చెడిపోయిన కథలు

1.

కథ ఇట్లా మొదలుపెట్టవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

ఏమీ జరక్క ముందే ఇట్లా అకస్మాత్తుగా ముగించవలసి వస్తుందని కూడా.

2.

తల వంచుకుని ఫోన్‌లో మెసేజెస్ చూసుకుంటూ వచ్చీ పోయే జనాలకు దూరంగా నిలబడి ఉంది మాల్ ముందు. కిరణ్‌కి మళ్ళీ కొట్టింది, “ఎక్కడ?” టిక్కులు నీలంగా మారలేదు. లోపలికి వెళదామా అనుకుంటూనే చూడకుండా వదిలేసిన మెసేజెస్ చూసుకుంటూ ఉండిపోయింది.

అన్నీ డిలీట్ చేశాక విసుగు బయటపడబోయేంతలో కిరణ్ నుంచి మెసేజ్. “సారీ బేబ్! దారిలో ఆక్సిడెంట్లో పడిపోయిన స్కూటర్ మీద పెద్దాయన్ని అందరూ చూసీ చూడనట్లు వదిలేసి పోతుంటే హాస్పిటల్‌కు తీసుకురావలసివచ్చింది. నాకు లేటవుతుంది.”

కొంచెం చిరాకనిపించినా లోలోపల హాయిగా అనిపించింది. అతనిలో ఆమెకి నచ్చిందదే. ఎప్పుడూ బ్లడ్ డొనేట్ చేస్తూనో, వీధి పిల్లలకి పాఠాలు చెబుతూనో ఉంటాడు. చాలామందిలా ఆ పనులు చేస్తూ ఫొటోలు తీసుకుని చాటింపు వేసుకోడు.

కేండిల్ లైట్ ఊరేగింపులో మొదటి పరిచయం. అమాయకమైన మొహమూ, నిజాయితీతో మెరిసే కళ్ళూ. అతని ప్రేమలో పడడానికి ఎంతో సమయం పట్టలేదు. అతన్ని తల్చుకుంటుంటే పెదాలమీదికి నవ్వు తేలి వస్తూంది.

“మీరు కావ్య గదా!” ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు అతను.

“మిమ్మల్ని ఎప్పుడూ చూసిన గుర్తు లేదు!” తెలిసినవాడిలా పలకరిస్తుంటే అర్థంకాక అతనికేసి చూస్తూ అంది.

“మీరు నాకు తెలుసు గానీ నేను మీకు తెలియదు. మిమ్మల్నయినా ఇదే చూడడం. గుర్తుపట్టడం కష్టమయింది. మీరు జీన్స్, తెల్ల షర్ట్‌తో ఉంటారని తెలియదు. ఫోన్‌లో మెసేజెస్ చెక్ చేసేవాళ్ళు ఇక్కడ ఇంకో ముగ్గురున్నారు.”

“ఏం కావాలి?”

“కిరణ్ మెసేజ్ పంపాడు గదా!”

“ఓఁ, కిరణ్ ఫ్రండా! మీ గురించి ఎప్పుడూ చెప్పలేదు.”

“ఫ్రండా పాడా! వాడో పెద్ద ఫ్రాడ్!”

“ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి?”

“నాకు అంతా తెలుసు. ఎలా మొదలయిందో, ఎట్లా ముగుస్తుందో. మీరు ముద్దుపెట్టుకునేది సెల్ఫీ తీస్తాడు. మీ నేకేడ్ ఫొటో మీరే పంపుతారు. తర్వాత సెక్స్టింగులూ. చివరికి అవన్నీ చూపించి బెదిరిస్తాడు. మీరు ఇంట్లో డబ్బు దొంగిలిస్తారు, నగలు అమ్ముతారు. వాడి ఫ్రండ్స్ మీవెంట పడతారు. మీరు రెండో పేజీ కూడా దాటరు.”

“మీరు పొరపాటు పడుతున్నారు. ఆ రెండో పేజీ ఏమిటి?”

“ఫేజ్… రెండో ఫేజ్. వదిలేయండి. కానీ నామాట నమ్మండి! మీకు కేండిల్ లైట్ ఊరేగింపులో పరిచయమయ్యాడు. ‘సారీ బేబ్! దారిలో ఆక్సిడెంట్లో పడిపోయిన స్కూటర్ మీద పెద్దాయన్ని అందరూ చూసీ చూడనట్లు వదిలేసి పోతుంటే హాస్పిటల్‌కు తీసుకురావలసివచ్చింది. నాకు లేటవుతుంది’ అనే కదా అతను మెసేజ్ పంపింది? కొంచెం చిరాకనిపించినా లోలోపల హాయిగా అనిపించింది కదా మీకు?”

“నా మెసేజెస్ ఎట్లా తెలిశాయోగానీ మీరు అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నట్టున్నారు. అటువంటి దుర్మార్గుల మూలాన ఎవరో దగ్గరవారిని పోగొట్టుకుని ఉంటారు. కిరణ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ప్లీజ్ వదిలేయండి!”

“మంచివాడినని నమ్మించడం ఎంత తేలికో తెలియదు మీకు. బ్లడ్ డొనేషన్ పేరు సునయన. నర్స్. వీధి పిల్లల పాఠాల పేరు అమూల్య. టీచర్. కానీ ఆ పేర్లు తర్వాత ఎపుడో బయటపడేవి. నేను చెప్పకపోతే మీకు ఎప్పటికీ తెలియవు. ఆ ఫొటోలు మీకు పంపంది అతను అట్లాంటి మంచి పనులేవీ చేసే రకం కాదు కనకనే!”

“కానీ నేనట్లా చేసేదాన్ని కాదు. అలాంటి పనులు ఎప్పుడూ చేయను.”

“అలా చేయకముందుదాకా ఎవరయినా అలా చేసేవాళ్ళం కాదనే అనుకుంటారు. అన్నీ మీ చేతుల్లో ఉన్నాయనుకున్నారా?”

“మేమలా కాదు. మాకిద్దరికీ ఒకరికొకరం బాగా తెలుసు!”

“అందరిలా కాదు, మీరు తెలివయిన వాళ్ళనుకుంటున్నారు. అతనూ అందరిలా కాదు, మంచివాడనుకుంటున్నారు. అందుకే అలా జరుగుతుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు చేయి తగిలితే సారీ చెప్పాడు. ‘రాత్రంతా నా కలలో తిరుగుతున్నావు, నీ కాళ్ళు నొప్పెడుతున్నాయా?’ అంటూ పొద్దున్నే కాపీ పేస్టు మెసేజెస్ పెడుతుంటాడు. ఇవన్నీ మీరు మళ్ళీ మళ్ళీ తలుచుకుని వీటికే ఎలా మాయలో పడిపోయానా అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు.”

ట్రెయిన్ కింద పడబోయే ముందు అని చెప్పలేదు. అనవసరం. ఆమె చనిపోయాక అతన్ని పోలీసులు పట్టుకోవడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది గానీ అదంతా చాలా ప్రిడిక్టబుల్.

“ఇవన్నీ మీకెలా తెలుసు? మీరు ఎవరు అసలు?” పెదవి కొరుక్కుంటూ పాలిపోయిన మొహంతో అడిగింది.

“నేనెవరినో, నాకెట్లా తెలుసో చెప్తే నేను పిచ్చివాడిననుకుని నేను చెప్తూన్నది నమ్మరు. ముందతన్ని బ్లాక్ చేయండి. మీ దగ్గరికి కూడా రానీయకండి. మీ జీవితం మీ చేతుల్లో ఉంది!”

ఇంకా ఏమయినా చెప్తాడా అన్నట్టు చూస్తూంది.

“నేనిక వెళ్ళాలి. ఆ కాలేజ్ దగ్గర గొడవ కాబోతూంది. ఎవరిదో చోట్లో ఉందని షాపు తీసేయాలని పోలీసులు మల్లేశాన్ని కొడితే, స్టూడెంట్స్ దన్నుగా ఉన్నారని మొండిగా ఎదురుతిరగబోతున్నాడు. తర్వాత అతని ప్రాణాలు పోతాయి. భార్యాపిల్లలు బజారునపడతారు. అది వేరే కథ. మీరు మాత్రం నామాటలు గుర్తు పెట్టుకోండి!” అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు.

3.

పొద్దున జరిగింది మరిచిపోయి ఆమె దీర్ఘనిద్రలోకి జారుకుంది గానీ అతనికి నిద్ర పట్టడంలేదు. జీవితాంతం ఇలాగే ఉండబోతుందా అన్న భయం సన్నగా మొదలయి చిరుచెమటలు పట్టాయి.

ఇవన్నీ చిన్న విషయాలు. ఒక విషయానికి తను రాజీపడితే మరొకదానికి ఆమె పడవచ్చుగదా! తామిద్దరూ మెచ్యూర్డ్ అడల్ట్స్ అయి ఉండీ ప్రతిదాన్నీ లాగి ఒకరినొకరు చిత్రవధ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏం గొడవ కాబోతుందోనని రోజూ ఒకవైపు భయం, మరొక వైపు అంతకు ముందు కలిగిన బాధకు బదులు తీర్చుకోవాలన్న మండే కోరిక.

లోపం తనదో, ఆమెదో అర్థంకావడంలేదు. పెళ్ళి కాకముందే ఆమెతో కూచుని ఇంకా వివరంగా మాట్లాడుకోవలసింది. ఆమెను చూడకముందు అలాగే అనుకున్నాడు. ఫైనాన్సియల్, రెలిజియస్, పొలిటికల్, మోరల్, ఎమోషనల్, సెక్సువల్ విషయాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ ఏమిటో, కంపాటబిలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న జ్ఞానం ఉండేది. కానీ ఆమెను చూశాక అన్నీ పక్కన పెట్టేశాడు. ఆ అందమైన మొహం చూసి. అయినా అప్పుడు తాము అన్నీ నిజాలే చెప్పుకునేవాళ్ళా!

ఆమె వల్ల తనకు కష్టం కలించేవేవో గుర్తు చేసుకున్నాడు. ముందు గుర్తొచ్చింది ‘నేను చాలా సెన్సిటివ్’ అని ఆమె అన్నపుడల్లా ఇరిటేటింగ్‌గా అనిపించడం. ఎవరు కాదు సెన్సిటివ్? అందరూ బయటికి ఏడుస్తూ కూర్చోరు, అంతే.

రెండోది తమ మధ్య జరిగే ప్రతి చిన్న గొడవనూ వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పేయడం. తమకు మాత్రమే తెలిసిన, తాము మాత్రమే పంచుకునే రహస్యాలేమీ ఉన్నట్టు అనిపించదు.

మూడు వాళ్ళ సర్కిల్‌లోనూ, ఆఫీస్‌లోనూ స్టేటస్ మెయిన్‌టెయిన్ చేయడం కోసం లేనిపోని తాపత్రయం పడుతుంది. ఏదయినా కొనడం తనకు ఇష్టం లేకపోతే వాళ్ళ నాన్న చేత కొనిపించుకుంటుంది.

ఆ లెక్క పూర్తి కాకుండానే ఈరోజు జరిగిన గొడవ మీదికి ఆలోచన పోయింది. నిన్న సాయంత్రం బోర్ కొడుతుందని వాళ్ళ ఆఫీస్‌వాళ్ళంతా కలుస్తున్నారని వెళ్ళింది. రాగానే తెలిసింది వైన్ ఎక్కువ తాగడం వల్ల వచ్చిన తడబాటు. నిజానికి తననూ రమ్మంది కానీ పనుందని చెప్పాడు ఇష్టం లేక. లేక తనకోసం మానేస్తుందో లేదో చూడడానికో! ఆ కోపమంతా పొద్దున్నే ఆమె మీద చూపించాడు.

తను వేరేలా మారుతున్నాడా? ఇటువంటి పరిస్థితుల్లో బయటపడేదే తన నిజరూపమా! ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

అతనికి నిద్ర పట్టేలాలేదు. అతను చేయగలిగిందల్లా చేయాలనే నిశ్చయానికి వచ్చాడు. ఆమెని లేపి మాట్లాడదామనుకున్నాడు.

తను నెమ్మదిగా ప్రేమతో మాట్లాడతాడు. ఆమెకు ఏం బాధ కలిగించాడో తెలుసుకుంటాడు. క్షమాపణ అడుగుతాడు. ఆమె చేసిన ఏ పనులకు, మాట్లాడిన ఏ మాటలకు తనకు కష్టం కలిగిందో చెప్తాడు. ఇదంతా అంత కష్టమేం కాదు గదా! తమ ఇద్దరి కోసం!

ఆమెను లేపబోయేంతలో ఏం జరిగిందో అతనికి ముందు అర్థంకాలేదు. బెడ్‌లాంప్ మసక వెలుతురులో నడుచుకుంటూ పోతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. గోడల మీద పొడుగ్గా నీడలు పాకుతూ పోతున్నాయి. కొన్ని పిల్లల నీడలు, కొన్ని వొంగిపోయిన ముసలి నీడలు, భుజాలకు వేలాడుతూ పసిపాపల నీడలు, నెలల నిండు గర్భిణుల నీడలూ. నెత్తిన ఏవో మూటలూ. నివ్వెరపోయి చూస్తూ కూచుండిపోయాడు మంచం మీదనే. ఎక్కడనుంచి వస్తున్నారు వీళ్ళు? అప్పటిదాకా కలిగిన ఆలోచనలన్నీ ఎటో పారిపోయాయి. ఆమెని తట్టి లేపాడు.

“ఏమిటి?” మగత నిద్రలోనే అడిగింది.

“ముందు తలుపు వేయలేదా?”

“నువ్వు వేయలేదా?” కళ్ళు తెరవకుండానే అంది.

“లే, లే! చూడు!” అతని కంఠంలో ఆందోళన అర్థమై కళ్ళు తెరిచి అతను చూస్తున్న వంక చూసింది మోచేతి మీదుగా సగం లేచి.

“ఎవరు వీళ్ళు?” భయంగా అడిగింది. “వాళ్ళు ఇటుగుండా ఎందుకు పోతున్నారు?” వాళ్ళు పోతున్న వంకే చూస్తూ అడిగింది.

వాళ్ళెవరూ అతని వంకో, ఆమె వంకో చూడడం లేదు. తిన్నగా చూస్తూ అలానే నడుచుకుంటూ కిటికీ లోంచి బయటకు పోతున్నారు అదొక అడ్డంకే కాదన్నట్టు.

“ఏం కావాలి? ఏదయినా అడగండి, చెప్పండి, పోనీ అనండి.”

బదుల్లేదు. గమ్యం తప్ప మరేదీ అక్కర్లేదన్నట్టు పోతున్నారు. తమకెవరూ లేనట్టు. వాళ్ళేనని తెలిసిందతనికి. రాముడూ లేడు, రాజ్యమూ లేదని తెలిసి ఒక ప్రార్థనా లేక, ఒక శాపనార్థమూ లేక, అసలే శబ్దమూ చేయకుండానే.

“ఎందుకిట్లా? ఎటు పోతున్నారు?”

ఆ రాత్రంతా వాళ్ళలా పోతూనే ఉన్నారు. అతనూ, ఆమే అలా చూస్తూనే ఉండిపోయారు దానికి ముగింపెక్కడో, ఎలాగో తెలియక.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...