ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న “ఈ మాట” పాఠకులకు సుస్వాగతం! ఈ సంచికలో ఒక విశేషం ఉంది. అందువల్లనే ఇది బయటకు రావటం కొంత ఆలస్యం అయింది కూడ. తానా వారు ఈ వారాంతంలో జరగబోతున్న మహాసభలను పురస్కరించుకొని జరిపిన కథల పోటీలో వచ్చిన 700 పైగా కథల్నుంచి ఆరింటిని ఉత్తమమైన వాటిగా నిర్ణయించి బహుమతులు ప్రకటించారు. ఆ ఆరు కథల్నీ ఈ సంచికలో ప్రచురిస్తున్నాం!
శ్రీ జంపాల చౌదరి గారు ఇందుకు ప్రేరకులు, కారకులు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు!
ఈ కథల గురించి, ప్రస్తుత తెలుగు కథా సాహిత్య స్థితిని గురించి అభిప్రాయాలు, చర్చలు ఆహ్వానిస్తున్నాం.
ఈ సందర్భంలో మరొక శుభవార్తను “ఈ మాట” పాఠకులకు తెలియజెయ్యటానికి ఎంతో సంతోషిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు సాహిత్య సృష్టిని ప్రోత్సహించటానికి పోటీలను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ వారు ఈ సంవత్సరం వారు ఎంపిక చేయబోయే రచనలను “ఈ మాట”లో ప్రచురణకు ఇవ్వటానికి సహృదయంతో అంగీకరించారు. శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి మా కృతజ్ఞతలు.
మరో విశేషం ఏమిటంటే, ప్రఖ్యాత సాహితీ పరిశోధకులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారి ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సాహితీప్రియులు కొందరు తయారు చేసిన “ఈ శతాబ్దపు పుస్తక శతం” కూడ ఈ సంచికలో ప్రచురిస్తున్నాం! తెలుగు సాహిత్యంలో అభిరుచి ఉన్నవారు వీటిలో వీలైనన్నింటిని చదవాలని వారి ఆకాంక్ష. ఈ పట్టిక మీద కూడ అభిప్రాయాలను, చర్చలను ఆహ్వానిస్తున్నాం!
ఎందరో పాఠకులు పత్రికను ఇంకా అభివృద్ధిపరచటానికి రకరకాల సూచనలు చేస్తున్నారు. ఐతే ఈ పత్రికను నడపటానికి మేం ఇవ్వగలిగిన కాలం కేవలం పరిమితం కావటం వల్లను, కొన్ని సూచనలను అమలుపరచటానికి కావలసిన సాంకేతిక కౌశలం కూడ మాదగ్గర లేనందు వల్లను అందరినీ తృప్తి పరచలేక పోవచ్చు. సాంకేతికంగా సహాయం చెయ్యగలిగిన వారు సహృదయంతో వారి కాలాన్ని, జ్ఞానాన్ని యివ్వదలిస్తే ముందుకు రావచ్చును. వారికి మా స్వాగతం. మాకు యీమెయిల్ పంపితే వారి సహాయాన్ని తీసుకుంటాం.
ఖండ ఖండాంతరాల తెలుగు వారి అనుభవాలు, ఆలోచనలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం “ఈ మాట” లక్ష్యం. ఇందుకు పాఠకులే కాదు రచయితలు కూడ ఇతోధికంగా ముందుకు రావాలి. రచనలను “ఈ మాట” కు పంపదలుచు కున్నవారికి మా సూచన, వీలయితే వాటిని RTSలో టైప్ చేసి ఈమెయిల్ ద్వారా పంపమని. అది కుదరని పక్షంలో fax ద్వారా పంపటం అనుకూలంగా ఉంటుంది. అలాటి వారు “ఈ మాట” కు ముందుగా ఈమెయిల్ పంపితే మా fax number తెలియజేస్తాం. అది కూడా వీలు కానివారు సాధారణ మెయిల్ లో పంపవచ్చును. వారు కూడ ఈమెయిల్ పంపితే మా మెయిల్ అడ్రస్ తెలుపగలం.
ఈ సారి కూడ శ్రీ మంథా లక్ష్మణమూర్తి గారు ముఖచిత్రం వేసి యిచ్చారు. వారికి మా కృతజ్ఞతలు.