రైల్వే స్టేషను

వసంతకాలపు ఒక ఉదయం. తెన్‌కాశీ స్టేషను. ఇది బ్రిటిష్ ఇండియా కిందికి వస్తుంది. దీనికి పడమరగా వున్న తర్వాతి స్టేషను శెంగోట్టయ్. యిది తిరువాన్కూరు సంస్థానానికి చెందింది. పడమర వైపుకే, రెండు మైళ్ళ దూరంలో, చాలా ప్రసిద్ధి గాంచిన కుట్రాలం జలపాతం వుంది. పక్కనంతా పర్వతాల సాలు. కొంచెం పడమరకు పోతే, శెంగోట్టయ్ స్టేషను నుంచి తిరువనంతపురం వరకు మధ్యలో పది స్టేషన్లు మాత్రమే వున్నాయి. రెండువైపులా ఎత్తయిన కొండలు, లోతైన లోయలు. కొండని తొలచి, రైలు వెళ్ళడానికి తవ్విన సొరంగ మార్గం. రెండువైపులా సహజ సిద్ధంగా ఆకుపచ్చటి ప్రకృతి సంపద. ఒకసారి చూస్తే, ఇక యెప్పటికీ మరువలేము.

యీ తెన్‌కాశీ స్టేషను వెనుక ప్లాట్‌ఫాం మీద, ఆ ఉదయపు వేళలో, తిరునల్వేలి వైపు, తూర్పు వెళ్ళే రైలు వస్తున్న సమయంలో సుమారు వందమంది ప్రయాణికులు గుమికూడారు.

వీరిలో కొంతమంది వైదిక బ్రాహ్మణులు. నీరుకావి రంగు నుండి బురద రంగులోకి వెలసిపోయిన చాలా పాతబట్టలు కట్టుకొని, శరీరాలు చెమటలు కక్కుతుంటే, కూర్చొని, ‘ఫలానా వూరిలో, ఫలానా తేదీ, ఫలానా వారికి సీమంతం’ వంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.

బ్రాహ్మణ విధవలు చాలామంది వెనుక వైపు కూర్చొని, తమలో తాము యేదో మాట్లాడుకుంటున్నారు. సుమంగళి బ్రాహ్మణ స్త్రీలు ఒక వైపు తలలొంచుకొని నిల్చొని, వచ్చేపోయేవారిని క్రీగంటి చూపులతో చూస్తున్నారు. ఇంకొంతమంది ఉద్యోగస్తులు తలపాగా, కోటు, గడియారం గొలుసుల సహితంగా తాపీగా అటూ యిటూ పచార్లు చేస్తున్నారు. కొంతమంది పోలీసులు చక్రవర్తులలాగా తలలెత్తుకొని ఠీవిగా నడుస్తున్నారు. కొంతమంది మహమ్మదీయ స్త్రీలు ముసుగులు వేసుకొని, తలనూ, ముఖాన్ని కప్పుకొని తలా ఒక దిక్కున కూర్చొని వున్నారు.

తమలపాకు, వక్క, పొగాకు, చుట్ట, బీడి, నశ్యం, జంతికలు, చక్కిలాలు, పూర్ణాలు, కాఫీ మొదలైనవి అమ్మే వొకరిద్దరు బ్రాహ్మణులు, శూద్రులు పగటిపూట దోపిడి కొనసాగిస్తున్నారు. అంటే, చిల్లిగవ్వ చేయని సామాన్లను మూడు, నాలుగు రెట్లు ధరను పెంచి అమ్ముతున్నారు.

రైలు ఆ రోజు ఒక గంట ఆలస్యం. నాకు పొద్దుపోవడంలేదు. రైలు పట్టాలకు దగ్గరగా కొంతదూరం అలా తిరిగివద్దామని, దక్షిణం వైపుగా, కూతవేటు దూరం వెళ్ళాను.

అక్కడ, ఒక చెట్టు కింద అందమైన మహమ్మదీయ యువకుడు ఒకడు కూర్చొని వుండటం చూశాను. పట్టు టోపీ, పట్టు అంచులున్న మల్లు చొక్కా, పట్టు చెప్పులు, పూర్ణచంద్రుడిలాంటి ముఖం, బాగా పెంచిన మీసం. తొలి చూపులోనే అతడు రాజవంశంలో పుట్టినవాడని నాకు ఖరారుగా తెలిసిపోయింది. అతని కళ్ళనుంచి ధారలుధారలుగా కన్నీరు కారుతున్నది.

ఇది చూసి నాకు చాలా జాలివేసింది. నేను వెళ్ళి అతడ్ని ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే, అతనికి కోపమొస్తుందేమో అని కూడా ఆలోచించకుండా సర్రుమని అతని ముందుకెళ్ళి నిలుచొని, “తమ్ముడూ, ఎందుకు ఏడుస్తున్నావ్?” అని అడిగాను.

అతను నన్ను ఒకసారి యెగాదిగా చూశాడు. అతడి వయసు 25 పైన వుండదు. తల వంచుకొని ఏడుస్తున్నపుడే చాలా సుందరాంగుడిగా అనిపించాడు. నన్ను చూసిన వెంటనే అతను కళ్ళను తుడుచుకొన్నాడు. నా రెండు కళ్ళని అతడి రెండు కళ్ళు కలిపి చూసిన సమయంలో అతని రూపం నాకు సాక్షాత్తు మన్మథరూపం లాగే కనిపించింది.

నన్ను తదేకంగా చూసినపుడు, అతనికి ఎలానో నా గురించి మంచి అభిప్రాయం యేర్పడింది. కాస్త కూడా నామీద కోపగించుకోకుండా, “రైలు ఎప్పుడొస్తుంది?” అని అడిగాడు.

“యివాళ రైలు ఒక గంట ఆలస్యంగా వస్తుందని స్టేషను మాస్టరు చెప్పారు.” అన్నాను.

నాకు హిందుస్తానీ లేదా ఉర్దూ భాష చక్కగా వచ్చు. అందువల్ల, నేను అతనితో ఉర్దూ భాషలోనే మొదలుపెట్టి మాట్లాడాను.

“మీకు ఉర్దూ ఎలా తెలుసు? మిమ్మల్ని చూస్తే హిందువులని తెలుస్తూ వుందే!” అని అడిగాడు.

దానికి నేను, “చిన్నప్పుడే కాశీలో చదువుకున్నాను నేను. అక్కడ నాకు హిందుస్తానీ భాష వంటబట్టింది.” అన్నాను.

“కాశీలో హిందీ భాష కదా మాట్లాడుతారు!” అని ఆ ముసల్మాను అడిగాడు.

దానికి నేను, “హిందీ, ఉర్దూ, హిందుస్తానీ అన్నీ ఒకే భాష. మొఘలు చక్రవర్తులు మొదట్లో పారశీక భాషలోనే యెక్కువగా వ్యవహారాలు నడిపేవారు. తర్వాత వారు, తమకూ తమ పరివారానికీ ఈ దేశభాష అయిన హిందీనే ఉమ్మడి భాషగా తీసుకున్నారు. హిందీ భాష సంస్కృతం నుండి పుట్టింది. అది సంస్కృత భాషకు వికృత రూపం. దాన్ని హిందువులు దేవనాగరిలో రాసి, స్వతంత్ర భాషగా మాట్లాడేవారు. దీన్నే పార్శీ లిపిలో రాసుకొని, పలు పార్శీ, అరబీ భాషలు కలపి, ముసల్మానులు మాట్లాడేటప్పుడు, దానిని హిందుస్తానీ, లేదా ఉర్దూ అని పిలవటం అలవాటు అయ్యింది. ఉర్దూ అంటే గుడార భాష అని అర్థం. అంటే, మొఘలు రాజ్యంలోని సైనికులు గుడారాలు వేసుకొని, పలు దేశాల యుద్ధవీరులను కలుస్తున్నప్పుడు, అక్కడ కలిసిన మిశ్రమ భాషే ఉర్దూ. నాకు హిందీ చాలాబాగా వచ్చు. హిందీలో అదనంగా పార్శీ, అరబీ పదాలు చేరి ఉర్దూ అయినా, దాన్ని కూడా బాగా మాట్లడగలుగుతాను,” అని చెప్పాను.

“నువ్వు బాధ పడుతున్న కారణం యేమిటి?” అని మరొక్కసారి నాకు తెలియకుండానే అడిగాను.

ఇది విని ఆ మహమ్మదీయ ప్రభువు చెప్పాడు. “స్వామీ, తొలిచూపులోనే నాకు మీ పట్ల విశ్వాసం యేర్పడింది. మీతో చెబితే నా దుఃఖానికి నివృత్తి కలుగుతుందని నా మనసుకు అనిపించింది. నా వేదన సాధారణంగా యితరులకి చెప్పుకునేది కాదు. కానీ మీతో చెప్పచ్చని చెబుతున్నాను. నా దుఃఖాన్ని తొలగిస్తే మీకు చాలా పుణ్యం వుంటుంది. మీ ఉపకారాన్ని నేను చనిపోయేదాకా మరచిపోను.”

“మొదట మీకొచ్చిన కష్టం గురించి చెప్పండి. తీర్చడానికి దారి దొరికితే తీరుస్తాను.”

అప్పుడు ఆ మహమ్మదీయ ప్రభువు కింది విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.

“మా మతంలో చిన్నాన్న, పెదనాన్న పిల్లల్ని వివాహం చేసుకుంటామని మీకు తెలిసే వుంటుంది. నేను పుట్టింది ఉత్తరాన హైదరాబాదు నగరం. సింధు రాష్ట్రపు రాజధానిగా వున్న హైదరాబాదు కాదు. నిజాం రాజ్యపు రాజధానిగా వున్న హైదరాబాదు నగరం.

నేను మా నాన్నకు ఒక్కడే కొడుకుని. నేను పుట్టినప్పుడు మా తండ్రి చాలా పేదవాడు. నేను పుట్టిన చాలాయేళ్ళ తర్వాత, మా రాజ్యంలో వొక పెద్ద ‘లాటరీ’ వేలం చిట్టీ నడిపారు. ఆ చిట్టీకి మా నాన్న యెవరిదగ్గరినుంచో 10 రూపాయలు అప్పు తీసుకొని పంపారు. అదృష్టం వుండింది ఆయనకు. ఆయన దరిద్రాన్ని అంతం చెయ్యాలని అల్లా నిర్ణయించుకొన్నారు. ఒక కోటి రూపాయల చిట్టీ గెలుచుకొన్నారు. తర్వాత ఆయన దాంతో కొన్ని వ్యాపారాలు నడిపారు. ఆ వ్యాపారాల్లో కూడా ఆయనకు లెక్కకుమించి లాభం రావడంతో, కొన్ని సంవత్సరాలలోనే ఏడెనిమిది కోట్లకు అధిపతి అయిపోయారు. అప్పుడప్పుడు కొంచెం నష్టం రావడం మొదలుపెట్టింది. మా నాన్న మంచి బుద్ధిశాలి. నష్టం వస్తున్నప్పుడే, వున్నట్టుండి వ్యాపారాలన్నిటినీ నిలిపివేసి, డబ్బులన్నిటినీ పోగేసి, లెక్కలేనన్ని భూముల్ని కొని, వాటిల్లో మహాభవనాల్ని కట్టుకొని, తన వల్ల అయినంతవరకు పరోపకారం చేస్తూ జీవించారు.

నాకు పదిహేనేళ్ళప్పుడు ఆయన చనిపోయారు. నేను ఒకే కొడుకునవడం వల్ల, ఆయన ఆస్తి అంతా నాకు చేరింది. మా యింటి పర్యవేక్షణ కోసం మా చిన్నాన్నను నియమించివున్నారు మా నాన్న. మా నాన్న చనిపోతూ, చిన్నాన్నకు కొన్ని లక్షల విలువ చేసే భూమిని ఈనాంగా యివ్వడంతో పాటు, నన్ను చూసుకునే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించి వెళ్ళారు.

మా చిన్నాన్న, మొదటి కార్యంగా, తన కుమార్తెలను నాకిచ్చి వివాహం జరిపించారు. మా తండ్రి చనిపోయి రెండేళ్ళు నిండకముందే, నా పెళ్ళి అయిపోయింది. మా చిన్నాన్నకు మగబిడ్డలు లేరు. ముగ్గురు ఆడపిల్లలు. అదువల్ల నా ఆస్తి బయటి కుటుంబాలకు వెళ్ళకూడదనే వుద్దేశంతో ఆయన యీ విధంగా చేశారు.

ఈ వివాహం మా అమ్మగారికి యిష్టంలేదు. ఆమె తన వైపువారిలో ఒక అందమైన అమ్మాయితో నా పెళ్ళి జరిపించాలనుకొన్నది. అదీ కాక, నేను చిన్నాన్న కూతుర్లని వివాహం చేసుకోవాలనుకుంటే, వారిలో యెవర్నయినా వొక్కర్ని చేసుకోవాలని, ఒకేసారి ముగ్గుర్ని చేసుకోవద్దని పట్టుబట్టింది. దీని మూలంగా, మా తల్లికీ చిన్నాన్నకూ మధ్య మనస్పర్థలు యేర్పడ్డాయి.

చిన్నాన్న నన్ను విడిగా వేరేవూరికి పిలుచుకొనిపోయి, అక్కడ, మా తల్లి అనుమతి లేకుండానే వివాహం జరిపించేశారు. కొంతకాలానికే, మా తల్లి, నేను చేసిన కార్యం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేక ప్రాణాన్ని విడచింది.

మా యింట్లో, చిన్నాన్న చెప్పిందే చట్టమయిపోయింది. ఆస్తి విషయాల్ని నేను చూసుకున్నదే లేదు. అంతా ఆయన వశం చేశాను. ఆయన నా ఆస్తిలో యెంత వీలైతే అంత, రెండు మూడు యేళ్ళ లోపలే, అరవై యేడు లక్షలు – దాదాపు కోటి రూపాయల దాకా – దాసీమణులకూ, తాగుడుకూ తగలేశారు. చివరికి తాగుడు ఎక్కువై, పేగులు పగిలి చనిపోయారు.

తర్వాత, నా ఆస్తినంతా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది. సరే, ఈ విషయాన్ని వివరంగా చెప్పడం నా వుద్దేశం కాదు. ఆస్తి కొంచెం నష్టమవడం వల్ల నాకు యెక్కువ కష్టమేమీ లేదు. ఈలోగా, నా ముగ్గురు భార్యల వల్ల నేను పడుతున్న పాట్లు చెప్పనలవి కాదు.

అదిగో, చూశారా? స్టేషనుకు పక్కన, మహమ్మదీయ స్త్రీలు కూర్చొని వున్న గుంపు కనిపిస్తుందా? మధ్యలో వున్న ముగ్గురు నా భార్యలు. చుట్టూ కూర్చొనివున్నవాళ్ళు పనివాళ్ళు. ఆ ముగ్గురూ మూలకొకతి ముఖం తిప్పుకొని కూర్చున్నది. చూడగానే, వారిలో ఐక్యత లేదని స్పష్టంగా కనిపిస్తుంది కదా? వీరిలో పెద్దదాని పేరు రోషన్. దాని వయసు ఇరవై రెండు. తర్వాతి దాని పేరు గులాబ్ బీవి. ఆమె వయస్సు పంతొమ్మిది. చివరి ఆమె పేరు ఆయేషా బీవి. ఆమె వయసు పదహారు.

రోషన్‌తో నేను మాట్లాడితే, గులాబ్‌కు నన్ను నరికేయాలనిపిస్తుంది. గులాబ్‌తో మాట్లాడటం ఆయేషాకు నచ్చదు. ఆమెకు ఒక నగ తీసిస్తే, యీమె ఒక నగ పగలగొడుతుంది. ఈమెకు వొక పట్టురవికె కొనిస్తే, ఆమె ఒక రవికెను చింపేస్తుంది. ఈ విధంగా అన్నిట్లో ఆ ముగ్గురూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తూ నా ప్రాణం తీస్తున్నారు. ఒక రోజా, రెండు రోజులా, ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా, నా జీవితం మొత్తం వీళ్ళవల్ల నరకమయిపోయింది. నేనేం చెయ్యాలి?

యిది యిలా వుంటే, నిన్న రాత్రి ఒక కల కన్నాను. మహమ్మద్ ప్రవక్త వచ్చి నన్ను చూసి, ‘ఒరే, ఇస్మాయిల్ ఖాన్, నువ్వు నీ ముగ్గురు భార్యల వల్ల చాలా బాధలు పడుతున్నావు. ఎవర్నయినా యిద్దర్ని వదిలేసి, వాళ్ళని వేరే పెళ్ళి చేసుకోనివ్వు. ఒకర్ని మాత్రం వుంచుకో. నీ దుఃఖం తీరుతుంది.’ అన్నారు.

నేను ఆ కలను దైవశాసనంగానే నమ్ముతున్నాను. మన మనసులో తోచేదే కలలాగ వస్తుందనేది నాకు తెలుసు. అయినా కూడా, మన ఆత్మలో అల్లానే వుండడం వల్ల, యీ కల అల్లా యొక్క ఆజ్ఞ అని నేను భావిస్తున్నాను. అయితే, యీ ముగ్గురు స్త్రీల పట్ల నాకు సమానమైన ప్రియం వుంది. వాళ్ళు కూడా నా పట్ల సమానమైన ప్రేమను కలిగి వున్నారని అనుకొంటున్నాను. ఎవర్ని వదిలెయ్యాలి? ఎవర్ని వుంచుకోవాలి? అనేది నా బుద్ధికి తోచలేదు. అందువల్లే దుఃఖిస్తున్నాను.”

ఇంతలో స్టేషనులో రైలు వస్తున్న శబ్దం వినిపించింది. అతడు గబుక్కున పైకి లేచి, “సలాం! సలాం!” అని చెప్పి, స్టేషను వైపుగా పరిగెత్తాడు.

నేను కూడా, ‘మంచి కాలం! యీ కఠినమైన వ్యవహారానికి పరిష్కారం చెప్పడానికి ముందే రైలు వచ్చేసింది!’ అని ఆనందించి రైలెక్కడానికి వెళ్ళాను.

మహమ్మదు ప్రవక్త కలలో చెయ్యమని ఆజ్ఞాపించినట్టుగానే అతడు నడచుకొంటాడని నమ్ముతున్నాను.


సుబ్రహ్మణ్య భారతి (1882 -1921): ప్రఖ్యాత తమిళ మహాకవి, రచయిత, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆయన కవిత్వం, పాటలు, కథలు, వ్యాసాలు, అనువాదాలు, బాల సాహిత్యం వంటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లో మార్గ నిర్దేశకుడు. ఆయన తొలుత తిరునల్వేలిలోనూ, తర్వాత వారణాసిలోనూ విద్యాభ్యాసం చేసి, పాత్రికేయ రంగంలో స్వదేశమిత్రన్, ఇండియా వంటి పలు పత్రికలకు పనిచేశాడు. ఈ పత్రికల ద్వారా ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. జాతీయ కాంగ్రెస్ పార్టీలో అతివాద గ్రూపులో పనిచేశాడు. ఫలితంగా ఆయన బ్రిటిషువారి నుండి తప్పించుకోవడం కోసం ఫ్రెంచి కాలనీ అయిన పాండిచ్చేరిలో 1910 నుండి 1919 వరకు ప్రవాసిగా వున్నాడు. 1919లో తిరిగొచ్చాక, అరెస్టయ్యి కొంతకాలం జైలులో వున్నాడు. జైలు నుంచి బయటికొచ్చాక ఆయన రోజూ మదరాసు ట్రిప్లికేన్ లోని పార్థసారథి ఆలయానికి వెళ్ళి అక్కడున్న లావణ్య అనే ఏనుగుకు ఆహారం పెట్టేవాడు. ఒక రోజు అలానే ఆహారం అందిస్తుండగా అనుకోని విధంగా ఏనుగు ఆయన శరీరాన్ని తొండంతో ఎత్తి పడేసింది. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడినా, ఆ గాయాలు, అనారోగ్యం కలిపి విషమించడంతో, 1921 సెప్టెంబరు 12న అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన మరణించాడు. భారతి జీవితం ఆధారంగా, తమిళంలో జ్ఞాన రాజశేఖర్ దర్శకత్వంలో ‘భారతి’ (2000) పేరుతో సినిమా వచ్చింది.

ఈ కథను చదివిన భారతి ముస్లిమ్ స్నేహితుడొకరు భారతిని కలసి, “సోదరి వరసైన ముగ్గురు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవడం మహమ్మదీయ శాస్త్ర ప్రకారం ‘పాపం’గా భావించబడుతుంది. తన భార్య సజీవంగా వున్నపుడు, ఆమె తోబుట్టువును వొక ముస్లిమ్ పెళ్ళి చేసుకోకూడదు అని మా శాస్త్రాలు చెబుతున్నాయి” అని వివరించాడు. తనకు ఆ విషయం తెలియదని, ప్రభోదాత్మకంగా యీ కథ రాశానని చెప్పిన భారతి, తన మిత్రుడు ఎత్తి చూపిన తప్పును సవరిస్తూ ప్రకటన యిచ్చాడు. రైల్వే స్థానం స్వదేశీమిత్రన్ దిన పత్రికలో 1920, మే 22న ప్రచురణ అయ్యింది.