[తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువదించ బడ్డాయి.
వాల్మీకి రామాయణంలోని సుందరకాండకు, హర్షుని నైషధీయ చరితకు వ్యాఖ్యానం రాశారు. జర్మనీ ఇండోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీలో ’కాళిదాసు మేఘదూతానికి, వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధం’ అనే వ్యాసం సమర్పించారు. కాళిదాసు అకాడమీ వారికి ’ఇద్దరు ఋషులు – ఒక కవి ’ అనే శీర్షికతో వాల్మీకి, వ్యాస,కాళిదాసుల కవిత్వానుబంధాల మీద వ్యాసం సమర్పించారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి కొన్నాళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. భారత ప్రభుత్వ హోం శాఖకు సంబంధించిన అధికార భాషా కమిటీ పక్షాన కలకత్తాలో అఖిల భారత భాషా సమ్మేళనంలో ’రాష్ట్రేందు’ బిరుదు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు.
నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేషజ్యోత్స్న, ఋతుఘోష, నీరై పారిపోయింది, ప్రేమలేఖలు, నేను -నా నెమలి, నా రాష్ట్రం, మొదలుకొని అన్నీ కలిపి యాభై గ్రంధాలు రాశారు. కవిత్వం, విమర్శ, నాటకం, కథ, ఎపిక్ పోయెం, వ్యాసాలు, డైరీలు, ఉత్తరాలు, అనువాదాలు … ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టారు. ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు.
శేషేంద్రతో ’పత్రిక’ ప్రతినిధి సి.హెచ్.లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూను సంక్షిప్తంగా ఈమాట పాఠకులకు అందిస్తున్నాము. దీనితోబాటు శేషేంద్ర రాసిన చివరి కవితను కూడా ప్రచురిస్తున్నాము. -సంపాదకులు ]
మీరు పుట్టిన ఊరు …
నేను పుట్టింది మాతామహుల ఊరైన నాగరాజుపాడులో. పెరిగిన ఊరు తోటపల్లి గూడూరు.నెల్లూరుకు తూర్పున పది మైళ్ళ దూరంలో ఉంది.
మీ తల్లితండ్రులు…
మా నాన్న గుంటూరు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. అమ్మ అమ్మాయమ్మ. వీళ్ళిద్దరూ బాగా చదువుకున్నవారే. మా నాన్నతోటపల్లి గూడూరు గ్రామ మునసబు. మా నాన్న వ్యవసాయం చేశారు. సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్నారు. ఆయనకి దువ్వూరి రామిరెడ్డి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి జాయింట్‌గా కొన్ని రాశారని నాకు చెప్పారాయన.
విద్యాభ్యాసం…
నేను బాగా చిన్నవాడిగా ఉన్నపుడు నాకు నేతి కృష్ణశాస్త్రిగారని మంచి వేద పండితుడు ఋగ్వేద యజుర్వేదాలు చెప్పారు. ఆయనే శబ్దమంజరి, ధాతుపాఠం కూడా బోధించారు. కుమారసంభవంలో కొన్ని సర్గలు, మేఘసందేశంలో ప్రథమ భాగం చెప్పారు. అభిజ్ఞానశాకుంతలము కూడా ఆయన దగ్గరే చదివాను.
పాఠశాల లేదా…
వీధిబడి ఉండేది. అందులో తెలుగు పాఠాలు చెప్పేవారు. ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశము వంటివి కంఠత పట్టించారు. మా ఊళ్ళోనే ఇంగ్లీషు చెప్పే టీచరొకాయన కొత్తగా వచ్చారు. ఆయన దగ్గర ఇంగ్లీషు చదువుకోని నెల్లూరులో ధర్డ్ ఫారంలో చేరాను.
కాలేజీ అనుభవాలు…
నెల్లూరు హైస్కూల్లో చదివాక వి.ఆర్. కాలేజీలోనే ఇంటర్‌లో చేరాను. అందులో గుర్రం వెంకటారామయ్యో, వెంకట సుబ్బయ్యో అనే పేరుండే లెక్చరర్ ఉండేవారు. అయన షేక్స్పియర్ నాటకం చెప్పేవారు. ఇటీవల మహారాష్ట్ర గవర్నరుగా ఉండి పదవీ విరమణ చేసిన పి.సి.అలెగ్జాండర్ మాకు ఇంగ్లీషు పొయెట్రీ చెప్పేవారు. ఇంటర్ తర్వాత మా నాన్నకు , మేనమామకు నేను ఎం.బి.బి.ఎస్ చదవాలని ఉండేది. అప్పట్లో ఎం.బి.బి.ఎస్.కి మద్రాసుకు వెళ్ళి ప్రయత్నం చేయాలి. మా ఊర్లో ఎం.పి., వంగల్లు కోదండరామిరెడ్డి. మా నాన్న ఆయన్ని కలిశారు. ఆయన మద్రాసుకు వెళ్ళి బెజవాడ గోపాలరెడ్డిని కలుద్దామన్నారు. మద్రాసులో గోపాలరెడ్డి గారిని కలిశాం. నేను, మా నాన్న, మా మేనమామ. ‘విషయమేమిటి?’ అని అడిగారు. చెప్పాం. ‘ఇది అయ్యే పని కాదు’ అనేశారు. అయినా ప్రయత్నిస్తాను అని లోపలికెళ్ళి టెలిఫోను చేశారు. ‘మీవాడు ఇంటర్‌లో లాజిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాడు. అన్నీ సైన్సు సబ్జెక్టులైతే తప్ప ఎం.బి.బి.ఎస్ లో సీటు ఇవ్వరు’ అన్నారు. మా వాళ్ళు ఏదైనా మార్గం చూపమన్నారు. ఆయనేం చేస్తారు? ‘దీనికి వేరే మార్గం ఏముంటుంది? సైన్స్ సబ్జెక్ట్స్ చదివి వస్తే కావాలంటే అప్పుడు చెబుతాను’ అన్నారు. నెల్లూరులో అన్నీ సైన్స్ సబ్జెక్టులు లేవండి అని మా వాళ్ళూ అన్నారు. ఆయన వెంటనే ‘గుంటూరులో ఉంది. షాలే అని వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, లెటర్ రాసిస్తాను’ అని లెటర్ రాసిచ్చారు. మామేనమామ నన్ను గుంటూరుకు తీసికెళ్ళి ఎ.సి. కాలేజీలో చేర్పించారు. అక్కడ బి.ఏ తీసుకున్నాను. మా నాన్న మళ్ళీ ఎం.బి.బి.ఎస్.కి ప్రయత్నించడానికి మొదలుపెడితే నేనే వద్దన్నాను. అప్పటికే చదివి చదివి విసుగొచ్చేసింది.
మీకేం చదవాలని ఉండేది?
నాకు ముందునుంచీ జర్నలిస్టుగా పని చేయాలని ఉండేది. కాబట్టి మా నాన్నతో నేను లా చదువుతూ జర్నలిస్టుగా పని చేస్తానని చెప్పాను. ఆయన నన్ను మద్రాసు లా కాలేజీలో చేర్పించారు. అప్పట్లో ‘జనవాణి‘ పత్రిక ఉండేది. తాపీ ధర్మారావుగారు దానికి ఎడిటర్. ఆయన పెద్ద పండితుడు. ట్రిప్లికేన్ (మద్రాసు) నుంచి ఆ పత్రిక వచ్చేది. ఒక సాయంకాలం నేను ‘జనవాణి‘ పత్రిక ఆఫీసుకెళ్ళి తాపీ ధర్మారావుగారిని కలిశాను. ‘ఎవరు మీరు?’ అని ఆయన ప్రశ్నించారు. పేరు చెప్పాను. ఆయన వెంటనే,’’సొరాబు’ అనే కావ్యం రాసింది మీరేనా?’ అని ప్రశ్నించారు. అవునండి అన్నాను. కూర్చోండి అంటూ చాలా గౌరవంగా మాట్లాడారు.
సొరాబు ఇతివృత్తం ఏమిటి?
గుంటూరులో బి.ఎ. చదువుతున్న రోజుల్లో ‘సొరాబ్ అండ్ రుస్తుం’ అని ఒక పాఠం ఉండేది. దాని కథ తీసుకుని నేను కావ్యంగా రాశాను.
తాపీ ధర్మారావుగారు ఏమన్నారు?
‘మీ దగ్గర జర్నలిస్టుగా పని చేద్దామని వచ్చాను. అదే నా కోరిక’ అన్నాను. ‘మరి కాలేజీలో చదువుతూ ఎలా రాస్తారు? మీరొచ్చేటప్పటికి ఇక్కడ అందరు వెళ్ళిపోతారు’ అన్నారు. ‘మీరు ఏది ఇచ్చినా చేస్తాను. ఎప్పుడు రమ్మన్నా వస్తాను’ అన్నాను. కాలేజీ తర్వాత రాత్రి తొమ్మిదింటి వరకైనా ఉండి పనిచేస్తానన్నాను. సరేనంటూ కొన్ని ట్రాన్స్లేషన్స్ చేయమని ఇచ్చారు. వెంటనే అకౌంటెంట్‌ని పిలిచి 73 రూపాయలు జీతం ఫిక్స్ చేశానని ఆయనకు చెప్పారు. ‘మీరెంత ఇచ్చినా ఫర్వాలేదండీ’ అన్నాను.
రెండేళ్ళు మద్రాసులో ఉంటే, ఆ రెండేళ్ళు అక్కడ పనిచేశాను.ఒక రోజు ఉన్నట్టుండి మా ఎం.పి. వచ్చి, ‘నీవు కాలం వృధా చేస్తున్నావు. ఏమిటీ పని? లా చదివితే ప్రయోజనం ఏమిటి? మంచి గెజిటెడ్ ఆఫిసర్ కావాలి కానీ ఇదేమిటి?’ అని ప్రశ్నించేసరికి, నేను జర్నలిస్టు కావాలన్నది చెప్పాను. ఆయన ఒక ఆర్డరు చూపిస్తూ ‘మున్సిపల్ కమీషనర్ ధర్డ్ గ్రేడ్‌గా అపాయింట్‌మెంట్ తెచ్చాను. అది గెజిటెడ్ ఆఫిసరు పోస్టు. అందులో చేరాలి, పద’ అన్నారు. నేను చదవాలండి అన్నాను.‘అదంతా లాభంలేదు ముందు పదా’ అని నన్ను ఆయన కారులోనే మా ఊరు తోటపల్లి గూడూరుకు తీసుకెళ్ళారు.
మీ నాన్నగారేమన్నారు?
అక్కడ మా నాన్న, మేనమామ బలవంత పెట్టి ఉద్యోగంలో చేరాలన్నారు. నాకు తొలి పోస్టింగ్ ‘నీలగిరి ‘ వచ్చింది. ‘భాష తెలిసిన వారుండరు. ఉండడం కష్టం .. ‘ అని అందరూ భయపెట్టారు. ఆ విషయమే మా నాన్నతో అంటే మళ్ళీ ఎం.పి.ని కలిసి ఆ పోస్టింగుని తిరుపతికి మార్పించారు. అలా నేను తిరుపతికి వెళ్ళి ఛార్జి తీసుకున్నాను. ఇక అక్కడి నుండి ఊళ్ళు తిరగడం ప్రారంభమైంది.
మరి ‘జనవాణి’ సంగతి?
నేను ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ‘జనవాణి’ నుండి ఆర్టికల్స్ పోస్టులో వచ్చేవి. నేను రాసి తిరిగి పోస్టులోనే పంపేవాడిని ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు, ప్రభుత్వోద్యోగంలో ఉంది ఇలా రచనలు చేస్తే సర్వీసు నుంచి తొలగిస్తారని. దాంతో నేను మద్రాసు వెళ్ళి ధర్మారావు గారిని కలిశాను.
ఉద్యోగంలో ఉండి రచనలు చేయడం మంచిది కాదంటున్నారు అన్నాను. సరే నీ ఇష్టం అన్నారు. ఇన్నాళ్ళూ నేను రచనలు చేసినట్టు సర్టిఫికెట్ ఇస్తే నాకిది విలువైన అనుభవం కాబట్టి భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమోనన్నాను. ఆయన వెంటనే రాసిచ్చారు.
తొలిసారి అచ్చయిన మీ రచన ఏది?
తొలిసారి ముద్రితమైంది నా పాట. ముద్రించిన పత్రిక విశాలాంధ్ర. అప్పుడప్పుడే విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభమైంది.
అది గుర్తుందా?
‘ఈ ప్రపంచం ఎక్కడున్నా సరే! ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే! మన బాధలూ ఒక్కటే, ఎప్పుడూ మన గాధలూ ఒక్కటే…’ దీన్ని ‘ఆధునిక మహాభారతం’లోని ఆదిపర్వంలో చేర్చాను.
ఉద్యమాల మీద కూడ పాటలు రాశారనుకుంటాను!
ఆ రోజుల్లో తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతున్నపుడు నల్లగొండ కేంద్రంగా ఉద్దేశించి రాసిన పాట కూడా ‘విశాలాంధ్ర ‘లోనే అచ్చయ్యింది.
గుర్తుందా?
‘వరద వచ్చిందోయి వరద వచ్చింది!
గగన ఘంటాపధం కదలి వచ్చింది!
నిషదాచలం దాటి తుహినా చలం దాటి!
వసుధా తలం మీద బుసబుసలు విసురుతూ,
భంగ సంఘాలతో పాదమెట్టింది!
పాత కోటలు తాకి పగలగొట్టింది!
కొండ గోగుల కోన కుసుమించినా రీతి!
చిగురెండ వెల్లువలు చిందులాడిన రీతి!
నల్లగొండ మీద నాట్యమాడింది
ఆంధ్రదేశాకాశమావరించింది.
వరద వచ్చిందోయి వరద వచ్చింది…’
‘ సొరాబు’ తర్వాతి రచన ఏది?
తిరుపతి నుంచి ట్రాన్స్ఫరై బొబ్బిలికెళ్ళాను. అక్కడ ‘ఋతుఘోష‘ పేరుతో కావ్యం ప్రచురించాను.అది పద్యకావ్యం! అప్పట్లో పద్యం రాసినవాడే కవి. కవి సమ్మేళనంలో పద్యకవిత చదివితే బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చేది, తర్వాత పోనుపోను పద్యాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.
ఎందుకంటారు?
కాలం మారింది. అభిరుచులు మారాయి. కవిత్వం అంటే నీవు సృష్టించిన ఆనందాన్ని ఇంకొకరితో పంచుకోవాలి. అప్పుడే దానికి సాఫల్యమేర్పడుతుంది. ఎపుడైతే పద్యాల్ని ఆనందించడం మానేశారో, అప్పుడు నేను కూడా పద్యాలు రాయడం మానేశాను.
ఫ్రీవెర్స్ పుట్టుక గురించి చెప్పండి.
‘ఫ్రీవెర్స్’ అనేది ‘వచన కవిత్వం’ కాదు. ‘వెర్స్’ అంటే ‘లయబద్ధమైన రచన’ అని అర్ధం. ఏది రాసినా లయబద్ధంగా ఉండాలి. పొడి వచనం కవిత్వం ఎలా అవుతుంది.కాలేదు. ‘వెర్స్-లిబర్’ అని ఫ్రెంచ్ భాషలో ఉంది. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ వీళ్ళు పేరు పెట్టారు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా షేక్స్ఫియర్ రాసిన ‘బ్లాంక్ వెర్స్’ నుంచి ఫాం తీసుకుని ఆ పేరు పెట్టుకున్నారు. మొత్తమ్మీద ‘వచన కవిత్వం’ వీరతాండవం చేస్తున్న రోజుల్లో పద్యాలకు గతిలేకపోయింది. అందువల్ల నేను కూడా వచనంలో రాయడం మొదలెట్టాను. వచనంలో రాయి. పద్యంలో రాయి. ఎందులో రాసినా కవిత్వం రాయాలి. కవిత్వం గనుక ఉన్నట్లయితే ఏదైనా చదవడానికి ఆనందంగానే ఉంటుంది.
వచన కవిత్వం పూర్వం రోజుల్లో ఉందా?
బాణుడు రాసిన ‘కాదంబరి’లో అద్భుతమైన కవిత్వం ఉంది. కవిత్వాన్ని వచనంలో కూడా చెప్పవచ్చు. పూర్వకాలంలో చాలామంది కవులు సుబంధు, బాణుడు, దండి అందరూ వచనంలోనే కవిత్వం రాశారు. ‘ప్రోజ్- పోయెట్రీ’ రాశారు. ఫ్రెంచి భాషలో కూడా చార్లెస్ బోదిలేర్ ప్రోజ్ పొయెట్రీ రాశారు. ఆయనకు ముందు షటో బ్రియాన్ అనే ఆయన డైరీలో కూడా పొయెట్రీ రాశారు. మీరు ఎందులో రాయండి – కవిత్వం రాయాలి.
మరి మీరు…
నేను వచన కవిత్వం రాసేటప్పుడు కవిత్వానికి ప్రాధాన్యం ఇస్తూనే రాశాను. రాస్తున్నాను. పద్యకవిత అలాగే రాశాను. ఇప్పుడు అలాగే రాస్తున్నాను.
సాహిత్యంలో మీముందు తరం వారిలో .. గొప్పవారెవరు?
అన్ని సాహిత్య ప్రక్రియలూ చేపట్టి, రాసి మెప్పు పొందినవారు విశ్వనాధ సత్యనారాయణ. కానీ కవిత్వంలో అత్యద్భుతంగా శిఖర స్థానం అందుకొని అక్కడ కూచుని కవిత్వ సామ్రాజ్యాన్ని ఏలినవాడు మాత్రం రాయప్రోలు సుబ్బారావు. ఆయన ప్రభావమే తదనంతర కవులందరి మీదా పడింది.
మరి గురజాడ …
ఆయన గొప్ప ద్రష్ట. సామాజికంగా జరిగే అన్యాయాల్ని దెబ్బ గొట్టినవారు. ఆయన అభ్యుదయ కవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే కవిత్వం విషయంలో మాత్రం రాయప్రోలు శిఖర సమానుడు. గురజాడలో కవిత్వంపాలు తక్కువ. భావకవుల్లో అందరికీ పాండిత్యం ఉంది. తర్వాతి కవుల్లో పాండిత్య రహితమైన కవిత్వం అల్పస్థాయికి చేరుకుంది.
మరి శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, ఆ తర్వాతి కవులు?
ప్రతీక వాదాన్ని చూపిస్తూ కవిత్వం రాసినవారు వీళ్ళిద్దరే – శ్రీశ్రీ,, శ్రీరంగం నారాయణబాబులు. ఇద్దరూ శాస్త్రాలు బాగా చదివారు. తర్వాతి వారిలో మంచి కవిత్వం రాసిన వారిలో వీళ్ళిద్దరే కనిపిస్తారు. వీళ్ళిద్దరిలోనూ నారాయణబాబు మంచి కవిత్వం రాశారు. ఆయన తర్వాతే వస్తాడు శ్రీశ్రీ. నారాయణబాబు కవిత్వంలో ఉన్న చిక్కదనం శ్రీశ్రీ కవిత్వంలో లేదు. శ్రీశ్రీ వాడిన ప్రతీకలన్నీ పూర్వం ఉన్నవే. శబ్దాలన్నీ పాతవే. ప్రబంధాల నుంచి, కావ్యాల నుంచి భాష తీసుకున్నాడు శ్రీశ్రీ. కానీ నారాయణబాబు అలాకాదు. ఉపమానాలు, రుధిరజ్యోతి అనే కావ్యానికి రాసిన ఉపోద్ఘాతంలో కూడా ఈ చర్చ ఉంది.
ప్రస్తుతం కవి బాధ్యత ఏమిటి?
ఈ రోజు మన దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఆకలి చావులు లేకుండా పత్రికల్లో వార్తలు లేవు.ఫుట్‌పాత్‌ల మీద పడుకొని తిండి లేకుండా చనిపోయేవారు చాలా మంది కనిపిస్తారు. ఈ పేదరికాన్ని పారద్రోలి, సమాజంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి, నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికి కవిత్వం రాయాలి.
20వ శతాబ్దంలో కవిత్వంలో వచ్చిన మార్పులు…
కవిత్వం గత శతాబ్దం తొలినాళ్ళలో ఒక స్పష్టమైన లోకోపకారక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని నడవలేదు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి సామ్యవాద సమాజ సాధన కోసం అంకితమైంది. తర్వాత సంభవించిన అనేక అంతర్జాతీయ, జాతీయ కల్లోల సంఘటనల మూలంగా వామపక్ష రాజకీయ పార్టీల్లో సిద్ధాంతరీత్యా భేదాలు రావటం. ఆ భేదాల ననుసరించి రచయితల్లో కూడా చీలికలు వచ్చాయి. అవన్నీ అందరికీ తెలిసిందే.
దీనికి భిన్నంగా రాసేవాళ్ళూ ఉనారు కదా…
భిన్న ధోరణిలో పోయే అల్ప సంఖ్యాక కవులు ఉండనే ఉంటారు. ఇది స్వాభావికం.
మీరొక నవల రాశారు. కామోత్సవ్. అది శృంగార ప్రధానమైంది. ఎన్నో గొడవలు జరిగాయి కదా !
నా మీద అసూయ , ద్వేషం చేత నలుగురైదుగురు కవులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు. అప్పర్‌మోస్ట్‌క్లాసెస్ కి చెందిన వారు ఎంత బాధ్యతారహితంగ ప్రవర్తిస్తారో తెలియజేయడానికి నేనది రాశాను.
సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చడం సాధ్యమంటారా?
సాహిత్యం ద్వారా మాత్రమే సమాజ దృక్పథాన్ని మార్చగలం. ఉపన్యాసాలు, హరికథలు ఈ చెవితో వింటారు. ఆ చెవితో బయటకు గెంటేస్తారు. తుపాకీతో బెదిరించి మనిషిని మార్చలేమని ప్రూవ్ అయింది. కవి తన రచనలతో, చమత్కారోక్తులతో, ఆకర్షణీయమైన పదజాలంతో చదువరుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాడు. ‘వాహ్ ఎంత బాగా రాశాడు‘ అని ఎవరైనా అన్నాడంటే ఆ వ్యక్తి హృదయంలోంచి ఆమాట వస్తోందన్నమాట. అది ఆ వ్యక్తిని వీడదు. ఆలోచింప చేస్తుంటుంది. అందుకే కేవలం సాహిత్యం ఒక్కటే మనిషిని మార్చగలదు.
దీనికి ఉదాహరణంగా ఏదైనా చెబుతారా?
ఋగ్వేదకాలం నుంచీ కవులందరూ మనుషుల స్వభావాల్ని మార్చినవారే. పశువుల దశ నుంచి మనుషుల దశకు మార్చిన వారు కవులే. సాహిత్యం ఒక్కటే అమృతం. కవి అంటే నా ఉద్దేశం – సృజనాత్మక రచన చేసేవాడని. నాటకం రాసినవాడు కూడా కవే. భాసుడు నాటకాలే రాశాడు . ఆయన్ని మహాకవి అన్నాడు కాళిదాసు.
కవిసేన మ్యానిఫెస్టో ద్వారా ఏ విధమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టారు?
అందులో భారతీయ కావ్యశాస్త్ర పరంపర, అదే కాలంలో గ్రీకు, రోమన్ సాహిత్యంలో వున్న శాస్త్ర పద్ధతి, పశ్చిమ డేశాల నుంచి దిగుమతైన ఆధునిక సాహిత్య విమర్శ, మార్క్సిస్టు దృక్పధం – ఈ నాలుగింటి సమన్వయమే కవిసేన మ్యానిఫెస్టో.
పాటలతోనే రచన ప్రారంచించిన మీరు ‘ముత్యాలముగ్గు’ సినిమాలో గొప్ప పాట రాశారు- నిదురించే తోటలోకి… అని, మీ సమకాలీకులందరూ సినీ రంగంలో పాటలు రాస్తే మీరెందుకు ఆ దిశగా ప్రయత్నించలేదు?
‘ముత్యాలముగ్గు’ పాట తర్వాత చాలా మంది వచ్చి నన్ను కలిశారు. ‘మీరు మాకు పాటలు రాయాలండీ‘ అంటూ, సరేననేవాడిని. మళ్ళీ వస్తామని వెళ్ళేవారు. అలా నాలుగైదు సంవత్సరాలు గడచిన తర్వాత ఎవరూ రాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత సినీ పరిశ్రమలోనే ఉన్న నా స్నేహితుడు చెప్పాక అసలు విషయం తెలిసింది. ఎవరో నా గురించి నిర్మాతలకి చెడ్డగా ప్రచారం చేశారట. నాకు ఎయిర్ టిక్కెట్టివ్వాలనీ, చోళ హోటల్లో ఫిఫ్త్ ఫ్లోర్‌లోనే బస ఏర్పాటు చేయాలని, ఇలా తడిసి మోపెడు ఖర్చవుతుంది అనీ!
మీకు ‘గజల్ ‘ ప్రక్రియ చాలా ఇష్టమని కొన్ని రచనలు తెలుపుతున్నాయి.
గజల్ అంటే నాకు ఇష్టం. డెబ్బయిల్ల్లో ఉర్దూ, హిందీ కవులు మా ఇంటికొచ్చేవారు. వాళ్ళు ‘షేర్’ వినిపించేవారు.. నేను వాళ్ళకి పద్యాలు వినిపించేవాడిని. వాళ్ళకవి అర్ధమయ్యేవి కావు. గజల్ దారిలో ఉన్న షేర్లను అర్ధం చేసుకుని రెండేసి , నాలుగేసి పంక్తుల కవితలు రాశాను. భావోద్వేగంలో మెరుపులా కొన్ని పంక్తులు తుళ్ళిపడుతూ వచ్చేవి. వాటిని ‘గజళ్ళు’ అనడం కన్నా ‘చమత్కారికలు’ అంటే బాగుంటుందని ఆ పేరు పెట్టాను. అవే ‘శేషేంద్రజాలం’ శీర్షికన ప్రచురితమయ్యాయి.
ఇప్పుడు అనేక వాదాలొచ్చాయి, ఉద్యమాలొచ్చాయి…
ఈ వాదాలు మొదట్లో సదుద్దేశంతోనే మొదలయ్యాయి. ఆయా వర్గాల్ని చైతన్యపరచడానికి,వారిని సమాయత్తం చేయడానికి ఏకీకృతం చేయడానికి ఇవి దోహదపడ్డాయి. అయితే రానురాను వాటిని నిచ్చెనలుగా చేసుకుని పైకెక్కే ట్రెండ్ ఎక్కువైంది. సాహిత్యంలో ఇటువంటి వాదాలు ఎప్పుడూ అభిలషణీయమే. కానీ స్వార్థమే పనికిరాదు.
కవిగా మీరు ఏ ఉద్యమాన్ని సమర్ధిస్తారు?
ప్రతి ఉద్యమాన్ని సమర్థించాను. పీడిత వర్గం వైపే నిలుచున్నాను. పద్య కవిత్వం రాసినప్పుడు కూడా నేను పీడితుల పక్షానే ఉన్నాను. ‘ఋతుఘోష’ వంటి ప్రకృతివర్ణన కవిత్వంలో కూడా పీడితుల పక్షమే ప్రధానం. వాళ్ళవైపు నిల్చొని, వాళ్ళ పక్షాన యుద్ధం చేయడమే కవి పాత్ర, బాధ్యత.
”కరపత్రాలే”మైనా మీ దృష్టికొచ్చాయా?
అవన్నీ నీచాతి నీచం. మానవ జాతి అంతా ఒకటని అనుకోవడమే కవి లక్షణం. ఇలా ప్రాంతీయంగా, లింగ వివక్ష … ప్రదర్శించడం స్వార్ధం తప్ప మరోటి కాదు.
మీ తరం కాక మీ తర్వాతి తరం వారిలో బాగా రాస్తున్న వారుగా మీరెవరిని గుర్తిస్తారు?
ఇప్పుడున్న కవుల్లో రాయసం వెంకట్రామయ్య, తరువాత గోపి.
ఇతర దేశాల సాహిత్యం చదువుతుంటారు కదా! మన తెలుగులొ ఇదిగో ‘ఇది మిస్సింగ్’ అనగలిగేదేమైనా ఉందా?
ఆధునిక పాశ్చాత్య దేశాల్లో వస్తున్న కవిత్వ ధోరణులన్నీ మన భారతీయ సాహిత్యంలో ఉన్నవే. ‘సింబాలిజం’ అంటారు కదా… ఇది ఋగ్వేదం నిండా కనిపిస్తుంది. అక్కడ ఉండి ఇక్కడ లేనిదేది లేదు.