రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు
నవంబర్ 2008

సెప్టెంబరు 20, 21 శనీ ఆదివారాల్లో డెట్రాయిట్‌లో డి.టి.ఎల్.సి. గా పిలువబడే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు వారు దశవార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సమావేశాన్ని జరిపారు. ఈ తెలుగు సాహితీ సంఘపు సభ్యులు పదేళ్ళుగా ఎన్నో పుస్తకాలను అన్ని సాహిత్య రంగాలనుండి – కథా సంపుటాలు, నవలలు, నాటకాలు, కవితా సంపుటాలు, విమర్శనాత్మక గ్రంథాలు – చదివి తమలో తాము చర్చించుకొన్నారు. వారి ఈ పరిశ్రమ మెచ్చుకో తగ్గదే. ఎక్కడో మిన్నులు పడ్డ చోట వసిస్తూ తెలుగు భాషను మరచిపోకుండా దాని రసాస్వాదనలో తన్మయత చెందడం ఒక గొప్ప విశేషమే.

ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను కూడా వెళ్ళాను. ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది. నేను సదస్సు ఆహ్వానం అంగీకరించి తెలుగు అక్షరాల సౌష్ఠవ చిత్రాలను, సందిగ్ధ చిత్రాలను (ambigrams), సంపూర్ణావరణ చిత్రాలను (tesselations) కొన్నిటిని ప్రదర్శించాను. అతిథులకు తెలుగు పుస్తకాలను కొనే అవకాశం కూడా లభ్యమయింది ఈ సమావేశంలో. సాహిత్య చర్చలూ, స్నేహితుల సహవాసంలో ఆ వారాంతమంతా ఎంతో ఆహ్లాదంగా గడిచింది. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరిదీ ఇదే అభిప్రాయం.


మద్దిపాటి కృష్ణారావు

శనివారం ఉదయం, టంగుటూరి సూర్యకుమారిగారి “మా తెనుగు తల్లి” వీడియో ప్రదర్శనతో సమావేశం ప్రారంభమయింది. డీటీఎల్‌సీ అధ్యక్షులు మద్దిపాటి కృష్ణారావు డీటీఎల్‌సీ పదేళ్ళ జీవితాన్ని పరిచయం చేస్తూ, సభికులకి స్వాగతం పలికి సభను ప్రారంభించారు. కీలకోపన్యాసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ప్రాధ్యాపకులుగా తెలుగు భాష గౌరవాన్ని అమెరికాలో తమ అనువాదాలతో, వ్యాసాలతో వ్యాప్తి చేస్తున్న వెల్చేరు నారాయణరావు గారు ఇచ్చారు. వారు ఎంచుకొన్న అంశం: తెలుగు విమర్శ – అక్కడ (భారతదేశంలో), ఇక్కడ (అమెరికాలో). పందొమ్మిది, ఇరవైయవ శతాబ్దాలలో తెలుగులో వచ్చిన మార్పులను ప్రస్తావించి తెలుగు ఎలా సంస్కృతం, ఆంగ్లం మధ్య నలిగిందో అనే విషయాన్ని విపులీకరించారు. సాహిత్యం గురించి మాట్లాడేవారే గాని, సాహిత్యాన్ని మాట్లాడేవారు లేదు. పద్యం వచ్చింది, వచన పద్యం వచ్చింది. కాని విమర్శ మాత్రం రాలేదు. తమ అభిప్రాయాలతో ఏకీభవించే రచనలే మంచివి, మిగిలినవి చెడ్డవనే భావనతో మాత్రమే విమర్శించడం వల్ల తెలుగు సాహిత్యంలో విమర్శ ఎలా కుంటు పడ్డదో వివరించారు.


ఆచార్య వెల్చేరు నారాయణరావు

తెలుగు నేలపై ఉన్నవారికి ఉన్న కట్టుబాట్లూ ఇబ్బందులూ అమెరికాలో తెలుగువారికి ఉండవు అని చెబుతూ, అమెరికాలో ఉండే సాహిత్యాభిమానుల జీవనోపాధి తెలుగు సాహిత్యం కాదు. అందువల్ల ఇక్కడివారు స్వతంత్రంగా తమ భావాలను వెలిబుచ్చడం సాధ్యమయింది. ఈ సాహితీస్వాతంత్ర్యాన్ని ఇక్కడి తెలుగువారు మరింత ఉపయోగించుకొని సాహిత్యానికి ఎలా మేలు చేయగలరో చర్చించారు. “ఏ సిద్ధాంతం కూడా ఏది మంచి సాహిత్యమో, ఏది కాదో చెప్పదు. మన అభిరుచి మాత్రమే మంచి చెడ్డలను గుర్తిస్తుంది. కవిత్వం రెండు రకాలు – ఒకటేమో శబ్దాలంకారాలతో విన్నప్పుడు ఆనందాన్ని కలిగించేది. రెండవదేమో అర్థవంతమైనది, ఆలోచనలను కలిగించేది. కవిత్వంవల్ల వచ్చే పర్యవసానం ఏమిటి?” ఇలా ఎన్నో అంశాల గురించి చర్చిస్తూ, విమర్శకులకున్న బాధ్యతను గుర్తు చేశారు. ఏ విధంగా, తార్కిక దృష్టితో పరిశీలించేవారు తక్కువై, నిందారోపణలూ, రాజకీయ వాదాల పడికట్టు మాటల చట్రాల లోనే తెలుగునాటి ప్రస్తుత విమర్శ ఉన్నదో వివరిస్తూ, మంచి కవితలను, కథలను, నవలలను గుర్తించడం ద్వారా ఇక్కడి తెలుగువారు సాహిత్య విమర్శకు చేయగల్గిన మేలును ప్రస్తావించారు.


చంద్రలత

భోజనానంతరం సభ మళ్ళీ మొదలైంది. మొదటి కార్యక్రమం – కథా, నవలా విమర్శ. చర్చలో, చంద్రలత, కొడవళ్ళ హనుమంతరావు, ఆరి సీతారామయ్య, కారుమంచి శ్రియ, పాల్గొన్నారు. మొదటగా రేగడివిత్తులు, దృశ్యాదృశ్యం నవలల ద్వారా చిరపరిచితులయిన రచయిత శ్రీమతి చంద్రలత మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి అయిన చంద్రలత తన ఉపన్యాసంలో నవలా సాహిత్యపు పుట్టుపూర్వోత్తరాలను బొకాచియో డెకామెరాన్ నుండి ప్రారంభించి వీరేశలింగంగారి రాజశేఖరచరిత్ర వరకు పేర్కొన్నారు. నవల ఎలా కథ చెబుతుందో అది ఎలా సాంస్కృతికమయినదో, స్థానిక సమాజపు అవగాహన, అందులోని లోటులను నవలలో ఎలా రాయడానికి వీలవుతుందో వివరిస్తూ, సమాజం, రచన, రచయిత, పాఠకుడు వీటికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని ఎత్తిచూపారు. నవల మనుగడ ఏమవుతుంది అనే ప్రశ్నకు ఇప్పుడు చరిత్రను రాజకీయతకు ఉపయోగించుకొంటున్నారు అన్నారు. తెలుగు సాహిత్యపు మనుగడకు ముఖ్యమైనది నవలా ప్రక్రియ అని ముగించారు.

కొడవళ్ళ హనుమంతరావుగారు వడ్డెర చండిదాసు రాసిన “అనుక్షణికం” అనే నవలలో గాయత్రి పాత్రను గురించి ఉపన్యసించారు. కథ ఒక జలపాతం అయితే, నవల ఒక నది లాటిది, అనుక్షణికం ఉరిమి, చించి చెండాడించే నవల, విప్లవ భావాలు, పదునైన భాష చలం సొత్తయితే, పాత్ర పోషణ చండీదాసు గుణం అని అభిప్రాయపడ్డారు. ఇతివృత్తాలు మేధాజనితం, కానీ పాత్ర సృష్టీకరణ జగజ్జనితం అంటూ చండీదాస్ పాత్రలు ఎలా రక్తమాంసాలతో సజీవంగా నిలిచి ఉంటాయో వర్ణించారు. “గాయత్రిది చక్కని అందం కాదు, కానీ ఆమె అనాకారి కూడా కాదు. ఆమె ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, విరసంలలో పాల్గొంటుంది. గాయత్రి, మోహన్ రెడ్డి ప్రేమించుకొన్నారు. ఆమె గర్భవతి అవుతుంది, కానీ కడుపు తీయించుకోడానికి ఒప్పుకోదు. పెద్దలకు చెప్పడానికి తీర్మానించుకొంటుంది. ఈ గాయత్రికి మూడో నెల అంటే తండ్రి గాయత్రి అనే పేరుకే అవమానం తెచ్చావంటాడు. ఇంటిని వదిలే ముందు కట్టు బట్టలతో వెళ్ళాలా, చీరలు, పుస్తకాలు తీసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతుంది. పాప అరుణ పోయాక గాయత్రి ఏడుస్తుంది. తిరిగి పుట్టింటి గుమ్మం ఎక్కడానికి ఆమెకు మనసు రాదు.” ఈ సందర్భాలలో చండీదాసు పాత్రల సంభాషణ ద్వారా నవలకు ఒక వైశిష్ఠ్యాన్ని ఎలా కల్పించ గలిగాడో, గాయత్రి పాత్ర ఎందుకు తనకు నచ్చిందో ఉత్తేజితులై ప్రసంగించారు.

తరువాత కారుమంచి శ్రియ “Post-feminist view of the Telugu literature” అన్న అంశం గురించి ఆంగ్లంలో మాట్లాడారు. శ్రియ post-feminist అమెరికాలో పుట్టి పెరిగిన యూనివర్సిటీ విద్యార్థిని. వోల్గా కథల ఆంగ్లానువాదాలు చదివి వాటిలో స్త్రీ పాత్రలని తన అనుభవాలతో పోల్చుకుంటూ చేసిన ఉపన్యాసం, చక్కటి చర్చకు దారి తీసింది. ఎలా ఒక కథలో జానకి అనే పాత్రను నోరు ముయ్యమని పదేపదే చెప్పారో, అలా చేయడం ద్వారా ఆమె నోరు మాత్రమే కాదు, ఆమె ఆలోచనా ద్వారాలు కూడా మూతబడినయో, పర్యవసానంగా ఆమె ఒక విధంగా చివరకు ఎలా మూగదై పోతుందో, ఒక ఉదాహరణగా తీసుకొని వోల్గా కథలలో ఎదురయే ప్రశ్నల గురించి, సమాజంలో మారుతున్న స్త్రీ పాత్ర గురించి తన పరిశీలనలను పంచుకున్నారు. ఒక సభికుడు స్త్రీ అణచివేత తెలుగు నాట ఇప్పుడసలు లేదనీ, ఇంకా దానిగురించి మాట్లాడటం తెలుగు వారికి అవమానమనీ అనడం వేడి చర్చకు దారి తీసింది.

ఆరి సీతారామయ్య గారు మంచి కథను గురించి మాట్లాడారు. మంచి కథను నిర్వచించడం కష్టతమమయిన విషయం. ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చదు. కాని కథను ఎలా రాయకూడదో, ఎలా రాస్తే బాగుండదో అనే అంశాలపై తన అభిప్రాయాలను సమకాలీన కథలు ఉదహరిస్తూ వివరించారు. “పాత్రలచే చెప్పించేది మంచి కథ కాజాలదు. కథ గురించి ఒక రెండు మాటలలో పాఠకుడు అభిప్రాయం చెప్పలేకపోతే అది మంచి కథయే. కథలో ఒక వస్తువు మాత్రమే ఉండాలి, రెండు ఉండరాదు. అసహజమైన సంభాషణలు కథను చెడగొడుతాయి. కథలోని సందేశాన్ని పాత్రలు నోటితో చెప్పరాదు. వస్తువు మీద ఫోకస్ ఉండాలి. కథ రాసిన తరువాత స్నేహితుల దగ్గర విమర్శ తీసుకొంటే మంచిది” ఇవి వీరి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.

“>
కన్నెగంటి చంద్ర

విరామానంతరం చర్చ కన్నెగంటి చంద్ర గారి ఆధ్వర్యాన జరిగింది. చర్చాంశం తెలుగు కవిత్వం – విన్నకోట రవిశంకర్‌, వెంకటయోగి నారాయణస్వామి, తమ్మినేని యదుకులభూషణ్, వేలూరి వేంకటేశ్వరరావు గార్లు పాల్గొన్న ఈ కార్యక్రమం చాలా ఆసక్తిగా సాగింది. ముందుమాటగా – కవిత్వం రాయడం తేలిక, కాని మంచి కవిత్వం రాయడం కష్టం. కవిత్వంలో పాఠకుని పాత్ర, ప్రమేయం ఎక్కువ, అంటూ, మంచి కవిత్వానికి కవీ, పాఠకుడూ ఎలా రెండు కళ్ళ వంటి వారో వివరిస్తూ – చంద్ర చేసిన వ్యాఖ్యానం, సాహిత్యంలో కీలకమైన కొన్ని అంశాలను ప్రస్తావించింది.

విన్నకోట రవిశంకర్‌గారు కవిత్వపు ప్రేరణలను, కారణాలను గురించి ప్రసంగించారు. సమకాలీన తెలుగు కవిత్వం నుండి కొన్ని ఉదాహరణలను ఎత్తి చూపించారు. “తీవ్రమైన భావోద్వేగానికి చలించి వ్రాసేది కవిత. ఇందులో దుఃఖము, ఆనందము, సంభ్రమము అన్నీ ఉంటాయి” అని కవి మనోస్థితిని వివరిస్తూ సాగరసంగమం చిత్రంలో తల్లి చనిపోయేటప్పుడు కమలహాసన్ నృత్యాన్ని ఉదహరించారు. వీరుద్ఘాటించిన మరొక ముఖ్యమైన విషయం పరుల బాధను కవి ప్రకటించేటప్పుడు, కవి ఆ బాధలో మమేకం కాకపోవడం వల్ల జరిగే అనర్థం. “ఇంకొకరి బాధను, దుఃఖాన్ని కవితకు ఉపయోగించుకోరాదు. ఇది మంచి ఎథిక్స్ కాదు” అన్నారు. మనిషి మనిషిని ప్రేమిస్తాడు, అదే మనిషి సంఘాన్ని ద్వేషించగలడు. కవిత్వంలో జ్ఞాపకం పాత్ర ఎక్కువ. పద్యం తెరచుకొని ఉండాలి, దానితోబాటు మనసు కూడా తెరచుకొని ఉండాలి, అని ముగించారు. కవి స్పందన, కవిత్వీకరణల గురించి వక్త వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలపై వాడిగా చర్చ జరిగింది.

కవిత్వంగురించిన ఊహలను, అపోహలను వెంకటయోగి నారాయణస్వామిగారు చర్చించారు. “భిన్నమైన అభిప్రాయాలవల్ల ఒక కొత్త అభిప్రాయం పుట్టవచ్చు. నిష్పక్షపాతంగా కవిత్వాన్ని చూడగలమా, దానికి ప్రమాణాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి. వాక్యాలను విరిచే చోట జాగ్రత్త పడాలి. కవితలో వస్తువుకు మాత్రమే ప్రాధాన్యము ఇవ్వరాదు, శిల్పం కూడా ముఖ్యమే. అందులో nuances, subtleties ఉండాలి అన్నారు. కవి భాషను ఒక కొత్త కోణంనుంచి చూడాలి. రూపం వస్తువును మించిపోవాలి. కవిత్వాన్ని అంచనా వేయడానికి కొత్త ప్రమాణాలు రావాలి అని అభిప్రాయపడ్డారు. తమ్మినేని యదుకులభూషణ్ గారు ఆంగ్లము, గ్రీకు, చైనీసు భాషలలోని కవిత్వాలను, వాటిలోని విశిష్ఠతను గురించి చర్చించారు. ఆంగ్ల భాషా ప్రమాణాలను అలాగే మన భాషలకు దిగుమతి చేసుకోరాదు అన్నారు. ఒక భాషనుండి మరొక భాషకు కవిత్వాన్ని తర్జుమా చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఒక్కొక్క భాషకు ఉన్న ఒక ప్రత్యేక సంస్కృతి, నాగరికత గురించి మాట్లాడారు. ఐతే వీటి భేదాలపై వక్త నిర్వచన లోపం వల్ల కొంత అస్పష్టత సభికుల్లో ఏర్పడింది.

1 2అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • కొక్కొండ: నూతన వృత్తములు – పట్టిక 3
  • ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.
  • వాడుక భాషలో తెలుగు కవితావికాసము
  • షష్ఠ్యంతములు
  • ఛందస్సులో గణితాంశములు – 7 – ఆవృత్త వృత్తములు

ఇటువంటివే…

  1. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  2. డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష
  3. 2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
  4. “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ
  5. 2003 తానా కథాసాహితి కథనవలల పోటీ బహుమతి విజేతల సమీక్ష

నవంబర్ 2008 సంచికలో ...

  • 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
  • A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu
  • అసమర్థులు
  • ఈమాట – నామాట
  • ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం
  • కుతంత్రం
  • జనరంజని: మహానటి సావిత్రి
  • డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష
  • తరువాతేమిటి?
  • తెలుగు కథల పోటీ
  • నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం
  • నాచన సోమన అపురూప పద సంచయం
  • నేనొక సాధారణ పాఠకుణ్ణి
  • పదేళ్ళ “ఈమాట” మాట
  • పళ్ళెం మాత్రం పగలగొట్టకు
  • పురూరవ
  • పురూరవ: శ్రవ్య నాటిక
  • బాలమురళీకృష్ణ సంగీతం
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 2
  • మరచిపొమ్మంటున్నారు
  • మూడు జ్ఞాపకాలు
  • రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా
  • రామా కనవేమిరా!
  • రెండు తీరాలు
  • సార్ గారండీ… సార్ గారండీ…
  • సువర్ణభూమిలో …
  • స్మైల్ ఒఖడే… ఇహ లేడు!
  • హిమపాతము
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రామా కనవేమిరా!
సువర్ణభూమిలో …

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.