స్మైల్ ఒఖడే… ఇహ లేడు!

స్మైల్
స్మైల్

జులై ’95 లో షికాగో తానా సభల సందర్భంలో యస్. వీ. రామారావు, నేనూ చిత్రకళా ప్రదర్శనానికి వచ్చిన బొమ్మల కోసం ఈజెల్స్‌ తయారుచేస్తున్నాం. అతిథిగా వచ్చిన బాపూ గారు కూడా మాతో కలిసి వడ్రంగం పని చేసిపెడుతూ, అన్నారు ‘మీ సభలకి స్మైల్‌ వస్తున్నాడటగా?’ అని. ఆశ్చర్యం వేసింది. ‘స్మైల్‌ వస్తున్నట్టు మాకు ఎవరూ చెప్పలేదే?’ అని ఊరుకున్నా.

అన్నట్టుగానే రెండువందల “ఖాళీ సీసాలు” మోసుకొని స్మైల్‌ షికాగో వచ్చాడు. ‘ముందుగా చెప్పద్దూ, వస్తున్నట్టు?’ అని కాస్త గదమాయించా.’మీ ఊరొస్తున్నా’ అని ముందుగా చెప్పడం స్మైల్‌ కి ఎప్పుడూ అలవాటు లేదు. చిన్నప్పుడు ఏలూరు లోనూ అంతే! ఎక్కడనించో తుఫానులా ఊడి పడేవాడు, చెప్పకండా చెయ్యకండా.

జులై ఒకటో తారీకున స్మైల్‌ని తానా సభకి పరిచయం చేసి “ఖాళీ సీసాలు” గురించి నాలుగు మాటలు చెప్పడం నా భాగ్యం. ఆ సభలో వేదాల శ్రీనివాసాచార్యులు గారు వేదపఠనం చేసి స్మైల్‌కి దుశ్శాలువాలు కప్పడం నాకు నవ్వొచ్చింది. ఎప్పుడూ అంటూ ఉండే వాడిని, “తమ్ముడూ! సాయిబ్బూ! నీకు ఒడుగు చేయించాలని ఉన్నదయ్యా” అని. ఇస్మాయిల్ (స్మైల్‌ కాకముందు మాకు అతను ఇస్మాయిల్ గానే తెలుసు.) మా తమ్ముడి క్లాస్ మేట్. అందుకని స్మైల్ నాకు సాయిబ్బు తమ్ముడు అయ్యాడు. అల్లా అనే హక్కు నాకొక్కడికే ఉండేది. అతని పూర్తి పేరు మహమ్మద్‌ ఇస్మాయిల్‌.

ఏలూరు కాలేజీలో చదువుకొనే రోజుల్లో వెల్చేరు నారాయణ రావు మేస్టారి ద్వారా స్మైల్ మాకు పరిచయం. అరవైల్లో నారాయణరావుగారు, సూర్యనారాయణరాజు, నేనూ, రాత్రుళ్ళు ఒంటిగంట దాటే దాకా ఓవర్ బ్రిడ్జ్ కోసం పోసిన ఇసక కొండల పైన కూచొని బాతాఖానీ చేసే రోజుల్లో ఇస్మాయిల్ మాతో కలిసి తిరిగేవాడు. మాతోపాటు పెద్దవంతెన దగ్గిర ఇరానీ “టీ”ర్థయాత్రకి వచ్చేవాడు.

పంథొమ్మిదివందల అరవై నాలుగు ఆఖరి రోజుల్లో ననుకుంటాను, తెల్లటి కాగితాల మీద ముత్యాల్లాంటి దస్తూరితో “వల” కథ పట్టుకొని వచ్చాడు. అప్పటి వరకూ ఇస్మాయిల్ కథలు చదువుతాడనే తెలుసు. కథల గురించి మాట్లాడతాడని తెలుసు. రాస్తాడని నాకు తెలీదు. రాతప్రతిలో ఉన్నప్పుడు ఆ కథ మేమందరం చదివాం. “అక్షరం మార్చకు! వెంటనే అచ్చుకి పంపించు” అన్నాం. భారతిలో ఆ కథ వచ్చిన తరవాత అదేదో నాకథ పడ్డట్టే గర్వంగా మురిసిపోయాను.

ఆ తరువాత “సముద్రం” కథ. “అదేమిటి? సముద్రం ముందు రావాలి. ఆ తరువాత వల రావాలి. నువ్వుత్త తిరకాసు వాడివి” అని వేళాకోళం చేసాను. ఆరు నెల్లు తిరక్కుండా, ఆ సముద్రాన్ని నవలికగా మార్చి పట్టుకొచ్చాడు. అప్పటికింకా తాను స్మైల్ అవతారం ఎత్తలేదు. చాలా ఏళ్ళ తరువాత, “నీ సముద్రాన్ని మరీ పల్చబడనీయకు. దాన్నీ కథ గానే ఉండనీ” అని నే నన్నానని తానే గుర్తుచేశాడు.

నేను ప్రతి ఏడూ ఇండియా వచ్చినప్పుడు చూడటానికి వచ్చేసేవాడు; రాజమండ్రీ నుంచో, హైదరాబాదు నుంచో. కనీసం ఒక రెండు రోజులు పాత స్నేహితాలు నెమరు వేసుకోవడం, పాత దోస్తుల్ని కలవడం ఆనవాయితీ. కొత్త కొత్త కవుల పుస్తకాలు పోగుచేసి ఉంచేవాడు, ఆప్యాయంగా నాకోసం. తరువాత గంటలకొద్దీ తెలుగు సాహిత్యం గురించీ తెలుగులో విమర్శల గురించీ వాదాలు, ప్రతివాదాలు.

తను చేసిన అనువాదాలు చదివి వినిపించేవాడు. చాలా మొహమాటస్తుడు స్మైల్. తన కవితల పుస్తకం, “ఒఖడే” సిగ్గుపడుతూ మరీ ఇచ్చాడు. ముందు డాలీ బొమ్మ. వెనక తన ఫొటో! స్మైల్ రాసింది కాస్తే. అయితేనేం, వాసి మాత్రం జాస్తి.

 అర్థ స్వప్నాలు, అర్థ సత్యాలు
చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు. 

చాలా మంది విషయంలో ఇది ఎంతో నిజం, కానీ, స్మైల్ విషయంలో ఇది పచ్చి అబద్ధం.

నిజమైన స్మైల్‌ని హెరన్‌టన్‌ కవితకి అనువాదంలో చూడండి.

” …ఈ మాట్లాడేది నేను
నేను జీవిస్తున్నాను,
ఇది నా గొంతు,
ఈ మాటలు నా మాటలు.
నా నోరు పలుకుతోది వీట్ని.
నేనొక కవిని.
నువ్వు వినేది
నీ గూబ మీద పేల్తున్న నా పిడికిల్ది.”

మహా మంచి స్నేహితుడు స్మైల్. మరెంతో మెత్తని హృదయం స్మైల్‌ది. వీటన్నింటికన్నా మహ గట్టిది అతని మాట.

అలాంటి స్మైల్ ఒఖడే! ఆ స్మైల్ ఇహ లేడు.