నా పేరు అభిరామి. అందరూ నాపేరెంతో బావుంటుందంటారు. “మీ లాగే” అని కొసరు. నేన్నవ్వేసి ఊరుకుంటాను. “నీ నవ్వు కూడా” అంటారప్పుడు. చిన్నప్పణ్ణుంచీ అంతే. మొదట్నుంచీ నన్నో విలక్షణమైన వ్యక్తిగానే చూస్తుండేవారంతా. ఎందుకో తెలీదు.
ఏదో మొహమాటానికంటున్నాగానీ నాకు తెలుసు. “నేను నిజంగా విలక్షణంగానే ఉంటాను” అని చెప్పుకోకపోవడంలో నిరాడమ్బరత మరింత విలక్షణతని ఆపాదిస్తుందనీ నాకు తెలుసు.
ఆ పదం ఎక్కువగా వాడినట్టున్నాను. “విలక్షణమైన” అన్న పదమే ఎంతో విలక్షణంగా ఉంటుంది. పైగా అది నాకున్న విశేషణాల్లో ఒకటి కావటాన దానిపై మరింత మక్కువ.
తాతయ్యకెంత ముచ్చటో నేనంటే. నాక్కూడా ఆయనంటే ఎంతో ఇష్టం, ప్రేమా, స్నేహం. కాయకష్టం చేసి గట్టిపడిన వొళ్ళూ, జ్ఞానంతో వెలిగే మొహమూ, దయతో చూసే కళ్ళూ, ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే నోరూ, నోటి వెంట ఎప్పుడూ సాగుతుండే పద్యమూ! భారతం, భాగవతం, రామాయణాల్లోని పద్యాలన్నీ నేర్పేవాడు వొళ్ళో కూచోబెట్టుకుని అర్థాలతో సహా వివరిస్తూ. “నువ్వు రాకుమారివమ్మా!” అనేవాడు. “మనం రాజులం కాదు కదా తాతయ్యా!” అంటే నవ్వేవాడు “మా చిట్టి తల్లికెన్ని తెలివితేటలో” అని. అందరికీ చెప్పి మురుసుకునేవాడు.
అసలు ఆ మాట అన్నట్టు నాకు గుర్తు లేదు. అంత చిన్నప్పుడే కులాల గురించి నాకు తెలుసనుకోను. తరవాతెప్పుడో అట్లాంటి సమాధానం ఎక్కడయినా చదివి నేనే అన్నట్టు గుర్తుంచుకున్నానేమో గుర్తులేదు.
ఆ మాటకొస్తే తాతయ్య పద్యాలు పాడినట్టు కూడా నాకు గుర్తు లేదు. ఒకటో రెండో పాత సినిమా పాటలు పాడేవాడేమో రెండు ముక్కలు! పక్కింటి పూజారిగారు గొంతెత్తి ఆ పద్యాలు పాడుతూ పిల్లలకి కంఠతా పట్టించే వారని గుర్తు.
మామూలుగా అయితే ఆయన గురించి అంత మర్యాదగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆచారినీ, ఆయన పిలకనీ ఎగతాళి చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం.
నిజానికి తాతయ్య ఆరోగ్యం కూడా అంత బాగా ఉండేది కాదు. అప్పుడప్పుడూ ఎందుకో దగ్గేవాడు తాతయ్య. అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూ. ముఖ్యంగా రాత్రిళ్ళు. దగ్గు కాకపోతే ఆయాసం. కష్టాలకీ, జబ్బులకీ కుంగిపోయిన శరీరానికి ఎప్పుడూ ఎవరో ఒకరి సాయం అవసరమయ్యేది. చిన్నపిల్లని కావడంతో అది ఎప్పుడూ నేనే చేయవలసి వచ్చేది.
అంటే ఎప్పుడూ కాదు, నేనింట్లో ఉన్నప్పుడు. నాకు స్కూల్, హోమ్‌వర్క్ లేనప్పుడూ, ఆటలకోసం బయటి కెళ్ళనప్పుడూ. అయినా మిగతా అందరూ విసుక్కునే వాళ్ళు. నేనట్లా గాదు. తాతయ్యకు సాయం చేస్తుంటే నాకెప్పుడూ ఫ్లారెన్స్ నైటింగేల్ బొమ్మ గుర్తొచ్చేది. తలొంచుకుని రోగి పక్క లాంతరు వెలుగులో కూచుని.
చేయెత్తి లాంతరు పట్టుకు నిల్చుని కూడా కావచ్చు. ఆ బొమ్మ ఎప్పుడూ గుర్తొచ్చేదని మాత్రం బాగా గుర్తు. ఆ బొమ్మ మాత్రం అంతగా గుర్తులేదు.
అయినా అప్పుడప్పుడూ విసుగొచ్చేది. ఒకటి రెండు సార్లు విసుక్కున్నానేమో కూడా.
విసుక్కున్నానేమో కాదు, విసుక్కున్నాను. రెండు తడవల కంటే ఎక్కువ కూడాను.
అసలు తాతయ్య మంచాన పడి మరీ అన్నాళ్ళు ఉండకపోయీ ఉండొచ్చు. మహా అయితే రెండు మూడు నెలలు. చనిపోయేముందు.
రెండు నెల్ల కంటే తక్కువ కూడా కావచ్చు.
అయినా ఇదంతా ఎందుకు చెబుతున్నాను? నేను పెరిగిన తీరు లోని విలక్షణత గురించి చెప్పటానికనుకుంటాను.
చెప్పటానికనుకుంటాను అని ఎందుకన్నానో మరి, చెప్పటానికే. రెంటికీ తేడా ఏంటో నాకు తెలియదు.
తెలియదు అని చెప్పటంలోని హంబుల్‌నెస్ కోసమలా అన్నానే గానీ నాకు తెలుసు. ఒకటి అభిప్రాయం, మరొకటి వాస్తవం.
అని ఎక్కడో చదివిన గుర్తు.
నన్ను విలక్షణమైన వ్యక్తిగా చూసేవారని మాత్రం అనుకునేదాన్ని. పైకెవరూ అనకపోయినా అనుకుంటూ ఉండేవారని అనుకునేదాన్ని. పన్నుపై పన్ను ఉండటం వల్ల నా నవ్వు కూడా తేడాగా ఉండేది.
“అని” మాత్రం ఒకసారి అన్నట్లున్నాడు నేను ఒక విలక్షణమైన వ్యక్తినని.
అతని పేరు అని కాదు, ఆనంద్. అని అని నేనే ఎప్పుడోగానీ పిలవను అతనికిష్టం లేకపోవటం వల్ల.
కానీ అతననకపోయుండొచ్చు. అతనట్లా అని ఉంటే బావుండుననుకున్నాననుకుంటా.
ఏదో కాలేజ్ డిబేట్‌లో పరిచయమయింది. అందరి వంతూ అయ్యాక వచ్చి అభినందించాడు “ఎంత బాగా మాట్లాడారు” అంటూ. అతని కళ్ళల్లో మెరుపులు.
చుట్టూ ట్యూబ్‌లైట్ల వెలుగుల మూలాన కూడా కావచ్చు.
అప్పట్నుంచీ ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం ఎక్కడికైనా.
అంటే మిగతా స్నేహితులూ ఉండే వారు మాతో.
ఎప్పుడూ ఏవో చర్చలు. సార్‍త్ర, నీషేల గురించీ. మార్క్స్ నించి ఫెమినిజం, దళితవాదం మీదుగా పోస్ట్‌మోడర్నిజం దాకా. దేశీ, విదేశీ కవులూ, కవిత్వాలూ. సమాజాన్ని ఏదో ఉధ్ధరిద్దామని కలలూ. సమయం తెలిసేది కాదు.
ఎప్పుడూ అవే కబుర్లని కాదు. కాసేపటికి బోరెత్తి సినిమాల గురించీ, లెక్చరర్ల గురించీ కూడా బాగానే చెప్పుకునే వాళ్ళం.
ఆ మాటకొస్తే నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని కూడా కాదు. కాకపోతే చివరి అట్ట క్షుణ్ణంగా చదివేదాన్ని. ఆమాత్రానికే నన్నో ఇంటలెక్చువల్‌గా చూసేవాళ్ళు.
వాళ్ళతో కలిసి తిరుగుతూ, వాళ్ళ చర్చల్లో పాలు పంచుకోవటం వల్ల కూడా అయివుంటుంది. అప్పుడప్పుడూ బయట జరిగే సభలకీ, ఊరేగింపులకీ వెళ్ళి నలుగురి కళ్ళల్లోనూ పడటం వల్ల కూడా కావచ్చు.
నిజం చెప్పొద్దూ, నాకు విదేశీ కవుల పేర్లూ, కొటేషన్లూ బాగా గుర్తుండేవి ఎందుకో.
ఎందుకో అని కాదు, ఇంట్రస్ట్ వల్ల చదివి గుర్తు పెట్టుకునేదాన్ని.
ఇంట్రస్ట్ అని కూడా కాదు గానీ అవి మిగతావాళ్ళకు చెబుతుంటే సరదాగా ఉండేది. వాళ్ళు ఇంప్రెస్ అయిపోతున్నట్టు వాళ్ళ మొహాల్లో తెలుస్తుండేది.
ఊళ్ళో రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాలేజ్ స్టుడెంట్స్ అంతా స్ట్రైక్ చేసి కలెక్టరేట్ దాకా నినాదాలిచ్చుకుంటూ ఊరేగింపు చేసి ధర్నా చేసినప్పుడు మేం మరింత దగ్గరయ్యాం.
ధర్నా చేసిందాకా నేను ఆగిన గుర్తు లేదు. ఆరోజు అమ్మను హాస్పిటల్‌కు తీసుకుపోవలసి వచ్చి ఇంటికి వెళ్ళిపోవలసి వచ్చింది.
కాకపోతే నేను వెళ్ళకపోయుంటే నాన్నయినా తీసుకువెళ్ళి ఉండేవారే. అయితే కలెక్టరేట్ దగ్గర చుట్టూ ఉన్న పోలీసులని చూసి భయం కూడా వేసినట్లు గుర్తు.
నిజానికి ఊరేగింపు మొదలుపెట్టింది కూడా మేము కాదు. వేరే కాలేజ్ వాళ్ళు మొదలెడితే మేమూ ఆ గుంపులో కలిశామంతే.
నన్నే కాదు మా గ్రూప్‌నంతా ఇంటలెక్చువల్ గుంపు అనేవారంతా.
అయితే అది ఎగతాళి చేయటానికని ఒకసారి సరిత రాజీతో అంటుంటే విన్నాను.
సరితకూ నాకూ పడదు కనక, నేనంటే తనకు అసూయ కనక అట్లా చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
కాకపోతే సరిత మా పెళ్ళి కుదరటానికి తర్వాత చాలా సాయం చేసింది.
మాది ప్రేమ వివాహమే అయినప్పటికీ.