మరోసారి

ఒక వైపు నీడలు సాగుతూన్న, మరొక వైపు మబ్బులు మూసుకురాబోతూన్న సాయంత్రం. బజార్లో పక్కపక్కనే నడుస్తూ అతనూ, ఆమే. మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

ఎవరో ఎదురొచ్చి “ఇక్కడో గ్రీటింగ్ కార్డ్స్ షాపుండాలి, ఎక్కడుందో మీకు తెలుసా?” అంటూ ఆపారు. ఆలోచన అటు పోక, ఏం చెప్పబుద్ధీ కాక అడ్డంగా తలూపాడు. ఆమె “ఇక్కడిది మూసేశారు…” అంటూ ఎటు వెళ్ళాలో చెప్తూంది. ఆపై మరికొన్ని ప్రశ్నలకూ. అక్కరగా, ఓపిగ్గా. ఈమధ్య అరుదుగా కనపడుతున్న నవ్వు మొహాన్ని వెలిగిస్తూ. వినడం ఆపి ఆమెనే చూస్తూండిపోయాడు. మొదటిసారి ఆమెను కలిసింది ఇలానే ఏదో దారి వెతుకుతున్నప్పుడు. అపరిచితులకెప్పుడూ ఆశాభంగం కలగనివ్వదు.

వాళ్ళు వెళ్ళిపోయాక నడుస్తూ అన్నాడు ఆమె వంక చూడకుండానే. “మళ్ళీ నీకు అపరిచితుణ్ణయి ఉంటే బావుండుననిపిస్తుంది. అప్పుడు ఇంత హాయిగా మాట్లాడేదానివి కదా!”

అతని వంక చూసి తలతిప్పుకుంటూ అంది. “నువు రోజురోజుకూ అపరిచితుడివవుతూనే ఉన్నావు!” వెంటనే బదులివ్వబోయి ఆగాడు, ఆమె గొంతులో ధ్వనించిన భావాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...