కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ళ మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్ళలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.

నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.

గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.

రోషన్‌తో నేను మాట్లాడితే, గులాబ్‌కు నన్ను నరికేయాలనిపిస్తుంది. గులాబ్‌తో మాట్లాడటం ఆయేషాకు నచ్చదు. ఆమెకు ఒక నగ తీసిస్తే, యీమె ఒక నగ పగలగొడుతుంది. ఈమెకు వొక పట్టు రవికె కొనిస్తే, ఆమె ఒక రవికెను చింపేస్తుంది. ఈ విధంగా అన్నిట్లో ఆ ముగ్గురూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తూ నా ప్రాణం తీస్తున్నారు. ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా, నా జీవితం మొత్తం వీళ్ళ వల్ల నరకమయిపోయింది.

బయటనుంచీ శిల ఒక పొడుపుకథ
దానినెలా విప్పాలో ఎవరికీ తెలియదు. కానీ
లోలోపల అది స్తబ్దంగా నిశ్శబ్దంగా వుండే వుంటుంది
ఓ ఆవు తన భారాన్నంతా దానిపై నిలిపి పైకెక్కినా
ఏ చిన్నారైనా దాన్ని నదిలోకి విసిరేసినా
అది మెల్లగా నిరుద్రేకంగా
నది లోపలికి నిశ్శబ్దంగా మునిగిపోతుంది.

ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.

నాకు మాత్రం ఆ నదిలో కొట్టుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. నాని ఉబ్బిపోయిన శవాలు. కుక్కలు పీక్కొని తిన్న శవాలు. ఆనవాలు పట్టలేని శవాలు. గంగా! పాప వినాశినీ! మా ధర్మచరితకు పవిత్రసాక్షివి! శివుని జటాజూటంలో కొలువైన ఉగ్రతేజానివి! ఎందుకు రహస్యాలు నీలోనే దాచుకోవడానికి నిరాకరించావు?

అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టు ఉండేది ఈ తాగుడు తంతు. కాని, శరీరాన్ని మోసం చెయ్యడం వీలయ్యేది కాదు.

– మన పురాపారవశ్యాలు నీకు గుర్తుకు వస్తున్నాయా?
– నేనేమి గుర్తు ఉంచుకోవాలని నువ్వు ఆశించావు?

నా పేరు వినగానే నీ హృదయం ఇంకా స్పందిస్తుందా?
ఇప్పటికీ కలలో నీకు నా మనసు ఊసు వినిపిస్తుందా? – లేదు!

యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్‌తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి. నీలి రంగు జీన్స్ మీద, తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది.

అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్ళముందే కనిపిస్తోంది.

అసలు దయ్యాలు, సైతానూ అన్నవే లేకపోతే, క్రీస్తుమతం పొడిపొడిగా రాలిపోతుంది; ఏళ్ళబట్టి అబద్ధాలూ పొరపాట్లతో, అసత్యాలతో, అద్భుతాలూ వింతలతో, రక్తపాతంతో, అగ్నిజ్వాలలతో, అనాగరిక ప్రపంచం నుండి ఎరువు తెచ్చుకున్న కల్పిత కథలతో మన పూర్వీకులు, పోపులు, ఫాదరీలు, వేదాంతులు, క్రైస్తవం పేరుతో నిర్మించిన భవనం నామరూపాలు లేకుండా కుప్పకూలిపోతుంది.

ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.

కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.

అన్ని వాదనలకీ ముగింపుగా, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చివరకి ఇలా చెప్పేవాడు: ‘ఈ సరఫరా-గిరాకీ అన్న నియమం భగవంతుడు ఏర్పాటు చేసినది. మనం ఊహించగలిగిన అన్ని సందర్భాల్లోనూ ఈ నియమం పని చేస్తుంది. ఈ నియమమే శ్రమకి తగిన ధరని కూడా నిర్ణయిస్తుంది. దీనికి తిరుగు లేదు. ఈ ఆచరణావిధానం నచ్చని వాళ్ళు తమ స్వంత ప్రపంచాలను నిర్మించుకోవచ్చు.’

రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది. ‘ఒక నెల రోజలుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం’ అని అబద్ధమాడాను.

మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.