“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
ఈ సంచికలో ఒక ముఖ్య విశేషం ఇందులోని రచనల్న్నీ PDF రూపంలో ఉండటం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో తెలుగు అక్షరాలు సక్రమంగా రావటం లేదన్న మీ అభిప్రాయానికి ప్రతిస్పందన ఈ ప్రయత్నం. మీకు నచ్చుతుందనే ఆశిస్తాం.
ఒక ముఖ్య గమనిక – ఎక్రొబాట్ రీడర్ ఒక్కోసారి వెంటనే ఫాంట్స్ లోడ్ చెయ్యకపోవచ్చు. ముఖ్యంగా పెద్ద ఫైళ్ళ విషయంలో ఇది జరుగుతుంది. అలాటప్పుడు కర్సర్‌ని కుడిపక్కనున్న స్క్రోల్‌బార్ మీద కిందికి జరిపితే ఫాంట్స్ లోడ్ అవుతాయి.
ఇక ఇందులోని రచనల విషయానికి వస్తే, ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది – అభ్యుదయ కవితోద్యమారంభంలో అందులో ముఖ్య పాత్ర వహించిన వారందరితోనూ చాలా సన్నిహిత సంబంధాలున్న డాక్టర్ ఆవంత్స సోమసుందర్ గారు “ఈమాట” కోసం ప్రత్యేకించి రాసి పంపిన ఒక వ్యాఖ్యా వ్యాసం. శ్రీరంగం నారాయణ బాబు “మౌనశంకం” కవిత గురించిన ఎన్నో కొత్త విషయాల్ని, ఆ కవిత పుట్టుక చుట్టూ ఉన్న అనేక సంఘటనల్ని ప్రత్యక్ష సాక్షిగా వివరించారు వారు. ఎంతో శ్రమ చేసి ఇంతటి ఉన్నత రచనని పంపిన శ్రీ సోమసుందర్ గారికి మా కృతజ్ఞతలు. ఇందుకు కారకులైన శ్రీ వెల్చేరు నారాయణ రావు గారికి అభివందనాలు. కవిత్వంలో ఆసక్తి ఉన్న వారందరూ చదవవలసింది ఈ వ్యాసం.
ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు ఇప్పటి తెలుగు సాహిత్య రంగపు పరిస్థితిని, దానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటనల్ని, శక్తుల్ని, తమదైన ప్రత్యేక విశ్లేషణాత్మక దృష్టితో వివరించిన వ్యాసం పాఠకులందరూ చదివి తీరవలసింది.
మన మధ్య ఉంటూ, “ఈమాట”కు క్రమం తప్పకుండా కవితల్ని అందిస్తున్న విన్నకోట రవిశంకర్ కవితాసంకలనం “కుండీలో మర్రిచెట్టు” పూర్తిపాఠం, “ఈమాట”కు అనుబంధంగా అందిస్తున్నాం. అలాగే 15 శతాబ్దపు వింత కవి వినుకొండ వల్లభరాయని విశేషరూపకం “క్రీడాభిరామం” మూలాన్ని కూడా పూర్తిగా ఇస్తున్నాం. 20వ శతాబ్దంలో చాలా కాలం పాటు చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అద్భుత రూపకాన్ని చదివి అందులోని ఎన్నో రసవత్తర విశేషాల్ని ఆస్వాదించమని ఆహ్వానం.
వీటికి తోడు మామూలుగానే మీకు నచ్చే ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలతో సర్వాంగ సుందరంగా మీ ముందుకు వస్తోందీ సంచిక. రసజ్ఞ పాఠకులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.