[సెప్టెంబరు 20, 2008 డెట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ దశమ వార్షిక సమావేశంలో ఇచ్చిన ఉపన్యాసపు వ్యాస రూపం. ఈ వ్యాసం లిటరరీ క్లబ్ వార్షిక సమావేశపు ప్రత్యేక సంపుటిలో ప్రచురింపబడుతుంది. ]
Every feeling is attached to an a priori object, and the presentation of the latter is the phenomenology of the former.
— Walter Benjamin in ‘The Origin of German Tragic Drama’.
తన కవిత్వం కష్ట భూయిష్టం అని మార్క్సిస్టులు ఆరోపిస్తే , విశ్వనాథ సత్యనారాయణగారు ఇచ్చిన సమాధానం:
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి. ఈనా-
ళుల వ్రాసిన కవి దోషము.
కలి గడచిన కొలది చిత్రగతులన్ చెలగన్.
పూర్వపు రోజుల్లో పద్యానికి అర్థం తెలియకపోతే, పాఠకుడిది దోషం! ఈ రోజుల్లో అది కవి దోషం. కలికాలం గడుస్తున్నకొద్దీ, చిత్రవిచిత్రంగా ఉంటోంది!
అంటే, కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.
ఆయనే గనక ఈ రోజుల్లో వస్తూన్న వచన కవిత్వం చవి చూసి ఉంటే, పాఠకుడిది దోషం అని అనేవాడు కాదు. కచ్చితంగా కవిదే దోషం, అని ఒప్పుకొని ఉండేవాడు.
నేను విమర్శకుడిని కాదు; కవిని అసలే కాదు. నేను ఒక సాధారణ పాఠకుణ్ణి.
ఈ మధ్య కాలంలో వస్తున్న కవితలు, కవితా సంకలనాలు చూస్తుంటే, ఎవరైనా ఒక కంప్యూటర్ మేథావి “కవిత్వానికి వెలకట్టే” కలన యంత్రం -కంప్యూటర్ ప్రొగ్రాము – ఒకటి ఎంత త్వరగా తయారు చేస్తే అంత బాగుంటుందనిపిస్తుంది. ఈ యంత్రం లోకి కవితని పంపిస్తే, కొద్ది క్షణాల్లో అది కవితకి మార్కులు వేసి వెలకట్టి “పాసో” “ఫేలో” చెప్పుతుందన్న మాట! అందుకు కొన్ని ప్రామాణికాలు – విజ్ఞులు వాదించి, విమర్శించి, పరామర్శించి సరే అని ఒప్పుకున్న ప్రామాణికాలు: భాష , మాటల పొందిక, విషయం, అలంకారాలు, గతి ఛందస్సు, సంగీతం, ఉపమానాలు, ఇంకా కావాలంటే కించిత్ పాలు సామాజిక దృక్పథం, మరి కొంచెం సమకాలీనత, సమానత, అసమానత, నవ్యత, భవ్యత, వగైరాలు – ఏవి ఎంత మోతాదులో ఉంటే, నూటికి నూరు మార్కులు ఆ కవితకి వస్తాయో ముందుగానే నిర్థారించుకోవాలి. అప్పుడు, ఈ యంత్రంలోకి ఒక కవితని ఇన్‌పుట్ చేస్తే , అది మనం పంపిన కవితని కొలిచి, చీల్చి చెండాడి, బేరీజు వేసి, రేట్ చేసి పెడుతుంది, అవుట్‌పుట్ గా. అప్పుడు, ఒక సమీక్షకుడు వ్రాసిందో , మరో విమర్శకుడు చెప్పిందో నమ్మక్కరలేదు; వాళ్ళ పాక్షికతకి మనం అమ్ముడు పోనక్కరలేదు.
అటువంటి ప్రక్రియలు, సాధనాలూ ద్రాక్షా సారాయి(wine) పరంగా ఉన్నాయి. Ann Noble అనే రసాయన శాస్త్రవేత్త 1984 లో ప్రయోగాత్మకంగా తయారు చేసిన Wine Aroma Wheel, ఇందుకు నిదర్శనం. నా బోటి సాధారణ వ్యక్తులు, ఎవరో సొమెల్యే (Sommelier) చెప్పినది నమ్మక్కర లేదు! ద్రాక్షసారాయపరిమళం (Wine Aroma), వాసన, రుచుల భేదాల కోసం తయారైన అనంతకోటి పదజాలం తెలియక తబ్బిబ్బు పడనక్కరలేదు! నిజంగా వాళ్ళు వాడే పదజాలం చూస్తే పిచ్చెక్కి పోతుంది. ఉదాహరణకి, మంచి వైన్ అమ్మే షాపుల్లో, మీరు చూసే వుంటారు, వైన్ కవిత్వం: “Gorgeous notes of chocolaty creme de cassis, somewhat spicy, high quality toasty oak, a rich, plush, savory, expansive mid-palate, and a long heady finish with elevated glycerin and plenty of sweet tannin and fruit”. ఈ రోజుల్లో కవితా సంకలనాలకి వచ్చే పరిచయ వాక్యాలు ఇంతకన్నా మధురాతిమధురంగా వ్రాయబడి, పాఠకుడిని మభ్యపెట్టి తబ్బుబ్బు చేస్తాయి.
నోబుల్, ఆవిడ అనూయాయులూ, “వైనికు” లందరికీ వాడుకలో ఉన్న 12 లక్షణాలు, 94 వర్ణన పరిభాషా పదాలు పోగుచేసి వాటి మేలు కలయిక తో వైన్ అరోమా చక్రం తయారు చేశారు, – ప్రతిఒక్కరూ తేలికగా వాడుకొని వైన్‌లకి ఆబ్జెక్టివ్‌గా విలువకట్టడానికి ఈ చక్రం ఉపయోగపడుతుంది. నోబుల్ తయారు చేసిన ఈ పరిమళచక్రం Do-It-Youself పుస్తకం లాంటిది. అట్లాగే మరొక పద్ధతి కూడా ప్రచారంలో ఉన్నది. సారాయానికి పరిమళం, రుచి మొదలైన కొన్ని లక్షణాల ఆధారంగా, 80 నుంచి 99 మధ్యలో మార్కులు వేసి, సారాయాన్ని రేట్ చెయ్యడం. (చూ: Wines: Their Sensory Evaluation, Maynard Amerine and Edward Roessler, 1976) ఇంత శాస్త్రీ యంగా కాకపోయినా, సుమారు ఇలాంటి పద్ధతే సెంట్లు, సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూములకి కూడా ఉన్నది. (చూ: Perfumes: The Guide, Luca Turin and Tania Sanchez, Viking 2008. ఈ పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది.) వైనికులు, పెర్ఫ్యూమెర్లూ రెండు రకాల గొంతుకలతో వాళ్ళ ప్రచార సాహిత్యం రాస్తారు. మొదటిది: వస్తుపర వ్యాఖ్యానం. అంటే వైనులోను, పెర్ఫ్యూములోనూ ఉన్న ముడిసరుకులని సాంకేతిక భాషలో రసాయన శాస్త్ర పదజాలం గుప్పించి వర్ణించడం. రెండవది: ఆకర్షక ప్రతిమలతో (attractive imagery) నిండిన భాషతో వర్ణించడం. సాధారణ వ్యక్తులకి ఈ రెండు రకాల వర్ణనలూ ఒక పట్లాన అర్థం కావు. సరిగ్గా, ఈ రెండు పద్ధతులూ నేటికాలపు కవిత్వంపై వస్తున్న సమీక్షలు విమర్శలలో మోతాదుకి మించి ఉంటున్నాయి!
అందుకనే, ఇప్పుడు వస్తూన్న ఆథునిక కవిత్వానికి నోబుల్ తయారు చేసిన వైన్ అరోమా చక్రం లాంటి సాధనం అత్యవసరం. అదే గనక వస్తే అప్పుడు, ఈ కవిత ఎందుకు చదవక్కరలేదు, ఎందుకు ఫలానా కవిత మంచి కవిత, లేకపోతే ఫలానా కవిత ఎంత చచ్చు కవిత, అని నాబోటివాడు తేలిగ్గా తెలుసుకోవచ్చు. చదవడం, చదవకపోవడం నిర్ణయించుకోవచ్చు. ఫలానా వైన్ కొందామా, రుచి చూద్దామా వద్దా అని నిర్ణయించుకోటానికి, ఆ వైన్ కి వచ్చిన మార్కులు చూసి నిర్ణయించుకున్నట్టు!
ఇలాంటి సలహాలకి చిర్రెత్తి, కవిబ్రహ్మలు మూక ఉమ్మడిగా ఒక మాట అనచ్చు. “మేము, నువ్వు, అంటే సాధారణ పాఠకుడు, చదవడం కోసం కవిత్వం సృష్టించడం లేదు. మా ఆనందం కోసం వ్రాసుకుంటున్నాం. నువ్వు చదివితే ఎంత? చదవకపోతే ఎంత?” అని. ఇది వట్టి భేషజం!
అసలు విషయం: కవికి పాఠకుడు కావాలి; అందులోనూ ‘సహృదయుడ’యిన పాఠకుడు కావాలి. భావకుడైన విమర్శకుడు కావాలి. భేషజానికి కవులెన్ని మాటలన్నా నాబోటి పాఠకుడు కవులకు కావాలి. పీరియడ్. సహృదయుడు అన్నా కదూ! అంటే, నా ఉద్దేశంలో, కవి వ్రాసినప్పుడు ఏ అనుభూతిని పొందాడో, పాఠకుడు కూడా అదే అనుభూతిని పొందడం సహృదయత అని నా భావం.
సరే! ఇప్పుడు అసలు విషయానికొద్దాం.
వైన్‌లకి, పెర్ఫ్యూములకీ వెలకట్టే పరిభాష ఉన్నది; అందుకని అది సాధ్యం అయ్యింది, మరి కవిత్వానికి అటువంటివి ఉన్నాయా అని సందేహం వెలిబుచ్చవచ్చు. కవిత్వానికి వెల కట్టే, లక్షణాలు, వర్ణనల పరిభాష మనకి లేక కాదు. కావలసినదానికన్నా ఎక్కువే ఉంది! సంస్కృతంలో దరిదాపు 870 పైచిలుకు లక్షణ గ్రంధాలున్నాయట! అందులో కొన్ని పుస్తకాలకి, ఒక్కొక్క దానికీ పాతిక పైచిలుకు వ్యాఖ్యానాలు! గ్రాంథిక ఆంధ్రంలో ఉన్న శాస్త్ర గ్రంధాలు 27 పైచిలుకు అని చెప్తారు! అందుకనే, వీటిలో లక్షణాలన్నీ క్రోడికరించి, జల్లించి, సారం – అంశం పట్టుకొని, ద్రాక్షసారాయానికి తయారు చేసినట్టుగా ఒక చక్రం తయారు చేస్తే అప్పుడు, సాధారణ పాఠకుడైనా సరే, చెయ్యి తిరిగిన సంపాదకుడైనా సరే, ఏ కవినీ, కవితనీ ఒక ప్రత్యేక చట్రంలో, అంటే – స్త్రీ, దళిత, ముస్లిం, మైనారిటీ, మెజారిటీ , విప్లవ, అవిప్లవ, అభ్యుదయ, నియో, నయా, ఉత్తర-ఆథునిక, తెలంగాణా, ఇలా – సవాలక్ష వాదాల బందిఖానాల్లో బంధించనక్కరలేకండా, సాధ్యమైనంత ఆబ్జెక్టివ్‌గా విలువ కట్టచ్చు; ఆ విలువని బట్టి సంపాదకుడు సదరు కవితని, తన పత్రికలో అచ్చెయ్య వచ్చు, లేదా మానచ్చు. అలాగే, పాఠకుడు చదవచ్చు; ఫెయిల్ మార్కులొస్తే చదవడం మానెయ్యచ్చు. ఎందుకు ఫెయిల్ మార్కులొచ్చాయో కనుక్కునేందుకు నాలాంటి ప్రబుద్ధులు కొంతమంది చదవచ్చు కూడాను! ఇలాంటి పరికరం మూలంగా, పాఠకులు పెరుగుతారే తప్ప తగ్గరు! అదేగా, అందరికీ కావలసింది?
ఈ పని సులభం కాకపోవచ్చు; కానీ, అసాధ్యం కాదు, అసంభవం అంతకన్నాకాదు. ఇటువంటి సాధనం లేకపోబట్టే, ఎవరో ఎక్కడో చెప్పిన కాసిని పడికట్టు మాటలు భట్టీ పట్టి అవే వల్లించి వల్లించి, మన కవితలకు వెల కట్టడం ఒక వేలంవెర్రిగా పరిణమించింది.
కవికి కవిత్వం వ్రాయడానికి ఏదో ఉద్వేగం, ఉద్రేకం ప్రేరణ అని చెప్పారు. విమర్శకూ ప్రేరణ ఉన్నదనే అన్నారు. ప్రస్తుతం వీరి ప్రేరణ సామాజిక విలువలు, సంఘ శ్రేయస్సు, నిబద్ధత వగైరా! ఇవన్నీ పడికట్టు పదాలే! వీటి అర్థం ఏమిటయ్యా అని నిలదీసి అడిగితే, ఎవడికి తోచిన అర్థం వాడు చెప్తాడు. అందుకని, ప్రస్తుతానికి వీటిని వదిలిపెట్టండి. సాధారణ పాఠకుడికి, ఈ కవిత్వం చదవడానికి ప్రేరణ ఏమిటి? ప్రస్తుతానికి, సాధారణ పాఠకుడు ఉబుసుపోక, తన తృప్తి కోసం ఈ కవిత్వం చదువుదామనుకోవడమే ప్రేరణ అనుకుందాం. అలా చదివిన తరువాత, తన జ్ఞాపకాలని తన సహజజ్ఞానం( Intuition) తో మేళవించి, కవిత్వాస్వాదన అనే “కళ” కి తనకి సాధ్యమయినంతలో ఒక “సిద్ధాంతం” తయారు చేసుకోవడం, ఇక్కడి ముఖ్యవిషయం. మరోరకంగా చెప్పాలంటే, ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.
అంటే, కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు/సాధనాలు తిరిగిగుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories- పాత జ్ఞాపకాలు అని చెప్పుకుందాం. ఈ జ్ఞాపకాలు, నాబోటి సాధారణ పాఠకుడికే కాదు, చదువుకున్న అంటే విద్యాధికుడైన పాఠకుడికి గూడా కవిత్వాన్ని అనుభవించడానికి, ఆనందించడానికీ ఉపయోగపడే పరికరాలు అని నా గట్టి నమ్మకం. ఒక పెర్ఫ్యూమ్ యొక్క పాత పరిమళం ఆ పెర్ఫ్యూమ్ మరొకసారి కొని అనుభవించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. (నిజం చెప్పాలంటే, నోటితో చవి చూసే రుచిని, ముక్కుతో అనుభవించే వాసననీ వేరు చెయ్యడం తప్పు. వాసనకి, రుచికీ అవినాభావ సంబంధం ఉన్నది. రుచి లేని వాసన ఉండవచ్చేమో కాని, వాసన లేకండా రుచి ఉండదు.) ఒక వ్యక్తి జ్ఞాపకంలో ఉన్న పాత రుచి, ఒక వైన్ కొని అనుభవించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. అట్లాగే జ్ఞాపకాలు కవిత్వాస్వాదనకి కూడా సాధనాలు!
కవిత్వంలో ఈ తిరిగొచ్చే జ్ఞాపకాలు అనేవి స్వయంగా కేవలం నీ అనుభవంలో, వాసనలు, రుచులనుంచే వచ్చినవే కానక్కరలేదు. ఎప్పుడో వేరొకరు, బహుశా మీ తొలి తెలుగు మేష్టారు చెప్పినవో, ఎక్కడో ఎప్పుడో విన్నవో, చదివినవో, కావచ్చు. ద్రాక్ష సారాయం విషయంలో కూడా అంతే! మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక సారాయ పరిమళాన్ని ఆఘ్రాణించి, ఆ తరువాత చప్ప రించి రుచి చూసి నప్పుడు, ఒక కొత్త అనుభవం కలగచ్చు. ఎవరో మహానుభావుడు, అనుభవజ్ఞుడు, ఈ అనుభవాన్ని మాటలలో పెట్టవచ్చు. అవి సరికొత్త మాటలు. ఇంతకుముందు నీ భాషా పరిధిలో లేని మాటలు. అప్పటినుంచి, ఆ పరిభాష నీకు కూడా అబ్బుతుంది.
ఇలా అనుభవపరిధి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది. నిన్ను స్నాబ్ అనో, రియాక్షనరీ అనో తిరోగమనవాది అనో లేబెల్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు!