ఒకప్పుడు

మేమూ పిల్లలలమే ఒకప్పుడు
మాకూ సమయం తెలియని కాలం ఉండేది
లోకం తెలియని నవ్వులు ఉండేవి
తడిసిన చెంపలు తుడిచే చేతులు ఉండేవి

మేమూ యువకులమే ఒకప్పుడు
మాకూ సవారి ఎక్కి దౌడు తీయించిన కాలం ఉండేది
కడకంటి చూపుకోసం చెడ తిరిగిన దారులు ఉండేవి
బుసు బుస పొంగిన నెత్తురు వెతికిన చాటులు ఉండేవి

మేమూ వృద్ధులమే ఒకప్పుడు
మాకూ ఆడిన గవ్వలు పక్కకు తోసిన కాలం ఉండేది
పొద్దున్నే తీరానికి తిరిగి చేరిన తీరిక ఉండేది
రాత్రంతా నెమరు వేసినా తరగని గురుతులు ఉండేవి

మేమూ జీవితులమే ఒకప్పుడు


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...