తిలక్ తో నా పరిచయం

మన సాహితీ సంప్రదాయంలో కవులను కవులుగా గుర్తించి వారి కవితలు చదివి ఆనందించడమే పరిపాటి. కవులని మామూలు మనుషులుగా చూసి వారితో పరిచయం ఉన్నవాళ్ళ వ్యక్తిగత అనుభవాలని పంచుకోవడం పాశ్చాత్య సంప్రదాయంలో ప్రబలంగానే ఉన్నది. ఇది మంచి పద్ధతా కాదా, అవసరమా అనవసరమా అన్నవిషయం చర్చించడం అనవసరం.

దేవరకొండ బాలగంగాధర తిలక్‌‌గారి కవిత్వం గురించి ఎందరో పేరుపొందిన విమర్శకులు రాశారు. ఘాటుగా విమర్శించిన వాళ్ళూ లేకపోలేదు. ఆయన కవిత్వం జోలికి పోకండా, ఆయనతో నాకున్న వ్యకిగత అనుభవాలను ఆయన ఆప్యాయతనీ మీతో పంచుకుందామని ఈ మూడు మాటలూ రాస్తున్నాను. తిలక్‌గారితో నాకన్నా ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా నేనీ పనికి పూనుకోవడం నా అహంభావం అని ఎవరన్నా అంటే, వారితో నాకు పేచీ లేదు.

1957లో ఏలూరు సాహిత్య మండలి వార్షీకంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూన్న రోజులవి. ఇక్కడ ఏలూరు సాహిత్యమండలి గురించి ఒక్క మాట చెప్పాలి. శ్రీశ్రీగారికి ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా సన్మానం చేసిన గౌరవం ఏలూరు సాహిత్యమండలికే దక్కుతుంది.

సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూశాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది. ఈ మనిషిని చూడంగానే, “ఎవరోయ్‌! ఈ బాలరాజు?” అని పక్కనున్న స్నేహితుడితో అన్నాను. ఆ మాటలు ఆయనకి వినిపించాయి. చిన్న చిరునవ్వుతో నావైపు చూశాడు. నేను మొహం తిప్పుకొని పక్కకి సర్దుకున్నాను. ఆరోజు ఆయన తన కవితలు చదివారు. మరుసటి రోజున నేనూ సంక్రాంతి పండగ గురించి రాసిన వేళాకోళం పద్యాలు చదివాను. మూడో రోజుననుకుంటాను, మిత్రుడు తంగిరాల సుబ్బారావు తిలక్‌‌గారిని నాకు పరిచయం చెయ్యబోయాడు, చేశాడు. ” ఇదిగో, వీడు …” అంటూ! అతని వాక్యం పూర్తి కాకముందే, తిలక్ గారు “ఇతను నాకు బాగా తెలుసు. మొన్న సాయత్రం నన్ను బాలరాజు అన్నది ఇతనే!” అని మళ్ళీ చిరునవ్వు నవ్వాడు, నేను వెర్రిమొహం పెట్టి సారీ అనక ముందే! కొందరితో మొదటి పరిచయాలు ఆఖరి పరిచయాలవుతాయి. అదృష్టవశాత్తు తిలక్‌గారితో నా మొదటి పరిచయం, ఆ స్థితికి రాలేదు.

తరువాత తిలక్‌గారిని ఏలూరులో చాలా సార్లు కలిసాను. ఆయన మిత్రుల ఇళ్ళల్లో కవితాపఠనాలు విన్నాను. అంతకన్నా ముఖ్యం, ఆయన కాస్మాపాలిటన్‌ క్లబ్బులో పేకాట ఆడటం; నేను కిబిట్జ్ చెయ్యడం! “ఇక ఆడింది చాలు, లేవండి,” అని ఆయన్ని పేకాటనుంచి లేవదీసి, బయట చెట్టుకింద కూర్చోపెట్టి కబుర్లలోకి దింపడం–నేనూ, మిత్రుడు రాజూ చేసిన మంచిపనుల్లో ఒకటనుకుంటాను.

1960లో ఆంధ్రా యూనివర్సిటీ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో నేను, బంగోరె సహకారంతో కావ్యదహనోత్సవం (ఆ వివరాలు వేరే చెప్పుతాను!) అనే ఉత్సవం చేశాను. దానితో యూనివర్సిటీ తెలుగు సాహితీ సమితిలో రాజకీయంగా నాకు కాస్త పలుకుబడి హెచ్చింది. ఆ సంవత్సరం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వార్షికోత్సవాలకి తిలక్‌గారిని పిలిపించాను. ఆయనతో పాటు తెలుగు స్వతంత్ర గోరా శాస్త్రిగారిని, శ్రీదేవిగారిని (కాలాతీత వ్యక్తులు), ఊహాగానం లతగారినీ కూడా పిలిచాం.

తిలక్‌‌గారు ధారాళంగా ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి కాదు. ఒక పావుగంట సేపు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ సభలో మాట్లాడి, కొన్ని కవితలు చదివారు. ఆ తరువాత, నాతో పది రోజుల పాటు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ హాస్టల్లో ఉన్నారు. ఆ రోజులు ఇప్పటికీ మరిచిపోలేను. ఆయనకి నాతో కలిసి హాస్టల్‌ భోజనం చెయ్యడం ఒక గండంలా ఉండేది. ఏ జబ్బులు వస్తాయో అని ఒకటే భయపడిపోయేవారు. సాంబారు, పెరుగు అన్నం తప్ప ఏవీ ముట్టుకునే వారు కాదు! ఆ రోజుల్లో ఆయనతో కలిసి యూనివర్సిటీలో జీడిమామిడి చెట్లకింద కూర్చొని సాయంకాలాలు డైలాన్‌ థామస్‌ కవితలు చదివిన రోజులు మరిచిపోడం అసాధ్యం (నాకయితే నామటుకు ఆ కవితలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వంట పట్ట లేదు. అది మాత్రం నిజం!). ఒకరోజు సాయంకాలం తెలుగు భాషా సమితి ఆఫీసుకి తీసుకెళ్ళాను. అక్కడ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు, మేడేపల్లి వరాహ నరసింహస్వామిగారూ పనిచేసేవారు. వాళ్ళ సమక్షంలో తిలక్‌గారు తాను చందస్సులో రాసిన కవితలు (ఇప్పుడు ఆ కవితలు గోరువంకలు పుస్తకంలో ఉన్నాయి) చదివారు. నాతోపాటు జ్యేష్ట, బంగోరె, చేరాలు శ్రోతలు అని గుర్తు!

అప్పటి నుంచీ ఆయన ఏలూరు వచ్చినప్పుడల్లా కలిసే వాడిని. అడపా తడపా పోస్టు కార్డులు రాసుకోవడం కూడా అలవాటయ్యింది. తిలక్‌ గారు నన్ను My Dear Stormy Petrel అని సంబోధించి పోస్టు కార్డులు రాసేవారు. ఆ నాటి ఉత్తరాలు దాచుకోలేక పోవడం నా తెలివితక్కువతనం అని వేరే చెప్పనక్కర లేదు!