లక్ష్మణుని జాగారము

పరిచయము

శ్రీ వెల్చేరు నారాయణరావుగారు ఐదు సంవత్సరాలకు ముందు ఊర్మిళాదేవి నిద్ర – ఒక ఆలోచన అను వ్యాసమును ప్రచురించినారు. దాని ధ్వనిముద్రిక కూడ శ్రీమతి మలయవాసిని గళములో అదే సంచికలో ఇవ్వబడినది. అప్పుడు నేను ఆ పాట ఛందస్సుగుఱించి ప్రస్తావన చేస్తూ, దాని వివరములను తెలియబఱచినాను. ఊర్మిళ నిద్ర ఛందస్సు “కస్తూరి రంగ రంగా నా యన్న కావేటి రంగ రంగా” వంటిదే. ప్రతి పాదములో దీనికి 5, 7, 5, 5, 7 మాత్రలు. ఏడు మాత్రలను 2, 5 లేక 5,2 లేక 3, 4 లేక 4, 3 మాత్రలుగా ఎన్నుకోవచ్చును. మొదటి భాగము (5, 7 మాత్రలు) వలెనే చివరి భాగము కూడ (5, 7 మాత్రలు). రెండు భాగాలు, మధ్య ఉండే ఐదు మాత్రల వంతెనతో కలుపబడుతుంది. క్రింద రెండింటిని వృత్త రూపములో ఉదాహరించినాను. అవి –

పాదమునకు 20 అక్షరములు గల కృతి ఛందములోని 240443వ వృత్తము
గణములు – ర/న/త/జ/ర/న/గగ UIU III UU – IIUI – UIU III UU,
అక్షరసామ్య యతి (1, 9) ప్రాసయతి (1, 13 అనగా 2వ, 13వ అక్ష్రములతో ప్రాస)

మాధవా పిలువరాదా – మనసార – రాధతో పలుకరాదా
బాధతో మనసు నీకై – వనమాలి – పేదగా వణకె నాకై
మోదమో కనఁగ రాదే – పొడుగైన – ఖేదమా బ్రదుకు నీదే
చేదు నా మధువు గాదా – చిరమైన – హ్లాద మా మరువు గాదా

పాదమునకు 22 అక్షరములు గల ఆకృతి ఛందములోని 2070269వ వృత్తము
గణములు – ర/న/స/స/య/న/న/గ UUI III IIU – IIUI – UUI III IIU,
యతి (1, 10) ప్రాసయతి (1, 14 అనగా 2వ, 15వ అక్ష్రములతో ప్రాస)

ఆనంద సరసి నురుగై – యతి నూత్న – గానంపు స్వరపు పఱుగై
యా నీల గగన రవియై – యసమాన – మీనంపు కనుల ఛవియై
నా నేత్రములకు శశియై – నడిరేయి – యా నింగి వెలుగు నిశియై
నా నోము వరపు ఫలమై – నగుమోము – రా నేను దలచు కలయై

పదాలను మాత్రాగణములకు తగినట్లు విడదీసి వ్రాస్తే ఈ పద్యాలలో మరొక గమ్మత్తు ఉంటుంది. మధ్య నుండే వంతెన గణాన్ని తొలగిస్తే కూడ పద్యము స్వతంత్రముగా ప్రాసయతితో నిలబడి ఉంటుంది. అలా వ్రాస్తే మొదటి వృత్తానికి 16 అక్షరాలు, రెండవ వృత్తానికి 18 అక్షరాలు ఉంటాయి. మొదటి పద్యమును అలా చేయగా మనకు క్రింది పద్యము లభిస్తుంది.

మాధవా పిలువరాదా – రాధతో పలుకరాదా
బాధతో మనసు నీకై – పేదగా వణకె నాకై
మోదమో కనఁగ రాదే – ఖేదమా బ్రదుకు నీదే
చేదు నా మధువు గాదా – హ్లాద మా మరువు గాదా

‘ఊర్మిళ’ జాతి పద్యము – వృత్తములుగా వ్రాసినప్పుడు మనకు సౌలభ్యము కొద్దిగా కుంటువడుతుంది. కాని ఈ మూసను ఇవే నియమములతో జాతి పద్యముగా వ్రాస్తే , మనకు భావప్రకటనలో స్వేచ్ఛ ఎక్కువగా లభిస్తుంది. ఇట్టి జాతి పద్యమునకు నేను ‘ఊర్మిళ’ అని పేరు పెట్టినాను. ఊర్మిళ జాతి పద్యమునకు నేను ఏర్పరచుకొన్న నియమములు –

  1. ప్రతి పాదములో 5, 7 – 5 – 5, 7 మాత్రలు ఉంటాయి.
  2. సప్తమాత్రలను 3,4 లేక 4,3 లేక 2,5 లేక 5,2 గా విఱిచి వ్రాయ వచ్చును.
  3. మధ్య ఉండే పంచమాత్ర రెండు భాగములకు ఒక వంతెనలా ప్రవర్తిస్తుంది. మొదటి అక్షరముతో ఈ పంచమాత్రలోని మొదటి అక్షరముతో అక్షరసామ్య యతిని నేను ఇట్టి పద్యములలో ఉపయోగిస్తాను.
  4. రెండు సరి భాగములకు (అనగా 12 మాత్రల భాగములకు) ప్రాసయతి పాటకు ఊపు నిస్తుంది. సరి భాగములలో చివర ఒక మాత్ర తగ్గినప్పుడు పొడిగించి పాడుకొనవచ్చును. అక్కడ ద్రుతము ఉన్నప్పుడు ద్రుతమును వదలి అక్షరమును పొడిగించుకొనవచ్చును (ఉదా. ‘భూమిజను భూమీశునిన్ – ముదముతోఁ నేమమున గొల్చుచుండెన్’ పాదము పాడేటప్పుడు ‘భూమిజను భూమీశునీ – ముదముతోఁ నేమమున గొల్చుచుండే’)

లక్ష్మణుని జాగారము – ఈ నియమములతో అయోధ్యలో ఊర్మిళ దీర్ఘనిద్రలో నున్నప్పుడు వనవాసము చేస్తున్న లక్ష్మణుని మానసిక స్థిని ప్రతిబింబింప జేయునది ఈ ఊర్మిళ నామ పద్యములు. వీటిని ‘ఊర్మిళ నిద్ర’ వలెనే పాడుకొన వీలగును.

[రచయిత గళంలో]

శ్రీరామ భూపాలు డా – సీతతో
జేరి చనెఁ గాననములో
వారితోఁ దా వెళ్ళెఁగా – వదలకను
వారిజాక్షుని నీడగా
ఘోర కాంతారములలోఁ – గూర్మితో
దూరముల గడచె నతఁడున్
చారుహాటకరూపుఁ డా – సౌమిత్రి
వీరవిక్రముఁడు గాదా… 1

రామచంద్రుఁడు నడువఁగా – రమణి దా
రామాఖ్యుతోడ వెళ్ళున్
సౌమిత్రి పిదప నడచున్ – జక్కఁగా
భూమిజను గాపాడఁగా
భూమిజను భూమీశునిన్ – ముదముతో
నేమమున గొల్చుచుండెన్
శ్యామలాంగుఁడు సీతయున్ – సర్వమని
ప్రేమతోఁ దలఁచె నతఁడున్… 2

ఎండనక వాననక తా – మేగి రా
కొండలను దాటి వెళ్ళన్
దుండగీడులఁ ద్రుంచుచున్ – ద్రోవలోఁ
జెండాడి రా యసురులన్
నిండుగాఁ బారు నదులన్ – నేర్పుతో
దండిగా గడచి రెన్నో
తిండిగాఁ గందమూలము – దినుచు దా
ముండి రొక పర్ణశాలన్ … 3

రాముండు నిదురించఁగా – రమణి యా
కోమలియు నిదురించఁగా
భూమిజము నిదురించఁగాఁ – బూదీవ
గోముగా నిదురించఁగా
గోమాత నిదురించఁగాఁ – గూనలును
క్షేమమై నిదురించఁగా
సౌమిత్రి గను మూయకన్ – జలిలోనఁ
దా మదిని దలఁచె భార్యన్… 4

నీకందు నిదుర యెపుడున్ – నెచ్చెలీ
నాకిందు నిదుర లేదే
రాకా సుధాకరుండే – రాత్రిలో
నాకసురుఁ డయ్యెఁ గాదా
నా కనులలోన నీవే – నా చెలీ
యీ కనులలోన నీరే
చీఁకటులయందు నిను నేఁ – జింతతో
వేకువగువఱకు దలఁతున్… 5

పగలంత గడచు నెటులో – పనులలో
సగమైన నన్ను మఱతున్
పొగమంచు పడఁగ రజనిన్ – బొగులుగా
వగలతో నాదు హృదియున్
జగమెల్ల నిదుర నుండన్ – సకియ నా
మొగమందు మూయ వక్షుల్
నగ మొక్క మౌని యనఁగా – నల్లఁగా
నగఁపడెను నిశ్చలమ్మై… 6

నడిరేయి యే జాములో – నా స్వామి
తలవాల్చి నిదురించఁగా
మలలెల్ల నింగి గనుచున్ – మైకమున
మెలమెల్ల నిదురించఁగా
సెలయే రచంచలముగా – చీఁకటుల
నల లేక నిదురించఁగా
లలితాంగి నీవె మదిలో – రసహీనుఁ
డిల నైతి నిన్ను దలువన్… 7

గూడు లందుండు గూబల్ – గొంతుతో
గోడుగోడంచు మూల్గెన్
ఏడనో నక్క యఱచెన్ – హిమములో
నేడనో పూలు విరిసెన్
చూడ నా తార లెన్నో – సొబగుతో
నేఁడు నాతోడ పలికెన్
నీడలను జూచుచుంటిన్ – నీకు నేఁ
దోడు నీయంగలేనే… 8

మత్తకోకిలలు పాడన్ – మఱచుచును
మత్తగిల్లితి నేనిటన్
నృత్తమును జేసె నెమలుల్ – నిజముగాఁ
జిత్తమున నీదు నటనల్
మెత్తఁగాఁ బూలు విరియన్ – మేనదియు
మత్తుతోఁ బరవశించెన్
నిత్తె మీ వనములోనన్ – నెనరుతో
వత్తువే నాకు ముందున్… 9

వచ్చె నామనులు యెన్నో – పడలుగా
నిచ్చె విరిదండ లెన్నో
వచ్చె గ్రీష్మమ్ము లెన్నో – వాడిగా
నిచ్చె వేడిని మంటతో
వచ్చెఁగాఁ గారులెన్నో – వానతో
నిచ్చెఁగాఁ బచ్చదనమున్
వచ్చె శరదృతువు లెన్నో – స్వచ్ఛమై
యిచ్చె నిర్మలపు రాత్రుల్
వచ్చె హేమమ్ము లెన్నో – వసుమతికి
నిచ్చె హిమరాశి చలితో
వచ్చె శిశిరమ్ము లెన్నో – పత్రముల
నిచ్చెఁగా వర్ణములతో
వచ్చె వత్సరము లెన్నో – ప్రాణమ్ము
నిచ్చెఁ గ్రొత్తగ ధరణికిన్
వచ్చునా నిన్ను గనఁగా – వాసర
మ్మిచ్చునా నాకు ముదమున్… 10, 11

ఋతురాగ రాగిణుల నేఁ – బ్రియతమా
మతిదప్పి వినుచుంటినో
వెతలేల యని చెప్పి రా – ప్రియమైన
హితులెల్లఁ బ్రీతి మీఱన్
మితిలేని ప్రేమ నీపై – మేదినిని
గత మొక్క స్వప్నమేనా
ప్రతి పగలు నిన్నె దలఁతున్ – ప్రాణేశి
ప్రతి రాత్రి నిన్నె దలఁతున్… 12

ఒక చూపుతోడనే న – న్నూర్మిళా
వికసింప జేసినావే
ఒక పల్కుతోడనే నా – కూర్మిళా
సకలమ్ము దెలిపినావే
ఒక నవ్వుతోడనే నీ – వూర్మిళా
మకరాంకు గెలిచినావే
ఇఁక నెప్పుడో తెలియదే – యింటిలో
సకి నిన్ను ముద్దాడుటో… 13

ఆనాఁడు జనకు నింటన్ – హారమ్ము
మానినీ వేసినావే
ఆనాఁడు ఉపవనములో – నందమౌ
గానమ్ము పాడినావే
ఆనాఁడు రాత్రి యొడిలో – నమృతంపు
పానమ్ము నొసఁగినావే
ఈనాఁడు నీవు నిద్రన్ – హృదయమా
నేనిందుఁ జుక్క లెంచన్… 14

కళలతో వెలుఁగు మోమున్ – గన్నులను
గలియఁగా నెప్పు డౌనో
కిలకిలల నవ్వు సడులన్ – గిన్నరీ
లలితమై వినఁగ నౌనో
చెలువముల్ చిందు సుధలన్ – జిన్మయీ
వలపులోఁ ద్రావ నౌనో
మిలమిలా మెఱయు తారన్ – మింటిలోఁ
బిలువఁగా నెప్పు డౌనో… 15

అన్నయ్య సూర్యుఁ డనఁగా – నందమును
గన్నులను జూడ నౌనా
అన్న సతి చంద్రుఁ డనఁగా – నా మొగము
వెన్నెలలఁ జిందు గాదా
కన్నార నిన్ను గాంచన్ – గలహంస
చెన్నులను దలఁచ నౌనా
ఎన్నడీ నాకు నీవున్ – హృదయమ్ము
వెన్నగాఁ జూప నగునో… 16

మఱి యెపుడు చూడ నౌనో – మధురమౌ
సరయూనదీ సలిలమున్
మఱి నేను జూతు నెపుడో – మహితమౌ
పురి యయోధ్యను గనులతో
మఱి గాంచ నగునొ లేదో – మాతలను
భరత శత్రుఘ్నాదులన్
మఱి నాకుఁ జూడా నౌనా – మమతతో
సిరివోలె నిన్ను ద్వరగా… 17

నిదురలో నీకు కలలా – నిర్మలా
నిదురయా యేమి యదియున్
నిదురలో నీవుండఁగా – నేనిందు
నిదురయే లేకుండఁగా
నిదుర నీదెంత పొడుగో – నిజముగా
నిదుర విడి మేల్కొందువో
హృదయ మిట రగులుచుండెన్ – బ్రేయసీ
హృదయ మిటఁ బగులుచుండెన్… 18

హోరుగా గాలి వీచన్ – ఊర్మిళా
జోరుగా గుండె గొట్టున్
ఊరిలో ఎట్లుంటివో – ఊర్మిళా
నేరుగాఁ గాంచలేనే
వేఱుగా నున్న కూడా – పేరునే
చేరువను మదినుంచితిన్
హోర యెపుడో కలియఁగా – నూర్మిళా
కూరునో నిను జేరఁగా… 19

శ్రీరామ భూపాలుఁ డా – సీతతో
నా రవిని గనఁగ లేచెన్
తూరుపున నగము పైనన్ – దోఁచె నా
సూరుండు వెలుఁగుఁ జల్లన్
గారమ్ముతో లక్ష్మణుడు – క్షణములో
వారి వందించె భక్తిన్
వేఱొక్క దినము వచ్చెన్ – బ్రియసఖిని
వీరుండు మఱువ లేచెన్… 20

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...