పరిచయము
ఆంధ్ర కవితోద్యానము ఎల్ల వేళలా నందనవనమే. అందులో ఎన్నో కవితాపుష్పాలు పూచాయి, పూయుచున్నాయి. అవి అంతులేని అందాలను చిందిస్తున్నాయి. ఆనందమయమైన ఆ నందనవనములో ఎన్నో పక్షులు గానం చేస్తుంటాయి. వాటిలో మొదటి పుంస్కోకిల నన్నయభట్టు. నన్నయకు ముందు తెలుగు కవులు ఉండి ఉండవచ్చు కానీ మనకు దొరకిన తెలుగు గ్రంథాలలో వీరి ఆంధ్ర మహాభారతమే మొట్టమొదటిది. అందుకే వీరు ఆదికవి అని సార్థకనామమధేయులు. అందమైన పదాలతో సంగీతము చిమ్మే నవరసముల బుగ్గ వీరి కవిత. సంస్కృత పదాలనే పాలతో తెలుగు పదాలనే తేనియను కలిపిన మధురసంలో భావఫలఖండికలను చేర్చి ఒక కవితాఫలమిశ్రణాన్నే (poetic fruit salad) తయారు చేశారు నన్నయగారు.
నన్నయ చివరి పద్యాలు
ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము వీరు రాసిన చివరి పద్యాలలోని అందాలను వివరించడమే. ఆంగ్లంలో మనం ఒక కళాకారుని చివరి కృతులను హంసగీతిక లంటాము. ఆ అర్థంలో నన్నయగారి చివరి పద్యాలకు హంసగీతికలని పేరు పెట్టాను. ఒక పద్యంలో హంస ప్రసక్తి కూడా వస్తుందన్న విషయం తరువాత గమనించగలరు. ఈ హంసగీతికలలో ఈ కవిరాజహంస విహారాన్ని చూడగలము, సంతోషంతో ఆలపించిన పద్యగీతీకలను వినగలము. ఆ అందచందాల అనుభూతిని మనసారా ఆనందించగలము. ఎనిమిది పద్యాలలో ఎనిమిది దిక్కులను చూడగలము, ఎనిమిది ఐశ్వర్యాలను పొందగలము, ఎనిమిది సిద్ధులను సాధించగలము. ఒక చిన్న వచనాన్ని మినహాయిస్తే నాలుగు కంద పద్యాలు, రెండు ఉత్పలమాలలు, రెండు చంపకమాలలు నన్నయగారి హంసగీతికలు.
కథాసందర్భము
ఒక కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు భీముని బంధించాడు. భీముని వెదుక్కొంటూ ధర్మరాజు అక్కడికి వచ్చి నహుషుని ప్రశ్నలకు జవాబులిచ్చి భీముని విడిపించుకొని వచ్చాడు. అన్నదమ్ముల తాపం వేసవి ఎండలా ఉండింది. అప్పుడే గ్రీష్మ ఋతువు అంతమై వర్షర్తువు ఆరంభమయింది. భారతదేశంలో గ్రీష్మఋతువులోని ఎండల తాపం అందరికీ తెలిసిందే. దానిని వర్ణించడం సులభం, కానీ అనుభవించడం కష్టం. ఎండలకు భరతవాక్యాన్ని పలికే శక్తి వర్షర్తువుకు మాత్రమే ఉంది. ఆ నీరామని వర్ణన, పిదప వచ్చే శరదృతువు వర్ణనలే ఈ ఎనిమిది పద్యాలు. ఈ వర్ణనలలో మొదటి మూడు కంద పద్యాలు –
మొదటి మూడు పద్యాలు –
ఖర కిరణ తాపమున నురు-
తర దవ దాహమున శోషితములైన వనాం-
తర తరుతతి కాప్యాయన-
కరమై వర్షాగమంబు గడు బెడఁ గయ్యెన్
నాలుఁగు కెలఁకుల నవఘన
జాలంబులు వ్రేలి కురిసె ఝంఝానిల వే-
గాలోలములై బహుల
స్థూల పయోధార లోలిఁ దుములంబులుగాన్
ఘనతర నైశతమంబొకొ
యనఁగ ఘనాగమ తమిస్ర మవిరలమై క-
ప్పిన జనులకు వస్తు విభా-
వన మొక్కొక్క యెడలఁ గలిగె వైద్యుత రుచులన్
ఇది అరణ్యపర్వము కాబట్టి అడవిలోని దృశ్యాలు ఇందులో వర్ణితాలు. వేసవికాలంలో ఎండ ఎక్కువయ్యేకొలది మనకు దప్పిక కూడా ఎక్కువవుతుంది. అప్పుడప్పుడు నీళ్ళు తాగకపోతే శోష కూడా వస్తుంది. ఇది మనవంటి మానవజీవులకు మాత్రమే కాదు, సూర్యుని వాడియైన కిరణాల వేడిమివల్ల చెట్లు చేమలు కూడా మూర్ఛిల్లినట్లున్నాయి అన్నారు నన్నయగారు. దప్పిక ఎక్కువయితే కావలసిందేమి? మంచి నీళ్ళు. అది అన్నిటికంటె ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే విధంగా వనాంతర తరుతతి తృష్ణకు ఈ తొలకరి చినుకులు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఒక చిన్న కంద పద్యంలో వేసవికాలపు యిడుములను ఎంతో అందంగా చిత్రించారు నన్నయగారు.
రెండవ పద్యములో వానాకాలంలోని ప్రకృతికి నన్నయగారు ఒక ఛాయాచిత్రం తీశారు అంటే అతిశయోక్తి కాదు. ఎటు జూచినా నల్లని మబ్బులు నాలుగు వైపులా దట్టంగా ఆవరించింది ఆకాశంలో. ఇక వర్షం కురవడానికి ముందు గాలి వేగంగా వీస్తుంది, తరువాతేమో కుండపోత. ఈ గాలివల్ల వాన దార ఇటూ అటూ ఊగుతూ ఉంది. అదొక దొమ్మి యుద్ధంలా ఉందట.
దట్టంగా అలముకొన్న మేఘాలు కుండపోతగా వర్షాన్ని కురిపిస్తుంటే ఆ సమయంలో వెలుగు తగ్గి చీకటి నిండింది. ఎదురుగా ఉండే ఏ వస్తువూ కనబడడం లేదు. అన్ని మేఘాలున్నప్పుడు మెరుపుతీగలకు తక్కువా? అలా ఆకాశంలో విద్యుల్లతలు నాట్యమాడుతుంటే ఆ వెలుతురులో ఎదురుగా ఉండే వస్తువులను చూడడానికి వీలవుతుంది. మనము నిత్యం చూస్తుండే విషయాలే ఇవి, కానీ ఈ పద్యాన్ని చదువుతుంటే మనము కూడా వానలో తడుస్తూ ఎక్కడున్నామో తెలియక గుడ్డివాళ్ళలా తిరుగుతుంటే ఉన్నట్లుండి ఆకాశం మెరిసిపోగా ఎక్కడ ఏముందో అనే విషయం మన కళ్ళకు అగపడుతుంది. ఇట్టి అనుభవాన్ని ఈ పద్యం మనకు అందజేస్తుంది.
సంస్కృత భారతములో వర్షర్తువు వర్ణన
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నన్నయ మాత్రమే కాదు, ఎందరో కవులు తమ కావ్యాలలో, నాటకాలలో ఋతువర్ణనను చేశారు. అయితే, నన్నయగారు ఋతువర్ణనలను కథలో ఒక భాగంగా చేశారు. పాండురాజు మరణానికి ముందు వసంత ఋతువును గురించి రెండు లయగ్రాహి వృత్తాలలో వర్ణించారు. అది వసంతఋతు వర్ణనగా మాత్రమే నిలిచిపోక తరువాతి కథలో ఒక సంఘటన అయింది. అదే నన్నయగారి ప్రత్యేకత. సంస్కృత భారతములో కూడా ఋతువర్ణనలు ఉన్నాయి. ఉదాహరణకు –
పాతయన్నివ వృక్షాంస్ తాన్
సుమహాన్ వాతసంభ్రమః
మేఘసంకుల మాకాశం
విద్యున్మండలమండితం
పైన ఉదహరించిన నన్నయ పద్యాలలోలాగే ఈ శ్లోకం కూడా, ఎలా పెనుగాలి వేగానికి తట్టుకోలేక చెట్లు నేల కూలాయో, ఆకాశం ఎలా మేఘాలతో నిండియుండిందో, చుట్టూ ఎక్కడ చూచినా విద్యుల్లతలు మెరుస్తున్నాయో అనే భావాలు ఇందులో ఉన్నాయి.
నాలుగవ పద్యము –
అరుదగు తత్పయోద సమయంబున నొక్కట విస్తరిల్లె నం-
బరమున నంబుద ధ్వనియుఁ బల్వల భూముల భూరి దర్దురో-
త్కర రవముల్ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం-
తర మద మంజుల స్వన ముదారతరంబగుచున్ వనంబునన్
మొదట భూమి ఎలా ఎండలో మాడిపోయిందని, తరువాత మేఘాలు ఎలా వ్యాపించి పెద్దగా వాన కురిసిందని, తరువాత ఎలా చీకటి అలముకొన్నదని నన్నయ వివరించారు. ఇప్పుడేమో వాన వచ్చిన తరువాత ప్రకృతిలో జరిగిన మార్పులను గురించి చెబుతారు. మెరుపులు మొదట, ఉరుములు తరువాత. కాంతివేగముకన్న ధ్వని వేగం తక్కువని నన్నయకు కూడా తెలుసు. నింగిలో ఉరుముల సడులు ప్రతిధ్వనించాయి. పల్లపు భూమి నీళ్ళతో నిండింది. నీళ్ళుంటే కప్పలకు తక్కువా? ఆ పల్లపు గుంటలు కప్పల బెకబెకలతో మ్రోగిపోతున్నాయి.
నా స్మృతిపథంలో ఈ కప్పల బెకబెకలను ఇంకా వింటూనే ఉన్నాను. ఒక కప్ప మొదట కూయడానికి ఆరంభిస్తుంది, తరువాత మరొకటి దానితో గొంతు కలుపుతుంది. పిదప మరి కొన్ని. కొంత సేపటికి అన్ని మండూకాలు ఉపనిషద్గానామృతాన్ని అందజేస్తుంది. ఒక కొన్ని నిముసాల పిదప మళ్ళీ నీరవత. తరువాత మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ సంగీతపు కచేరీ! కప్పలను గురించి కాళిదాస మహాకవి కూడా ఋతుసంహారములో ఇలా చెప్పారు –
విపాండురం కీటరజస్తృణాన్వితం
భుజంగవద్ వక్రగతిప్రసర్పితం
ససాధ్వసైర్భేకకులైర్నిరీక్షితం
ప్రయాతి నిమ్నాభిముఖం నవోదకం –
– కాలిదాస, ఋతుసంహారం, 2.13
వాన నీళ్ళు నిర్మలంగా ఉన్నా, నదిని చేరే సమయానికి కీటకాలతో, బురదతో దాని రంగు మారి పారుతూ ఉంది. నదిలోని కప్పలు వాన నీటికోసం బయటికి వచ్చి నదిని చూచి కొండచిలువలా నది ప్రవహిస్తుందా లేక నదిలా కొండచిలువలా వక్రంగా నడుస్తుందా అని తికమక పడ్డాయి.
వర్షం వస్తే హర్షంతో నెమళ్ళు పురి విప్పి నాట్యం చేస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది కావ్యాలనుండి సినిమా పాటలదాకా ప్రసిద్ధమే. చెట్ల కొనలలో నెమళ్ళు నాట్యమాడుతున్నాయి, అలా నృత్యం చేసేటప్పుడు సంతోషంగా కేకలు వేశాయి. వర్షాకాలంలో వనదేవత నిమిష నిమిషానికి మార్చుకొన్న రంగులను, చేర్చుకొన్న హొంగులను తెలిపే పద్యం నన్నయది. ఈ చంపకమాలలోని సమయంబున, అంబరమున, అంబుదధ్వనియు, భూముల, భూరి, శిఖండ, శిఖండి, తాండవ లాటి శబ్దాలంకారాలు కూడ విన సొంపైనవే.
ఐదవ పద్యము –
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్
నాకు నచ్చిన నన్నయగారి పద్యాలలో ఇది ఒకటి. దీనిని చదువుతుంటే ఒక సంగీతపు వెల్లువ ప్రవహించేటట్లు తోస్తుంది. ఇక అర్థమో, ఇది ఎంత సహజంగా వాస్తవంగా ఉందో! నన్నయగారు ప్రకృతిని చక్కగా పరిశీలిచడం నేర్చుకొన్నారు కాబోలు. రవి గాంచనిచో కవి గాంచును గదా! వాన కురిసిన కొన్ని దినాలకు ప్రకృతి పచ్చని చీరతో సింగారించుకొంటుంది. కొత్త మొలకలు నేలను చీల్చుకొంటూ బయలుదేరుతాయి. కొత్త పూలు పరిమళిస్తాయి. సువాసన గాలిలో తేలియాడుతుంది. తరువాత కడిమిచెట్లలో పూలు గుత్తులు గుత్తులుగా విరబూసినాయి. ఇక దక్షిణ దేశస్థుడైన నన్నయకు మొగలి పూలు పరిచితమైనవే. ఆ మొగలిపూల పుప్పొడి గాలితో చేరింది. అట్టి సువాసనలతో కూడిన గాలి పూలగుత్తులనే ఉయ్యాలను ఊచుచుండినదట. ఆ ఉయ్యాలలో నల్లని ఆడు తుమ్మెదలు ఊగుతున్నాయట. అలా సంతోషంగా ఊగేటప్పుడు మృదువైన స్వరాలతో నిండిన పాటలు వినిపిస్తున్నాయట. ఇది మనకు సినిమాలో చెట్టు కొమ్మకు తాడుతో కట్టిన ఉయ్యాలలో పాడుతున్న ఒక అందమైన అమ్మాయిని కూర్చోబెట్టి ఊగించే అబ్బాయిని గుర్తుకు తెస్తుంది! అర్థపరంగా ఎంత అందమైన పద్యం. ఇందులోని అనుప్రాసలు ఎంత కర్ణానందముగా ఉన్నాయో? పాదాలలోని ళ-కారము (దళిత, కందళ, మిళిత, అళినీ), క-కారము (కందళ కదంబ కదంబక కేతకీ), ల-కారము (గుత్తులు, ఉయ్యెలలు, ఉల్లల, కులంబు, మృదుల) ఎంత అక్షర సుగంధ బంధురాలో? ఇలాటి చంపకమాలలను వ్రాయాలని ఎందరు నక్కకవులు నన్నయపులిని చూచి వాతలు పెట్టుకొన్నారో!
ఆరవ పద్యము –
సురచాపచిత్ర గగన-
స్ఫురణం బురుణించునట్లు భూవనిత నిరం-
తర చిత్రితయై యొప్పెను
సురుచిర నవతృణ శిలీంధ్ర సురగోపములన్
వాన ఆగిన తరువాత ఆకాశంలో కనబడేదేమి – ఇంధ్రధనుస్సు! ఆకాశంలో కనిపించే హరివిల్లు ఎక్కువ కాలము ఉండదు. కాని అలాటి రంగులతోనే చిత్రించబడి ఉన్నది భూమి కూడా. ఆ రంగుల చిత్రం ఇంధ్రధనుస్సులా క్షణికం కాదు, అది కొద్ది కాలం ఉంటుంది, చక్షువులను అలరింప జేస్తుంది. కొత్త కొత్త గడ్డి దినుసులు, కుక్కగొడుగులు, పూలు, ఇంకా ఎన్నో మొక్కలు – వీటి రంగులు సురచాపపు రంగులతో పోటీ పడుతున్నాయి. గగనాంగణమంతా పలు రంగుల సింగారం, ఆ రంగుల సింగారాన్ని చూచి పొంగిపోయిన భూసతి తాను కూడా అలాగే సప్తవర్ణాల వస్త్రముతో ఆచ్ఛాదితము చేసికొన్నదనే భావం జనిస్తుంది మనకు ఈ పద్యం చదివిన తరువాత.
ఏడవ పద్యము –
చివరి రెండు పద్యాలలో నన్నయగారు చూపించిన కవితాకౌశాలము అపారము, అద్వితీయము. వర్షాకాలం అంతమయింది. శరదృతువు ఆరంభమయింది. దట్టమైన నల్లని మేఘాలు మాయమయ్యాయి. ఆకాశం నిర్మలంగా మారింది.
భూసతికిం దివంబునకుఁ బొల్పెసగంగ శరత్సమాగమం
బాసకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షిమండలో-
పాసిత రాజహంసగతి భాసి ప్రసన్న సరస్వతీక మ-
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై
ఈ పద్యము అతి సుందరమయినది. గొప్ప కవులకు – కాళిదాసు కానీయండి, నన్నయభట్టు కానీయండి – ఆడంబరాలు పట్టవు. సమయోచితంగా శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను వాడుతారు. అంతే కానీ రసహీనంగా వాడరు. ఈ పద్యములో శరత్సమాగమము భూమికి, గగనానికి ఎలా వచ్చింది అన్నది వర్ణించబడినది. ఇందులో అలంకారము శ్లేష. పదాలు భూమికి వర్తిస్తాయి, ఆకాశానికి కూడా వర్తిస్తాయి. అదే ఇందులోని గొప్పదనం. సకలలోకానికి సంతోషదాయకంగా ఉండింది శరదృతువు రాక. భూమి మహర్షులు ఆరాధించే పరమహంసలా నిర్మలంగా ఉంది. నదులు, కాసారాలు విరబూసిన పద్మాలతో శోభాయమానంగా ఉన్నాయి. మొత్తంపైన భూదేవి స్వచ్ఛత తెల్లటి హంసతో పోల్చవచ్చును. ఇదే పద్యము ఆకాశపరంగా కూడా అర్థవంతమైనదే. అక్కడ ఉండే మహర్షి మండలం సప్తర్షిమండలం. దీనినే మనము ఆంగ్లములో big dipper లేక ursa major అంటాము. ఆ కాలంలో మరొక భావన ఉండేది. హంసలు శరత్తులో ఉత్తరంలో ఉండే మానససరోవరంనుండి మళ్ళీ దేశానికి తిరిగి వస్తాయి. బహుశా ఇది శీతాకాలానికి ముందు జరిగే పక్షుల వలస కాబోలు. ఏది ఏమైనా సప్తర్షిమండలం రాజహంసలతో ప్రకాశిస్తుంది. ప్రసన్న సరస్వతీ నక్షత్రంతో, బ్రహ్మ నక్షత్రంతో వెలుగుతూ ఉంది రాత్రి పూట ఆకాశం. ఆ నక్షత్రాల నడక హంస నడకలా ఉందట. ఇక్కడ ఇంకొక విషయం చర్చించాలి – ఈ సరస్వతీ నక్షత్రం ఏదని. తులారాశిలో స్వాతి నక్షత్రం మిక్కిలి కాంతివంతమైనది. స్వాతి అనేది శ్వేత (అంటే తెలుపు) పదమునుండి పుట్టినది. ఇదే సరస్వతీ నక్షత్రం. యా కుందేందుతుషారహారధవళాం వంటి పద్యాలలో సరస్వతి ఎప్పుడూ తెల్లని ఉడుపులను ధరిస్తుంది కదా! ఇది bootes అనే నక్షత్రమండలములో ఉంటుంది. మరి కొందరు సరస్వతీ నక్షత్రము cygnus (హంసమండలం) నక్షత్రరాశిలోని దంటారు. భారతీయ యవన ఖగోళ శాస్త్రజ్ఞుల మధ్య చాలా కాలంనుండి సంబంధాలు, సంభాషణలు, రాకపోకలు ఉండి ఉంటాయి. బ్రహ్మ నక్షత్రం అభిజిత్ నక్షత్రమని భావన. ఇది lyra (స్వరమండలం లేక వీణామండలం) రాశిలో మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రం. భూమినుండి చూస్తే ఈ హంసమండలము, స్వరమండలము పక్కపక్కన ఉన్నట్లు తోస్తాయి. అంటే సరస్వతి, బ్రహ్మ దంపతులు సమీపంలో ఉన్నారన్న మాట. భూమిపైన, ఆకాశంలో శరదృతువును వర్ణించడానికి నన్నయ రెండు పద్యాలు వ్రాయలేదు. ఒకే పద్యంలో రెంటికీ అన్వయాన్ని కలిగించారు. అదే ఈ ఉత్తమకవి చాతుర్యం! ఇది buy one get one free లాటిది. అయితే మనకు ఏది ఉచితంగా దొరికింది – భూమియా లేక ఆకాశమా?
నింగికి నేలకు సంగమం
నింగికి నేలకు ఉండే ద్వైతాద్వైత స్వభావం నాటినుండి నేటివరకు భారతీయ సాంస్కృతిక మేధస్సులో నిలిచి ఉన్నది. వేదాలలో ఇది పదేపదే చిత్రించబడినది. వేదకాలంలో దీనిని ద్యావా-పృథ్వీ అనేవారు. ఋగ్వేదంనుండి ఉదాహరణ నొకటిని కింద ఇస్తున్నాను –
తే నో గృణానే మహినీ మహి శ్రవః
క్షత్రం ద్యావా-పృథివీ ధాసథో బృహత్
యేనాభి కృష్టీస్తతనామ విశ్వహా
పనాయ్యమోజో అస్మే సమిన్వతం
– ఋగ్వేదము, ద్యావా-పృథ్వీ
ఓ భూమీ, ఓ ఆకాశమా, మిమ్ములను మేము ఎన్నో విధాలుగా స్తుతించాము. మాకు కీర్తిని, భూసంపదను ప్రసాదించండి. మాకు బలాన్ని, శౌర్యాన్ని ఇవ్వండి, దానితో మేము ప్రజలను మా అధీనంలో ఉంచుకొన వీలవుతుంది.
నన్నయ భారతానికి, పంపకవి రాసిన కన్నడ భారతనికి ఎన్నో పోలికలు ఉన్నాయి. కాని ఒక మాట మాత్రం మరువరాదు. పంపకవి జైనుడు. నన్నయ భారతరచనతో వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈ భూమ్యాకాశ సమాగమాన్ని అందంగా ఈ పద్యంలో చిత్రించారు.
చివరి పద్యము –
శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో-
దార సమీర సౌరభముఁ దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండు రుచి పూరములం బరిపూరితంబులై
ఇది నన్నయగారు రచించిన చిట్టచివరి పద్యం. నాకు ఇది ఎంతో నచ్చిన ఉత్పలమాల. దీనిని చదువుతుంటే వయ్యారంగా నడుస్తుండే ఒక అసమాన రూపవతి జ్ఞాపకానికి వస్తుంది. ఇందులో సంస్కృత సమాసాలు ఎక్కువగా ఉన్నా, దీనిని చదువుతుంటే ఒక అందమైన గేయాన్ని చదువేటట్లుంటుంది. పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది. మనం నగరాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాము. అందువల్ల కలుషితమైన వాతావరణం, అధికమైన కాంతి నక్షత్రాలను బాగుగా చూచే అవకాశాన్ని ఇవ్వవు. నక్షత్రాల అందాన్ని చూడాలంటే ఆకాశం నిర్మలంగా ఉండాలి, చుట్టుపట్ల ఎక్కువ కాంతి ఉండరాదు. శరదృతువులో ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది, మేఘాలు ఉండవు. తారకలను కళ్ళు తరించేలా చూడవచ్చు అరణ్యంలో. శరత్కాలములో రాత్రిళ్ళు మిక్కిలి అందమైన నక్షత్రమాలలతో విరాజిల్లుతూ ఉంటాయి. అప్పుడే వికసించిన కలువ పూల సుగంధాన్ని పిల్లగాలి మోసి తెస్తూ ఉంది. ఇక చంద్రుడు ప్రసరించే వెన్నెల అంటారా? అది తెల్లని కర్పూరపు పొడి వెదజల్లినట్లుంది. నన్నయగారు శారద యామినుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నా, దీనిని ఒక యువతికి కూడా అన్వయించవచ్చు. అదే ఇందులోని చమత్కారం. ఆడవాళ్ళు అందమైన హారాలను ధరిస్తారు గదా! వాళ్ళు మంచి సుగంధాన్ని కూడా అలదికొంటారు గదా! వాళ్ళ ముఖాలలో వెన్నెల పరాగాలలా చిమ్ముతుంది గదా! కాళిదాసు ఋతుసంహారములో శరదృతువును వర్ణించేటప్పుడు రాత్రిని కన్యతో పోల్చినట్లు ఒక వసంతతిలకవృత్తము ఉన్నది. అది –
తారాగణప్రచురభూషణముద్వహంతీ
మేఘోపరోధపరిముక్తశశాంకవక్త్రా
జ్యోత్స్నాదుకూలమమలం రజనీ వసనా
వృద్ధిం ప్రయాత్యనుదినం ప్రమదేవ బాలా
– కాలిదాస, ఋతుసంహారం, 3.07
బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్ళు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది. యువతి ముసుగు తొలగిస్తే ఆమె అందమైన ముఖం కనబడేటట్లు, దూదిపింజాలాటి మేఘాలు తొలగినప్పుడు చంద్రబింబం కనబడుతుంది.
నన్నయగారి ఆఖరి పద్యానికి ఒక పాఠాంతరం కూడా ఉంది. చివరి పదము పరిపూరితంబులై-కు బదులు పరపూరితంబులై అని కొందరంటారు. అంటే భారతము ఇక మీద ఇతరులతో పూరించబడుతుంది అని భావన. దీని నిజానిజాలు దేవుడికి, దేవుడిని చేరిన నన్నయకు మాత్రమే తెలుసు, మనకెవరికీ తెలియదు.
ముగింపు
ఈ పద్యాలను రాసేటప్పుడు నన్నయగారి సృజనాశక్తి ఒక ఉన్నత శృంగాన్ని తాకింది. బహుశా అతనికి ఉన్నట్లుండి హృదయాఘాతము వంటిది ఏదైనా సంభవించి ఉంటుంది. అది మన దురదృష్టం. తిక్కన ఎఱ్ఱనలు తరువాత భారతాన్ని పూర్తి చేసినా, వారి పద్ధతి వేరు. అది నన్నయ ప్రణాళిక కాదు. మిగిలిన పర్వాలను నన్నయగారు ఎలా పూర్తి చేసి ఉంటారో అన్న విషయాన్ని మనం ఊహించవలసిందే, కాని చదివి ఆనందించడానికి వీలు కాదు.
అంకితము
ఉన్నత పాఠశాలలో ఆరవ ఫారం చదివేటప్పుడు నన్నయ యెఱ్ఱనలు వ్రాసిన వర్షశరదృతువర్ణనలు మాకు పఠనీయాంశముగా ఉండేది. ఈ పద్యాల అర్థాలను చక్కగా విడమర్చి చెప్పింది మాత్రమే కాక తెలుగు సాహిత్యంలో నాకు ఆసక్తి కలిగించిన తెలుగు పండితులు విద్వత్కవిభూషణ విద్వాన్ శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారి (కుందమాల, భామినీవిలాసము, శతకవాఙ్మయసర్వస్వము, తేనెసోనలు మున్నగు పుస్తకముల రచయిత) స్మృతికి వినయంగా భక్తితో ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను.