్దిష్టమయి, సిద్ధమయే ఉన్నాయి. వాటి ఆధారంగానే ఈనాటి మన ఆలోచనలూ, సిద్ధాంతాలున్నూ. మరి వచన పద్యం అత్యాధునికంగా నిష్పన్నమయిన ఛందోరూపం. లక్షణ రూపంగా ఇంతవరకూ, రామారావుగారన్నట్టు దీనికి నిర్దిష్ట సూత్రాలు లేవు. అవి రూపొందవలసే ఉంది. రకరకాలుగా, అస్తవ్యస్తంగా, యధేచ్ఛగా, యాదృచ్ఛికంగానూ ‘లక్ష్యాలు’ వెలువడి కూడా, వాటిని గూర్చి ఆలోచనలూ-చర్చలూ సాగి, వర్గీకరణాదులు జరిగి, నిర్దిష్టంగా లక్షణాలు ఇంకా రూపొందకుండా ఉండి ఉండిన్నాడు ఆ ‘పద్యా’ల స్థితి ఎట్లాంటిదో, ఈనాటి వచన పద్యాల స్థితి అట్లాంటిది. అందువల్ల ఈ స్థితిలో ఉన్న వచనపద్యాల గూర్చి ఆలోచించేటప్పుడు, ఆర్బిట్రరీగా రూపొందిన లక్ష్యాల్ని పరిశీలించి, వర్గీకరణాదులు చేసి, సామాన్య లక్షణాలను గమనించి, వీలయినంత అనువుగా పొసగే పాదవ్యవస్థాదులను నిరూపించే లక్షణాలను – సూత్రాలను నిష్పన్న పరచవలసి ఉంటుంది. అట్లా నిష్పన్న లక్షణాలననుసరించి లక్ష్యాలు మళ్ళీ విరివిగా వచ్చింతరువాత ఈ లక్షణాలకూ – లక్ష్యాలకూ అవినాభావ సంబంధం సుప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు, సాంప్రదాయికంగా అనువర్తిస్తున్న పద్యాల గూర్చి మనకీనాడు కలుగుతున్న ప్రామాణ్యమూ, సులువూ వచన పద్యాల విషయంలో కలుగుతుంది. వచన పద్య ప్రయోక్తకూ – పరిశీలకునికీ సమాన ప్రమాణం ఉండటం వల్ల కలిసిపోయిన ఛందఃపద్ధతులను ప్రెడిక్టు చేయగల్గటం, ‘ఛందస్‌శ్లేష’ను పరిశీలించటం వంటివి అప్పుడు కుదురుతయి.

ఇక ముందుకు సాగితే –

వృత్తాల నుంచి జాతుల వరకొచ్చేటప్పటికి అక్షర సంఖ్యా నియమం పోయింది. జాతుల్నించి తెలుగులో ఉపజాతుల వరకొచ్చేప్పటికి ప్రాస నియమం పోయింది. పాదాంత విశ్రాంతి తెలుగులో ఒక నియమం కానే కాదు. ఉపజాతుల్నుంచి మాత్రా ఛందస్సుల కొచ్చేటప్పటికి సూర్యాది మాత్రాగణ నియమమూ పోయింది. అధునికంగా యతి-ప్రాస నియమాలు పూర్తిగా ఐచ్ఛికాలయిపోయినై. (రామారావు గారి వృత్తనిర్మాణ యంత్రం, దానికి సంబంధించిన అంశాల గురించి ఇప్పుడు చర్చించబోవటం లేదు.) అయితే, వృత్తాదులైన ఈ ‘పద్యా’లన్నీ, ‘పద్యం’ కావటానికి మౌలిక లక్షణమయిన ‘పాదబద్ధత’ మాత్రం నిలుపుకున్నాయి. అది లేక ఎన్నున్నా పద్యం కాదు. అది ఉండి ఏవి లేకున్నా అది పద్యం అవుతుంది. కాగా పాదబద్ధతేతర నియమాలన్నీ అనియతాలు. ఈ నియత, మౌలిక, పాదబద్ధతా లక్షణాన్ని మాత్రం నిలుపుకుని, మాత్రాసంఖ్యాగణ నియమాన్ని కూడా వదిలేసింది వచన పద్యం. ఇది ‘పద్య స్వరూపం’లో వచ్చిన క్రమ పరిమాణం. కాగా, వచన పద్య విషయంలో అక్షరాదుల లెక్కలు పాదస్వరూప నిర్ణయానికి ఉపయోగపడవు. ఉపయోగపడేది కేవలం ‘భావం’ మాత్రమే. అందుకనే, వచన పద్యపాద స్వరూప నిరూపణకు మౌలికాధారంగా తీసుకున్నాను. ఇట్లా తీసుకోవటానికి ప్రమాణమై దారి చూపింది, ఋగ్వేదంలోని కొన్ని ఋక్కుల పాదవ్యవస్థ నిరూపించే – ‘తేషాం ఋక్ యత్రార్థవశేన పాదవ్యవస్థా’ అనే – జైమినీయ న్యాయ సూత్రం. అయితే ఈ వైదిక ఛందస్సంబంధ సూత్రం – బండి నాగరాజుగారనుకున్నట్టు (చూ. అనుబంధం) మారుమూలదేమీ కాదు – లౌకిక ఛందస్సు కనువర్తించదనుకో నక్కరలేదు. వేద రచన ఆగినప్పటినుంచి సాగిందాన్ని ‘లౌకిక’ మంటున్నాం. అంటే లౌకిక ఛందస్సు అనబడేది వైదిక ఛందస్సు నుంచే నిష్పన్నమయిందని పింగళ ఛందశ్శాస్త్రాన్ని పరిశీలిస్తే స్పష్టమయే విషయమే. కాగా, పయి సూత్రాన్ని వచన పద్యాల విషయంలో ప్రమాణీకరించడానికి సందేహపడ నక్కరలేదు. రామారావుగారనుకున్నట్టు ఋక్కులన్నీ అక్షరచ్ఛందస్సులు – అక్షరసంఖ్యా నియమిత పాద వ్యవస్థ గలవి – కావు. పింగళచ్ఛందం పరిశీలించవచ్చు. మరి ఈ విధమయిన పాద వ్యవస్థ ఋక్కుల పఠనంలోనా? లేఖనంలోనేనా? అని రామారావుగారూ, నాగరాజుగారూ పడ్డ సందేహం ప్రస్తుతానికి అభ్యంతరం కలిగించేదేమీ కాదు. (ఊరికే, వ్యాసం పెరుగుతుందని దాన్ని వివరించబోవటం లేదు.)

ఎందులో అయినా, నా ప్రతిపాదనల్లో మార్పేమీ రాదు. పాదానికి అక్షరాదుల సంఖ్యా నియమం ప్రవర్తించని చోట పాదవ్యవస్థ కవలంబించిన పద్ధతి, అట్లాంటి చోటే అయిన వచన పద్యపాద వ్యవస్థకు ప్రమాణం కావటం హేతుబద్ధమే. రామారావుగారన్నట్టు ‘హేతుబద్ధతే ప్రమాణం కన్నా విలువయినది’. నిజమే. అయితే, ఆ ప్రమాణం హేతుబద్ధం కానప్పుడే ఇట్లా అనడం సమంజసం. ఆ సూత్రం ప్రవర్తించే విషయం ఉన్నదంటే, అది హేతుబద్ధమన్నమాటే. ఇక, రామారావుగారు గ్రహించినట్టే – ‘అక్షరసంఖ్యా నిబద్ధమయిన పద్యాపాదాల్లో పాద విభజన అర్థభంగం కలిగించని విధంగా ఉండాలని పై సూత్రానికి తాత్పర్యం’. అయితే, దీన్నిబట్టి వ్యక్తమయ్యేదేమిటి? అర్థభంగం కలిగించని విధమే అక్కడ పాదవిభజనకు సూత్రం తప్ప, అక్షరాదుల సంఖ్య కాదని. సూత్రంలోని ‘అర్థవశేన’ అన్నది ఋక్కుల పాదవ్యవస్థలో అక్షర నియమ వ్యావర్తకం కాదు, ఆ నియమం లేని ఋక్కుల విషయంలో ప్రవర్తకం మాత్రమే. ఇక పద్యం మొత్తంగా అక్షర సంఖ్య నియమితం కావటానికక్కడ – ఈ సూత్ర ప్రవృత్తి ఉన్నచోట – ప్రాధాన్యం లేదు. ఆ మొత్తమయిన అక్షర సంఖ్యకు పాదవిభజనలో ప్రసక్తి లేదు కాబట్టి, దీన్నది ప్రభావితం చేయటం లేదు కాబట్టి, పద్యం మొత్తానికీ అక్షర సంఖ్య లేకపోవటమనేది, ఉన్నదానికంటే పూర్వస్థితి.

కాగా, పాద వ్యవస్థా నిరూపణంలో రెండు పద్ధతులున్నాయని స్పష్టపడుతున్నది. ఒకటి: అర్థవశంగా పాదనిరూపణం జరిగేది. రెండు: అక్షరసంఖ్యావశంగా పాదనిరూపణం జరిగేది. మొదటిదానిలో అర్థానికీ, రెండవదానిలో అక్షర సంఖ్యకూ ప్రాధాన్యం. వచన పద్యం మొదటి తరహాకు చెందింది. అందువల్ల, తద్ వ్యవస్థానిర్ణాయక సూత్రం వచన పద్యపాద వ్యవస్థా నిరూపణకు ప్రామాణికంగా దారిని సుగమం చేసింది. ఆ దారిలోనే, వచన పద్యపాద వ్యవస్థ ‘భావ’ వశంగా ఉంటుందని చెప్పటం ప్రామాణికమూ, హేతుబద్ధమూ అయితున్నది. ఛందోమార్గంలో పాదవ్యవస్థా సంబంధి పద్ధతులు రెండు ఉన్నాయని గుర్తించటం ఇక్కడ అవసరమే కాక, తప్పనిసరి గూడా. ‘ఋక్కులు వచన పద్యాలు కా’వనే ఊహతో వాటిని ‘వచన పద్యాలుగా ఎందుకు భావించకూడదు’? అంటే భావించవచ్చునని సమాధానం. పాద వ్యవస్థలోని రెండు పద్ధతులను గుర్తించినాక నిజానికీ ప్రశ్న పుట్టదు. ‘పద్యం’ అన్న పేరు నిశ్చితమయినాక పద్యాలు ‘పద్యా’లయినట్టుగానే, ఆ పద్ధతివన్నీ దాని పరిధిలోకి చేరినట్టుగానే, -వచన పద్యం అన్నది నిశ్చితమయింది కాబట్టి – దీని పరిధిలోకి వచ్చేవాటిని – అవి ఎక్కడున్నా కూడా – వచన పద్యాలనడానికి వెనుకాడ నక్కరలేదు.

ఇక, అంతర్నిర్మాణ, బాహ్య పరిమితుల విషయానికి వస్తే –

పద్య పాదానికి అంతర్నిర్మాణమూ, బాహ్య పరిమితీ ఉంటాయని మొదటినుంచీ రామారావుగారి వాదం. వీటిలో అంతర్నిర్మాణమనేది పాదానికుండే అక్షర, మాత్రాగణక్రమ, సంఖ్యల నాధారం చేసుకున్నది. అక్షరాదిక సంఖ్యా నియమం వర్తించని వచన పద్యం విషయంలో ఈ వాదానికి ప్రసక్తి లేదు. అయినా, ఏ పద్యానిగ్గూడా అంతర్నిర్మాణమంటూ లాక్షణికంగా ఏదీ ఉండదని నా వాదన.

రామారావుగారి వాదాన్ననుసరించి, అంతర్నిర్మాణమంటే – ఒక పాదానికి ఫలానా అక్షరక్రమం, లేదా గణక్రమం, కాదా ఫలానా పద్ధతిలో ఫలానా మాత్రలుండటం – కనీసం పాదానికి మొత్తంగా ఇన్ని మాత్రలుండటం, ఎట్లా ఉన్నా, ఉన్నట్టు చెప్పినా సరే, పాదానికి అంతర్నిర్మాణం ఉన్నట్టు. పాదాల్లో మాత్రల కలయికల్ని చెప్పకుండా పాదాల్లో మాత్రా సంఖ్యను మాత్రమే చెప్తే పాదాల అంతర్నిర్మాణాన్ని గూర్చి చెప్పినట్టే. ఇక వాటి అంతర్నిర్మాణాన్ని లయ ననుసరించి చెప్పాలంటే, మాత్రాగణాల పద్ధతిలోనే చెప్పాలని ఆయన వాదం. ఈ వాదం నుంచి ఒక అంశం నిష్పన్నమయితున్నది. అంతర్నిర్మాణాన్ని లయ ననుసరించీ, అనుసరించకుండా కూడా చెప్పవచ్చు. అనుసరిస్తే గణపద్ధతి. లేకుంటే ఆ పాదానికి ‘అన్ని’ మాత్రలుండటం. అంటే, పాదానికి త్రిమాత్రాగణాలు నాల్గున్నా, పన్నెండు మాత్రలున్నా అంతర్నిర్మాణం ఉన్నట్టే. మరి పాదానికి బాహ్య పరిమితి ఏమిటి? పాదానికి నాలుగు గణాలు, లేదా పన్నెండు మాత్రలు. మరి, అంతర్నిర్మాణ, బాహ్యపరిమితులకు తేడా ఏమిటి?

పాదానికి నాలుగు త్రిమాత్రాగణాలిండటం, లేదా పన్నెండు మాత్రలుండటం నిజానికి ‘పాద పరిమితి’ అంటే పాదం యొక్క బాహ్య నిర్మాణ స్వరూపం. ‘బాహ్య పరిమితి’ ఉందంటే ‘అంతఃపరిమితి’ కూడా ఉండవలసి రావటం సహజం. అది ఉండదు, ఇది ఉండదు. కాగా ఇది పాద పరిమితి. ఇది పద్య పద్యానికీ భేదిస్తుంది. ఇక, పాదానికి ఫలాన అక్షరాల, గణాల క్రమం ఉండడం గానీ, ఫలాన ఫలాన మాత్రల కలయికలు జరుగటం, జరక్కపోవడం గానీ – ఇదంతా పద్య పాదం యొక్క బాహ్య నిర్మాణం మాత్రమే. ఈ విధాన్నంతే చూచే, ‘ఏ విధమయిన పద్యపాదానికి గాని అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు’ అని మొదటినుంచీ నే ననటం. మరిదంతా బాహ్య నిర్మాణమే అయితే అంతర్నిర్మాణం కూడా ఉండాలె గదా! ఉంటుంది. అయితే, బాహ్య నిర్మాణాన్ని మాత్రమే సూచించగల పాదలక్షణం, దాని అంతర్నిర్మాణాన్ని సూచించజాలదు. అంతర్నిర్మాణాన్నీ, అందులో వైవిధ్యాన్నీ కవి సాధిస్తాడు. అది కవికి సంబంధించింది. తానుపయోగించే పదాలు, వాటి స్వరూపం, వాటి విరుపులు, ఎన్నుకునే అక్షరాల స్వరూప స్వభావాలు, మాత్రల రకరకాల కలగలుపులూ – ఈ మొదలయిన వాటి ద్వారా కవి పద్య పాదంలోను, పద్యం లోనూ చిత్రవిచిత్రంగా అంతర్నిర్మాణమూ, దానిలో వైవిధ్యమూ సాధిస్తాడు. ‘స’గణాల కేవిధంగా ఆస్కారం లేని చంపకమాలా పాదంలో ‘వనితా, జనతా, ఘనతా…’ అనీ, సూర్యేంద్ర గణాలని గాక, చతుర్మాత్రా గణాలతోడి బాహ్యనిర్మాణం కల కంద పద్య పాదంలో ‘మగువ, పొలుపు, తెలుపు, నొక్క…’ అనీ బాహ్యనిర్మాణానికి భిన్నమయిన అంతర్నిర్మాణాలను కవి సాధిస్తాడు. పాదానికి 14 మాత్రలని గానీ, 3+4+3+4 అని గానీ చెప్పబడిన బాహ్యనిర్మాణం గల మాత్రాఛందస్సులో – ‘చివురులూ, కొమ్మలా, చివరా…’, ‘చిలువలై, పలువలై, అందపు…’, ‘తల్లికీ, చిలుక, తల్లంటే…’ మొదలయిన – అంతర్నిర్మాణాలు సాధిస్తాడు. సీసపాదంలో మొదటి ఆరూ ఇంద్రగణాలే అయినా, అందునా పంచమాత్రా గణాల్నే ఉపయోగించినా –

1. మందార, మకరంద, మాధుర్య, మునదేలు
    మధుపంబు, వోపునే – మదనములకు
2. ఓరీ-దు, రాత్మ-నీ, వార-ము, ష్టింపచా
    భాస-యో, జనగంధి – ప్రథమపుత్ర

అంతర్నిర్మాణం రెండు పాదాల్లో భేదించింది. రెండు శార్దూల విక్రీడిత పాదాలే అయినా –

1.రారా సాదర మేదురావలిత ధారాసార మైరేయకి
    ర్మీరారాసార మురావలీ కలితవారీ
2.లోలత్వంబున మత్తకాశినుల కిల్లుంబొల్లును తెల్లగా…

భిన్నస్వరూపం గల గుర్వక్షరాల ఎన్నిక ద్వారా సాధింపబడిన అంతర్నిర్మాణ వైవిధ్యమిది. ఇది కవి సాధించింది. ‘పది మాత్రల బాహ్యపరిమితి గల పద్య పాదాల్లో కొన్ని చోట్ల ఖండగతిని, కొన్ని చోట్ల మిశ్రగతిని పాటించారు కవులు’ అని రామారావుగారన్నారు. ఈ పాటింపు నిజానికి అంతర్నిర్మాణానికి సంబంధించింది. కొందరు కేవలం బాహ్యనిర్మాణాన్ని మాత్రమే అనుసరిస్తూ పోవచ్చు. కొందరీ అంతర్నిర్మాణ వైవిధ్యాన్ని – బాహ్య నిర్మాణాన్ని మన్నిస్తూనే – సాధించవచ్చు. ఒకే కవిలో రెండు రకాల రీతులూ ఉండవచ్చు. అదంతా ఆయా కవులకు సంబంధించిన విషయం. పద్య నిర్మాణ శిల్పానికి సంబంధించిన విషయం.