ఐదు కవితలు: గాలి రొద

ఆ దుర్గంధానికి వూపిరాడక
గాలి వుక్కిరిబిక్కిరై అల్లాడుతుంది
పారిపోవాలని వొకటే ప్రయాస-

పొగచూరిన వూపిరి తిత్తుల గుప్పిటనుంచి
గింజుకుని బయటపడి
పొగ గొట్టాలనుంచి కళ్ళు మూసుకు జారి
పచ్చటి పైరు మీద వాలి
నువాక్రాన్ ఘాటు వొళ్ళంతా పట్టుకుని
అరుస్తూ సముద్రమ్మీద పడి
పారబోసిన చమురు మడ్డిలో
చచ్చిన చేపై తేలింది!

దాక్కుందామని అదే తాపత్రయం-
ధ్వని కంపనాలకు దడపుట్టి
నిశ్శబ్దంలోకి తప్పుకోవాలని!

దొర్లుకొస్తున్న డుర్…డుర్‌ల నుంచి
మీదికి దూకుతున్న బొయ్…బొయ్‌ల నుంచి
ఎగస్తున్న కఠిన కంఠస్వరాల్లోకి మళ్ళి
కీచు గోళ్ళ గగుర్పాటు గీరుకుని
మోయలేని శబ్దాలు మోసుకుని
భరించలేక ఫటిల్లుమని
పేలుతుంది చావు కేకై.

(05/02/1997)


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...