1. వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం

ఇటీవల వస్తున్న ఒక రకం కవితా స్వరూపానికి వచన కవిత, వచన పద్యం ఇత్యాదిగా చాలా పేర్లు వాడుకలో ఉన్నై. దీని పేర్లను గురించి సంపత్కుమార (1968), నరసింహారెడ్డి (1968) విశేషమైన చర్చ చేశారు. నరసింహారెడ్డి వచన కవిత్వం అనే పేరును, సంపత్కుమార వచన పద్యం అనే పేరును ఎన్నిక చేశారు. నరసింహారెడ్డి మొత్తం 15 పేర్లను పేర్కొన్నారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించవచ్చు. మొదటి తరగతి వచన అనే పూర్వపదంతో ఉన్న సమస్త పదాలు. అవి: 1. వచన కవిత, 2. వచన పద్యం, 3. వచన గేయం, 4. వచన గీతం. ఇతరమైనవి రెండో తరగతి. అవి ముక్తచ్ఛందం (సోమసుందర్), స్వచ్ఛందకవిత్వం (వరవరరావు) మొదలైనవి. మొదటి తరగతిలో ఉన్న నాలుగు పేర్ల మధ్యా చెప్పుకోదగిన భేదం లేదు. పద్యం, గేయం, గీతం అనేవి కవిత్వానికి పర్యాయ పదాలుగానే పై పేర్లలో ప్రయుక్తమయినై.

వచన గేయం, వచన గీతం అని శ్రీరంగం శ్రీనివాసరావు, కుందుర్తి ఆంజనేయులు వాడారు. వచన పద్యం అనే పేరు మొదట పట్టాభిరామిరెడ్డి (పఠాభి), తరువాత సంపత్కుమార వాడారు. వచన కవిత అనే పేరు కుందుర్తి ఆంజనేయులు, టి.వి. రమణారెడ్డి, కోవెల సుప్రసన్నాచారి మొదలైనవారు వాడుతున్నారు. ఈ పేరే ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు సంపత్కుమార (1968), నరసింహారెడ్డి (1968) ఇద్దరూ పేర్కొన్నారు. ప్రీవర్సు ఫ్రంటువారు కూడా ఈ పేరే ఎన్నిక చేశారు (ఆంజనేయులు, గోపాల చక్రవర్తి, 1967). అయినప్పటికి, ఈ వ్యాసంలో – వచనకవిత అనే పేరు అప్పుడప్పుడూ వాడినా – వచన పద్యం అనే పేరే స్వీకరిస్తున్నాను. దానికి కారణాలివి. 1. పద్యం అనే పేరు verse కి సమానార్థకంగా తెలుగులో వాడుతున్నారు. 2. వృత్తాలు, జాతులు, ఉపజాతులు, రగడలు – ఇవన్నీ పద్యాలుగానే ప్రాచీనులు పరిగణించారు. 3. సంపత్కుమార ఒక్కరే ఈ కవితా స్వరూపానికి లక్షణాలు చెప్పటానికి సీరియస్‌గా ప్రయత్నించారు. ఆయన అభిప్రాయాల్నే ప్రధానంగా సవిమర్శకంగా ప్రస్తావించదల్చుకున్నాను గనుక ఆయనకు నచ్చిన పేరే గ్రహించదల్చుకున్నాను.

అసలు లక్షణాలను పరామర్శించ బోయేముందు అపోహలు కలక్కుండా ఉండటానికి ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సివుంది. నరసింహశాస్త్రి (1971) ఇటీవల భారతిలో, “వచనకవిత – అభిమానుల అత్యుక్తులు” అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. అందులో ఆయన వచన పద్య స్వరూపాన్నే కాక, అందులో వస్తున్న కవిత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. వచన పద్య తత్వపరిశీలన అక్కడ సుష్ఠుగా జరగలేదు. ప్రాచీన ఛందః పద్ధతిని సమర్ధించటమూ, ఆధునిక పద్ధతినీ వ్యతిరేకించటమూ, ఆయన అక్కడ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నై. నాకు వచన పద్య స్వరూపం మీదగాని, ఆ రూపంలో వస్తున్న వస్తున్న కవిత్వం మీదగాని వ్యతిరేకత లేదు. కవిత్వం ఏ తొడుగు వేసుకున్నా నా కభ్యంతరం లేదు. ఒక్కో తొడుక్కి ఒక్కో ప్రయోజనం ఉండవచ్చు. ఆ ప్రయోజనాల్లో ఒకానొకటి నాకు నచ్చవచ్చు. అది వేరే విషయం. ప్రస్తుత పరిశీలన ఛందస్స్వరూపానికి మాత్రమే పరిమితం.

ఈ వ్యాసంలో నేను ప్రస్తావించని విషయాలు చాలా ఉన్నై. వచన పద్యం చారిత్రక పరిణామాన్ని గురించి విమర్శకుల్లో చాలా అభిప్రాయాలున్నై. కొందరు దీనిని సమాజ పరిమాణంతో ఉన్న సంబంధాన్ని నిరూపించటానికి ప్రయత్నించారు. దాన్ని గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించను. వచన గేయం ఒక ఉద్యమమని కుందుర్తి ఆంజనేయులు (నవత-2) ప్రకటించారు. ఈ విషయంలో నేను రమణారెడ్డితో (1967) ఏకీభవిస్తాను. అయినా అందుకు కారణాలు ఈ వ్యాసంలో ప్రస్తావించను. వచన పద్యంలో కథాకావ్యాలు రావాలని కుందుర్తి ఆంజనేయులు, శీలా వీర్రాజు, కోవెల సుప్రసన్నాచార్యులు వంటివారు అభిప్రాయపడ్డారు. కీ. శే. బాలగంగాధర తిలక్ ఇందుకు వ్యతిరేకులు. ఈ విషయంలో నాది అలీన విధానం.

ఈ వ్యాసంలో నేను చేయదల్చుకున్నది వచన పద్యానికి లక్షణాలుగా చెప్పబడుతున్న వాటిని పరామర్శించటమే. ఈ లక్షణాలు కేవలం ఆభాస మాత్రాలేనని, అవి శాస్త్రచర్చకు నిలవ్వని నా అభిప్రాయం. అందుకే వాటిని నిరాకరిస్తున్నాను. అది హేతుబద్ధంగా చేయటమే ఈ వ్యాసంలో నేను చేసిన ప్రయత్నం.

వచన పద్యం తత్వాన్ని గురించి, చరిత్రను గురించి, ఇటీవల (అంటే దాదాపు ఒక దశాబ్దకాలం) భారతి, ఆంధ్రపత్రిక, నవత, సృజన, జనధర్మ వంటి పత్రికల్లో విశేషమైన చర్చ జరిగింది. వాటిల్లో కుందుర్తి ఆంజనేయులు, కె. వి. రమణారెడ్డి. దేవరకొండ బాలగంగాధర తిలక్, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వే. నరసింహారెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, పెండ్యాల వరవరరావు, వేగుంట మోహనప్రసాద్, ఆవంత్స సోమసుందర్, టి. యల్. కాంతారావు, అరిపిరాల విశ్వం – ఇంకా అనేకులు పాల్గొన్నారు. వీటిలో కొన్నిటిని వచన కవిత అనే పేరుతో ఫ్రీవర్సు ఫ్రంటువారు కుందుర్తి ఆంజనేయులు, గోపాలచక్రవర్తి (1967) సంపాదకత్వాన ఒక సంకలనం వేశారు.

వచనపద్యం చాలామంది దృష్టిని ఆకర్షించింది. కొత్తకవులు అంతా వచన పద్యాల్లోనే రాస్తున్నారు. అంతేకాదు. పాతకాలపు కవులు కూడా ఈ పద్ధతిలో రాయడానికి ప్రయత్నించారు. (చూ. భాగవతుల శంకరశాస్త్రి (ఆరుద్ర) రాసిన సినీవాలికి కాటూరి వేంకటేశ్వరరావుగారి పీఠిక.) ప్రధానంగా కథలూ, నవలలూ రాసే రచయితలు వచన పద్యం ద్వారా కవులైనవారున్నారు. (స్పందన సాహితివారు 1959లో ప్రచురించిన ‘స్పందన’ అనే సంకలనంలో వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘అన్వేషణ’ అనే ఖండిక ఉంది. పోతుకూచి సాంబశివరావు వచన పద్యాలు ‘రాసి సిరా’ అనే పేరుతో 1963లో ప్రచురితమయినై.) ఆలిండియా రేడియో యువవాణి కార్యక్రమాల్లో కుర్రవాళ్ళు ఆవేశంతో వచన పద్యాలే చదువుతున్నారు. ఎన్నికల ప్రచార కరపత్రాల్లోకి కూడా ఈ వచన పద్యం వ్యాపించింది. ఒక ఏడాది కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసిన పి. వి. రంగారావు వచన పద్యంలో కరపత్రం వేశారు.

ఇంతగా ప్రచారంలో ఉన్న కవితా ప్రక్రియను గురించిన చర్చ కూడా ఇంత విస్తారంగానే జరిగింది. చాలామంది వచన పద్యం అంటే ఏమిటో చెప్పకుండానే దానిమీద పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు. కొంతమంది వచన కవిత్వాన్ని గురించి కవితామయ నిర్వచనాలిచ్చారు. కవిత్వాన్ని గురించి కవిత్వంలో చెప్పితే అది లక్షణం కాదు. స్పష్టంగా శాస్త్ర పరిభాషలో హేతుబద్ధంగా దాని లక్షణం చెప్పాలి. (అట్లాంటి ప్రయత్నం చేసింది నాకు తెలిసినంతవరకు ఒక్క సంపత్కుమార మాత్రమే. ఆయన లక్షణాలని నేను నిరాకరించటం, ఆయన ప్రయత్నాన్ని కించపరచటంగా అర్థం చేసుకోకూడదు.) నేనీ ఆరోపణలను నిరాధారంగా చెయ్యటం లేదు. మచ్చుకి ఈ వాక్యాలు గమనించండి.

వచన గీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమనవైవిధ్యం. ఇది సంభాషణలోని యాసలూ, కాకువులూ, ఉచ్ఛారణ విశేషాల మీద ఆధారపడి ఉంటుంది.

– శ్రీరంగం శ్రీనివాసరావు (1939)

వచన గేయం సమాజాన్ని గురించి సూటిగా చెబుతుంది. సమాజం మీద యీటెలుగా విర్చుకు పడుతుంది. సమాజంలో అనేకమందికి అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తూ, ప్రజా హృదయాల్లోని విప్లవ దృక్పథాన్ని నిద్రలేపి సంపూర్ణ సామాజిక వికాసానికి దోహదం చేస్తుంది.

– అద్దేపల్లి రామమోహనరావు (1969)

ఇట్లాంటి వాక్యాలు చాలా వ్యాసాలనుంచి చూపించవచ్చు. చాలామంది వచన పద్యం ఎట్లా పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఏం చెయ్యగలదో చర్చించారేగాని దాని లక్షణాలేమిటో ఎవరూ చెప్పరు. వచన పద్య ప్రవక్తలు, సిద్ధాంతకర్తలుగా పత్రికల్లో కనిపిస్తున్న కుందుర్తి ఆంజనేయులు, అరిపిరాల విశ్వం, అద్దేపల్లి రామమోహనరావు, కోవెల సుప్రసన్నాచారి, టి. ఎల్. కాంతారావు మొదలయిన వారంతా వచన పద్యం మీద పెద్ద పెద్ద వ్యాసాలు రాసినవారే కాని వారి వ్యాసాల్లో వచన పద్యాలను గురించిన పొగడ్తలు తప్ప శాస్త్ర సంక్షిప్తత అసలు కనపడదు. అయినా అక్కడక్కడ కొన్ని ఆభాస లక్షణాల ప్రస్తావన కనిపిస్తుంది. వాటిని ఒక్కొటక్కటే పరామర్శించి ఖండిస్తాను.

తూగు, విసురు, ఊపు, విరుపు, లయ, భావలయ, అంతర్లయ, అంతర్నాదం, భావగణాలు వచన పద్య లక్షణాలుగా కొందరు ప్రతిపాదించారు. వీటిలో తూగు, విసురు, ఊపు, విరుపు అనేవాటిని ఒక గణంగానూ; లయ, భావలయ, అంతర్లయ, భావగణాలు అనేవాటిని ఇంకో గణంగాను వేరుచేసి పరిశీలిస్తాను. ముందుగా ఈ ప్రవచనాలు చూడండి.

వచన గేయానికి మొట్టమొదటి లక్షణం నిరాడంబరత. వచన గేయాన్ని కుంటుపడనీయకుండా ఆద్యంతం చదివేటట్లు చేయగల సొగస్సు, విసురు అలపరచటం ఛందోబద్ధమయిన పద్య రచనకంటే కష్టమయిన పని – వచన గేయంలో ఒక్క ఉపమానాల విషయంలోనే కాదు. ఇతర సందర్భాల్లో కూడా ఈ విసురు ఒక ముఖ్య లక్షణంగా ప్రతిపాదిస్తున్నాను.

– ఆంజనేయులు (1958)

వచన గేయానికి ఒక స్థిరత్వం, స్తిమితత్వం ఏర్పడాలంటే పంక్తి నిర్మాణంలో ఒక తూగు కూడా అవసరం.

– ఆంజనేయులు (1967)

వదిలేసిన ఛందస్సు యొక్క ఎఫెక్ట్సు మరో రూపంలో సాధించబడుతున్నవి. ఆధునిక వచన గేయాల్లో విరుపూ, విసురూ, ధోరణీ, పలుకుబడీ ఇందుకే పుట్టినవి.

– ఆంజనేయులు (1965)

మాత్రా ఛందస్సువల్లా, కావ్య భాషా గుణంవల్లా వచ్చిన ఊపూ, విసురూ తెలుగు నుడికారపు సొంపువల్ల తేవాలనే ప్రయత్నం వచన గేయంగా రూపొందింది.

– ఆంజనేయులు (1969)

ఇన్ని చోట్ల ఇన్ని విధాలుగా కుందుర్తి ఆంజనేయులు ప్రతిపాదించిన ఊపు, విసురు, తూగు అనేవాటిని గుర్తు పట్టడానికి తగిన సాధనాలు లేవు. వీటిని పారిభాషిక పదాలుగా ఉద్దేశించినట్టు కూడా నాకు తోచటం లేదు. వ్యస్తపదత్వం విరుపు అయితే ఏ పద్యాల్లో అయినా వుండచ్చు. అది కవి శైలికి సంబంధించిన విషయం. భావోద్వేగం విసురయితే అది ఛందస్సుతో సంబంధం లేకుండా కవిత్వానికి ఉండే లక్షణం. ఈ ఊపు ఏమిటో నాకు తెలీదు. ఇదీ, విసురూ ఒకటేనేమో? సమభారత్వాన్ని తూగు అంటారు. అందుకు శ్రీనాధుడి సీస పద్యాల్ని ఉదాహరణలుగా సాహిత్య విమర్శకులు చూపిస్తుంటారు. సమభారత్వం సమపరిమాణం గల గణాల ప్రయోగం వల్లనే సాధ్యం. అట్లాంటి గణనియమం లేని వచన పద్యాల్లో తూగు ఎలా వుంటుంది? ఒకవేళ ఉన్నా అవి మాత్రా పద్యాలవుతై గాని వచన పద్యాలు గావు. ఒక వస్తువుకి కొన్ని లక్షణాలు ప్రతిపాదించేటప్పుడు ఆ లక్షణాల్ని తెలిపే మాటకు అర్థం చేసుకోగల్గిన వివరణ ఇయ్యటం లక్షణకారుడి కనీస ధర్మం. అట్లాంటి ధర్మాన్ని వచన పద్య సిద్ధాంతకర్తలు పాటించక పోవటం మన దురదృష్టం. ఆ లక్షణాల్ని గురించి వారికే స్పష్టమైన అవగాహన లేదని తీర్మానించుకోవాల్సి ఉంటుంది. కుందుర్తి ఆంజనేయులు తాను ప్రతిపాదించిన విసురుకు ఉదాహరణగా గోపాల చక్రవర్తి రాసిన ఈ పాదాలను ఉదాహరించారు.

ఆకసం నిండా మేఘాలు
వ్రేలాడు ఏన్గులవలె
దేవవేశ్య ఊర్వశి శిరోజాలవలె
ఉన్మత్త మనో వల్మీకంలో
ఊర్ధ్వంగా ప్రసరించే వేడి వేడి తలపులవలె
మహిషాసురుని మీసాలవలె
అనభ్యుదయవాది ఆలోచనవలె

పై పాదాల్లో నాక్కనిపించిన గుణం ఒక ఉపమేయానికి అనేక ఉపమానాలు వాడటం. ఇది మాలోపమ అవుతుంది. ఇదే విసురు అని ఆంజనేయులుగారి ఉద్దేశమా? ఇది వచన పద్యానికి మాత్రమే ఎందుకు పరిమితం? ఛందస్స్వరూపానికి ఉపమాన బాహుళ్యానికీ ఉన్న అవినాభావ సంబంధమేమిటి? ఇంత అస్పష్టమైన, అసమర్థమైన ప్రతిపాదనలు చెయ్యటానికి కారణం కవులైనవాళ్ళు సిద్ధాంతకర్తలు కూడా కావాలన్న ఉబలాటమే.