2. వచన పద్యం: లక్షణ నిరూపణం

‘వచన పద్యం’ అన్న ప్రక్రియ ప్రయోగంలోకి వచ్చి దాదాపు నలభై ఏళ్ళయింది. ఇటీవల మరీ విరివిగా విస్తృతంగా ప్రయోగింపబడుతున్నది. అయితే వచన పద్యాన్ని ప్రయోగించటమే తప్ప, ఒక ఛందోరూపంగా దాని లక్షణాన్ని నిరూపించే ప్రయత్నం మాత్రం జరగలేదు. అందుకని, దాని లక్షణాన్ని నిరూపిస్తూ నేను కొన్ని వ్యాసాలు రాయటం జరిగింది. ఆయా నా వ్యాసాలను పురస్కరించుకొని చేకూరి రామారావుగారు ‘వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం‘ అన్న వ్యాసంలో నేను చెప్పిన లక్షణాలను నిరాకరించినారు. కాగా, వారు చేసిన ఈ ‘నిరాకరణం’ పురస్కరించుకొని, మళ్ళీ వచన పద్యాన్ని గూర్చిన కొన్ని అంశాలను స్పష్టం చేయవలసిన అవసరం ఏర్పడింది.

వచన పద్యాన్ని గురించి నేను మాత్రమే కాక, ఇంకా కొంతమంది చెప్పిన చాలా అంశాలను ప్రస్తావించి రామారావుగారు తమ వ్యాసంలో నిరాకరించినారు. అయితే, వాటిని గూర్చి నా ఈ వ్యాసంలో ఏమీ చెప్పబోవటం లేదు. నా ‘అభిప్రాయాల్నే, ప్రధానంగా -సవిమర్శకంగా ప్రస్తావించదలచు కున్నా’రు వారు కాబట్టి, వాటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించి వివరిస్తాను.

నా అభిప్రాయాల్నే ప్రధానంగా ‘సవిమర్శకంగా’ ప్రస్తావించదలచుకున్న రామారావు గారు, ఈ ప్రక్రియకు వ్యవహారంలో మరికొన్ని పేర్లు ఉన్నాగూడా, వాటిని కాదని, నాకు నచ్చిన పేరే – అంటే వచన పద్యం అన్న పేరే – గ్రహించినారు. ఆ పేరే నాకు నచ్చటానికి కారణం, ఆ ప్రక్రియకు మిగిలిన పేర్లన్నిటి కన్నా, ఈ ‘వచన పద్యం’ అన్న పేరు బాగా నప్పటం మాత్రమే. ఈ పేరును గూర్చి ఇదివరకటి నా వ్యాసాల్లో – ప్రధానంగా ‘వచన పద్యం: దాని పేరు’ అన్న వ్యాసంలో – చర్చించి నిర్ధారించినాను. ఈ పేరు విషయంలో అసమ్మతినేమీ రామారావుగారు ప్రకటించలేదు. పైగా, నాకు నచ్చిన కారణంగా వారూ ఆ పేరే స్వీకరించి పెట్టినారు. అసలు ఈ ప్రక్రియ పేరును గూర్చి రామారావుగారంతగా పట్టించుకోలేదు. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ ఎక్కువగా వివరించటం లేదు.

రామారావుగారు తన వ్యాసాంతంలో ‘వచన పద్యం పద్యం కాదనీ, గద్యమేననీ, సిద్ధాంతం. గద్యానికి ఏ నియమాలూ లేవు. వచన పద్యానికీ అంతే. నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అని సిద్ధాంతీకరించటం జరిగింది. వచన పద్యం గద్యమే తప్ప పద్యం కాదని సిద్ధాంతం చేస్తూ ‘నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అనటం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. వచన పద్యం పద్యం కాకనే పోతే అందులో – ‘వచన పద్యం’లో – పద్యం అన్న పదం ఉండటానికే వీల్లేదు. మరొకటి, ‘అనియతత్వం ఒక లక్షణం ఎట్లా అవుతుంది?’ అని తమ వ్యాసంలో ఒక చోట ప్రస్తావించిన రామారావుగారు ‘నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అనటం ఎట్లా కుదిరిందో అర్థం కావటం లేదు. ‘అనియతత్వం’ లక్షణం కానప్పుడు ‘నియమ రాహిత్యం’ మాత్రం లక్షణమెట్లా అయితుంది?

వచన పద్యాన్ని నేను ‘పద్యం’ అనటానికి నేను ప్రతిపాదించిన ప్రధానాంశం దాని పాదబద్ధత. దీన్ని అనుసరించి చేసిన భావగణ ప్రతిపాదన. రామారావుగారు తమ వ్యాసంలో మొదట భావగణ నిరాకరణ చేసి, ఆ తరువాత పాదబద్ధతా నిరాకరణం చేసినారు. అయితే, ఈ రెండవ నిరాకరణాన్ని గూర్చి మొదట, మొదటి నిరాకరణాన్ని గూర్చి తరువాత విచారిస్తాను. కారణం, ఛందస్సులో మొదట పాదం, ఆ తరువాత గణం.

పాదబద్ధతను నిరాకరిస్తూ రామారావుగారు కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించినారు. ‘పాదం అక్షర సముదాయం కాదు. గణ సముదాయం. అంటే పాదానికి అంతర్నిర్మాణం ఉన్నదన్న మాట’ అన్నారు. కాని, విచారిస్తే, పాదం అక్షర సముదాయమే తప్ప గణ సముదాయం కాదు. కొన్ని పద్యాల్లో అక్షరాల సంఖ్య పాదప్రమాణం కాగా, మరి కొన్నింటిలో ఆ అక్షరసంఖ్య మాత్రా సంఖ్యాదృష్టి చేత హెచ్చుతగ్గులయితున్నది. నిజానికి, ఛందస్సులో గణపద్ధతి మొదట పింగళుడు ప్రవేశపెట్టింది. ఆయన పద్ధతి ప్రకారం మూడక్షరాల గుంపు ఒక ‘గణం’. [నగణం (లగ), హగణం (గల) అని రెండక్షరాల గుంపులను గణం అనటం ఔపచారికంగా మాత్రమే.] పద్య లక్షణం చెప్పటంలో సౌలభ్యం కోసంగాను తన ధోరణిలో పింగళుడు ఉద్దేశించింది మాత్రమే, ఈ ‘గణ’ పద్ధతి. శాస్త్రకర్తలు ఈ విధంగా లక్షణకథనంలో సౌలభ్యం కోసం కొన్ని పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుని సంకేతించటం పరిపాటే. పింగళునికి పూర్వులైన భరతాదుల్లో ఈ ‘గణ’ పద్ధతి లేదు. ఇన్నిన్నేసి అక్షరాలు గల పాదాల్లో ఫలానా ఫలానా సంఖ్య గల అక్షరాలు లఘువులనీ, లేదా గురువులనీ చెప్పటం వారి పద్ధతి. పరిశేషన్యాయంగా మిగిలినవి గురువులో, లేక లఘువులో అయితాయని అనుకోవాలి.

మరొకటి. పింగళుని గణ పద్ధతికి భిన్నంగా రత్నమంజూషకర్తా, జనాశ్రయుడూ తమకనుకూలమనుకున్న పద్ధతిలో గణనిర్మాణం చేసుకున్నారు. పింగళుడు ఎనిమిది గణాలను చెప్పగా, రత్నమంజూషకర్త పన్నెండు, జనాశ్రయుడు పద్ధెనిమిది గణాలను చెప్పటం జరిగింది. పైగా వారి గణనిర్మాణంలో మూడక్షరాల సంఖ్య పరిమితం కాదు. రెండు నుంచి ఆరు దాకా అక్షరాలు ఆ గణాల్లో ఉండవచ్చు (సంపత్కుమార, 1962). పింగళుడి గణాలు ఎనిమిది కావటం, ప్రతి గణంలోనూ మూడేసి అక్షరాలు మాత్రమే నియతంగా ఉండటానికి కారణం, ఆయన మూడక్షరాల ఛందాన్ని ప్రస్తారం చేసి దానివల్ల ఏర్పడ్డ ఎనిమిది రకాల పద్యపాదాలనూ ‘గణాలు’ గా స్వీకరించటమే. మూడవ ఛందాన్ని (మధ్యాచ్ఛందం) ప్రస్తారించటం వల్ల ఎనిమిది రకాల పాదాలు మాత్రమే ఏర్పడుతయి. రత్నమంజూషకర్త, జనాశ్రయుడు ఈ ప్రస్తార పద్ధతిని కాక తమ స్వసంకేతికమయిన అనుకూలాన్ని అనుసరించి మాత్రమే గణనిర్మాణం చేయటం వల్ల వాటిలో సమత్వం కొరవడింది. ఆ కారణంగా క్లిష్టత్వం అధికమయి వారి గణనిర్మాణానికి ప్రాధాన్యం, ప్రాచుర్యం కలుగలేదు. పింగళుడి పద్ధతికే ప్రాచుర్యం లభించింది.

ఏదెట్లాగయినా, గణాలనేవి లక్షణకర్తలు లక్షణకథనంలో సౌలభ్యానికి ఏర్పరుచుకున్నవే తప్ప పద్యపాదానికి నిసర్గం కావు. ఒకవేళ పాదనిర్మాణంలో గణాలే ప్రధానమయితే, అయిదు గణాల ఛందం, ఆరు గణాల ఛందం… ఇత్యాదిగా గణసంఖ్యలో చెప్పవలసి ఉండేది. కాని, ఆ విధంగా ఏ లాక్షణికుడూ చెప్పలేదు. ఒక అక్షరం నుంచి ఇరవయారక్షరాలదాకా ఒక పాదంలో అక్షరాలుండవచ్చు. ఎన్ని అక్షరాలుంటే ఆ పాదం అన్నవ ఛందానికి చెందుతుంది. పాదానికి పదక్షరాలుంటే అది పదవ ఛందానికి చెందిందన్నమాట. (అంతకన్నా ఎక్కువ అక్షరాలుంటే, అవి వేరే వృత్తాలు.) అన్ని ఛందాల్లోని పద్యపాదాలూ గణాలతో నిశ్శేషంగా విభక్తం కావు. అందుకనే విభక్తం కాని కొన్నిచోట్ల, గణ పద్ధతిలో విభజిస్తూపోగా పాదాంతాన మిగిలే ఒకటి రెండక్షరాల ఉనికినిగూర్చి ప్రత్యేకంగా (ఉదా: మ-స-జ-స-త-త-గ) చెప్పడం జరిగింది.

మరొకటి. పద్యపాదాల్లోని గురులఘుక్రమం ‘ప్రస్తారం’ ద్వారా నిర్ధారిత మయితుంది. కాగా, పద్యపాద స్వరూపాన్ని అక్షరసంఖ్య, దాన్ని బట్టి జరిగే ‘ప్రస్తార’ పద్ధతీ నిరూపిస్తున్నయి తప్ప, గణాలు కాదు. మాత్రా సంఖ్య ప్రాధాన్యం గల పద్యాల్లోనూ ఇంతే, ఆ పద్యపాదాల్లోనూ గణపద్ధతిని ఉపయోగించటం లక్షణకథన సౌలభ్యం కోసమూ; ఎన్ని మాత్రల వద్ద పదం, పదాంశం విరిగితే పద్యం నడక బాగుంటుందో చెప్పటనికి ఉద్దేశించీ, మాత్రమే. ఈ నడక కోసమే చతుర్మాత్రా గణమయిన జగణాన్ని, చతుర్మాత్రా గణాల్ని ఉపయోగించవలసిన సందర్భాల్లో కొన్నిచోట్ల లక్షణ కర్తలు నిరాకరించటం జరిగింది. (అయినా, కవులు స్వేచ్ఛగా ఈ నిరాకరణాన్ని పాటించకపోవటం చాలా చోట్ల గమనించవచ్చు.) మరికొన్ని చోట్ల మాత్రా గణాల్ని వదిలి కేవలం మాత్రా సంఖ్యతో పాదలక్షణం చెప్పటం గూడా ఛందోగ్రంథాల్లో కనిపించే విషయమే. ఇవన్నీ గమనిస్తే పాదం గణ సముదాయం కాదనీ, అక్షర సముదాయమేననీ స్పష్టమయితుంది. కాగా గణాల దృష్ట్యా పాదానికి అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు. నిజానికి పద్యపాదాల్లో గణ పరిమితికి లొంగకుండా పదాలూ, పదాంశాలూ మించిపోవటమే అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం. ఆయా అంశాలను బట్టి పాదం అక్షర సముదాయమేననీ అంగీకరించక తప్పదు.

ఇంతవరకూ తెలుగులో వచ్చిన పద్య పాదాలన్నిటినీ రాతతోగాని, అచ్చుతోగానీ పనిలేకుండా కనుక్కునే వీలుంది. ఏ పద్యాన్నయినా పాదవిభజన చేయకుండా పూర్వీకులు తాళపత్ర గ్రంథాల్లో ఒకే వరుసలో రాసేవాళ్ళు. అయినా, ఛందస్సు తెలిసిన వారికి వాటిని మళ్ళీ పాదబద్ధంగా రాయటం కష్టం కాదు. పాదవిభజన లేకుండా అచ్చువేసిన (లేక రాసిన) వచన పద్యానికి ఈ వచన పద్య లక్షణకర్తలు కవ్యుద్దిష్టమైన పాదవిభజన చేయగలరా? కవ్యుద్దిష్టం కాకపోతే పోనీ, ఏ ఇద్దరు లక్షణకర్తలయినా ఒకే రకపు పాదవిభజన చేయగలరా? – అని రామారావుగారి ప్రశ్న.

ఒక విధంగా చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఒకసారి కుందుర్తి కూడా నన్ను దాదాపుగా ఇట్లాగే ప్రశ్నించినారు. వచన పద్య లక్షణ సమాకలనంలో ఇట్లాంటి ప్రశ్నల్ని గూర్చి నాతో నేనే కాకుండా, మరి కొంతమంది మిత్రుల్తోనూ చర్చించి ఒక సమాధానానికి వచ్చినాను. అదే ముందు వివరిస్తాను.

అయితే, ఈ రామారావుగారి ప్రశ్నలో రెండంశాలున్నయి. ఒకటి: పూర్వులు పాద విభజన లేకుండా రాసినా, ఛందస్సు తెలిసినవారు పాద విభజన చేసుకోడానికి వీలుండేది. రెండు: కవ్యుద్దిష్టంగానైనా, కాకపోయినా, వచన పద్యాన్ని పై విధంగా రాస్తే లక్షణకర్తలు గాని, ఏ ఇద్దరు లక్షణకర్తలు గాని, పాద విభజన చేయగలరా? ఒకే విధంగా చేయగలరా? వీటిని వరుసగా పరిశీలిద్దాం. పూర్వపు పద్యాల్లో పాదవిభజనకు ఉండిన వీలుకి కారణం అక్షర సంఖ్యతోనో, మాత్రా సంఖ్యతోనో, గణపద్ధతి ద్వారానో పరిచితమయిన ధోరణిలో ఆ పాదాలు నియమితం కావటం. అయితే, ఈ క్రింది పద్యపాదం, ఉదాహరణకి చూడండి –

మధురమధురమైన మామిడిపండ్లను
పంచియిచ్చు జనుడె మంచివాడు

ఇది ఫలాన పద్యం అని చెప్పకుండా, ఇది ఏ పద్యపాదం అని అడిగితే రెండురకాలుగా చెప్పటానికి వీలున్నది. ఇది ఆటవెలది రెండు పాదాలూ కావచ్చు. సీసపద్యంలో ఒక పాదమూ కావచ్చు. మొదటి పంక్తిని 3సూర్య, 2 ఇంద్ర గణాలుగా విభజిస్తే, ఆటవెలది. అట్లా కాకుండా రెండు పంక్తుల్నీ కలిపి ఆరింద్రగణాలు, రెండు సూర్యగణాలుగా విభజిస్తే సీసపాదమూ అవుతుంది. రెండువిధాలా విభజించేందుకు అనువుగా పై పంక్తులున్నయి. ఇదే పద్ధతిలో మరికొన్ని పంక్తులు వరుసగా ఉండేట్టయితే, ఇది ఫలానా పద్యం అని కవి చెప్పకుండా, కవి ఏ పద్యంగా ఉద్దేశించినాడో చెప్పటం కుదరదు. పాదాన్ని పట్టియ్యటంలో ఒకానొక సాధనమయిన (తెలుగులో మాత్రమే) ప్రాసనియతి ఈ రెండు పాద్యాలకూ లేదు. యతి రెండింటా అమరేట్టుగానే ఉంటుంది. అయితే, ఇట్లాంటి స్థితి చాలా అరుదు. అయినా, ఒక ఉదాహరణంగానే ఇక్కడ ప్రదర్శింపబడింది. మరొక అంశం ఏమిటంటే, తాళపత్ర గ్రంథాల్లో ఒకే వరుసలో పద్యాలు రాస్తూ పోయినా, చాలా వరకు పాదాంతంలో ఒక నిలువుగీత (|), పద్యాంతంలో రెండు నిలువుగీతలు (||) గీసి పాద, పద్యాంతాలను సూచించటం జరుగుతుంది.

ఇదిట్లా ఉండగా, అక్షర లేక గణపద్ధతి నియతంగా ఉన్నప్పుడు, అనుభూయమానమయితున్నప్పుడు, పాద విభజన లేకుండా రాసినా పాద విభజన చేయవచ్చు. అక్కడ కవ్యుద్దిష్టంగా పాద విభజన చేయడమన్న ప్రశ్నే లేదు. ఉదాహరణకు ఉత్పలమాల పద్యం ఉన్నదంటే ఒక కవి ఒక విధంగా మరో కవి మరో విధంగా తమ ఉద్దేశ్యాల ననుసరించి విభజించటం జరుగనే జరుగదు. వారి ఇష్టనిష్టాల ప్రసక్తి లేనే లేదు. ఆ పద్యపు చట్రం నియతం. పాదాక్షర మాత్రా సంఖ్య నియతం. (కొన్నిచోట్ల మాత్రా సంఖ్యలో వచ్చే తేడాలు గణపద్ధతి ద్వారా పరిష్కృతమయితయి.) ఆ నియతి ననుసరించి పదాలను కూర్చుకోవటమే కవి పని. అందువల్ల అక్షర, మాత్రాదుల నియతి ఉన్నచోట పాద విభజనకు కవి ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఇక పోతే, ఈ విధమయిన నియమం లేనిచోట కవి తనంతట తానే పాదాలను విభజించక తప్పదు. అందువల్ల, అక్షర మాత్రాదుల నియతి లేని వచన పద్యం విషయంలో ‘పాద విభజన… లేకుండా రాసిన’ ఇత్యాది ప్రశ్నే ఉత్పన్నం కాదు. వచన పద్యాన్ని కూడా పాద విభజన చేస్తూ రాయవలసిందే. తాళపత్ర గ్రంథాల్లో, మొదటినాళ్ళలో అచ్చయిన కొన్ని గ్రంథాల్లోనూ పాదవిభజన లేకుండా ఒకే వరుసలో పద్యాలుండటం చూస్తాం గాని, ఈనాటి గ్రంథాల్లో చూడటం లేదు. పాద విభజన విషయంలో పాఠకుడు చీకాకు పడగూడదనే కదా, ఈనాడు పాద విభజన పూర్వకంగా అచ్చువేయటం! కాబట్టి, ఈనాటి వచన పద్యాన్ని పాద విభజన లేకుండా రాయటం కానీ, అచ్చు వేయటం కానీ కుదరదు. పలుచోట్ల పత్రికల్లోనూ, గ్రంథాల్లోనూ, వ్యాసాల్లోనూ వచన పద్యాల్ని ఉదహరిస్తున్న సందర్భాల్లో నిండు పంక్తులుగా రాస్తూ, పాదాంతాల్ని సూచించే విధంగా నిలువు గీతలు (కొన్ని చోట్ల ఏటవాలు గీతలు) గీయటం జరుగుతూనే ఉన్నది. పాద విభజన, విభజన సూచన కూడా లేకుండా రాస్తే, ఆ రాసిన వ్యక్తి దాన్ని వచన పద్యంగా ఉద్దేశిస్తున్నాడా లేదా అన్నది సందేహించాల్సిన విషయమే.

ఇక, ఏ లక్షణకర్త అయినా కవ్యుద్దిష్టంగా పాద విభజన చేస్తాడా? ఏ ఇద్దరు లక్షణకర్తలయినా ఒకే విధంగా పాదవిభజన చేయగలరా? అని విచారిస్తే, ‘కవ్యుద్దిష్టంగా పాద విభజన ‘ అంటే పాద విభజనకు కవి ఉద్దేశించింది ప్రధానమనీ, ఆయన ఉద్దేశించిన రీతి మీద పాద విభజన ఆధారపడి ఉంటుందనీ అనిపిస్తున్నది. అట్లాగే అయితే, కవ్యుద్దిష్టంగా మరొకరు పాద విభజన చేయనవసరం లేదు. కవే చేస్తాడు. పేచీ లేదు. కాకపోతే, తన ఉద్దేశ్యం ప్రకారం పాద విభజన చేసి వచన పద్యం రాసుకొని, పాద విభజన లేకుండా నిండు పంక్తులుగా మళ్ళీ రాసి లక్షణకర్త ముందుంచి పరీక్ష పెడితే, అప్పుడు ఆలోచించవలసి వస్తుంది. పాద విభజనకు లక్షణకర్త ఏదైనా పాద విభాజక సూత్రాన్ని ఏర్పరచుకుంటే, దాన్ని బట్టి ఆ పంక్తులను పాదాలుగా విభజిస్తాడు. అప్పుడు – ఏర్పడిన పాద విభాజక సూత్రంగా ఉంటుంది కాబట్టి – కవ్యుద్దిష్టతకు ప్రాధాన్యం లేదు. కాగా, విభాజక సూత్ర ప్రామాణ్యానికి ప్రాధాన్యం, విభాజక సూత్రం అంగీకృతమయితే, పాద విభజన దాన్ని అంగీకరించే జరగవలసి ఉంటుంది. మ-స-జ-స-త-త-గ అన్న క్రమాన్ని ఒప్పుకున్నాక, దాన్నిబట్టే శార్దూల విక్రీడిత పద్య పాద విభజన జరిగినట్టు. కవ్యుద్దిష్టత కక్కడ ప్రాధాన్యం లేనట్టు. ఇక పోతే, ఏ ఇద్దరు లక్షణ కర్తలయినా ఒకే విధంగా పాద విభజన చేయటానికి వీలున్నదా? అంటే లేదనే వీలు లేదు. ఆ ఇద్దరు లాక్షణికులు పాద విభజన సూత్రాన్ని సమంగా ఉపయోగిస్తే, ఒకే విధంగా పాద విభజన జరిగే వీలుంది. ఒకప్పుడు సూత్రోపయోగంలో తేడా రావచ్చు. ఆ రావటం ఎట్లాంటిదంటే, వెనుక “మధుర మధురమైన…” అన్న చోట ఒక లక్షణకర్త ఆటవెలదిగా విభజిస్తే, మరొకరు సీసపాదంగా విభజించటంలో వచ్చినటువంటిది. సాంప్రదాయిక ఛందస్సుల్లోనూ సమాన ప్రమాణాల్ని అనుసరించటం వల్లనే ఆ పాద విభజనలో సమానత్వం కనిపిస్తుంది. లేని చోట లేదు. అందుకని, ఎక్కడయినా సరే, ప్రమాణ సమానత్వం అవసరం.