సముద్రం

నేనెప్పుడూ బందీనే. ఎంత స్వేచ్ఛగా ఉందామనుకొన్నా ఏదో ఒక తీగ కాలికి చుట్టుకొంటుంది.
అండమాన్‌ ఆకాశం నీలంగా మెరిసిపోతుంది.సముద్రం నాలాగే అశాంతిగా కదులుతోంది.
బీచ్‌ లో ఎవరో విదేశీయులు రంగురంగుల దుస్తుల్లో .. అర్థం కాని భాష మాట్లాడుకొంటున్నారు. బహుశా పోలిష్‌ అనుకొంటా. శరీరవర్ణం అంత ఆకర్షణీయంగా లేదు. వారితో ఒక చిన్నపాప కూడా వుంది. నా వైపే పరిగెత్తుకొంటూ వస్తోంది రంగుల బంతిని తరుముతూ.. బంతి నీడ వేగంగా కదులుతోంది.నాకు చేరువగా వచ్చి ఆగింది బంతి. ప్రశ్నార్థకంగా వచ్చి నిలబడింది పసిపిల్ల. సున్నితమైన చేతులు రెండూ చాచి బంతి ఇవ్వ మన్నట్టుగా అభ్యర్థిస్తోంది. కొంచెం ముందుకు వంగి..  బంతిని అటు తోశాను. దొర్లుతూ పోతోంది రంగురంగుల బంతి. జాగ్రత్తగా దొరకబుచ్చుకొని .. కేరింతలు కొడుతూ పరిగెత్తుకు వెళ్ళిపోయింది.

అప్పుడప్పుడూ జనసంచారం తక్కువగా వుండే సముద్రతీరాల్లో గడపడటం నాకు అలవాటు. ఒంటరితనం మాయమయ్యేది ఎగసిపడే సముద్రాన్ని .. మెరిసిపోయే ఆకాశాన్ని చూస్తుంటే.. ఒక చెట్టు కొట్టుకు వచ్చి .. తీరంలో నిలబడిపోయింది. సగం ఎండుగా .. సగం పచ్చగా..కళకళ లాడుతూ ! కనుచూపుమేరలో ఎప్పటిదో పాతపడవ .. బాగా విరిగి శిథిలమైపోయింది. దాన్ని అలాగే వదిలేశారు.. ఏవో సముద్రపీతలు ఎక్కితిరుగుతుంటాయి.అప్పుడప్పుడు తాబేళ్ళు కూడా దాన్ని సందర్శిస్తుంటాయి.
అలవాటైన వాతావరణం..
జాగ్రత్తగా ఒక్కొక్క ఉత్తరాన్ని చదివి మళ్ళీ ప్లాస్టిక్‌ కవర్‌ లో పెట్టేస్తాను. అందులో నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయినా గతం మీద ఏదో ఆకర్షణ . నీలికవర్‌ లో ఉన్నవన్నీ సుజీ ఉత్తరాలు. ఎర్రకవర్‌ లో ఉన్న పాత ఉత్తరాలు నాన్నవి.

2.
సివిల్‌ సర్వీసెస్‌ లో భాగంగా అండమాన్‌ లో చేరడం నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. అండమాన్‌ అంటే నాన్న దృష్టిలో సెల్యులార్‌ జైలు, ద్వీపాంతరవాస శిక్ష! ” నీకేం ఖర్మరా శుభ్రంగా ఇంత దేశముండగా అక్కడ తగలడ్డానికి” అని చీవాట్లేసేవాడు. తను వచ్చినా ఎక్కువ రోజులు వుండేవాడు కాదు.షేర్‌ అలీని ఉరి తీసిన వైపర్‌ ఐలాండ్‌, ఒకప్పుడు పోర్ట్‌ బ్లయర్‌ కాపిటల్‌ రోజ్‌ ఐలాండ్‌ .. అవీఇవీ చూసి నావల్ల కాదురా అని వెళ్ళిపోయేవాడు. అప్పుడు వంటవాడు కూడా వాడికిష్టం వచ్చినట్టు వండి నాన్నకు మొహం మొత్తించేవాడు తిండంటే. నా అనుమానం తిండి బాగాలేక పోవడం వల్లే నాన్న ఉండలేక పోతున్నాడని. నాన్న ప్రసన్నంగా ఉన్నప్పుడు చెబితే నన్ను చెడామడా తిట్టాడు “తిండిపోతులా కనిపిస్తున్నానా నీ కళ్ళకు” అని.
నాన్న బోసుకు వీరాభిమాని. గాంధీని,నెహ్రూను ఈసడించుకొనేవాడు. అండమాన్‌ పేరును “స్వరాజ్‌” గా మార్చవలసిందే అని వాదించేవాడు. ” తాగలేని పిల్లి బోర్ల దోసుకొన్న చందాన ” బ్రిటిష్‌ వారు  ఇండియాను వదులుకొన్నారు కానీ అహింసావాదులకు ఝడిసికాదు అని స్వరం పెంచేవాడు. జిన్నాను కాంగ్రెస్‌  సృష్టిగా పేర్కొనేవాడు. హిందీ అంటే మండిపడే వాడు.
నాన్న పోయి మూడు సంవత్సరాలు కావస్తోంది. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. ఉన్న ఊరు ససేమిరా వదలననే వాడు.
నేను సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ కు వెళుతున్నప్పుడు రాసినది.
” భయపడకుండా ,ధీమాగా మాట్లాడు.రావడం రాకపోవడం అన్నది నీచేతుల్లో లేదు.అలాంటప్పుడు దాన్ని గురించి ఎక్కువ ఆలోచించకు.ఇక్కడ నాయర్‌ అందరూ కులాసాయే.నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు”

3.
నాయర్‌ నాన్నకు చిన్నప్పటి నుండీ తెలుసు. భోజనం , టిఫిన్‌  నాయర్‌ హోటెల్‌ నుండే వెళతాయి. విసుగు పుడితే నాయర్‌ దగ్గర కూచుని పిచ్చా పాటిగా మాట్లాడుతూ గడిపేస్తుంటాడు. నాయర్‌ కు తెలుగు చదవడం రాయడం రాదు. ఏవైనా లెక్కడొక్కల్లో నాన్న సాయం తీసుకొంటూ వుంటాడు. నాయర్‌ బ్రహ్మచారి. ఇప్పుడు దరిదాపు వంద సంవత్సరాల పండు వయసులో కూడా ఓపిగ్గా కాష్‌ కౌంటర్‌ దగ్గర కూచుని అజమాయిషీ చేస్తేకానీ తనకేమీ తోచదంటాడు.
ఇంకొక ఉత్తరం. నాన్నదే. నాన్న నాకు రాసినవన్నీ కార్డు ముక్కలే !
“నా ఆరోగ్యం గురించి ఆందోళన వద్దు. నాయర్‌ వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు. నాకిక్కడ హాయిగా గడిచిపోతోంది. నీవు మన ఊరి లస్సీ తాగి ఎంతకాలమైందిరా , పిచ్చిసన్నాసివి అండమాన్‌ లో అఘోరిస్తున్నావు గానీ”.
అదే ఆఖరి ఉత్తరం .
ప్రశాంతంగా నిద్రలోనే పోయింది ప్రాణం.
నాయర్‌ ఫోన్‌ చేశాడు “నిండా మునిగిపోతిమప్పా.. నీవు రారా నాయనా” అంటూ.
నాయర్‌ ఇప్పటికీ నన్ను “రా” అనే సంబోధిస్తాడు. నేను హైదరాబాద్‌ లో ఉండి చదువుకోవడం వెనుక నాయర్‌ పాత్ర చాలా ఉంది. నాన్న చేసిన వ్యాపారాలన్నీ బెడిసికొట్టి దివాలా తీసి ఉన్నాడు. నేను చదువుకోవడం కల్లే. నాయర్‌ కు ఇటువంటివన్నీ అనుభవమే. బ్రతికి చెడ్డ వారిని తక్కువగా చూసేవాడు కాదు. నేను మూడునాలుగు గంటలు మాథ్స్‌ క్లాసులు తీసుకొని బండి నెట్టుకొచ్చేవాణ్ణి.
నాన్న ,నాయర్‌ లలో నాకు నచ్చిన అంశమేమిటంటే ,వాళ్ళు ఏనాడూ నా పెళ్ళి ప్రసక్తి తీసుకు రాలేదు.
అమ్మ ఫోటోయే కానీ అమ్మను చూడలేదు నేను. నాన్న చనిపోయాక ఉన్న ఒక్క ఆసరా పోయి ,చాలా బాధ పడ్డాను. నాన్న కోసం ఇది చేయలేదే, అది చేయలేదే అన్న ఆక్రోశం. నాయర్‌ ఓదార్చేవాడు. ” నీవు ఇంతవాడివయ్యావని మీనాన్న ఆనందించని క్షణం లేదు. నీకోసం ఏమీ మిగల్చలేదని బెంగ పడ్డా,నేను సర్దిచెబితే మళ్ళీ మామూలు అయ్యేవాడు. నేనున్నంత వరకు మన ఊరికి వచ్చిపో” అనునయంగా నచ్చజెప్పేవాడు.

4.
విదేశీయులు తిరుగుముఖం పట్టారు. రంగురంగుల బంతిని సముద్రం అల నురగలతో తాకాలని చూస్తోంది. ఒక్క క్షణం సముద్రానికి ఆడుకోవాలని పిస్తుందేమో! నా ఊహకు నేనే నవ్వుకొన్నాను.

నీలికవరులో ఉన్నవి సుజీ ఉత్తరాలు. సుజీ వాళ్ళది చాలా సంపన్న కుటుంబం.
డిగ్రీ అవగానే వాళ్ళకున్న బిజినెస్‌ నే చూసుకొంటోంది.
మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. హైద్రాబాద్‌ లో బోనాలు ఎప్పటిలా చాలా సందడిగా జరుగుతున్నాయి. నేను ఇందిరా పార్క్‌ వైపు నుండి వస్తున్నా. జీన్స్‌ లో ఉన్న అమ్మాయి వాచీ వైపు అసహనంగా చూసుకొంటోంది. ట్రాఫిక్‌ మొత్తం స్తంభించి పోయింది. ఆటోలు ఏవీ రావడం లేదు. తన మొహం లో ఆందోళన చూస్తుంటే నాకర్థమయింది.. ఏదో బస్సో , రైలో పట్టుకోవాలి..
నేను దగ్గరిగా వెళ్ళి ” లిఫ్ట్‌ కావాలా ” అన్నా. ఆమె సంకోచంగా, కాస్త వేగంగా చెప్పింది.
” కార్‌ ట్రబులిచ్చింది. అరగంటలో ఏర్‌ పోర్ట్‌ చేరక పోతే ,బాంబే ఫ్లైట్‌  మిస్సవు తుంది”.
మరేమీ ఆలోచించకుండా, బండి స్టార్ట్‌ చేసి, సందులు గొందులు పట్టు కొని ఏర్‌ పోర్ట్‌ చేర్చాను. సుజీ పరుగో పరుగు.
తర్వాత కూడా అప్పుడప్పుడు కలిసే వాళ్ళం.
ఒక రోజు సుజీ ఎందుకో ఎప్పటిలా లేదు. కొంచెం ఉద్విగ్నంగా ఉంది. తలస్నానం చేసింది. ఎప్పుడూ లేనిది చీర కట్టుకొంది. నాకెందుకో ఆశ్చర్యం వేసింది. ఆ రోజు తన పుట్టినరోజు కాదని నాకు తెలుసు.
“ఎనీతింగ్‌ స్పెషల్‌ ?” అడిగాను
“సమ్‌ తింగ్‌ స్పెషల్‌ !” అంది నవ్వుతూ నల్లని వెంట్రుకలు బుగ్గల మీదికి జారాయి. స్థిరంగా నా వైపు చూసింది..
కనులార్పకుండా !
ఉద్విగ్నత నాలో మొదలయింది..నాకు తెలియకుండా.
ముందుకువంగి, నా చెవిని మెలివేస్తూ.. “మొద్దూ” అంది అధికారంగా,గారంగా.
ఆరోజు చాలా సేపు మాట్లాడుకొన్నాం. మాటల్లోంచి బయట పడేసరికి సిటీ వెలిగి పోతోంది. ఒక్కసారి మా ఇద్దరి మధ్య దూరం తగ్గిపోయిందనిపించింది. ” సివిల్స్‌ లో నాకేదైనా వస్తేనే.. అన్నీ సాధ్యం ” అని నేనొకసారి అంటే  “నాకు తెలుసు ” అని పొడిగా తుంచి వేసింది.
సంభాషణను నేను పొడిగించలేదు.
సముద్రం గాలికి రెపరెపలాడుతుంది సుజీ ఉత్తరం !

5.
” నీవు తోకను వెంట పెట్టుకొని వచ్చినా సమస్య లేదు. నీతో దెబ్బలాడటానికి కారణం తోక కాదు. వేరే వుంది. నీవింత సీరియస్‌ అవుతావు అనుకోలేదు. మొద్దూ.. రారా.. నాకేమీ తోచట్లేదు. ఈ బిజినెస్‌ తో నాకు  మతిపోయేలా వుంది.”

తోక అంటే అవని ! నేను అద్దెకుంటున్న ఇంట్లోనే వారూ ఉంటారు. ఐతే క్రింది పోర్షన్‌ ఒక పదేళ్ళు ఉంటాయంతే. మొండిఘటం. స్కూలుకు వెళుతుంది, మానేస్తుంది. వాళ్ళ తాత, మామ్మ దగ్గర పెరుగుతోంది. చాలా చలాకీ. అమ్మా నాన్నా ఇద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తాత,మామ్మ అతి గారాబం చేసేవారు. సాయంత్రానికి పుట్టెడు సమస్యలు తెచ్చిపెట్టేది. అల్లరి భరించలేకపోయే వారు. అవని చాలా దుడుకు !

ఒకరోజు నేను దీక్షగా చదువుకొంటూ ఉన్నా. మొత్తం సీసా ఇంకు కుమ్మరించింది నా మీద వెనుకనుంచి వచ్చి. నా గది తలుపులు తెరిచే వుంచుతా. నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. కుమరన్‌ అనే అరవతను నాతోనే ఉండేవాడు. అతన్ని బొత్తిగా లెక్క చేసేది కాదు. నేను గొంతు పెగల్చుకొని “అవనీ ఏమిటిది” అంటే ” రెడ్‌ ఇంక్‌ ” అని తుర్రుమంది.
నేను కోపంగా వెంటపడ్డాను. చుట్టుపక్కల వాళ్ళు నా అవతారం చూసి గొల్లుమన్నారు. అవనికి కావలసిందదే. దాదాపు దొర్లి నవ్వు తోంది. నా స్థానంలో కుమరన్‌ ఉంటే నేను అలాగే నవ్వేవాడిని ! దాని సంతోషం చూసి ఒక్క క్షణం నాకు ముచ్చట వేసింది. రెండు చేతులతో ఎత్తుకొని అవని మొహమంతా ముద్దులతో ముంచెత్తాను.
” వదులు ..ఛీ రెడ్డింకు ” అని లబలబలాడింది.
తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం. అవగాహన కుదిరింది మా ఇద్దరి మధ్య. కొంతకాలం గడిచాక నన్ను అసలు వదిలి వుండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వుండేది. వాళ్ళ తాత,మామ్మే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ ఊపిరి పీల్చుకొన్నారు ప్రశాంతంగా. అంతటితో ఆగక ” తోక ” అని నామకరణం చేశారు;నన్ను తోకలా అంటిపెట్టుకు వుంటుందని. “అవనీ” అని పిలిస్తే పలక్క పోతే వెంటనే ” తోకా ” అని పిలిచేవారు. బాణంలా దూసుకు పోయేది అలా పిలిచిన వారిమీదికి. అలా పిలిపించుకోవడం దానికి అసలు ఇష్టం వుండేది కాదు. సుజీ దగ్గరకు వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాగోలా అవనిని తప్పించేవాణ్ణి. ఒకసారి మాత్రం మంకుపట్టు పట్టి కూచుంది! తీసుక వెళ్ళక తప్పింది కాదు.
కానీ ఊరకుంటుందా !? సుజీని విసిగించింది. సుజీ చాలా సున్నితం. ఆరోజు సుజీని వెక్కిరించింది తను ఏం మాట్లాడితే అది మాట్లాడి. సుజీ నన్ను తిట్టి పడేసింది గోల భరించలేక. ఆ పై వారం నేను తనను కలవలేదు.. సుజీ కోపం తగ్గాక కలుద్దాంలే అని!
అప్పుడు రాసిన ఉత్తరమది!

6.
ఆ ఏడు సివిల్స్‌ రిజల్స్ట్‌ వచ్చాయి. కానీ నా పేరు లేదందులో.
అవని చాలా తెలివైనది. నా మొహం లో నిరాశను కనిపెట్టేసింది. మేడ మీద ఆరుబయట కుర్చీ వేసుకొని కూర్చున్నా. వెన్నెల పడుతోంది జాలిగా.. వెనుకనుండి వచ్చి.. నా కళ్ళు మూసిపెట్టి  ” ఎవరో కనుక్కో ” అంది. నేను ఎరుగనట్టు “కుమరన్‌” అని చెప్పా ! సుజీని అనుకరిస్తూ ” మొద్దూ ” అని తలమీద చరిచి బుగ్గమీద ముద్దు పెట్టుకొంది. నా కన్నీళ్ళు ఆగలేదు. భయంగా నా మెడను వాటేసుకొంది. అలాగే వుండిపోయాను.

నాన్న, నాయర్‌  కబురు పెట్టారు ఒక్క వారం ఊరికొచ్చిపో అని. నాక్కూడా గాలిమార్పు కావాలనిపించింది. సుజీకి మొహం చూపించాలనిపించలేదు. నాయర్‌ ఓదార్చాడు. నాన్న ” పోనీ ఈసారి వస్తుందిలే ” అని ధైర్య వచనాలు పలికాడు.

నేను తిరిగి వచ్చేసరికి అవని నా  మీద దిగులుతో మంచం పట్టింది. జ్వరంతో దాని వళ్ళు కాలిపోతోంది. ” మామా “అని పలవరిస్తోంది. తాత ,మామ్మలు గాభరా పడిపోతున్నారు. కొన్నిరోజులకే అవని ఆరోగ్యం చక్కబడింది పక్కనే వుండి సపర్యలు చేస్తుంటే.

సుజీ నా మీద ఎక్కడలేని కోపంతో కాగిపోతోంది. నాకు సర్వీసు రానట్టు తనకు తెలిసిపోయింది. ” నీకు సర్వీసు వచ్చినా సరే ,నాకు ఇలాగే మొహం చూపేవాడివి కాదు..అవునా ” ఆవేశం తో వణికిపోతోంది. సుజీకి నేనెంత నచ్చచెప్పాలని చూసినా వినిపించుకోలేదు, విసురుగా వెళ్ళిపోయింది.

సరిగ్గా ఒక నెల తిరిగే సరికి సుజీ పెళ్ళి !
బిత్తరపోవడం నా వంతయింది.
మళ్ళీ చదువు మీద దృష్టి నిలిపాను. విసుగనిపిస్తే అవనితో గడిపే వాణ్ణి. నాలో గూడు కట్టుకొన్న విషాదాన్ని, పెరిగిన పట్టుదలను పసిగట్టినట్టే వుంది అవని. నేను చెప్పిన మాట జవదాటేది కాదు. గాలి పటాలు, వింత బొమ్మలూ, రంగుల రిబ్బన్లు.. తనకేది కావాలంటే నేనది తెచ్చిపెట్టే వాణ్ణి.. ” కాదు కూడదు ” అనేవాణ్ణి కాను.

సంవత్సరం తిరిగేసరికల్లా నాకు సర్వీసు రావడం, అవనిని బెంగుళూర్‌ లో చేర్పించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. బెంగుళూరుకు నేను రావాలట. నాకూ వెళ్ళాలనే వుంది కానీ, ట్రైనింగ్‌ మొదలవబోతోంది. చాలా ఒట్లు పెట్టించుకొని వెళ్ళిపోయింది తోక ! ఆ రోజు రాత్రి బయట కుర్చీ వేసుకొని కూచున్నా.. వెలితిగా వుంది. మనసంతా అమాయకంగా అవని.
ఎప్పటిలా వెన్నెల పడుతోంది.

7.
నాయర్‌ ,నాన్న చాలా సంతోషంగా ఉన్నారు నాకు సర్వీసు వచ్చినందుకు. నేను ట్రైనింగ్‌ ముగించుకొని వచ్చేసరికి అవనీ వాళ్ళ మామ్మ, తాతయ్య ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వీరు ఎక్కడికీ పోరన్న భరోసాతో అవని ఏ స్కూల్లో చేరిందో వివరాలు అవీ సరిగ్గా తీసుకోలేదు. ఎంత విచారించినా లాభం లేక పోయింది. నేను క్రమ క్రమంగా పని వత్తిడిలో  అన్నీ మరచిపోయా. అండమాన్‌ ఆకాశం, దాన్ని తాకే నీలిసముద్రం నా ఒంటరితనాన్ని పంచుకొన్నాయి.

బాగా చీకటి పడిపోయింది.సెల్యులార్‌ జైల్లో  Light and show  జరుగుతున్నట్లుంది.
” సాబ్‌ హమ్‌ ఘర్‌ చలేంగే ” కారు డ్రైవర్‌ హుకుం సింగ్‌  నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. దుస్తులకంటిన ఇసుక దులుపుకొని లేచా. చీకటిలో సముద్రం తన రూపు మార్చుకొంటుంది. నాకెందుకో మరింత విహ్వలంగా కనిపించి అబ్బుర పరిచింది. అప్పారావు నాకోసమే కనిపెట్టుకొని కూచున్నాడు. “ఎక్కడికి వెళ్ళిపోనారు బాబూ” అంటూ .. విస్తరి వేసి వడ్డించాడు. నాకు విస్తరి భోజనం ఇష్టం.
అప్పారావు వంట్లో శక్తి ఉన్నంత  వరకు సా మిల్ల్లు లో పని చేశాడు. ఒకసారి బీచి దగ్గర కనిపించి ” ఏదైనా పని ఇప్పించండి బాబయ్యా ” అన్నాడు. అండమాన్‌ లో తెలుగు వాళ్ళు బాగానే వున్నారు. ఎప్పుడో వచ్చేశారు. వారి తెలుగు వింటుంటే అనందం కలిగేది. ” ఏ పని చేయగలవు ” అంటే “వంట బాగా వచ్చ”న్నాడు. తెలుగుతిండికి మొహం వాచి నేను మరేమీ ఆలోచించకుండా పనిలో చేరమన్నా. out house  లో వుంటూ వంటా వార్పూ,ఇంటిపని బయట పనీ అన్నీ తనే చూసుకొనే వాడు. భోంచేసి తలవాల్చేసరికి బాగా పొద్దు పోయింది. దూరంగా సముద్రం హోరు.

8.
రోజూ ఉదయం 1112 గంటల మధ్య ఎవరైనా సందర్శకులు వస్తుంటారు.
సాధారణంగా విదేశీయులు. అన్ని ఐలాండ్స్‌ లోకి వారిని అనుమతించం. ట్రైబల్‌ రిజర్వ్‌ ఏరియా లోకి వెళ్ళాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. జార్వాలు, ఓంగేలు తిరుగాడుతుంటారు. ఇప్పుడిప్పుడే వారు జనాల్లోకి అరుదుగా నైనా సరే వస్తున్నారు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదు. నాగరికత వారిని నాశనం చేసింది. గతంలో వేలల్లో ఉన్న జనాభా ఇప్పుడు వందల్లోకి వచ్చి చేరింది. జార్వాలు అప్పుడప్పుడు కొంచెం క్రూరంగా వ్యవహరించడం కూడా కద్దు. పందులు, కొబ్బరి కాయలు లాంటివి వారికిచ్చి వారితో స్నేహసంబంధాలు నెలకొల్పుకోవటానికి ప్రయత్నిస్తూనే వుంటాము. వాళ్ళూ కలిసిపోవాలనే చూస్తున్నారు. ఏ పని చేపట్టినా వారి సహజ జీవితానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుతుంటాం.
సందర్శకుల సంఖ్య పలుచగానే వుంది. ఎవరో ఆంగ్ల వనిత  ” నికోబార్‌  ఐలండ్‌ లోకి వెళ్ళాలి, అనుమతించండి ” అని విజ్ఞాపన పత్రం రాసుకొచ్చింది. దాన్ని ఒక్కసారి చూసి, ఆమెకే తిరిగి ఇచ్చి “సారీ విదేశీయులను అనుమతించం,” అని మృదువుగా చెప్పాను. నిరాశగా వెళ్ళిపోయింది.
ఇంకో అమ్మాయి ,జీన్స్‌ లో వుంది. Anthropology field study కోసం వచ్చింది.
Tribal Reserve Area  లో తిరిగి,జార్వాల గురించి మెటీరియల్‌ తయారు చేసుకొంటుందట ఒకటి రెండు సార్లు Department  నుండి ముందస్తు అనుమతి కోసం letters  పంపినా బదులు రానందున కలకత్తా నుండి నేరుగా వచ్చేశానంది.
” ఫీల్డ్‌ స్టడీ చేసుకోవచ్చు, కానీ కొంచెం లోపలికి వెళ్ళాలంటే  armed guards   అవసరం. లేనిపోని సాహసాలు చేయకండి ” అని చెప్పా. లోగడ కలకత్తా నుండీ వచ్చిన పర్ణా ఉదంతం నాకు బాగా గుర్తే. నేను వచ్చిన కొత్తలో జరిగిందది. దగ్గరలో గార్స్డ్‌ లేకపోతే ఆమెను గాయపరిచేవారే. అప్పటికే  ఆమెను వాడి గోళ్ళతో రక్కారు !

“పర్ణా తెలుసా !”అన్నా నవ్వుతూ.
“ఎక్కడో కాలిఫోర్నియా లో ప్రొఫెసర్‌ గా చేస్తోంది ” అని చెప్పింది. జుట్టు చాలా ఒత్తుగా వుండి ఆమె మొహం మీద పడుతోంది. చాల ఆత్మీయంగా వుంది ఆమె నవ్వు.
ఆమె చేతిలో లావాటి గ్రంథం.  THE GOLDEN BOUGH -JAMES FRASER . పర్ణా దగ్గర అటు వంటి పుస్తకమే చూసినట్టు లీలగా జ్ఞాపకం..
తన అప్లికేషన్‌ మీద సైన్‌ చేసి  లోపల పెడుతూ యథాలాపంగా పేరు చదివాను.
” అవనీకుమారి  “!! తను వెళ్ళిపోతోంది.
“అవనీ !”
తిరిగి చూసి “ఏమి ” అన్నట్టుగా కనులెగరవేసింది. పరిశీలనగా చూశా! సందేహం లేదు అవనియే.. మరి అడ్రసు కలకత్తా అని వుందే.
” మీకు చక్రధర రావు తెలుసా ” నింపాదిగా అడిగాను.
ఈసారి ఆశ్చర్యపోవటం తన వంతైంది. నమ్మలేనట్లు నా వంక చూసింది. అది వారి తాత పేరు. తేరుకోకముందే “నేను చందూని ..మామని..” అన్నా విభ్రమంగా! కుర్చీలో చేష్టలుడిగి కూర్చుండి పోయింది. వెంట వెంటనే అందరినీ పురమాయించాను. హుకుం సింగ్‌ కారు తెచ్చాడు. తను దిగిన కాటేజ్‌ నుండి లగ్గేజ్‌ వచ్చేసింది. అప్పారావు కు ఫోన్‌ చేసి, గెస్ట్‌ రూమ్‌ శుభ్రం చేసి, నా గదిలో ఉన్న బోన్సాయ్‌ చెట్టుని అందులోనే పెట్టమన్నాను.
అవనికి బోన్సాయ్‌ మొక్కలంటే ప్రాణం.

9.
అవని ఇంటికి వెళ్ళాక కాల్‌  చేసింది.
” మామా నేను నమ్మలేక పోతున్నా. అండమాన్‌ .. నువ్వు ”
“స్నానం చేసి రడీగా వుండమని ” చెప్పాను. నేనూ అలవాటు చొప్పున చన్నీళ్ళు దిగబోసుకొన్నా. చెంపల దగ్గర జుట్టు నెరిసింది. మీసం గుబురు పెరిగింది. అద్దం లో నాకు నేను అపరిచితంగా కనిపించాను.

” ఒకే నేను రెడీ ” ఆఫీసు లో నేను చూసిన అవని, ఇంట్లో తిరుగాడుతున్న అవని ఒకరు కాదనిపించింది. తేటగా వుంది వదనం. రోజూ వెళ్ళే బీచి కే వెళ్ళాం. సూర్యుడు దిగి పోతున్నాడు. పక్షుల అరుపులు. అంతా అవనియే మాట్లాడింది. తాతయ్య తను పీజీ లో చేరాక పోయారట. కలకత్తా లో కలిసే వుండేవారట. అవని కంటతడి. సూర్యుడు పూర్తిగా మునిగి పోయాడు. తనకు ఇంకా చదవాలని వుందట. కాలిఫోర్నియా లో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న పర్ణా సాయం చేస్తానందట. చెబుతున్నదల్లా ఆగి ,అటూ ఇటూ చూసి నా వళ్ళో తల పెట్టుకొని పడుకొంది. ఏదో దీర్ఘాలోచనలో పడినట్టు తన మొహమే చెబుతోంది. పై చదువుల గురించేనా ?
“నా బాంక్‌ బాలన్స్‌ ఓ రెండు లక్షల దాకా ఉంటుంది. నీ చదువుల గురించి బెంగ పెట్టుకోవద్దు. నీకెందుకు నే ఉన్నాగా !?” తల ఎత్తి కనులలోకి చూసింది.
నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేనలా ఆలోచిస్తుంటే మరుక్షణమే నవ్వింది. అడవిపూల సుగంధం అలముకొన్నట్టనిపించింది. తన కళ్ళలో మెరుపు !
” నేను నీకు ఏమవుతాను ?” నా చేయి తన చేతిలోకి తీసుకొంది. ఇద్దరిమీదా వెన్నెల పడుతోంది. చాలా సంవత్సరాల తర్వాత నాకెందుకో ప్రశాంతంగా నిద్ర పట్టింది.

10.
అవని నేను లేచేసరికి నోట్స్‌ రాసుకొంటూనో, చదువుకొంటూనో వుండేది. కాఫీ కలిపేది. అప్పారావు అవని రాకతో బ్రహ్మానంద పడిపోయాడు. “అమ్మాయి గారు” అంటూ కలియ దిరుగుతున్నాడు. హుకుం సింగ్‌  కలకత్తా లో పెరిగాడట. సరదాగా అవనిని బెంగాలీ లో పలుకరించేవాడు. తనను రిజర్వ్‌ ఏరియాకు హుకుం సింగే తీసుకువెళ్ళేవాడు. తన పనులన్నీ అప్పారావు చూసే వాడు. అవని వర్క్‌ అనుకొన్నదాని కన్నా వేగంగా సాగుతోంది. కొందరు జార్వాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంది.
ఒకరోజు నేను ఇంటికొచ్చేసరికి అప్పారావు ఎదురొచ్చి “అమ్మాయి గారు ఇంకా రాలేదండి ” అన్నాడు. సింగ్‌  అవనిని తీసుకు వచ్చి వదిలి, కారును ఆఫీసు దగ్గర వుంచేవాడు. సాయంత్రం నేనే నడుపుకొంటూ వచ్చేస్తా. నా మనసెందుకో కీడు శంకించింది. అప్పారావు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా కార్‌ స్టార్ట్‌ చేసి హుకుం సింగ్‌ ఇంటికి పోనిచ్చా.

కారు శబ్దం వినగానే హుటాహుటిన లేచి వచ్చాడు. అవని కొంచెం ఆలస్యంగా వచ్చి పికప్‌ చేసుకొమ్మందట. జార్వా స్త్రీల అలంకరణ చూడాలి అందట. నా భయమల్లా అవని పర్ణాలాగా అత్యుత్సాహంతో లోపలికి వెళ్ళి ఏ కష్టాలు కొనితెచ్చుకొంటుందో అని. జార్వాలకు, ఒంగేలకు బయటి వారి పొడ గిట్టదు. ఇరవై నిమిషాల్లో అక్కడ ఉన్నాం. అవని ఏదో రాసుకొంటోంది బుక్‌ లాంప్‌ వెలుగులో. నాకు చర్రున కోపం వచ్చి నాలుగు మాటలు అనేశాను. ఇంకెప్పుడు అవనిని చీకటి పడ్డాక అక్కడ వదిలేసి రావద్దని హుకుంసింగ్‌ కు గట్టిగా చెప్పాను. సలాం కొట్టి వెళ్ళిపోయాడు. అప్పారావు అన్నీ సిద్ధం చేసి చుట్ట కాల్చుకోవడానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇద్దరికీ వడ్డించి అవనిని పిలిస్తే ఆకలి లేదంది.
అలిగిందంటే చచ్చామే..రోజుల తరబడి భోజనం మానేస్తుంది.
చాలా సేపు బ్రతిమిలాడగా పెరుగున్నం మాత్రమే తింటానంది.
తన గదిలో బోన్సాయ్‌ కొత్త ఆకులు తొడిగింది. జార్వాలు చేసిన వస్తువులు చిత్రంగా వున్నాయి. “సతాయించక తినరా” అన్నాను అన్నం దగ్గరకి జరిపి.
పెరుగన్నం నా మొహానికేసి కొట్టింది. జాతర లో ఎగిరే పెద్ద ఆటవికుడిలా వున్నా.
పీజీ చదువుతున్నా ప్రవర్తనలో ఏమీ మార్పు వచ్చినట్టులేదు.
మొహం కడుక్కొని తలుపు చప్పుడయ్యేలా వేసి నా గదిలో నేను పడుకొన్నా. నాకు తినాలనిపించలేదు. అటూ ఇటు దొర్లుతుంటే నిద్ర రావడం లేదు.
చవితి చంద్రుడు కంఠహారంలా వున్నాడు.తలుపు దడాలున తెరుచుకొంది. లైటు వెలిగింది. చేతిలో ప్లేటుతో అవని. హమ్మయ్య అనిపించింది, అంత తేలికగా రాజీ కొచ్చినందుకు.
ఆ ప్లేట్‌ లోనే చపాతీలు ఇద్దరం కలిసి తిన్నాం. చల్లని మజ్జిగ తాగుతుంటే హాయిగా వుంది. అవని నాతో ఏమీ మాట్లాడలేదు, విసవిసా అటూ ఇటూ రెండుసార్లు  తిరిగి వెళ్ళి పడుకుంది. జిమ్‌ కార్బెట్‌ కథలు చదువుకొంటూ ఎప్పుడో నిద్రపోయాను.

11.
అవని వాళ్ళ ప్రొఫెసర్‌ పర్ణా కాల్‌ చేస్తూ ఉండేది. “అవని భారమంతా నాదే. తను కోరిన కోర్సులో చేర్పించే పూచీ మీది ” అని చెప్పాను. మధ్యలో అవని గైడ్‌ తో మాట్లాడాలి అని కలకత్తా వెళ్ళి వచ్చింది. ఈ లోగా కాలిఫోర్నియా యూనివర్సిటి లో అవనికి అడ్మిషన్‌ దొరికిందని పర్ణా చెబితే తెలిసింది. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నాయర్‌  నాకు సివిల్‌ సర్వీస్‌ వస్తే పడినంత ఆనందం. మద్రాస్‌ నుండి అవనికి డ్రస్సులు,సూట్లు కావలిసినవన్నీ తెప్పించా. టికెట్‌ కూడా confirm  చేయించాను.
అవని ఎందుకో ఈ మధ్య నాతో ముభావంగా ఉంటోంది. సాయంత్రం బీచిక్కూడా రానంటోంది.
ఒకరోజు ఎప్పటిలాగే ఆఫీసు నుండీ వచ్చి స్నానాదికాలు  ముగించుకొని వచ్చి చూస్తే కార్‌  తాళాలు కనిపించలేదు. అవని గదిలో తొంగి చూస్తే బోన్సాయ్‌ మొక్క పలుకరించింది. తను లేదు.
కారులోనే మరచిపోయానా ?  అలా ఎన్నటికీ జరగదు.
కారు స్టార్ట్‌ చేసిన చప్పుడు. బయటికి వచ్చి  చూస్తే డ్రైవరు సీట్లో అవని. ఈ మధ్య అవని బాగానే డ్రైవ్‌  చేస్తోంది. హుకుంసింగ్‌ తర్ఫీదు లో రాటుతేలినట్టు వుంది.

12.
సముద్రం ఎగిరెగిరి పడుతోంది.తోసుకొని వచ్చేటప్పుడు అది చేసే చప్పుడు నాకిష్టం.అవని నాకు కొంచెం దగ్గరగా జరిగి కూచుంది.నేను అలలను గమనిస్తున్నాను.
” నాకు కాలిఫోర్నియా వెళ్ళాలని లేదు ”
ఒక్కసారి ఉలిక్కి పడ్డాను.అలలు వెనక్కి వెళ్ళిపోయాయి.
ఉంగరాల జుట్టు నుదుటిమీద పడుతోంది.కనులు విప్పార్చి చూసింది.
” నన్ను ఎందుకు పంపించేయాలని చూస్తున్నావు? ” నేను ఊహించని ప్రశ్న .ఎక్కడో తాకింది.అలలు నురగలతో ఉరికి వస్తున్నాయి.రాతిలో చెమ్మలా నా కంట నీరు.అవును తనకైతే ఎవరున్నారని ?ఇటు వత్తిగిలి నా గుండెల మీద తల పెట్టుకొని పడుకొంది.నా గుండె చప్పుడు నాకు తెలుస్తూనే వుంది.తన కపోలాల చిరస్పర్శ.
” మామా నేను నీతోనే ఉంటానురా ” ప్రతి  పదాన్ని పట్టి పట్టి అమాయకంగా పలుకుతోంది.కనులు మూసుకొన్నాను.
చీకటి.. నురగల సద్దు.సున్నితమైన ముద్దు !
నా కనుల మీద ..నుదుటి మీద ..
చంద్రుని  వైపు చేతులు చాస్తోంది సముద్రం
కడలిలో తన ప్రతిబింబాన్ని వెదుక్కునే వెన్నెల గాఢాలింగనం ..
ఎంతసేపు అలా ఉన్నామో తెలియదు.
శాంతించింది సముద్రం !


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...