ఈమాట సెప్టెంబర్ 2010 సంచికకు స్వాగతం!

Issue Index Image

ఈమాట పాఠకులకు నమస్కారం.

నువ్వు లేవు నీ పాట వుంది, ఇంటి ముందు జూకా మల్లెల్లో చుట్టుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని… అంటూ అద్భుతమైన వచన కవిత్వాన్ని మనకందించి అకాలంగా కాలం చేసినా మన మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన ఇలా గుర్తు రావడానికి సందర్భమేమీ లేదు, మాకక్కర్లేదు. ఏమైతేనేం ఆ కవితా సతి నొసటి నిత్య రసగంగాధర తిలకపు చుక్కలు కొన్ని ప్రత్యేకంగా, శబ్దతరంగాలు, కథలు, కవితలు, వ్యాసాలతో కలిసి ఈ సంచికలో ఈమాట పాఠకుల కోసం.

ఈ సంచికలో మీకోసం:

సంపాదకీయం: మారుపేర్లు పెట్టుకొని ఎందుకు రాస్తామో తెలుసుకుందామని మా ముఖ్యసంపాదకుడి కుతూహలం ఈ సారి సంపాదకీయం, మారుపేర్ల మాయువు – వేలూరి వేంకటేశ్వర రావు.
ప్రత్యేక శబ్ద సాహిత్యం: కనకప్రసాద్ సంగీత రచన – దీపఖేల.
కథలు: మరో తోడు – ఆర్. శర్మ దంతుర్తి; పూలపల్లకీ – శ్రీనివాస్ గోపిసెట్టి; ఆర్ యూ రెడీ – తాటిపామల మృత్యుంజయుడు; తిలక్ కథలు – కవుల రైలు, మణిప్రవాళం, అద్దంలో జిన్నా (పునఃప్రచురణ).
కవితలు: ఇప్పుడెందుకిలా – స్వాతికుమారి బండ్లమూడి; మహామంగళ ప్రవచనము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; బందీ – డా. గరిమెళ్ళ నారాయణ; ఆత్మఘోష – రవి వీరెల్లి. గోరువంకలు – దేవరకొండ బాల గంగాధర తిలక్ (పునఃప్రచురణ).
శీర్షికలు: నాకు నచ్చిన పద్యంలో మొల్ల అయోధ్యరాజకుమారుల వర్ణన – చీమలమర్రి బృందావనరావు; సామాన్యుని స్వగతంలో మనం చూస్తుండగానే పెరిగి దూరమైపోయిన ప్రహేలిక గురించి – వింధ్యవాసిని.
వ్యాసాలు: కవితా సుమశరుడు తిలక్ – C. S. Rao; శతకందసౌరభము అనే తన శతకాన్ని పరిచయం చేస్తూ – జెజ్జాల కృష్ణమోహన రావు; మంచి కవి, మంచి స్నేహితుడు – వెల్చేరు నారాయణరావు; తిలక్‌తో నా పరిచయం – వేలూరి వేంకటేశ్వర రావు; తిలక్ జ్ఞాపకాలు మరీ పాతవీ, ఆ తరవాతవీ – నండూరి రామమోహనరావు (గోరువంకలు పుస్తకం ముందుమాట, 1992, పునర్ముద్రణ); తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు – రాచమల్లు రామచంద్రారెడ్డి (1969, సారస్వత వివేచన నుండి పునర్ముద్రణ); రారా వ్యాసానికి ప్రతిస్పందన – రారా సమీక్ష: ఒక ప్రతివిమర్శ – సి. ఎస్. రావ్
గ్రంథాలయం: శతాధిక కందపద్యాల సమాహారం శతకందసౌరభము – జెజ్జాల కృష్ణ మోహన రావు.
శబ్దతరంగాలు: సుప్తశిల – అహల్య శాపగాథ, ఆలిండియా రేడియో నాటిక – తిలక్. (ఈ నాటకపు పూర్తిపాఠం అనుబంధంగా ఇచ్చాం); వెన్నెల – తిలక్ స్వీయ కవితాపఠనం. శిఖరారోహణం- తిలక్‌పై ఆలిండియా రేడియో రూపకం.

ప్రముఖ పండితుడు, కవి, సాహితీ విమర్శకుడు శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ఇటీవలే పరమపదించారు. వారికి మా శ్రద్ధాంజలి.

మీ సద్విమర్శలే మాకు ఆశీస్సులని వేరే చెప్పక్కర్లేదు కదా.

ఈమాట సంపాదకుల బృందం.