శరీరం మీంచి బాల్యం అదృశ్యమౌతుంది.
దేహంపై యవ్వనం నూనూగుగా మొలకెత్తుతుంది.
దాని గొంతుక వింతైన జీరతో
“సార్ గారండీ, సార్ గారండీ” అంటుంది.
ఆ మాధుర్యానికి ఒక జీవితాన్ని అర్పించుకోవచ్చు.
ఆ అభిమానానికి ఒక హృదయాన్ని అంకితమీయచ్చు.
వాడు నిర్మించుకొనే వ్యక్తిత్వ హర్మ్యానికి
మేలిమి ఇటుకలను ఎంచి వాడికందిస్తాను.
వాని ఆలోచనల చురకత్తులు
పదును పెట్టుకోవటానికై
నా మెదడును సానరాయి ని చేస్తాను.
పరస్పర వైరుధ్యాల అరణ్యంలో
వాడు దారి తప్పి కునారిల్లినపుడు
నా అనుభవాల్ని దిక్సూచిగా చేసి బహూకరిస్తాను.
రసాయనోద్రేకాల ప్రళయ కాలంలో
అయితే కుంభవృష్టి లేకపోతే చండ్రగాడ్పులు
తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు
ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని,
మంచుసోనల్ని, వెన్నెలరాత్రుల్నీ
పరిచయం చేస్తాను.
ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ
నేను మంత్రసాని నౌతాను.
ఈ దేహం కలిసిపోయే లోపు
ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి,
“బాగున్నారా మాష్టారూ” అంటాడు.
అంతకుమించింకేం కావాలీ జీవితానికి.