అపార్ట్‌మెంట్స్
పార్కింగ్ ఏరియాలో కార్ల మధ్య
కొద్దిపాటి ఖాళీ స్థలంలో
తొక్కుడుబిళ్ళ ఆడుతున్న పిల్లల చుట్టూ
దృశ్యాదృశ్యంగా తిరుగుతున్న దయ్యాల్ని చూస్తున్నాను
స్కూటర్ మీద వెళ్తూ ఎవరో
రంగు రేపర్ చుట్టిన ప్యాకెట్ పారేసుకుంటే
అన్నా నీ ప్యాకెట్ అంటూ
గస పెడుతూ పరిగెట్టిన పిల్లాడు
ఇప్పుడు లేడనుకుంటే ఇకముందు ఉండడనుకుంటే
చాలా భయమేస్తుంది. తరువాతేమిటి?
మాట్లాడాలనిపించేది పలకరించాలనిపించేది
చిన్నపిల్లల్లా కలిసి ఆడుకోవాలనిపించేది ఏదీ లేదు
తరువాతేమిటి?
నేనొక కలను కావిలించుకుంటాను
వాస్తవంలోనికి విసిరిన వలలోంచి
వయ్యారంగా నవ్వుతున్న మత్స్యకన్యను
కావిలించుకుంటాను
వల విసిరిన చేతులు నావే వలనూ నేనే
నన్ను నేను విసిరేసుకోడం సేకరించుకోడం
ఎంపిక చేసుకోడం కౌగలించుకోడం అన్నీ నేనే
‘కోహం రండే’ అని నన్నెవరడిగినా
‘త్వమేవాహం త్వమేవాహం’ అంటాను
పొలాల్లో విత్తనాల కన్నా ముందు
రైతులు కలల్ని నాటుతారు
పంటకు పంటకు మధ్య ఎండాకాలం
నెర్రెలు వారిన చేల వద్దకు వెళ్ళి
వాళ్ళ కలల్ని వాళ్ళు ఆప్యాయంగా
ఆందోళనగా చూసుకుంటారు
అప్పుడు వాళ్ళ కళ్ళలో చేరే ఆవిర్లు
అవే తొలకరి మలికరి వానలన్నీను
చాలా ఊళ్ళు తిరిగాను
చాలా మంది కళ్ళలో నన్ను చూసుకున్నాను
చాలా కబుర్ల మధ్య సేద దీరాను
కర్ణభేరిని కదిపిన ప్రతి శబ్దంలో
కనుపాపను ఊపిన ప్రతి దృశ్యంలో
చిందరవందరగా నన్ను వెదుక్కున్నాను
అందరూ నన్ను చూడడం కన్న ఎక్కువగా
నాతో ఉన్న మరెవరినో చూశారు
అందరూ నాతో మాట్లాడ్డం కన్న ఎక్కువగా
నాతో ఉన్న మరెవరితోనే మాట్లాడారు
మరెవరో మాట్లాడడమే మంచిదనిపించి
పలుమార్లు నేను మూగవోయాను
మౌనం సంభాషణలో భాగమైపోవడం
చూసి ఆశ్చర్యపోయాను
దిగులు చేతిలో ఒక ఎండిపోయిన మట్టిముద్ద
తడవడానికి లోపల ఏమీ లేని వట్టి మట్టిముద్ద
ఆశపడి చూస్తే మనల్ని తన లోనికి
లాగేసుకునే బ్లాక్‌హోల్. దానిలో
విత్తనాలు తమ చుట్టూ తాము గిరగిర తిరుగుతాయి
తిరిగి తిరిగి అలిసిపోయి సొమ్మసిలి నిద్రపోతాయి
నిద్దట్లోంచి మృత్యువు లోనికి జారిపోతాయి
ఎప్పటికీ మొలకెత్తవు
అప్పుడు ఆ రోహిణి కార్తె మిట్టమధ్యాన్నం
ఊరి నుంచి ఊరికి నడుస్తూ
పడిపోతాననిపించేంతగా దప్పి గొన్న
నా దాహం తీర్చి బతికించిన మహత్తర శక్తి ఏమిటి?
రకరకాల బంధాలు బిగుసుకుంటున్న వేళ
పూల దండలు సాగి బిగిసి
ఆరదండాలుగా మారుతున్న వేళ
రకరకాల వధ్యశిలలు స్వేచ్ఛగా
మనల్ని ఎంపిక చేసుకుంటున్న వేళ
ఏం చేసినా ఏముంది లెద్దూ అని
తడి లేని మట్టి ముద్దల్లో నిద్రపోదామనిపించే వేళ
నన్ను కాపాడుకోడానికి
నిన్ను కాపాడుకోడానికి
మనల్ని కాపాడుకోడానికి
ముందుగా కాపాడుకోవలసిందేదో ఉంది
రెండు పనుల మధ్య రెండు మాటల మధ్య
రెండు పదాల మధ్య రెండు చుక్కల మధ్య
పార్కింగ్ ఏరియాలోని కొద్ది ఖాళీ స్థలంలో
తొక్కుడు బిళ్ళ ఆడుతున్న బాల్యం
వల సందుల్లోంచి వయ్యారంగా నవ్వే మత్స్యకన్య
ఎవరో అన్నారు, చిత్ర హింసల బల్ల మీద
కాల్జేతులు కదలని స్థితిలో కూడా
కలను కావిలించుకోవచ్చునట
ఎవరో అన్నారు, కాల్చివేయబడ్డానికి ముందు
తుపాకి మొన మీద సీతాకోక చిలుకలమై
కలలను ముద్దాడవచ్చునట
రకరకాల ముట్టడుల మధ్య
శరీరాల్ని దుర్బేధ్య దుర్గాలు చేసుకోవచ్చునట
అనుకుంటాను గాని
వ్యర్థంగా గింజుకుంటాను గాని
కల నుంచి ఎప్పటికీ విడిపోలేను
కల నుంచి ఎక్కడికీ వెళ్ళిపోలేను
చివరాఖర్న పోతూ పోతూ
మనవరాలి తల మీద నీడగా
అంతో ఇంతో కలనే వదిలి వెళ్ళాలి
నన్ను కప్పి ఉన్నదో నన్ను కప్పుకుని ఉన్నదో
కల మాత్రమే నిజం నేను కేవలం ఒక మెటఫర్‌ని
కల మాత్రమే అర్థం నేను కేవలం ఒక పదాన్ని
కల మాత్రమే వార్త నేను కేవలం ఒక విలేఖరిని