సామాన్యుని స్వగతం: మాకు తెలిసిన ప్రహేలిక

జీవితంలో ఒక్కొక్క దశలో మనం ఎందర్నో కలుస్తుంటాము. మన ప్రభావం వాళ్ళమీద ఏమాత్రమో మనకు తెలిసే అవకాశం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రభావం మనమీద ఎంత ఎక్కువయితే ఆ జ్ఞాపకాలు మాసిపోవటం అంత కష్టమవుతుంది. సాధారణంగా మనం రైలు ప్రయాణాల్లో కలిసే తోటి ప్రయణీకులను గూర్చి నేను మాట్లాడటం లేదు. ఆ అనుభవం కొన్ని గంటలే, రైలు దిగగానే మర్చిపోతాం. మా కుటుంబం అందరం ఉమ్మడిగా ప్రహేలికను మొదట చూసింది ఐదునెలల పాపగా మా పక్కింట్లో.

వాళ్ళ నాన్న రాజగోపాల్ అప్పట్లో మా ప్రక్క ఇంటి మేడ మీద పోర్షన్లో వచ్చి కొత్తగా చేరినారు. ఆయన చేరిన నెలరోజుల తర్వాత, భార్య మీరాను, పాప ప్రహేలికను పిలుచుకుని వచ్చినారు. పదిహేనేళ్ళ మా అమ్మాయి శివానికి కొత్తగా వచ్చిన పొరుగు కుటుంబమొక పెద్ద ఆకర్షణ. మొదట తనే వెళ్ళి పరిచయం చేసుకుని, పలుకరించి వచ్చింది. దీనికి చిన్న పిల్లలంటే భలే ఇష్టం! త్వరగా తను తిరిగి రావటం నన్ను ఆశ్చర్యపరిచింది. “ఏం, వాళ్ళ పాప నిద్రపోతోందా?” అని అడిగినాను. “లేదు ఆడుకుంటోంది.” సమాధానం. ఇంకా చెప్పింది. “చాలా సీరియస్. నుదురంతా చిట్లిస్తూ ఏదో పెద్ద ఆలోచనలో ఉన్నట్లుంది.”

“నీ ముఖం. అంత చిన్నపిల్లకేమాలోచనలుంటాయి? ఎక్కువగా ఊహించేస్తున్నావేమో?”

“లేదమ్మా! ఆ పిల్ల పుట్టినప్పటినుంచీ అంతేనట. వాళ్ళమ్మ చెప్పింది. మొదట ఆస్పత్రిలో సిస్టర్ గుర్తించిందట పాప ఎప్పుడూ నుదురు చిట్లిస్తుంటుందని!”

ఈ దెబ్బతో ఈమె ఇక అటువైపు చూడదని నేననుకుని ఉంటే నా ఊహ తప్పయేది. ఎందుకంటే అతి త్వరలో మా శివానికి మీరాతో ఆప్తస్నేహం కుదిరిపోయింది. దానిక్కారణం పెరుగుతున్న పాప ప్రహేలిక కూడా అని అంటే ఆశ్చర్యం కాదు. అన్నట్లు, మొదట తన పేరు చెప్తే, పలకడానికి మాకు నోరు తిరగటం కష్టం అయింది. అసలు ప్రహేలిక అంటే అర్థమేమిటి? అని అడిగాము వాళ్ళమ్మను. ప్రహేలిక అంటే సంస్కృతంలో నటన లేక నాటకానికి సంబంధించిన అర్థమట. సంస్కృతంలో ఏమో కానీ, నాకు పాత తెలుగు పత్రికల్లో ఎక్కడో, గళ్ళనుడికట్టుకు పదబంధప్రహేలిక అని పేరు చదివినట్లు గుర్తు. అర్థం సంగతి తెలీదు కానీ, పిల్ల మాత్రం ‘పజిల్’ లాంటిదే అనుకున్నాము. కష్టపడి ప్రహేల్ అన్న పొట్టి పేరు కూడా నేర్చేసుకున్నాము నేనూ, మా వారూ.

ప్రహేల్ కాస్త పెద్దదయి కూర్చోవడం మొదలయాక సాయంత్రాలు, శనీఆదివారాలు మా ఇల్లు విడిచేది కాదు. శివానికి పాపను పక్కనే కూర్చోబెట్టుకుని హోం వర్క్ చేసుకోవడం కూడా అలవాటయిపోయింది. ఆమె ముద్దుగా మాటలు నేర్చుకోవటం కాదు కానీ, శివానిని స్కూల్నుంచీ సాయంత్రం ఇంటికి రానివ్వదు, వాళ్ళింటి కిటికీలో నిలబడి, తను వేసే “సికానీక్కా … సికానీక్కా …” అన్న కేకలు ఆగేవికాదు. శివాని వెళ్ళి ఆమెను వెంటబెట్టుకు రావలిసినదే. ఈమె వేరే రకంగా పని తొందరలో ఆమెను పట్టించుకోకపోతే, కోపం వచ్చి పిలుపునుంచీ, ‘అక్క’ పదాన్ని వదిలేస్తుంది.

శివానితో సమయం గడపటం కాకుండా, మా ఇంట్లో ఆ పాపకు బాగా నచ్చే విషయాలు రెండు. ఒకటి మా ఇంట్లో ప్రతీ ఆదివారం ఉదయం టిఫిను దోశ. తనకోసం వేడిగా ఒక దోశ వేసిస్తాను. దాన్ని రెండుసార్లయినా తినకముందే, పక్కకు తోసేసి, “నున్ను దోసె కుడు” అంటుంది. అన్నట్లు రాజగోపాల్ కుటుంబం తమిళులు. అప్పుడే కాల్చి తీసిన దోశెలు వేడిగా ఉంటాయని, వెంట వెంటనే “ఇంకొకటివ్వు” అని అడుగుతుంది. శివాని మమ్మల్ని పిలవటం చూసి, మా పేర్లు మమ్మీ, డాడీ అనుకుందేమో ప్రహేల్, తనూ మమ్మల్ని అలాగే పిలిచేది. వాళ్ళింట్లో ఆ పిలుపులు లేనందుకు ఇబ్బంది కాలేదు. ప్రహేలికకు మా ఇంట్లో నచ్చే రెండో విషయం తనకు ఇష్టం వచ్చినట్లు టాల్కం పౌడరు, ఫేస్ క్రీములు రాసుకోవచ్చు. పౌడరు, క్రీముల డబ్బాలు తనకు మా ఇంట్లో బాగా అందుబాటులో ఉండేవి. మీరా మాత్రం ఇది చూసి కోప్పడేది, “మీరు దీన్ని క్రమశిక్షణ లేకుండా పాడుచేస్తున్నారాంటీ!” అని.

ప్రహేలిక పుణ్యమా అని నేను తమిళం అర్థం చేసుకోవడం, కొద్దిగా మాట్లాడగలగటం నేర్చుకున్నాను. తప్పదు, రెండేళ్ళ పాపను ఇంట్లో తనకు అలవాటయిన భాష కాక వేరే ఎందులో పలుకరించినా అర్థం కాదు. మా అమ్మాయి శివాని తమిళం పూర్తిగా నేర్చేసుకుంది. ఎన్నో ఏళ్ళనుంచీ తమిళం మాట్లాడుతున్నదానిలా శుద్ధ తమిళం లో మాట్లాడగలదు. ప్రహేలిక మరికాస్త పెద్దదవడం, స్కూలుకెళ్ళటం మా కళ్ళ ముందే జరిగాయి. అయినా తను మాకు దూరం కాలేదు. అలాంటిది, వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా వాళ్ళు సింగపూరుకు వెళ్ళాలిసి వచ్చినప్పుడు, శివాని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ప్రహేల్ అందరిమీదా కోపంతో, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మానాన్నల వెంట. వాళ్ళు సింగపూర్లో ఉన్న ఐదేళ్ళు ప్రతీ ఏడు, వేసవి సెలవుల్లో వాళ్ళమ్మమ్మను, తాతయ్యను చూడటానికి ప్రహేల్ అమ్మానాన్నలవెంట మద్రాసుకు వచ్చినప్పుడల్లా, బెంగుళూర్లో మా దగ్గరికి తప్పకుండా వచ్చేది. వచ్చినపుడల్లా, నేను ఏదయినా తనకిష్టమయిన ఒక బొమ్మో, ఆటవస్తువో కొని పెట్టాలి. అందుకని తను నావెంట, కైనెటిక్ హోండా స్కూటర్లో నా వెనుక కూర్చుని, కమర్షియల్ స్ట్రీట్‌లో ఉన్న సఫైర్ బొమ్మల అంగడికి వెళ్ళవలిసిందే! వాళ్ళమ్మ పర్మిషన్ లాంటిదేం లేకపోయినా తనకేం కావాలో అడిగి కొనిపించేది. ఇద్దరికీ తెలుసు ఇంటికెళ్ళాక, వాళ్ళమ్మతో ఇద్దరికీ తిట్లు పడతాయని. నాకుమాత్రం, పోయి వచ్చేటప్పుడు, పిల్ల వెనుక కూర్చుని నిద్రపోకుండా చూసుకోవడం పెద్దపని అయేది.

వాళ్ళ నాన్నగారిది ఐటి ఉద్యోగం కాబట్టి ప్రహేలిక ఇంటికి త్వరగా కంప్యూటర్ వచ్చింది. దాని ఉపయోగం తనకింకా తెలియకపోయినా ప్రహేలికకు, కంప్యూటర్‌లో ఆడగల గేమ్స్, ఎస్ఎంఎన్ చాట్ అంటే ఏమిటో తెలుసు. ప్రతిరోజు, మధ్యాహ్నం మూడుగంటల తర్వాత, నన్ను ఆఫీసులో డిస్టర్బ్ చేసి, నాలుగు మాటలయినా చాట్ చెయ్యంది వదిలేది కాదు. ఆఫీస్ టైములో డిస్టర్బెన్స్ ఒక ఎత్తయితే, భయంకరమయిన ఆమె ఇంగ్లిష్ స్పెల్లింగ్, భాషా అజ్ఞానం మరొక ఎత్తు. సింగపూరు జీవితం, స్కూలు వల్ల పిల్ల ఇంగ్లిష్ పాడయిపోతోందని, వాళ్ళ నాన్న ఉద్యోగం మార్చేసి, మద్రాసుకు వచ్చేసారు. వాళ్ళు సింగపూరు వదిలే లోపల సింగపూరు చూపిస్తామని శివానిని ఆహ్వానించారు. శివాని వెళ్ళి అక్కడున్న వారం రోజులు, ప్రహేలికే అన్ని చోట్లకు, తన వెంట బస్‌లో వచ్చి చూపించడం, ఒక మరపురాని అనుభవం. పదహైదేళ్ళ క్రితం తను ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తూ, హోంవర్క్ చేసుకున్నదీ పిల్లతోనేనా అనిపిస్తుంది.

సింగపూర్లో ఉండగానే, చాలా మంది తమిళ అమ్మాయిల్లా ప్రహేలిక కూడా భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ శిక్షణ మరింత చురుగ్గా కొనసాగించింది మద్రాసుకు చేరాక. తన అరంగేట్రం అని తేది నిర్ణయించి అవసరమయిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఆరోజు మద్రాసులో సునామి వచ్చింది. మధ్యాహ్నం తను కార్యక్రమానికి, ప్రాక్టీసుకు వెళ్ళకముందే, మేం అభినందనలు చెప్పాలని ఫోన్ చేశాను. “నా డాన్సు చూడటానికి ఎవరయినా వస్తారో లేదో మమ్మీ!” అని దిగులుగా చెప్పింది. రాత్రి వాళ్ళమ్మకు ఫోన్ చేస్తే చెప్పింది, కార్యక్రమం బాగా జరిగిందని, అహ్వానితుల్లో సగం మంది పైనే వచ్చారని.

ప్రహేలికను మేం చివరిసారి కలిసింది, ఆరేళ్ళ క్రితం మా ఇద్దరి వీసాలు తీసుకోవడానికి అమెరికన్ కాన్సులేట్ ఇంటర్వ్యూ కోసం మద్రాసుకు వెళ్ళినప్పుడు. మీరా ఆ ఒక్కరోజు వాళ్ళింట్లో మమ్మల్ని అతిథులుగా దిగకుండా వదల్లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న పిల్లగా మా జ్ఞాపకాల్లో ఉన్న ప్రహేలికను మొదటిసారి టీనేజర్ గా కలిసినాము. స్కూలు, ఆటలు, నాట్యం, కీబోర్డు నేర్చుకోవడం, అన్నిటితో ప్రహేల్ చాలా బిజీ. ఉదయం స్టేషన్‌లో దిగి, రాజగోపాల్ వెంట ఇంటికొచ్చిన మేము, ప్రహేల్ స్కూలుకు వెళ్ళేలోపు కొంచం సేపు మాత్రమే ఆమెతో గడపగలిగినాము. మాతో తను అలవాటు తప్పినందుకు మమ్మీ, డాడీ అని ఒకసారి, ఆంటీ, అంకుల్ అని ఒకసారి కలుపుతూ మాట్లాడింది. తను స్కూలుకెళ్ళిపోయాక మేం కాన్సులేట్‌కు వెళ్ళేవరకూ, మీరా కబుర్లలో ఒకే విషయం. కూతుళ్ళు `టీనేజ్’ లో అడుగుపెట్టినప్పుడు అందరు తల్లులూ ఎదుర్కొనే సమస్యలే. తనతో సరిగ్గా మాట్లాడదు, తను ఇల్లు వదిలి బయటికెళ్ళగానే తను ఎదుర్కొనే సమస్యలు, తన స్నేహాలు, ఇవేవీ వాళ్ళమ్మకు పూర్తిగా చెప్పదు. కూతురు చెడు అలవాట్లు చేసుకుని చెడిపోతుంటే తను ఏం చెయ్యాలి? నాకు నవ్వొచ్చింది. పిల్లకు ఊపిరి తిప్పుకోనివ్వకుండా చదువు, వేరే ఏక్టివిటీలు. పాడవడానికి సమయమేది? అలా చెప్తే మీరాకు నచ్చదు. “నీకు నీ కూతురి పెంపకం మీద నమ్మక ముంది కదా? అదే నమ్మకంతో కొంచం ఓపిక పట్టు. ప్రహేల్‌కు కాస్త టైమివ్వు. ఆమే నిన్ను తన బెస్ట్ ప్రెండ్ అని తెలుసుకుంటుంది. అప్పుడు నీతో అన్నీ చెప్పకుండా ఎక్కడికి పోతుంది?” అని నచ్చజెప్పాను.

ప్రహేలిక బాగా పొడవుగా ఉంటుంది. చదువు, భరతనాట్యం కాకుండా, తను బాస్కెట్ బాల్ బాగా ఆడుతుంది. పెద్దదయిపోయిన ప్రహేలికకు మేం ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే అనుకుంటాను. ఎప్పుడయినా మీరానో, నేనో ఫోన్ చేస్తే, ఉభయకుశలోపరి అయినతర్వాత, సంభాషణ పొడిగించడానికి ఇంకే విషయాలుండవు. కానీ ప్రతి ఏడు ఫిబ్రవరిలో ఆమె పుట్టినరోజున మాత్రం ప్రహేలికను గుర్తు చేసుకుంటాము. ఎందుకంటే, అదేరోజు, మా వారి పుట్టిన్రోజు కూడా!