గోరువంకలు

[దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి వచనకవితా సంకలం ద్వారా సుప్రసిద్ధుడు. కానీ ఆయన రాసిన గోరువంకలు అనే ఛందోబధ్ధ కవిత్వ సంకలనం అంతగా ఎక్కువమందికి తెలియదు. ఈ పుస్తకంలోంచి పద్యాలు కొన్ని ఈమాట పాఠకులకోసం ప్రచురిస్తున్నాం. – సం.]

అందపు లేతసిగ్గు తడియారని తారుణ కుంకుమ ప్రభల్
విందొనరించు నీ పసిమి నిల్చిన చెక్కిలి వోలె నాకు నీ
సుందర సంధ్యవేళ పొడచూపును వంపుల ఆకసమ్ము ఓ
స్పందిత చంద్రమ! ప్రభ!శుభానన! రమ్మిక మోహగీతివై

జారిన వేగుచుక్క చిరుసవ్వడి దూరముగా సముద్రపున్
తీరములో ధ్వనించె వ్రతతీ లలితాంగ సుఖోపగూహనో
దార సమీర శేఖరుని దర్పపద ధ్వని సోకు మా కుటీ
ద్వార పథాల; వెల్గు తొలి వానగ రమ్ము శుచిస్మితాననా

దోయిలిబట్టి స్వప్నముల తోటల పూచిన పూలమొత్తముల్
ఈ యవనీ గృహమ్ములకు నేగి యుపాయన మిత్తునన్న ఏ
మో యనుచున్ పరాఙ్ముఖత మోములు ద్రిప్పిరి రేకురేకుగా
ప్రాయపు చందనంపు తొలిపాన్పున జిమ్మెదు తావి క్రమ్మగన్


గోరువంకలు – తిలక్
ముద్రణ 1993. వెల రూ. 15/-
విశాలాంధ్ర బుక్‌హౌస్‌లలో లభ్యం

ప్రతిదినమేగు బాష్పకణ భార నిరోధ దిశాంత నేత్రమై
ప్రతి వకుళమ్ము రాలు శిశిరాత్త దళాంత గళోచ్ఛ నాదమై
ప్రతి తెలి వేకువన్ తొలగి రాలెను తారలు గాజుపూసలై
అతివ కదల్పకీ వయసు టద్దపు మేడ పునాది గోడలన్

వేసవిరేయి పందిరుల విచ్చిన జాజుల క్రింద సెజ్జపై
మూసిన కన్ను మూతవడబో దదియేమి, సుగంధ చర్చిత
శ్రీ సురభీ కృతస్తని! సుశీలవతీ! భవదీయ లేశవత్
భాసిత ఘర్మ శీతలిత భాసురగాత్ర నిషణ్ణ బద్ధుడన్

ఈ యెదలోని బాధలెటులేమని చెప్పెద సన్నజాజి పూ
రేకులు చెప్పనేర్చునటె మెల్లన కాల్చు నిశాత సూర్య కీ
లానల తప్తమై వడిలి వాడి దొరంగును గాక ఎప్పుడో
నేనును గూడ నంతియ పరీమళ లేశమునే మిగల్పకన్

ఇపుడు తారా లోకమెంతైన మెరసినది
ఇపుడు పాతాళమే యెదయెదకు విచ్చినది
ఈవేళ ఏకాదశీ త్రియామ యామినీ
ధ్వాంత మీ గొంతులో కొంత అడగినది

– గోరువంకలు, ప్రతిభ 1942-44.

ఈ చలికారురేయి రచియించిన పాపటజారు చుక్కలం
ద్రోచి తుషారపుం జడులదోగిన మేన తమస్సు శాటిగా
వైచి నికుంజసీమ చలివాపని వ్యర్థపు జంట కౌగిలిన్
వాచిన పావురా యెలుగు బాధకు మ్రాన్పడినిల్చు చిత్రమై

శిశిరము సన్నసన్న చిరు చీకటి బాటల వచ్చి జాలిగా
కొసరెడి పూల అత్తరుల కోసము తారెడి గాలి గొంతులో
విసమునుబోసి నల్దెసల వీచుచు సోరణ గండ్ల సందులన్
ముసరుచు తాకిపోవు విషమూరెడి సూదుల వ్రేళ్ళు గ్రుచ్చుచున్

చీకటు లొత్తిగిల్లు తరి చీలిన తూరుపు రాచబాటలన్
తాకి ధ్వనింప సూర్యుని శతాంగపు చక్రము పల్లెపల్లెలో
ప్రాకిన మంచుచీర చివరల్ నుసియైనవి కోష్ణకోష్ణ వా
త్యా కమనీయ పౌరవలయమ్ములు తీర్చిన భోగిమంటలన్

– శిశిరము, 1942-45.

ఇతడటే పుత్రకామేష్టి యాగఫలమ్ము
దశరథానంద నందనవనమ్ము
ఇతడటే వెరపేది యింతవయసున రా
క్షసుల దున్మిన వాడి కత్తిమెరపు
ఇతడటే రఘువంశ తత కీర్తి మద్గుణ
సంపదల్ ప్రోవైన చారుశీలి
ఇతడటే సాకేత స్మిత యౌవతవనమ్ము
కన్నట్టి నెత్తావి కలల గుత్తి

ఇతడటే తండ్రి నన్ను నాగేటి చాలు
కదిపి వెలికి దీయకముందె కానుపించె
నేమొ గాక లేక జననమేల నాకు
స్వామికోసము గాక నేనేమి కొరకు

అతడు వచ్చెనొ లేదొ అల్లపందిళ్ళ న
ల్గడల పద్మాల తోరణలు విరిసె
అడుగు కదిపినంత హల్లకమ్ములు పూచి
సభనెల్ల సౌందర్య సరసిజేసె
పెదవి చిర్నగవు తుంపెసలాడ మల్లెమొ
గ్గల వాన జల్లు జల్లులయి కురిసె
వానిగన్నంత నాలోని గుట్టెల్ల బ
యలుపడి పసపు సిగ్గులను చిమ్మె

ఇది వలపొ జన్మజన్మాల నదుము సౌహృ
దమ్మొ, లోని ఆత్మల పిల్పు దాచుకున్న
పుణ్యమో దోచుకున్న స్వర్భోగమో ప
విత్ర మీక్షణ మీస్వామి వీక్షణమున

వీని చెంతజేరి విడువగలను నేను
సుఖములేని రాణి సొగసులేని
వీని పనుపుచాలు వెడలగలను నేను
అడవికేని కడలి నడిమి కేని

– స్వయంవర, భారతి 1942-48.

తోట ఆకుపచ్చ పైట తొలగిజార
పూలరొమ్ము నిక్క పొడిచి నిలిచె
కొమ్మ కొమ్మ క్రొత్త కోర్కెల చివురుతో
గాలి కదలి పిలిచె కేలు సాచి

పవనుడేల యింత పంతాన పరవళ్ళు
త్రొక్కి నిలిచె మావి తోపునందు
తేనె బరువుతోడ తెరపిలేని వలపు
తెలుపలేక ఆమ్ర తెల్లబోవ

ఇంత చినుకు పడిన ఎంత పొగరు హెచ్చి
పచ్చి గడ్డిపరక పల్లవించె
చిన్ని పువ్వు తొడిగి చిలిపిచిలిపి గాలి
నూగి తూగి నవ్వు నూరినెల్ల

లేత యెండ లోన లేమ కౌగిలి లోన
సీతువొక్క స్వప్న శీధువౌను
కవిత లోన మధుర గానడోలల లోన
బ్రతుకు పరిమళించు భావమౌను

అమృత తత్వమేదొ వ్యాపించె నాలోన
సృష్టి మొదటి యూహ స్పష్టమయ్యె
బ్రతుకు బయలునందు భయము గొలుపు పాము
పడగ మీది మణిని పట్టినాను

– ఆటవెలది, భారతి, 1961.

తెలతెలవార నా యెడద తీర్చిన మ్రుగ్గుల త్రొక్కివచ్చు శీ
తలపవనమ్ము వీవు, కనుదమ్ముల సవ్వడి సోకి లోతు లో
తుల దిగిపోవు రత్నఖచితోజ్వల హేతివి, మద్గవాక్ష వీ
థుల పొగమబ్బులౌ అగరు ధూపము తావివి నీవు రాఘవా

గగనము వంటి నా బ్రతుకు గాథల రూపకమందు చంద్రమ
స్వగతమ వీవు, సంక్షుభిత సాగర సంధులవంటి కన్నులన్
తిగిచిన పక్ష్మ మాలికల తీయగనొత్తిన స్వప్న వేలవో
దృగభినవాభిరామ! యెలదేనియ కాల్వపు గుండె తోటలో

నే కలగాంచగా మును వినీలమణిచ్ఛవి జిమ్ము నిద్రవై
నా కను వాల్పు ముందు కలనన్ బడిపోవు ద్విరేఫమాలవై
నాకయి నేనుగా నిను వినా ఒక యేమియుకాని దాని నీ
స్వీకృతి జేసి సుప్రథిత సీతగ మల్చిన దివ్య శిల్పివై

నేను నీలోన నన్ను సృజించుకొనగ
నీవు నాలో లయింతు వెంతేని వింత
ఇది యపూర్వ క్రమము సృష్టి మొదలు తుదలు
కలసికొన్నవి మనలోన కాలమాగి

– అద్వైత మాన్మథము, భారతి 1961-66.