డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష

సెప్టెంబరు 20, 21 శనీ ఆదివారాల్లో డెట్రాయిట్‌లో డి.టి.ఎల్.సి. గా పిలువబడే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు వారు దశవార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సమావేశాన్ని జరిపారు. ఈ తెలుగు సాహితీ సంఘపు సభ్యులు పదేళ్ళుగా ఎన్నో పుస్తకాలను అన్ని సాహిత్య రంగాలనుండి – కథా సంపుటాలు, నవలలు, నాటకాలు, కవితా సంపుటాలు, విమర్శనాత్మక గ్రంథాలు – చదివి తమలో తాము చర్చించుకొన్నారు. వారి ఈ పరిశ్రమ మెచ్చుకో తగ్గదే. ఎక్కడో మిన్నులు పడ్డ చోట వసిస్తూ తెలుగు భాషను మరచిపోకుండా దాని రసాస్వాదనలో తన్మయత చెందడం ఒక గొప్ప విశేషమే.

ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను కూడా వెళ్ళాను. ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది. నేను సదస్సు ఆహ్వానం అంగీకరించి తెలుగు అక్షరాల సౌష్ఠవ చిత్రాలను, సందిగ్ధ చిత్రాలను (ambigrams), సంపూర్ణావరణ చిత్రాలను (tesselations) కొన్నిటిని ప్రదర్శించాను. అతిథులకు తెలుగు పుస్తకాలను కొనే అవకాశం కూడా లభ్యమయింది ఈ సమావేశంలో. సాహిత్య చర్చలూ, స్నేహితుల సహవాసంలో ఆ వారాంతమంతా ఎంతో ఆహ్లాదంగా గడిచింది. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరిదీ ఇదే అభిప్రాయం.


మద్దిపాటి కృష్ణారావు

శనివారం ఉదయం, టంగుటూరి సూర్యకుమారిగారి “మా తెనుగు తల్లి” వీడియో ప్రదర్శనతో సమావేశం ప్రారంభమయింది. డీటీఎల్‌సీ అధ్యక్షులు మద్దిపాటి కృష్ణారావు డీటీఎల్‌సీ పదేళ్ళ జీవితాన్ని పరిచయం చేస్తూ, సభికులకి స్వాగతం పలికి సభను ప్రారంభించారు. కీలకోపన్యాసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ప్రాధ్యాపకులుగా తెలుగు భాష గౌరవాన్ని అమెరికాలో తమ అనువాదాలతో, వ్యాసాలతో వ్యాప్తి చేస్తున్న వెల్చేరు నారాయణరావు గారు ఇచ్చారు. వారు ఎంచుకొన్న అంశం: తెలుగు విమర్శ – అక్కడ (భారతదేశంలో), ఇక్కడ (అమెరికాలో). పందొమ్మిది, ఇరవైయవ శతాబ్దాలలో తెలుగులో వచ్చిన మార్పులను ప్రస్తావించి తెలుగు ఎలా సంస్కృతం, ఆంగ్లం మధ్య నలిగిందో అనే విషయాన్ని విపులీకరించారు. సాహిత్యం గురించి మాట్లాడేవారే గాని, సాహిత్యాన్ని మాట్లాడేవారు లేదు. పద్యం వచ్చింది, వచన పద్యం వచ్చింది. కాని విమర్శ మాత్రం రాలేదు. తమ అభిప్రాయాలతో ఏకీభవించే రచనలే మంచివి, మిగిలినవి చెడ్డవనే భావనతో మాత్రమే విమర్శించడం వల్ల తెలుగు సాహిత్యంలో విమర్శ ఎలా కుంటు పడ్డదో వివరించారు.


ఆచార్య వెల్చేరు నారాయణరావు

తెలుగు నేలపై ఉన్నవారికి ఉన్న కట్టుబాట్లూ ఇబ్బందులూ అమెరికాలో తెలుగువారికి ఉండవు అని చెబుతూ, అమెరికాలో ఉండే సాహిత్యాభిమానుల జీవనోపాధి తెలుగు సాహిత్యం కాదు. అందువల్ల ఇక్కడివారు స్వతంత్రంగా తమ భావాలను వెలిబుచ్చడం సాధ్యమయింది. ఈ సాహితీస్వాతంత్ర్యాన్ని ఇక్కడి తెలుగువారు మరింత ఉపయోగించుకొని సాహిత్యానికి ఎలా మేలు చేయగలరో చర్చించారు. “ఏ సిద్ధాంతం కూడా ఏది మంచి సాహిత్యమో, ఏది కాదో చెప్పదు. మన అభిరుచి మాత్రమే మంచి చెడ్డలను గుర్తిస్తుంది. కవిత్వం రెండు రకాలు – ఒకటేమో శబ్దాలంకారాలతో విన్నప్పుడు ఆనందాన్ని కలిగించేది. రెండవదేమో అర్థవంతమైనది, ఆలోచనలను కలిగించేది. కవిత్వంవల్ల వచ్చే పర్యవసానం ఏమిటి?” ఇలా ఎన్నో అంశాల గురించి చర్చిస్తూ, విమర్శకులకున్న బాధ్యతను గుర్తు చేశారు. ఏ విధంగా, తార్కిక దృష్టితో పరిశీలించేవారు తక్కువై, నిందారోపణలూ, రాజకీయ వాదాల పడికట్టు మాటల చట్రాల లోనే తెలుగునాటి ప్రస్తుత విమర్శ ఉన్నదో వివరిస్తూ, మంచి కవితలను, కథలను, నవలలను గుర్తించడం ద్వారా ఇక్కడి తెలుగువారు సాహిత్య విమర్శకు చేయగల్గిన మేలును ప్రస్తావించారు.


చంద్రలత

భోజనానంతరం సభ మళ్ళీ మొదలైంది. మొదటి కార్యక్రమం – కథా, నవలా విమర్శ. చర్చలో, చంద్రలత, కొడవళ్ళ హనుమంతరావు, ఆరి సీతారామయ్య, కారుమంచి శ్రియ, పాల్గొన్నారు. మొదటగా రేగడివిత్తులు, దృశ్యాదృశ్యం నవలల ద్వారా చిరపరిచితులయిన రచయిత శ్రీమతి చంద్రలత మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి అయిన చంద్రలత తన ఉపన్యాసంలో నవలా సాహిత్యపు పుట్టుపూర్వోత్తరాలను బొకాచియో డెకామెరాన్ నుండి ప్రారంభించి వీరేశలింగంగారి రాజశేఖరచరిత్ర వరకు పేర్కొన్నారు. నవల ఎలా కథ చెబుతుందో అది ఎలా సాంస్కృతికమయినదో, స్థానిక సమాజపు అవగాహన, అందులోని లోటులను నవలలో ఎలా రాయడానికి వీలవుతుందో వివరిస్తూ, సమాజం, రచన, రచయిత, పాఠకుడు వీటికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని ఎత్తిచూపారు. నవల మనుగడ ఏమవుతుంది అనే ప్రశ్నకు ఇప్పుడు చరిత్రను రాజకీయతకు ఉపయోగించుకొంటున్నారు అన్నారు. తెలుగు సాహిత్యపు మనుగడకు ముఖ్యమైనది నవలా ప్రక్రియ అని ముగించారు.

కొడవళ్ళ హనుమంతరావుగారు వడ్డెర చండిదాసు రాసిన “అనుక్షణికం” అనే నవలలో గాయత్రి పాత్రను గురించి ఉపన్యసించారు. కథ ఒక జలపాతం అయితే, నవల ఒక నది లాటిది, అనుక్షణికం ఉరిమి, చించి చెండాడించే నవల, విప్లవ భావాలు, పదునైన భాష చలం సొత్తయితే, పాత్ర పోషణ చండీదాసు గుణం అని అభిప్రాయపడ్డారు. ఇతివృత్తాలు మేధాజనితం, కానీ పాత్ర సృష్టీకరణ జగజ్జనితం అంటూ చండీదాస్ పాత్రలు ఎలా రక్తమాంసాలతో సజీవంగా నిలిచి ఉంటాయో వర్ణించారు. “గాయత్రిది చక్కని అందం కాదు, కానీ ఆమె అనాకారి కూడా కాదు. ఆమె ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, విరసంలలో పాల్గొంటుంది. గాయత్రి, మోహన్ రెడ్డి ప్రేమించుకొన్నారు. ఆమె గర్భవతి అవుతుంది, కానీ కడుపు తీయించుకోడానికి ఒప్పుకోదు. పెద్దలకు చెప్పడానికి తీర్మానించుకొంటుంది. ఈ గాయత్రికి మూడో నెల అంటే తండ్రి గాయత్రి అనే పేరుకే అవమానం తెచ్చావంటాడు. ఇంటిని వదిలే ముందు కట్టు బట్టలతో వెళ్ళాలా, చీరలు, పుస్తకాలు తీసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతుంది. పాప అరుణ పోయాక గాయత్రి ఏడుస్తుంది. తిరిగి పుట్టింటి గుమ్మం ఎక్కడానికి ఆమెకు మనసు రాదు.” ఈ సందర్భాలలో చండీదాసు పాత్రల సంభాషణ ద్వారా నవలకు ఒక వైశిష్ఠ్యాన్ని ఎలా కల్పించ గలిగాడో, గాయత్రి పాత్ర ఎందుకు తనకు నచ్చిందో ఉత్తేజితులై ప్రసంగించారు.

తరువాత కారుమంచి శ్రియ “Post-feminist view of the Telugu literature” అన్న అంశం గురించి ఆంగ్లంలో మాట్లాడారు. శ్రియ post-feminist అమెరికాలో పుట్టి పెరిగిన యూనివర్సిటీ విద్యార్థిని. వోల్గా కథల ఆంగ్లానువాదాలు చదివి వాటిలో స్త్రీ పాత్రలని తన అనుభవాలతో పోల్చుకుంటూ చేసిన ఉపన్యాసం, చక్కటి చర్చకు దారి తీసింది. ఎలా ఒక కథలో జానకి అనే పాత్రను నోరు ముయ్యమని పదేపదే చెప్పారో, అలా చేయడం ద్వారా ఆమె నోరు మాత్రమే కాదు, ఆమె ఆలోచనా ద్వారాలు కూడా మూతబడినయో, పర్యవసానంగా ఆమె ఒక విధంగా చివరకు ఎలా మూగదై పోతుందో, ఒక ఉదాహరణగా తీసుకొని వోల్గా కథలలో ఎదురయే ప్రశ్నల గురించి, సమాజంలో మారుతున్న స్త్రీ పాత్ర గురించి తన పరిశీలనలను పంచుకున్నారు. ఒక సభికుడు స్త్రీ అణచివేత తెలుగు నాట ఇప్పుడసలు లేదనీ, ఇంకా దానిగురించి మాట్లాడటం తెలుగు వారికి అవమానమనీ అనడం వేడి చర్చకు దారి తీసింది.

ఆరి సీతారామయ్య గారు మంచి కథను గురించి మాట్లాడారు. మంచి కథను నిర్వచించడం కష్టతమమయిన విషయం. ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చదు. కాని కథను ఎలా రాయకూడదో, ఎలా రాస్తే బాగుండదో అనే అంశాలపై తన అభిప్రాయాలను సమకాలీన కథలు ఉదహరిస్తూ వివరించారు. “పాత్రలచే చెప్పించేది మంచి కథ కాజాలదు. కథ గురించి ఒక రెండు మాటలలో పాఠకుడు అభిప్రాయం చెప్పలేకపోతే అది మంచి కథయే. కథలో ఒక వస్తువు మాత్రమే ఉండాలి, రెండు ఉండరాదు. అసహజమైన సంభాషణలు కథను చెడగొడుతాయి. కథలోని సందేశాన్ని పాత్రలు నోటితో చెప్పరాదు. వస్తువు మీద ఫోకస్ ఉండాలి. కథ రాసిన తరువాత స్నేహితుల దగ్గర విమర్శ తీసుకొంటే మంచిది” ఇవి వీరి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.

“>
కన్నెగంటి చంద్ర

విరామానంతరం చర్చ కన్నెగంటి చంద్ర గారి ఆధ్వర్యాన జరిగింది. చర్చాంశం తెలుగు కవిత్వం – విన్నకోట రవిశంకర్‌, వెంకటయోగి నారాయణస్వామి, తమ్మినేని యదుకులభూషణ్, వేలూరి వేంకటేశ్వరరావు గార్లు పాల్గొన్న ఈ కార్యక్రమం చాలా ఆసక్తిగా సాగింది. ముందుమాటగా – కవిత్వం రాయడం తేలిక, కాని మంచి కవిత్వం రాయడం కష్టం. కవిత్వంలో పాఠకుని పాత్ర, ప్రమేయం ఎక్కువ, అంటూ, మంచి కవిత్వానికి కవీ, పాఠకుడూ ఎలా రెండు కళ్ళ వంటి వారో వివరిస్తూ – చంద్ర చేసిన వ్యాఖ్యానం, సాహిత్యంలో కీలకమైన కొన్ని అంశాలను ప్రస్తావించింది.

విన్నకోట రవిశంకర్‌గారు కవిత్వపు ప్రేరణలను, కారణాలను గురించి ప్రసంగించారు. సమకాలీన తెలుగు కవిత్వం నుండి కొన్ని ఉదాహరణలను ఎత్తి చూపించారు. “తీవ్రమైన భావోద్వేగానికి చలించి వ్రాసేది కవిత. ఇందులో దుఃఖము, ఆనందము, సంభ్రమము అన్నీ ఉంటాయి” అని కవి మనోస్థితిని వివరిస్తూ సాగరసంగమం చిత్రంలో తల్లి చనిపోయేటప్పుడు కమలహాసన్ నృత్యాన్ని ఉదహరించారు. వీరుద్ఘాటించిన మరొక ముఖ్యమైన విషయం పరుల బాధను కవి ప్రకటించేటప్పుడు, కవి ఆ బాధలో మమేకం కాకపోవడం వల్ల జరిగే అనర్థం. “ఇంకొకరి బాధను, దుఃఖాన్ని కవితకు ఉపయోగించుకోరాదు. ఇది మంచి ఎథిక్స్ కాదు” అన్నారు. మనిషి మనిషిని ప్రేమిస్తాడు, అదే మనిషి సంఘాన్ని ద్వేషించగలడు. కవిత్వంలో జ్ఞాపకం పాత్ర ఎక్కువ. పద్యం తెరచుకొని ఉండాలి, దానితోబాటు మనసు కూడా తెరచుకొని ఉండాలి, అని ముగించారు. కవి స్పందన, కవిత్వీకరణల గురించి వక్త వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలపై వాడిగా చర్చ జరిగింది.

కవిత్వంగురించిన ఊహలను, అపోహలను వెంకటయోగి నారాయణస్వామిగారు చర్చించారు. “భిన్నమైన అభిప్రాయాలవల్ల ఒక కొత్త అభిప్రాయం పుట్టవచ్చు. నిష్పక్షపాతంగా కవిత్వాన్ని చూడగలమా, దానికి ప్రమాణాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి. వాక్యాలను విరిచే చోట జాగ్రత్త పడాలి. కవితలో వస్తువుకు మాత్రమే ప్రాధాన్యము ఇవ్వరాదు, శిల్పం కూడా ముఖ్యమే. అందులో nuances, subtleties ఉండాలి అన్నారు. కవి భాషను ఒక కొత్త కోణంనుంచి చూడాలి. రూపం వస్తువును మించిపోవాలి. కవిత్వాన్ని అంచనా వేయడానికి కొత్త ప్రమాణాలు రావాలి అని అభిప్రాయపడ్డారు. తమ్మినేని యదుకులభూషణ్ గారు ఆంగ్లము, గ్రీకు, చైనీసు భాషలలోని కవిత్వాలను, వాటిలోని విశిష్ఠతను గురించి చర్చించారు. ఆంగ్ల భాషా ప్రమాణాలను అలాగే మన భాషలకు దిగుమతి చేసుకోరాదు అన్నారు. ఒక భాషనుండి మరొక భాషకు కవిత్వాన్ని తర్జుమా చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఒక్కొక్క భాషకు ఉన్న ఒక ప్రత్యేక సంస్కృతి, నాగరికత గురించి మాట్లాడారు. ఐతే వీటి భేదాలపై వక్త నిర్వచన లోపం వల్ల కొంత అస్పష్టత సభికుల్లో ఏర్పడింది.

“>
వేలూరి వేంకటేశ్వరరావు

కవిత్వంపై చివరి ఉపన్యాసం వేలూరి వేంకటేశ్వరరావు గారిది. కవిత్వంపై చర్చలో అలసిపోయిన సభికులందరిలో తమ హాస్యోక్తులతో కొత్త ఉత్సాహం నింపారు. ఆద్యంతమూ ఛలోక్తులతో ఆసక్తికరంగా సాగిన ప్రసంగం, సభికుల్ని ఆకట్టుకుంది. కవిత్వం చదివే సాధారణ పాఠకుడు ఎదుర్కొనే సమస్యలను వీరు వింగడించారు. ఒక కవిత మంచిదా కాదా ఎలా తెలుసుకోవడం? ఒక కవితను చదవాలా అక్కరలేదా? అనే విషయం పాఠకుడిని వేధిస్తుంది. ఈ సాధారణ పాఠకుడి కోసం ప్రామాణికతను, కొలబద్దను ఎలా సృష్టించాలి? ఒక సుగంధానికీ, ఒక ద్రాక్షా సారాయపు రుచికీ ప్రామాణికంగా ఒక విలువ నిర్ణయించగలిగినట్టే, కవిత్వానికి కూడా నిర్ణయించగలిగే వెసులుబాటు ఉన్నదా? సంస్కృతాంధ్రాలలో ఇప్పటికే మన పూర్వీకులు ఎన్నో ప్రమాణాలను నిర్వచించారు. ఇప్పుడు కొత్త ప్రామాణికాలు మనకు అవసరమా? అని తన వ్యాసోద్దేశాన్ని పరిచయం చేశారు. రాజశేఖరుడు తెలిపిన నవపాకాలకు కొత్త రుచులు తగిలించి, కవిత్వం ఎలా జ్ఞాపికల సముదాయమో, ఎలా అవి మరలా నెమరువేసికొన్న స్మృతులో, ‘recovered memories’ కవిత్వాన్ని బేరీజు వేయడంలో ఎంత ముఖ్యపాత్ర వహిస్తాయో వివరించారు. వీరి ఉపన్యాసం ఆ రోజు సభకు ఒక చక్కటి ముగింపు అని చెప్పవచ్చు.

“>
జానపద నాట్యం

సాయంకాలం చక్కటి భోజనం, సాంస్కృతిక కార్యక్రమాలూ. డిట్రాయిట్ తెలుగు సమితి సభ్యులు, వారి చిన్న పిల్లలూ పాటలూ, నాట్యాలతో పండుగ చేశారు. డీటీఎల్‌సీ వారు ఈ సందర్భంగా వెల్చేరు నారాయణరావు, చంద్రలత, వడ్లమూడి బాబు రాజేంద్రప్రసాద్, కన్నెగంటి రామారావు లకు విశిష్ఠసేవా పురస్కారాలను బహూకరించారు. డీటీఎల్‌సీ వారు ప్రచురించిన పుస్తకాలను విడుదల చేశారు. డీటీఎల్‌సీ సభ్యుడు గుళ్ళపల్లి రవి నిర్మించిన “మా భూమి” అనే చలన చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. గౌతం ఘోస్ దర్శకత్వంలో 1979లో వెలువడిన ఈ సినిమా ఎంతో పేరుగన్నది. బాగా పొద్దు పోయింది అందరూ తమ తమ విడిది చేరుకునేటప్పటికి.

ఆదివారం సమావేశం ఉదయం ఉపాహారంతో ప్రారంభమయింది. కన్నెగంటి రామారావు ఆధ్వర్యాన తెలుగు ప్రచురణలను గురించి ఒక సభ జరిగింది. సురేశ్ కొలిచాల, పారినంది లక్ష్మీనరసింహం (పాలన), వెల్చేరు నారాయణరావు పాల్గొన్నారు. మొదటగా సురేశ్ కొలిచాల ఈ ఇంటర్నెట్ యుగంలో, ప్రపంచమే ఒక గ్రామంగా మారుతున్న నేపథ్యంలో, తెలుగు భవిష్యత్తు ఏమిటి? దాని పోషణకు, అభివృద్ధికి మనమేమి చేయగలం? సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎలా వినియోగించుకోగలం? అనే విషయంపై పవర్‌పాయింట్ సహాయంతో ప్రసంగించారు.

“>
రామారావు, సురేశ్, వంగూరి, వెల్చేరు

ముందుగా, అసలు చరిత్రలో గ్రంథాలు ఎలా ముద్రించబడ్డాయో విశదీకరిస్తూ రాతిపైన చిత్రకళనుండి ప్రారంభించి ఇంటర్నెట్ యుగం వరకు ముద్రణలో జరుగుతున్న మార్పులను, కూర్పులను, చేర్పులను తెలిపారు. ఆ తరువాత, క్రీ.శ. 2100 నాటికి 90 శాతం భాషలు అంతరించి పోతాయన్న అభిప్రాయాన్ని వివరిస్తూ, ఆధునిక మానవ జీవితంలో ముఖ్య భాగమైన సమాచార సాంకేతికజ్ఞానాన్ని (Information Technology) తగు విధంగా ఉపయోగించుకోలేని భాషలన్నీ ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోయే ప్రమాదముందని అన్నారు. తెలుగువంటి ఆంగ్లేతర భాషల మనుగడకు ఇంటర్నెట్, e-పుస్తకాలే దోహదం చెయ్యగలవని ఆయన అభిప్రాయపడ్డారు. “ఆంగ్ల భాష శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఇప్పుడు అనుసంధాన భాషగా ఉపయోగించబడుతూ ఉంది. ఇప్పుడు కూడ ఇంటర్నెట్‌లో ఇంగ్లీషుది పై చేయి. యూనికోడ్ మాహాత్మ్యం వల్ల తెలుగును సులభముగా వ్రాయగలుగుతున్నాం, తెలుగులో ముద్రించగలుగుతున్నాం. ఇందులో ఇంకా ఎంతో కృషి చేయాలి. కొత్త ఫాంట్లు, OCR, e-గ్రంథాలయాల వంటివి చాల అవశ్యం” అని తెలిపారు.

వంగూరి చిట్టెన్‌రాజు గారు సుమారు రెండు వందల పైగా తెలుగు రచయితలు ఉండే అమెరికాలో తెలుగు పుస్తకాలను ఎలా అందరికీ అందుబాటు చేయడం అన్న విషయాన్ని సభ ముందు ఉంచారు. అన్ని సంఘాలు, సమూహాలు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేస్తే బాగుంటుందన్నారు. పుస్తక ముద్రణ, పంపిణీ, అందుబాట్లలో ఉండే సాదక బాధకాలు వినిపించారు. తరువాత పాలన గారు డిజిటల్ పుస్తకాలను తయారు చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను గురించి విపులీకరించారు. ముఖ్యంగా OCR (optical character recognition) తెలుగుకు ఎలా వర్తించ వీలవుతుంది అనే ప్రశ్నకు జవాబును అన్వేషించారు. వారు ముఖ్యంగా – preservation, production and propagation అనే మూడు అంశాలను చర్చించారు.

ఈ అంశం పైన చివరి ప్రసంగం వెల్చేరు నారాయణరావు గారిది. వారు ప్రచురణ అంటే ఏమిటి? అచ్చు వేయడానికి ప్రచురించడానికి తేడా ఏమిటి అనే ప్రశ్నకు జవాబు ఇచ్చారు. అక్షరము అంటే నాశనము లేనిది. గ్రంథాలు కూడా అవినాశనమై ఉండాలి. సాంకేతిక రంగం లోని మార్పులు ప్రగతికి చిహ్నం కాదు, అవి వట్టి మార్పు మాత్రమే అన్నారు. వావిళ్ళ సంస్థలాటి ప్రచురణ సంస్థలు నేడు లేక పోవడం శోచనీయ మన్నారు. ఇప్పుడు కూడ ఆ నాటి వావిళ్ళ ప్రతులను అలాగే ప్రచురిస్తున్నారు, మంచి పరిష్కర్తలు మనకు లేరు అని అవేదన వ్యక్తం చేశారు. మంచి ప్రచురణ సంస్థ నాగరితకు గుర్తు అన్నారు. ఇంతకు ముందులా ఇప్పుడు ప్రచురించే పుస్తకాలలో మంచివేవో కానివేవో అన్నది సంస్థను బట్టి నిర్ణయించలేము. ప్రచురణ సంస్థలకి ఈ రకమైన ఆత్మగౌరవం లేనప్పుడు మంచి పుస్తకాలు రావడం కష్టం అని ప్రసంగాన్ని ముగిస్తూ నారాయణరావు గారు, మంచి పరిష్కర్తలు, సంపాదకులు ఎంతో అవసరం, అప్పుడే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందన్నారు.

“>
పరుచూరి శ్రీనివాస్

మధ్యాహ్న భోజనానంతరం, చివరి సదస్సు తెలుగు సినిమాలపై, తెలుగు బ్లాగులపై జరిగింది. పరుచూరి శ్రీనివాస్ గారు తెలుగు సినిమా ప్రారంభ దశలో ఎలాగుండిందో అనే విషయంపై మాట్లాడారు. “ఇప్పుడు ఆంధ్రదేశంలో కేవలం భక్తి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సినిమా పుస్తకాలు మాత్రమే అమ్ముడు పోగలవు. అదే విధంగా విశ్వవిద్యాలయాలలో తెలుగులో పరిశోధనల్లో కూడా సినిమా చోటు చేసుకుంది. కానీ సినిమాలపైన జరిగే సంశోధన ఆ రంగంలోని లోతులను ఆరా తీయడం లేదు” అని విమర్శించారు. ఆరంభ దశలో గ్రామఫోన్ రికార్డులు ఎప్పుడు వచ్చాయి, ఏయే కంపెనీలలొ (ఓడియన్, ఎచ్ఎంవీ లాటి వాటిలో) ఏయే కళాకారులు పాడేవారు, సినిమాలను ఎలా తీసేవారు, ఎవరు పెట్టుబడి పెట్టేవారు, టాకీలు రాకముందు తెరకు ముందు కస్తూరి శివరావులాటి కథకులు ఎలా ప్రజలకు చిత్రకథను తెలిపేవారు – ఇలాటి విషయాలను చక్కగా విశదీకరించారు. ఆ కాలంలో సినిమా ఒక విధంగా కులమత భేదాలను, సంఘంలోని దురాచారాలను నిర్మూలించడానికి తోడ్పడిందో అనే విషయాలపై పరిశోధన ఎంతైనా అవసరము అన్నారు. గత శతాబ్దంలో తెలుగు దేశంలో ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పరమైన మార్పులను అర్ధం చేసుకోటానికి సినిమా చరిత్ర పరిశోధన ఎంత చక్కగా ఉపయోగ పడగలదో వివరించారు. ఇంకా ఎన్నో ఆసక్తి కరమైన సంగతులు వారి ఉపన్యాసంలో ఉన్నాయి. సంగీతరంగంలో కూడా సినిమా ఎన్నో కొత్త దారులు తీసింది. అసలు సంగీత దర్శకుడు అన్న పేరు భారతదేశములోనే పుట్టిందట మొదటిసారిగా! పల్లవికి అనుపల్లవికి మధ్య వాద్యాల అంతరము కూడా చిత్రరంగపు సృష్టియే. ప్రేమ మున్నగు పదాలు కూడా మొట్టమొదట చిత్రసీమలోనే వాడబడ్డాయట. శ్రీనివాస్ గారి ప్రసంగం వస్తురీత్యా చాలా చిక్కని ప్రసంగం.

“>
నాసీ శంకగిరి, రవి వైజాసత్య

తరువాత తెలుగు బ్లాగులపైన ఒక సదస్సు శంకగిరి నారాయణస్వామి ఆధ్వర్యాన జరిగింది. తెలుగులోని కొన్ని బ్లాగులను తెలియజేశారు. అందులో కొన్ని – ఊహలన్ని ఊసులై, జ్యోతి, నాగమురళి, రామనాథరెడ్డి, పర్ణశాల, మనలోమనమాట, సిరివెన్నెల, చదువరి, కలగూరగంప, కలం కలలు, తెలుగు తూలిక, గుండె చప్పుడు, రెండు రెళ్ళు ఆరు, విహారి, కొత్తపాళీ. బ్లాగులను ఎలా ప్రారంభించాలో, దానికి కావలసిన ఉపకరణాలను గురించి తెలిపారు. బసాబత్తిన శ్రీనివాసులు తమ అనుభవాలను ముచ్చటించారు. తెలుగు వికీపీడియా ఎలా కొనసాగుతుందో అనే విషయంపై వైజాసత్య రవి గారు మాట్లాడారు. ఈ విజ్ఞానసర్వస్వానికి అందరు కృషి చేయవచ్చును. ఇప్పటి దాక సుమారు 40 వేలపైన అంశాలు తెలుగు వికీపీడియాలో చూడ వీలవుతుంది, అని తెలిపారు. ఇంకా సి. బి. రావు, శ్రీ, శరత్ గార్లు కూడా బ్లాగులతో వారి అనుభవాలను సభికులతో పంచుకొన్నారు. మిగతా కార్యక్రమాలంత పకడ్బందీగా ఈ కార్యక్రమం లేదనే చెప్పుకోవాలి. బహుశా, బ్లాగుల గురించి జన సామాన్యానికి ఎంత తెలుసో అంచనా వేయడంలో పొరపాటు అయి ఉండవచ్చు. కానీ, ఇదేమంత పెద్ద విషయం కాదు.

ముగింపుగా అరుణా పాణిని అమెరికాలో ముఖ్యంగా పిల్లలకు తెలుగు వినడం, మాట్లాడడం, చదవడం, చదివించడం ఎలా అనే విషయంపై తన కుటుంబాన్నే ఒక ఉదాహరణగా తీసుకుని మాట్లాడారు. తన భర్త పాణిని తల్లి తమిళం మాట్లాడేవారు, తండ్రి తెలుగు అచార్యుడు, తమిళం రానివారు. పెళ్ళి అయిన తరువాత ఇద్దరూ కన్నడంలో మాట్లాడుకొనేవారు, అయినా సరే, వారి పిల్లలందరికీ తెలుగు క్షుణ్ణంగా వచ్చు. అలాగే అమెరికాలో పుట్టిపెరిగిన తన కొడుకు తనకు పరిచయమైన మెక్సికన్ అమ్మాయి వద్ద స్పానిష్ భాష నేర్చుకొనడానికి తెలుగు భాష పరిచయం ఎలా ఉపకరించిందో అనే విషయాన్ని వివరించారు. అట్లాంటాలో తెలుగు ఒక పఠనీయ భాషగా వెలుగులోకి వస్తున్నదని, దానికి నారాయణరావు గారు గౌరవ ప్రాధ్యాపకులని తెలిపారు. అంతటితో సమావేశం ముగిసింది. తిరుగు ప్రయాణాల హడావిడిలో దూర తీరాలనుంచి వచ్చిన వారు వెళ్ళిపోయారు. మిగిలిన ఆహూతులంతా ఒకరికొకరు వీడ్కోళ్ళు చెప్పుకుంటూ అక్కడే ఇంకొంచెం సేపు తారట్లాడారు.

ఇటువంటి సమావేశాల నిర్వహణలో ఎన్నో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అయితే, ఏ లోటూ రాకుండా, కాలాయాపన లేకుండా చాలా పకడ్బందీగా ఈ సమావేశం నిర్వహించినందుకు డీటీఎల్‌సీ వారిని అభినందించక తప్పదు. ప్రత్యేకించి, వక్తల ఉపన్యాసాలకూ, తదనంతరం చర్చలకూ సరిపోయినంత సమయాన్నివ్వడం చాలా నచ్చిన విషయం. ఇందువల్ల ఒక విషయాన్ని కొంచెం విశదంగా చర్చించే వీలుంటుంది. నిర్వాహకులు తాము చదివిన పుస్తకాలపైన మాట్లాడి ఉంటే బాగుండి ఉంటుందని నా ఊహ. మనుచరిత్ర, ఆముక్తమాల్యద వంటి కావ్యాలను చదివిన సాహితీ సభ్యులు ఎందుకు సంప్రదాయ సాహిత్యంపైన మాటలాడమని ఎవరినీ పిలువలేదో? ఇరవైఒకటవ శతాబ్దంలో కూడా ఛందోబద్ధమైన కావ్యాలు సాహిత్యానికి అవసరమనే నా భావన. సాంప్రదాయిక సాహిత్య విమర్శ పై ఏ కార్యక్రమం లేకపోవడం ఒక లోటు అనే చెప్పవచ్చు.

ఇది ఒక చక్కని సమావేశం. దీనిని జయప్రదంగా నిర్వహించిన డిట్రాయిట్ తెలుగు సాహితీ ప్రియులను తప్పక మెచ్చుకొని జోహారు లర్పిస్తున్నాను. చక్కటి భోజనం, ఉపాహారాలు అందరికీ సమకూర్చారు, వేరే ప్రాంతాలనుంచి వచ్చిన అతిథులకి తమ ఇళ్ళలో వసతి కల్పించారు. రెండు రోజులూ ఒక పండగ లాంటి వాతావరణం లో సమావేశం జరిపారు. డీటీఎల్‌సీ వారు నిజంగా అభినందనీయులు. కవులు, పండితులు, సాహితీ పిపాసకులతో రెండు రోజులు ఎంతో వేగంగా గడిచిపోయాయి. ఇలాటి సమావేశాలు అమెరికాలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో అవసరం.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...