వనమయూరము

పరిచయము

అన్ని వృత్తములను రాగయుక్తముగా పాడుకొన వీలగును. కాని అందులో కొన్ని మాత్రమే తాళబద్ధములు. అట్టి వృత్తములలో వనమయూరము ఒకటి. ఈ వనమయూర వృత్తమునకు ఎన్నో పేరులు ఉన్నాయి, అవి: వనమయూరము, ఇందువదన, కాంత, మహిత, వరసుందరి, స్ఖలిత, కుట్మల. వనమయూర వృత్తములో కాలిదాసాది సంస్కృతకవులు వ్రాయలేదు. అనగా అది బహుశా ఆ కాలములో వాడుకలో లేదేమో? ఈ వృత్తమును నాట్యశాస్త్ర రచయిత పేర్కొనలేదు. పింగళ ఛందస్సులో చివరి అధ్యాయములో అత్రానుక్తం గాథా, అనగా చెప్పబడని ఇతర పద్యములలో ఇది పేర్కొనబడినది. బహుశా హలాయుధుడు (10వ శతాబ్దము) తన మృతసంజీవని వ్యాఖ్యలో దీనిని చేర్చియుంటాడు.

సూత్రము: వరసుందరీ భూజౌ స్నౌ గౌ. అందులోని లక్ష్యపద్యము-

స్వాదు శిశిరోజ్జ్వల సుగంధిజలపూర్ణ
వీచిచయ చంచల విచిత్ర శతపత్రమ్
హంసకలకూజిత మనోహర తటాంతం
పశ్య వరసుందరి, సరోవరముదారమ్ – పింగళ ఛందస్సు, 8.9

వనమయూరమను పేరు మొట్టమొదట నాగవర్మ (సుమారు క్రీ.శ. 990) ఛందోంబుధిలో మనకు కనబడుతుంది.

బందిరె సరోజరిపు భాను మరు దింద్రం
ముందిరె హరద్వయగణం విమల సంపూ-
ర్ణేందువదనే యతి పదాంతదొళెనిందం
దెందుమిదు కేళ్ పెసరినిం వనమయూరం – నాగవర్మ ఛందోంబుధి, సమవృత్త, 174

(సరోజరిపు – చంద్రుడు అధిపతిగా నుండు భ-గణము, భాను – సూర్యుడు అధిపతిగా నుండు జ-గణము, మరుత్ – వాయువు అధిపతిగా నుండు స-గణము, ఇంద్ర – ఇంద్రుడు అధిపతిగా నుండు న-గణము, హరద్వయము – రెండు గురువులు. పాదాంతములో యతి. తన భార్యను ఉద్దేశించిన ఇందువదన పదము వృత్తముయొక్క మఱొక పేరా అన్నది సందేహాస్పదము. పాదము ఏడు, ఏడు అక్షరములుగా విఱుగుతుందని మఱొక లక్షణ పద్యము ఉన్నది. నాలుగు, ఏడు, ఎనిమిది అక్షరముల విఱుపు కూడ చెప్పబడినది. దీని మఱొక పేరు కుట్మల అని చెప్పబడినది.)

జయకీర్తి (సుమారు క్రీ.శ. 1000) ఛందోనుశాసనములో దీని లక్షణము ఇలా చెప్పబడినది: భాజసనగా యది గురుర్వనమయూరః. హేమచంద్రుడు (12వ శతాబ్దము) భ్జస్నాద్గౌ స్ఖలితమ్ అన్నాడు. అంతేకాక మహితా, కాంతా, వనమయూరశ్చేత్యన్యే అని ఇతర నామములను కూడ తెలిపినాడు. కేదారభట్టు (15వ శతాబ్దమునకు పూర్వము) వృత్తరత్నాకరములో ఇందువదనా భజసనైః సగురుయుగ్మైః అంటాడు. అందులోని లక్ష్య పద్యము-

కుందరదనా కుటిల కుంతలకలాపా
మంద మృదుల స్మితవతీ కమలనేత్రా
సుందరసరఃపరిసరే విహరమాణా
ఇందువదనా మనసి సా యువతిరాస్తే – కేదారభట్ట వృత్తరత్నాకరము, 3.82

రేచన కవిజనాశ్రయములో వనమయూరపు లక్షణ-లక్ష్య పద్యము క్రింది విధముగా నున్నది.

నందితగుణా భజస-నంబులు గగం బిం
పొంది చనఁగా వనమ-యూరమగుఁ బేర్మిన్ – రేచన కవిజనాశ్రయము, వృత్తప్రకరణము

తెలుగు కావ్యములలో వనమయూర వృత్తము భారత, భాగవత, కుమారసంభవాదులలో వాడబడినది.

రాజకులశేఖర ప-రంతప వివేక
భ్రాజిత జగద్వలయ – భాసుర సముద్య-
త్తేజ నిరవద్య యువ-తీమదన వీరో-
గ్రాజి విజయా త్రిభువ-నాంకుశ నరేంద్రా – నన్నయ భారతము, ఆది 5.261

పోర నొడ లస్త్ర పరి-పూతముగ ధీరో-
దారతఁ బిఱిందికిఁ బ-దం బిడక దృవ్య-
ద్వైరితతి నొంచి తెగు-వారగుట మేలు-
ర్వీరమణకోటి కని – వేదములు సెప్పున్ – తిక్కన భారతము, స్త్రీ 1.110

భూసురకదంబ సుర-భూరుహ వికాసో-
ద్భాసిత కృపారస వి-పాక సుగుణైకో-
ల్లాస హర హారమృగ-లాంఛన మృణాళీ
హాసినవ కీర్తి విస-రాకలితలోకా – ఎఱ్ఱన భారతము, అరణ్య 6.411

మేరునగధీరు నిర-మిత్రు సుచరిత్రున్
వారిధిగభీరు నిర-వద్యు జనవంద్యున్
చారుతరమూర్తి నతి-శాంతు గుణవంతున్
మారహరు సర్వజన-మాన్యు మునిమాన్యున్ – నన్నెచోడుని కుమారసంభవము, 3.113

అంత సురలేయు నిబి-డాస్త్రముల పాలై
పంతములు దక్కి హత – పౌరుషముతో ని-
శ్చింతగతి రక్కసులు – సిగ్గు డిగి భూమిన్
గంతుగొని పాఱి రప-కారపరు లార్వన్ – సింగన భాగవతము, 6.378

ఈయన రుమాజనకుఁ-డేననిన నెంతో
ప్రేయముగఁ జూచుఁ దన – బిడ్డ యనినట్టున్
శ్రీయుతుఁడు కోటిశత-సేన కధినాథుం
డీయన యొకండు లయ-హేళి రణకేళిన్ – విశ్వనాథ, శ్రీరామాయణకల్పవృక్షము, కిష్కింధ, సమీకరణ, 20

వనమయూరపు అమరిక

వనమయూర వృత్తపు పాదములో మూడు పంచమాత్రలైన భ-లములు (UIII), రెండు గురువులు (UU) ఉంటాయి. చివరి చతుర్మాత్ర విరామయతి వలన పంచమాత్రా తుల్యము. అనగా ఈ వృత్తపు గతి ఖండగతి. దీని తాళము ఖండగతి ఏకతాళము, మిశ్రగతి ఝంపతాళాము, ఖండచాపు తాళములకు సరిపోతుంది. అప్పుడప్పుడు ఇతర తాళములలో కూడ పాటలను కట్టుతారు. యక్షగానములలలో కూడ దీనిని వాడుతారు. ఈ గతితో మయూరగతి రగడ అనే ఒక రగడ కూడ పేర్కొనబడినది[1].

మయూరగతి రగడ –

మారమణి పల్లవ కు-మారమణి మోదం
బూరఁ గరుణింపను మ-యూరగతితో నే
తేర మది నిన్న నిటు – దీర్ఘమగు దండెన్
భారముగ రాజిలెడు – పల్లకియు వచ్చెన్ – శహాజీ విష్ణుపల్లకి సేవాప్రబంధము

సంస్కృతములో శ్రీమనవాళ మహాముని (15వ శతాబ్దము) ఈ వృత్తములో నరసింహస్వామిపైన ఒక అష్టకమును వ్రాసినారు. దానిని శ్రీ విద్యాభూషణులు తాళయుక్తముగా పాడినారు.

వనమయూరములాటి వృత్తములు తమిళములోని తేవారములో గలవు. తెలుగులో పంచమాత్రల ద్విపదలయ కూడ ఇట్టిదే. కన్నడములో కర్ణాట చతుష్పది అమరిక కూడ ఇట్టిదే. వీటిలో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి. పాదాంత యతివలన, త్రిమాత్రను కొనసాగించి వనమయూరపు లయను సృష్టించ వీలగును. నాగవర్మ, జయకీర్తులకు తెలుగు ద్విపద పరిచితమై ఉండుటకు అవకాశము ఉన్నది. ఆ విధముగా ఈ వృత్తము కల్పించబడినదేమో?

కన్నడములో లలితవృత్తము అనే ఒక వృత్తము ఉన్నది. దీని అమరిక తెలుగులోని ఉద్ధురమాలావృత్తమైన లయగ్రాహి వంటిదే. లయగ్రాహిలో నాలుగు ప్రాసయతులు ఉంటే, లలిత వృత్తములో మూడు ప్రాస యతులు మాత్రమే (చివరిది లేదు). ఈ లలిత వృత్తము పురాతనమైనదే. ఇందులో కన్నడములో ఒక శాసనము కూడ ఉన్నది. దీనిని తఱువాత పేర్కొంటాను. లలిత లేక లయగ్రాహి యందలి చివరి 14 అక్షరముల అమరిక వనమయూరపు అమరికయే.

UIII UIII – UIII UIII – UIII UIII – UIII UU- లలిత లేక లయగ్రాహి
                                  UIII UIII – UIII UU – వనమయూరము

సామాన్యముగా చిన్న వృత్తములను చేర్చి పెద్ద వృత్తమును నిర్మిస్తారు. వనమయూరపు పాదములను చేర్చగా లలిత వృత్తము జనించినదా లేక లలిత వృత్తమునుండి వనమయూరము పుట్టినదా అన్న ప్రశ్నకు జవాబు సులభము కాదు. కాని సామ్యము మాత్రము నిస్సంశయముగా ఉన్నది.

వనమయూరపు అమరికలో మూడు ఎదురు నడక లేని పంచమాత్రలు, ఒక గుర్వంతమైన చతుర్మాత్ర గలవు. ఎదురు నడక లేని పంచమాత్రలు ఆఱు – UIU, UUI, UIII, IIIU, IIUI, IIIII. ఎదురు నడక లేని గుర్వంతమైన చతుర్మాత్రలు రెండు – UU, IIU. వీటితో వనమయూర వృత్తపు లయతో ఒక పాదమును 6 x 6 x 6 x 2 = 432 విధములుగా వ్రాయ వీలగును. పాదములోని అక్షరముల కనిష్ఠ పరిమితి 11, గరిష్ఠ పరిమితి 18. అక్షర సంఖ్య, వృత్తముల సంఖ్య వరుసగా ఈ విధముగా నుంటుంది: 11 – 8, 12 – 44, 13 – 102, 14 – 129, 15 – 96, 16 – 42, 17 – 10, 18 -1. ఇట్టి వృత్తములు కొన్ని లక్షణ గ్రంథములలో పేర్కొనబడినవి. కొన్నికల్పింపబడినవి. ఈ వృత్తములు మొదటి పట్టికలో ఇవ్వబడినవి. పట్టికలో వృత్తముల ఇతర నామములు, వాటిని ఏయే లాక్షణికులు కనుగొన్నారో అనే విషయాలు ఉన్నాయి. అందులో ఐదింటిని కన్నడములో జన్నకవి కల్పించినట్లు వెంకటాచల శాస్త్రిగారు పేర్కొన్నారు[2]. క్రింద ప్రతి వృత్తమును రెండు ఉదాహరణములతో విశదీకరించినాను.

వనమయూరము – భ/జ/స/న/గగ UIII UIII – UIII UU 14 శక్వరి 3823

ఈదినము మంచి దిన – మెల్లరకుఁ గాదా
ఖేదములు మాయమగుఁ – గృష్ణుఁ డనరాదా
మోదమిడు రాగ మది – మోహనము గాదా
సాధానము సేతు నిఁక – సారిగపధాసా

హారముల వేతుఁగద – హారి గళమందున్
సారమతి నీవె గద – చారుతర రూపా
శ్రీరమణ రాత్రి నను – జేరఁగను రావా
శారద శశాంకుఁ గని – శారికలు నవ్వున్

ఆకసమునందు హృద-యమ్ము లలరంగా
నాకు నొక యిందువద-నమ్ము గనిపించెన్
చీఁకటులు మాయు నిక – చిందు ముద మెందున్
శ్రీకరమె “యీదు” యిది – చిత్తమున నిండున్

శ్రావణములో భువియు – శ్యామలము జూడన్
జీవమయమాయె వని – చెల్వములతోడన్
ఈ వనమయూరములు – హృద్యముగ నాడెన్
గ్రీవములు రమ్యముగ – గీతికల బాడెన్

దారుదేహ – ర/ర/ర/గగ UIU UIU – UIU UU 11 త్రిష్టుప్పు 147

ఎందుకో మానస – మ్మిందు జేరంగా
సింధువై పారెనే – చిందుతో నీకై
మందమందమ్ముగా – మత్తు జల్లంగా
వంద గీతమ్ములన్ – బాడనా నీకై

దారుదేహమ్ముతో – దర్శన మ్మీవా
చారుహాసమ్ముతోఁ – జక్కగా రావా
కోరికల్ దీర్చరా – కోమలాకారా
చేరవా చిత్తజా – జీవనాధారా

శాలీ – ర/త/త/గగ UIU UUI – UUI UU 11 త్రిష్టుప్పు 291

అందమా నీవుండు – యాచోటు లేవో
ఛందమా నీవుండు – సంగీత మేదో
గంధమా నీవుండు – ఖశ్వాస మేదో
బంధమా నీవుండు – స్వాంత మ్మదేదో

చాలురా నీమాట – సత్యమ్ము గాదే
చాలురా నీయాట – సాంత్వమ్ము నీదే
గోలురా నీతోడు – గోపాల బాలా
యేలరా ధీశాలి – యీరీతి శీలీ

ప్రాకారబంధ (లయగ్రాహి, విధ్యంగమాల) – త/త/త/గగ UUI UUI – UUI UU 11 త్రిష్టుప్పు 293

నాగుండెలో నుండు – నందాబ్ధిచంద్రా
నాగొంతులో నుండు – నాదాల సంద్రా
నాగీతమం దుండి – నర్తించు దేవా
వాగర్థ రూపాల – వాగ్భూషణా రా

ఆకాశమం దుండు – యందాల తారా
శ్రీకారమం దుండు – చిత్రంపు వంపా
రాకేందుబింబంపు – రశ్మీ, సుచిత్ర-
ప్రాకారబంధా, వ-రాంగీ సుమిత్రా

మురళీమోహన – స/జ/త/మ IIUI UIU – UIU UU 12 జగతి 299

మురళీధరా హరే – మోహనా కృష్ణా
వరమీయ వేగ రా – పద్మపత్రాక్షా
సరసీరుహమ్ము లా – చారు హాసమ్ముల్
నరకాంతకుండె యీ – నాకు వాసమ్ముల్

తెలిమంచు చుక్కయో – తేనియల్ చిందో
వలఱేని యస్త్రమో – వాణి గీతమ్మో
లలిఁ బెంచు లాస్యమో – రాశి రత్నమ్మో
అలివేణి యెవ్వరో – యామె చైత్రమ్మో

రమణ (కంజాక్షీ) – న/మ/య/య IIIU UUI – UUI UU 12 జగతి 584

కమలమా యీరోజు – కవ్వించబోకే
కమలె నా చేతమ్ము – కన్నీళ్ళు నిండెన్
యమళమై యుండంగ – నాశించఁగా నా
రమణుఁడో రాలేదు – రాత్రిన్ రమించన్

అలలతో హోరెత్తె – నంభోధి సంధ్యన్
శిలలపైఁ గూలంగఁ – క్షీరమ్ము సిందెన్
మిలమిలల్ వెల్గంగ – మీనమ్ము లెందున్
చెలువమా నేనెట్లు – చిత్రింతు నిన్నున్

వజ్రకటక – స/య/య/య IIUI UUI – UUI UU 12 జగతి 588

ఇది లంక నారాజ్య – మిందుందు ఱేఁడై
యెదిరించఁగా నౌనె – నెవ్వారికైనన్
మెదలంగ నౌనే స-మీరమ్ము వేగన్
గదలంగ నౌనే శు-కమ్మైన నిందున్

కనులిందు వ్రాయంగఁ – గావ్యమ్ము లెన్నో
మనమిందుఁ బాడంగ – మౌనంపు గీతిన్
దనువో గవేషించఁ – దాపమ్ము దీరన్
నను జూడ రాలేదు – నాసామి యేలా

హేమంత – భ/య/య/య UIII UUI – UUI UU 12 జగతి 591

మ్రోడులను జూడంగ – మోదమ్ము రాదే
వాడలిట నెందెందుఁ – బ్రాలేయ రాశుల్
వీడకను బాధించెఁ – బ్రేమాగ్నికీలల్
కాడె నను హేమంత – కాలంపు మంచుల్

ఆననముఁ జూపించు – మానందమొందన్
మానసములోనుండు – మాణిక్య దేహా
కాననములో బర్హి – కవ్వించ నాడెన్
వానవలె రారమ్ము – ప్రాణమ్ము పూయన్

వనితావిలోక – త/త/స/య UUI UUI – IIUI UU 12 జగతి 741

రాగమ్ములోఁ బాడ – రసగంగ సాఁగున్
యోగమ్ములోఁ గూడ – నొక హాయి యూఁగున్
వేగమ్ముగా రమ్ము – ప్రియమారఁ బల్కన్
భోగమ్ములే యిమ్ము – పులకించి కుల్కన్

పాలించరా వేగ – ప్రణయాంతరంగా
ఆలించరా వేగ – మసితాననాంగా
లీలామయా దేవ – ప్రియ చారువేషా
మేలమ్ముతో రమ్ము – మృదువాక్య భూషా

రాగాలస – ర/ర/త/స UIU UIU – UUI IIU 12 జగతి 1811

రాగిణీ యేల నీ – రాగాలసము నీ
యోగమే చాలు నీ – యుర్వీస్థలముపై
వేగమే రా దరిన్ – బ్రేమాబ్ధి మునుఁగన్
భోగసంపన్నమై – మోదమ్ము లొసఁగన్

శ్రీధరా రమ్ము నా – చిత్తమ్ము విరియన్
మాధవా రమ్ము నీ – మాధుర్య మొలుకన్
యాదవా రమ్ము నీ – యందమ్ము వెలుఁగన్
రాధ నే వేచితిన్ – రాగాల నిశిలో

నిష్కళంక – భ/న/య/ర/గ UIII IIIU – UUI UU 13 అతిజగతి 1151

నే నెపుడుఁ దలఁతుఁగా – నీ నిష్కళంక
మ్మైన ముఖకమలమున్ – హర్షమ్ముతోడన్
దీన నను గనఁగ రా – దేవాలయ మ్మీ
మానసము ప్రియతమా – మాయావినోదా

చక్కఁగ నరదమనన్ – సంక్రాంతి వచ్చున్
జుక్కలను ధరణిపైఁ – జూడంగ వచ్చున్
కుక్కుటము లడుగిడున్ – గోపమ్ముతోడన్
మిక్కుటము హరుసముల్ – మేలైన వాడన్